మేడ్చల్ : రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఉచితంగా అత్యవసర చికిత్స అందించేందుకు మేడ్చల్ జిల్లాలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహానగరానికి మోడల్హారంలా విస్తరించి ఉన్న ఔటర్ రింగురోడ్డు పక్కనే అత్యాధునిక హంగులతో ట్రామా కేర్ సెంటర్‌ను, బ్ల్లడ్ బ్యాంకు ఏర్పాటు చేయనున్నారు. జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సీఎస్ఆర్ (కార్పొరేట్ సొషల్ రెస్పాన్సిబులిటీ) కింద రూ.3 కోట్ల వరకు నిధులను సేకరించి బ్లడ్‌బ్యాంకు, ట్రామాకేర్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు.
భూమి కేటాయింపు...
ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ డా.ఎంవీరెడ్డి కొద్దిరోజుల కిందట శామీర్‌పేట మండలం అంతాయిపల్లి రెవె న్యూ పరిధిలోని సర్వే నెంబర్ 837లో అరఎకరం స్థలాన్ని రెడ్‌క్రాస్ సొసైటీకి కేటాయించారు. ఈ స్థలం లో రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా కార్యాలయంతోపాటు బ్లడ్‌బ్యాంకు, సుమారు 5-10 బెడ్లతో కూడిన ట్రామాకేర్ సెంటర్‌ను నిర్మించనున్నారు. ఈ స్థలం పక్కనే మేడ్చల్ జిల్లా దవాఖాన నిర్మాణానికి సుమారు 4.20 ఎకరాల స్థలంను కేటాయించారు. దవాఖాన నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాధనలు ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి.
ప్రాణాలను కాపాడేందుకు...
జిల్లాలో విశాలమైన రోడ్డు రవాణా వ్యవస్థ ఉంది. ప్రధానంగా రాజీవ్ రహదారి, ఔటర్ రింగురోడ్డు, వరంగల్ హైవే వంటి ప్రధాన రహదారులపై నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే ప్రమాదాల్లో గాయపడిన వారికి అత్యవర చికిత్స అందించాలంటే హైదరాబాద్‌కు తీసుకురావల్సిన దుస్థితి. ఈ లోపు రక్తస్రావం ఎక్కువగా జరిగితే ప్రాణా లు కూడా పోయేఅవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఔటర్‌కు, జాతీయ రహదారులకు దగ్గరగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ట్రామాకేర్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తే రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి ప్రాణాలు కాపాడవచ్చు. ఈ క్రమంలోనే కలెక్టర్ ఎంవీరెడ్డి ప్రత్యేక చొరువతో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయని జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ రాజేశ్వర్ రావు తెలిపారు.