మన్యంకొండలో రూ.2.70 కోట్లతో అభివృద్ధి పనులు

Fri,October 18, 2019 07:54 PM

మహబూబ్‌నగర్‌ : రోజురోజుకూ మన్యంకొండ ఆధ్యాత్మిక కొండగా ప్రసిద్ధి చెందుతున్నదని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌ జిల్లా మన్యంకొండలో రూ.2.70 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్‌ మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. మండలంలో అన్ని గ్రామాలకు కృష్ణా జలాలు వస్తున్నాయని ఆయన తెలిపారు. అన్ని గ్రామాలలో ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీటిని అందించనున్నట్లు చెప్పారు. మన్యంకొండలో 3 వేల ఏళ్ల కిందటే శ్రీ లక్ష్మీ నారసింహస్వామి (ఒబ్లేష్‌ స్వామి) స్వయంగా వెలిశారని మంత్రి తెలిపారు. ప్రస్తుతం నారసింహస్వామి ఆలయాన్ని పునర్‌ ప్రారంభానికి సీజీఎఫ్‌ నిధులు రూ.70 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. అలాగే అలివేలు మంగ ఆలయం సమీపంలో రూ.2 కోట్లతో ఏసీ కల్యాణ మండపాన్ని నిర్మించనున్నట్లు ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో మన్యంకొండను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే గుర్తింపు పొందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.

ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్‌ మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి సహకారం అందిస్తామన్నారు. గతంలో పలు గ్రామాలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేవని, నేడు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాకే ప్రజలు సంతోషంతో ఉన్నారని ఆయన తెలిపారు. అనంతరం ఓబ్లాయిపల్లి తండాలో రూ.2.50 లక్షల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్డును మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో డీఈవో ఉషారాణి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, ఆర్డీవో శ్రీనివాసులు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆంజనేయులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

549
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles