ఇంట పెండ్లి బాజా మోగిందంటే గోరింట అరచేత విరబూయాల్సిందే. పెండ్లికూతురు ముస్తాబులో ముచ్చటగా ఒదిగే అలంకారం ఇది. ఇక కుంచె పట్టిన చిత్రకారుడికి తాము ఏమాత్రం తక్కువ కాదని నిరూపించుకునేందుకు మెహందీ ఆర్టిస్టులూ ఇదే అవకాశంగా భావిస్తున్నారు. తమ ప్రతిభకు చిత్రిక పట్టి అచ్చెరువొందించే చిత్రాలను అరచేతిలో ఆవిష్కరిస్తున్నారు. ఆ ప్రయత్నంలోనే ‘గూంఘట్ బ్రైడ్ డిజైన్’ శ్రావణపు సరికొత్త మెహందీ ట్రెండ్ అయింది.
ఒకప్పుడు వేడుకంటే రోట్లో ఆకు నలిగేది. చేతిలో చందమామ వెలిగేది. ఎరుపు రంగు కళ ఎంతో తెలిసేది. ఇప్పుడూ శుభకార్యాలకు చేతులేమీ ఖాళీగా ఉండవు. అప్పుడు చుక్కలుంటే.. ఇప్పుడు ముగ్గులుంటున్నాయి. అప్పటి గోరింటాకు ఇప్పుడు మెహందీగా పిలుపు మార్చుకుంది. అంతేకాదు, ఉత్తరాది సంప్రదాయం ఇక్కడ వేడుకైంది. అక్కడ అమ్మాయితోపాటు మెహందీ కూడా కథానాయికే. అందులో అరబిక్, ఫ్లోరల్, జువెలరీ.. ఇలా ఎన్నో డిజైన్లు వచ్చాయి. అమ్మాయి అబ్బాయి ముఖాలను చిత్రించే పోట్రెయిట్ మెహందీ ట్రెండవుతూ ఉంది. ఆ కోవలో మరింత సృజనాత్మకతను జోడించి ‘గూంఘట్ బ్రైడ్ డిజైన్’లను వేస్తున్నారు మెహందీ ఆర్టిస్టులు. ముఖం మీద మేలి ముసుగు ధరించిన అందమైన ఆడపిల్ల చిత్రాలు ఇక్కడ విచిత్రంగా దర్శనమిస్తాయి.
కట్టిపడేసేలా…
మేలి ముసుగు లోపల నుంచి ముఖం కనిపించే పాలరాతి బొమ్మను సాలార్జంగ్ మ్యూజియంలో చూసిన ఎవరైనా ఆశ్చర్యపోకుండా ఉండరు. రాతి ముసుగులో నుంచి రమణి అందం కనిపించడమంటే మాటలా! మరీ ఆ రేంజ్లో కాకపోయినా… చూడగానే కట్టిపడేయటం మాత్రం అరచేతిలోని ఈ ముసుగు మారాణి ప్రత్యేకతని చెప్పొచ్చు. తెరచాటు నుంచి సిగ్గుల మొగ్గ అందాలను కనిపించేలా గోరింటాకు పెట్టాలంటే గోరంత ఎక్కువే నైపుణ్యం అవసరం. వీటిలో మొత్తం ముసుగు వేసిన పెండ్లికూతురు, ముసుగు తీస్తున్నట్టు ఉన్న అమ్మాయి… ఇలా వెరైటీలు ఉన్నాయి. మిగతా డిజైన్‌ను బట్టి దీన్ని ఎంచుకోవచ్చు. ముందుగా అమ్మాయి బొమ్మ అవుట్ లైన్ గీసుకుని దాన్ని పూర్తి చేస్తూ, మరో పక్క గూంఘట్ (మేలి ముసుగు) భాగాన్నీ పూర్తి చేస్తారు. అదాటున చూడగానే మాత్రం ఇది ఎలా గీశారబ్బా అనిపించడం మాత్రం ఖాయం. ఇంకేం, ఈ సారి గోరింటాకు అందంగానే కాదు, ఆశ్చర్యాన్ని కలిగించేలానూ వేసుకోండి!