భార‌త్‌లో పిక్స‌ల్ 4 ఫోన్లు విడుద‌ల కావ‌ని చెప్పిన గూగుల్‌.. ఎందుకంటే..?


Wed,October 16, 2019 10:51 AM

సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ పిక్స‌ల్ సిరీస్‌లో నూత‌న ఫోన్ల‌యిన పిక్స‌ల్ 4, పిక్స‌ల్ 4ఎక్స్ఎల్ ఫోన్ల‌ను నిన్న న్యూయార్క్‌లో విడుద‌ల చేసిన విష‌యం విదిత‌మే. అయితే ఈ ఫోన్ల‌కు గాను ఇప్ప‌టికే అమెరికా స‌హా ప‌లు దేశాల్లో ప్రీ ఆర్డ‌ర్ల‌ను ప్రారంభించ‌గా.. ఈ నెల 24వ తేదీ నుంచి ఈ ఫోన్ల‌ను విక్ర‌యించనున్నారు. అయితే పిక్స‌ల్ 4 ఫోన్ల‌ను భార‌త్‌లో విడుద‌ల చేయ‌డం లేద‌ని గూగుల్ వెల్ల‌డించింది. దీంతో పిక్స‌ల్ ఫోన్ల ప్రేమికులు నిరాశ చెందుతున్నారు. అయితే ఇందుకు కార‌ణాల‌ను గూగుల్ వెల్ల‌డించ‌క‌పోయినా.. పిక్స‌ల్ 4 ఫోన్ల‌లో ప్ర‌త్యేకంగా అందిస్తున్న రేడారే సెన్సార్ ఫీచ‌రే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.

పిక్స‌ల్ 4 ఫోన్ల‌లో గూగుల్‌కు చెందిన అడ్వాన్స్‌డ్ టెక్నాల‌జీ అండ్ ప్రాజెక్ట్స్ టీం (ఏటీఏపీ) 2015లో అభివృద్ధి చేసిన ప్రాజెక్టు సోలి అనే రేడార్ ఆధారిత గెస్చ‌ర్ కంట్రోల్ టెక్నాల‌జీని అందిస్తున్నారు. అయితే ఈ రేడార్ టెక్నాల‌జీ 60 గిగాహెడ్జ్ ఫ్రీక్వెన్సీలో ప‌నిచేస్తుంది. దీంతో ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్లను ఉప‌యోగించి మ‌రింత సుర‌క్షింత‌గా ఫేస్ అన్‌లాక్‌ను ఉప‌యోగించుకునేందుకు వీలు క‌లుగుతుంది. అలాగే యూజ‌ర్ల మోష‌న్‌, వారు చేసే గెస్చ‌ర్ల‌ను డిటెక్ట్ చేసి అందుకు త‌గిన విధంగా ఫోన్‌లో ప‌లు ఫీచ‌ర్ల‌ను ఫోన్‌ను తాక‌కుండానే ఉపయోగించుకోవ‌చ్చు.

అయితే 60 గిగాహెడ్జ్ ఫ్రీక్వెన్సీని భార‌త్‌లో కేవ‌లం మిల‌ట‌రీ, ప్ర‌భుత్వ ప్రాజెక్టుల్లో మాత్ర‌మే ఉపయోగిస్తున్నారు. సాధార‌ణ పౌరులు ఈ ఫ్రీక్వెన్సీని వాడ‌డంపై నిషేధం ఉంది. ఈ క్ర‌మంలో గూగుల్ త‌న పిక్స‌ల్ 4 ఫోన్ల కోసం 60 గిగాహెడ్జ్ ఫ్రీక్వెన్సీని వినియోగించుకునేలా అనుమ‌తి కోసం భార‌త ప్ర‌భుత్వాన్ని సంప్ర‌దించింద‌ని, కానీ అది వీలు కాక‌పోవ‌డంతోనే పిక్స‌ల్ 4 ఫోన్ల‌ను భార‌త్‌లో విడుద‌ల చేయ‌వ‌ద్ద‌ని గూగుల్ నిర్ణ‌యించుకుంద‌ని తెలుస్తోంది. అందుక‌నే గూగుల్ త‌న పిక్స‌ల్ 4 ఫోన్ల‌ను భార‌త్‌లో విడుద‌ల చేయ‌డం లేద‌ని మాత్ర‌మే తెలియ‌జేస్తూ.. భ‌విష్య‌త్తులో విడుద‌ల చేసే ఇత‌ర పిక్స‌ల్ డివైస్‌లు భార‌త్‌లో కూడా విడుద‌ల‌య్యేలా చూస్తామ‌ని చెప్పింది. ఈ క్ర‌మంలో భార‌త్‌లోని పిక్స‌ల్ ఫోన్ల ప్రేమికులు నిరాశ చెందుతున్నారు..!

1528
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles