ఇండియాలో నంబర్ వన్ జియో.. వరల్డ్‌లో నంబర్ 2..


Mon,August 12, 2019 01:04 PM

ముంబై: రిలయన్స్ జియో.. టెలికాం రంగంలో ఒకప్పుడు ఈ కంపెనీ ఒక సంచలనం.. కేవలం డేటాకు మాత్రమే డబ్బులు చెల్లించండి.. కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా పొందండి.. అంటూ జియో సంచలన ఆఫర్లకు తెర తీసింది. దీంతో వినియోగదారులు పెద్ద ఎత్తున జియో బాట పట్టారు. ఈ క్రమంలోనే ఏటా జియో తన ఖాతాదారుల సంఖ్యను పెంచుకుంటూ వస్తోంది.

ప్రస్తుతం జియోకు దేశ వ్యాప్తంగా 340 మిలియన్ల మందికి పైగా ఖాతాదారులు ఉండగా ప్రతి నెలా 10 మిలియన్ల మంది కొత్తగా జియో కనెక్షన్ తీసుకుంటున్నారని ఆ సంస్థ చైర్మన్ ముఖేష్ అంబానీ వెల్లడించారు. గత కొంత సేపటి క్రితమే జరిగిన రిలయన్స్ 42వ ఏజీఎంలో మాట్లాడిన ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం ఖాతాదారుల సంఖ్య పరంగా, ఆదాయం, వృద్ధిరేటు పరంగా దేశంలోనే నంబర్ వన్ టెలికాం ఆపరేటర్‌గా కొనసాగుతుందని తెలిపారు. ఇక ప్రపంచంలోని టాప్ 10 టెలికాం ఆపరేటర్ల జాబితాలో జియో 2వ స్థానంలో ఉందని అన్నారు.

రానున్న కాలంలో జియో 500 మిలియన్ల మంది ఖాతాదారుల మార్కును చేరుకోవడమే లక్ష్యంగా పనిచేస్తుందని ముఖేష్ అంబానీ తెలిపారు. ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా డిజిటల్ సర్వీస్‌లపై ఎక్కువగా ఖర్చు చేస్తున్నారని, అందుకనే అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నాణ్యమైన డిజిటల్ సేవలను అందించాలనే లక్ష్యంతోనే జియో గిగాఫైబర్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. జియో గిగాఫైబర్ సేవలను ఇప్పటికే దేశంలోని 5 లక్షల మందికి పైగా ఖాతాదారుల ఇండ్లలో ట్రయల్ పద్ధతిలో పరీక్షిస్తున్నామని పేర్కొన్నారు.

జియో గిగాఫైబర్ కోసం తమకు 16వేలకు పైగా పట్టణాలు, నగరాల నుంచి దాదాపుగా 15 మిలియన్లకు పైగా రిజిస్ట్రేషన్లు వచ్చాయని ముఖేష్ అంబానీ తెలిపారు. అయితే తాము మొదటి దశలో కనీసం 20 మిలియన్ల మందికి జియో గిగాఫైబర్ సేవలను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. జియో డీటీహెచ్ సేవలను అందించేందుకు గాను దేశ వ్యాప్తంగా ఉన్న లోకల్ కేబుల్ ఆపరేటర్లతో భాగస్వామ్యం అయ్యామని, దీంతో వారికి కూడా స్థిరమైన ఆదాయం వస్తుందని ముఖేష్ అంబానీ వెల్లడించారు.

3252
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles