కరీంనగర్: ఆయన నవశకానికి దిక్సూచి.. యువతరానికి ఐకాన్.. ఐటీహబ్ నిర్మాణ సారథి.. గల్లీల్లో సామాన్యులకు కష్టమొస్తే నేనున్నానంటూ భరోసానిచ్చే మనసున్న నాయకుడు.. అంతర్జాతీయ యవనికపై దేశాధినేతలను మెప్పించిన రాజకీయ చతురుడు.. అనతికాలంలోనే ఎన్నో అంతర్జాతీయ సంస్థల చేతుల మీదుగా అవార్డులను సొంతం చేసుకున్న మోడ్రన్ లీడర్.. దశాబ్దకాలంలో సిరిసిల్ల నియోజకవర్గ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేయడమేకాదు.. తాను చేపట్టిన శాఖల్లో ఎన్నో విప్లవాత్మక వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఆదర్శప్రాయుడు.. ఆయనే కల్వకుంట్ల తారక రామారావు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, పార్టీలో.. ప్రజల గుండెల్లో అంచెలంచెలుగా ఎదిగి చెరగని ముద్రవేసుకున్న ఆయన, రెండోసారి మంత్రిగా అవకాశం రావడంపై హర్షం వ్యక్తమవుతున్నది.
రెండోసారి మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన కల్వకుంట్ల తారకరామారావు, కార్యకర్తగా మొదలై, అంచెలంచెలుగా ఎదిగారు. 2004 నుంచే పరోక్ష రాజకీయాల్లో పాలుపంచుకుంటూ వచ్చిన ఆయన, తెలంగాణ ఉద్యమంలో చురకైన పాత్ర పోషించారు. 2006లో కరీంనగర్ లోకసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల సమయంలో మంత్రి కేటీఆర్ ప్రజల ముందుకు వచ్చారు. 2004 జమిలి ఎన్నికల్లో భాగంగా ప్రస్తుత ముఖ్యమంత్రి, నాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ కరీంనగర్ లోకసభ స్థానం నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం నిర్లక్ష్యం చూపడం.. అసలు తెలంగాణవాదమే లేదంటూ కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేసిన ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రపంచానికి చాటేందుకు 2006లో తన ఎంపీ పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు.
అప్పుడు ఉప ఎన్నికలు రావడం, ప్రజలు 2లక్షల పైచిలుకు మెజార్టీనిచ్చి ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఆకాకంక్షను ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ ఎన్నికల్లో కేటీఆర్ పరోక్షంగా అకుంఠిత దీక్షతో పనిచేశారు. కేసీఆర్‌కు అండగా.. అనేక నియోజకవర్గాల్లో ఒక సామాన్య కార్యకర్తగా ప్రచారం చేశారు. 2008లో మరోసారి కేసీఆర్‌తోపాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బరిలోకి దిగిన సయంలోనూ నేరెళ్ల, అలాగే సిరిసిల్ల పట్టణ కేంద్రంగా విస్తృత స్థాయిలో ప్రచారం చేసి తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమంలోనూ చాలా సందర్భాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. 2009లో కేసీఆర్‌ను అరెస్టు చేసిన సమయంలో ముందుండి పోరాడారు.
పోరాటాల గడ్డ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి..
సిరిసిల్ల శాసనసభా నియోజకవర్గం 1952లో ఏర్పడింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో పలు మండలాలు అటుఇటుగా మారాయి. కమ్యూనిస్టు సీనియర్ నాయకుడిగా పేరొందిన స్వర్గీయ చెన్నమనేని రాజేశ్వర్‌రావు సిరిసిల్ల నుంచి ఐదుసార్లు విజయం సాధించి రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులుగా ఎదిగారు. జనశక్తి, పీడీఎఫ్ విప్లవ పార్టీల అభ్యర్థులను కూడా గెలిపించిన చరిత్ర సిరిసిల్లకు ఉంది. కాగా, 2006 నుంచి తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన కేటీఆర్, 2009 నుంచి ప్రతక్ష్య రాజకీయాల్లోకి వచ్చారు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి, సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డిపై 171 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తిరిగి 2010 ఉప ఎన్నికల్లో బరిలో నిలిచారు. సమీప ప్య్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డిపై 68,219 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు.
2014 జనరల్ ఎన్నికల్లో సమీప కాంగ్రెస్ అభ్యర్థి కొండూరి రవీందర్‌రావుపై 53,004 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తిరిగి 2018 ఎన్నికల్లో 89,009 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం అందుకున్నారు. గత డిసెంబర్ 17న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన, తాజాగా రెండోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పరిశ్రమలు, సమాచార సాంకేతిక(ఐటీ) శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్‌అర్బన్ డెవలప్మెంట్ శాఖను కేటాయించారు.
రెండోసారి మంత్రిగా..
యువనాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్, ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేసి చూపించారు. స్వరాష్ట్రంలో మొదటిసారి మంత్రి పదవి చేపట్టి, అధికారం ఉంటే అభివృద్ధిని ఎలా పరుగులు పెట్టించవచ్చో ఆచరణలో చేసి నిరూపించారు. ఐటీ రంగం దిశ దశలను మార్చి చూపించారు. పరిశ్రమలు, పురపాలక శాఖల్లో కీలక మార్పులు తెచ్చి ప్రజలకు సౌలభ్యాన్ని మెరుగుపరచారు. రాష్ట్ర స్థాయిలో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుడుతూనే తనకు రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలను గుండెల్లో పెట్టిచూసుకుంటున్నారు. గడిచిన దశాబ్ద కాలంలో సిరిసిల్ల ముఖ చిత్రాన్ని మార్చివేశారు. అభివృద్ధిలో జిల్లాను రాష్ర్టానికే ఆదర్శంగా నిలిపారు. ముఖ్యంగా చేనేతకు జీవం పోసి, కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపారు. ఎవరికి ఏ ఆపదొచ్చినా నేనున్నానంటూ భరోసా నిచ్చారు. తాజాగా రెండోసారి ఆయన మంత్రి పదవి చేపట్టడంపై జిల్లావాసులు తమ అదృష్టంగా భావిస్తున్నారు. అమాత్యుడికి పదవి కట్టబెట్టిన ముఖ్య మంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ సంబరాలు జరుపుకున్నారు.