వీడియో ఎడిటింగ్, 3డీ డిజైనింగ్, గేమింగ్‌లో యాపిల్ ఉత్పత్తులది అగ్రస్థానం. ఆ స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటూ.. ‘ఆపిల్ ఐప్యాడ్ ప్రొ ఎం4’ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది ఆపిల్. ‘టాన్డెమ్ ఓల్ఈడీ టెక్నాలజీ’తో ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ డిస్ప్లేతో ఈ ఐప్యాడ్ వస్తున్నది. అల్ట్రా రెటీనా డిస్ప్లే కలిగిన ఈ ట్యాబ్‌పై ఎంతసేపు పనిచేసినా.. కళ్లపై ఏమాత్రం ఒత్తిడి పడదు. ఇందులో శక్తిమంతమైన ‘ఎం4 చిప్’ను ఏర్పాటుచేశారు. దీని సాయంతో 4కే వీడియోలను కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎడిట్ చేసుకోవచ్చు. అంతేకాదు..
ఈ ట్యాబ్‌ను ఆపిల్ మానిటర్‌కు కనెక్ట్ చేసుకొని, ఎడిటింగ్, కంపోజింగ్లాంటి అన్ని పనులనూ సులభంగా చేసుకోవచ్చు. ‘ఏఐ’ టెక్నాలజీతో వస్తున్న మొట్టమొదటి ఆపిల్ ట్యాబ్ కూడా ఇదే! ఇందులోని మరో ప్రత్యేకత.. ఇది కేవలం 5.5 మిల్లిమీటర్ల మందం మాత్రమే ఉంటుంది. 11 అంగుళాలు, 13 అంగుళాల వేరియంట్లతోపాటు 1టీబీ, 2టీబీ వేరియంట్లలో ఈ ట్యాబ్ లభిస్తుంది. 12ఎంపీ కెమెరా, 120 హెర్ట్ రిఫ్రెష్ రేట్లాంటి ఫీచర్లతోపాటు ప్రైవసీకి పెద్దపీట వేస్తూ తయారుచేసిన ‘ఆపిల్ ఐప్యాడ్ ప్రొ ఎం4’ ధర. రూ. 99,900. apple.com ద్వారా కొనుగోలు చేయవచ్చు.
షికారుకు దారి!
నేటితరం కార్లలో ‘నావిగేటింగ్ సిస్టమ్’ వాడకం తప్పనిసరి. కొన్ని వాహన సంస్థలు ఇన్‌బిల్ట్‌గా వీటిని అందిస్తున్నా.. ఫీచర్లు తక్కువగా ఉంటున్నాయి. మ్యాప్స్ తయారీలో 25 సంవత్సరాల అనుభవం కలిగిన ‘టామ్‌టామ్’ సంస్థ.. ఈ ఇబ్బందిని గుర్తించింది. ‘గో డిస్కవర్’ పేరుతో సరికొత్త ‘నావిగేటింగ్ సిస్టమ్ డిస్ప్లే’కు రూపకల్పన చేసింది. వాహనాల మోడల్స్‌కు తగ్గట్టుగా.. 5 అంగుళాలు, 5.6 అంగుళాలు, 8 అంగుళాల శ్రేణిలో డిస్ప్లేను అందిస్తున్నది. ఇతర మ్యాప్స్‌తో పోలిస్తే.. ‘టామ్‌టామ్’ మ్యాప్స్ 3 రెట్లు వేగంగా లోడ్ అవుతాయి. లైవ్ ట్రాఫిక్, బ్లూటూత్, స్పీడ్ కెమెరా అలర్ట్ లాంటి అనేక ఫీచర్లను ఇందులో పొందుపరిచింది. టచ్‌స్క్రీన్ హెచ్డీ డిస్ప్లేతో వస్తున్న ఈ నావిగేటర్ల ధర.. రూ. 25,400 నుంచి ప్రారంభం. tomtom.comలో లభిస్తాయి.
వెంట వచ్చే పవర్ హౌజ్..
ఫోన్లు, ట్యాబ్‌ల కోసం పవర్ బ్యాంక్‌లు ఉన్నట్టే.. టీవీలు, మ్యూజిక్ సిస్టమ్స్ కోసం ‘పవర్ హౌజ్’లు వచ్చేస్తున్నాయి. పిక్నిక్లు, టూర్లకు వెళ్లినప్పుడు ఎదురయ్యే ‘విద్యుత్’ సమస్యలకు ఇవి చెక్ పెడుతున్నాయి. ఔట్‌డోర్ పార్టీలను మరో మెట్టు ఎక్కిస్తున్నాయి. ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ యాంకర్.. ‘200 వాట్స్’ పవర్‌తో సరికొత్త ‘521 పవర్ హౌజ్’ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇందులో అత్యంత శక్తిమంతమైన లిథియం ఐరన్ ఫాస్పేట్ బ్యాటరీలను ఏర్పాటుచేశారు. లిథియం బ్యాటరీల కన్నా.. ఇవి నాలుగు నుంచి ఐదు రెట్లు మెరుగైనవి.
ఈ లాంగ్ లాస్టింగ్ పవర్‌హౌజ్‌ను ఒక్కసారి కొనుగోలు చేస్తే.. పదేళ్లపాటు మీ ఔట్‌డోర్ విద్యుత్ అవసరాలను తీరుస్తుంది. రగ్డ్ డిజైన్‌తో వస్తున్న ఈ పవర్ హౌజ్‌లో మొత్తం 6 పోర్ట్స్ ఉన్నాయి. వీటిలో రెండు ఏసీ పోర్ట్స్. మ్యూజిక్ సిస్టమ్, కంప్యూటర్, టీవీలను వీటికి కనెక్ట్ చేసుకోవచ్చు. మరో రెండు యూఎస్బీ- ఏ పోర్ట్స్ కాగా, ఒక యూఎస్బీ – సీ పోర్ట్. వీటి సాయంతో స్మార్ట్ఫోన్లు, ట్యాబ్‌లను చార్జ్ చేసుకోవచ్చు. మరొకటి కార్ ఔట్లెట్. 30 రోజుల మనీ బ్యాక్ గ్యారంటీతో వస్తున్న ఈ ‘521 పవర్ హౌజ్’ ధర రూ. 20,000. anker.com నుంచి బుక్ చేసుకోవచ్చు.
గో.. క్లిక్.. ప్రింట్!
డిజిటల్ కెమెరాల మార్కెట్లో ఇప్పుడు ‘పోలరాయిడ్’ హవా నడుస్తున్నది. ఫొటోలు దిగిన వెంటనే.. ప్రింట్లు తీసుకోగలగడం వీటి ప్రత్యేకత. పర్యటనలు ఎక్కువగా చేసేవారికి ఇవి ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఈ క్రమంలో ప్రపంచంలోనే అతిచిన్న పోలరాయిడ్ కెమెరాను తీసుకొచ్చినట్టు ‘పోలరాయిడ్’ సంస్థ చెబుతున్నది. ‘గో జెన్2’ పేరుతో ఈ పోర్టబుల్ ఇన్స్టంట్ కెమెరాను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇంతకుముందు కెమెరాల కన్నా..
ఇందులో ఫొటోల నాణ్యత పెంచారు. సెల్ఫీ మిర్రర్, సెల్ఫ్ టైమర్, డబుల్ ఎక్స్పోజర్ లాంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. ‘పోలరాయిడ్ యాప్’ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ అవుతుంది. కెమెరాలో తీసిన ఫొటోలను వెంటవెంటనే స్మార్ట్‌ఫోన్ ద్వారా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసే అవకాశం కల్పిస్తుంది. 30శాతం రీసైకిల్డ్ మెటీరియల్‌తో తయారైన ‘గో జెన్2’ ధర. రూ. 18,010. polaroid.com ద్వారా కొనుగోలు చేయవచ్చు.