యువ భారతం


Sun,January 12, 2020 01:09 AM

భారతీయులకు 1947 వరకు ఒక విజన్ ఉండేది. విజయమో వీర స్వర్గమో అని ఉద్యమం చేసి దేశానికి స్వాతంత్య్రం సంపాదించుకున్నాం. డ్బ్బై రెండేండ్లు గడిచిపోయాయి. తాజాగా 2020లోకి అడుగు పెట్టాం. కానీ 1947లో ఉన్నటువంటి విజన్ మరొకటి లేకుండా పోయింది. ఉన్నదల్లా ఒక్కటే విజన్. బాగా సంపాదించాలి. బాగా బతకాలి. ఎవరికి వారుగా. మరి దేశం కోసమంటూ చేసేదేమీ లేదా? ఇప్పటికైతే లేదు. కానీ ఇప్పటి నుంచి ఉండాలి.. ఉండి తీరాలి. 1947 కంటే పెద్ద విజనే ఉండాలి. ముఖ్యంగా యువత. మనమంతా కలిసి మళ్లీ ఉద్యమం చేసి దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాల్సిన విజన్ ఒకటి యువత చేతుల మీదుగా ప్రారంభం అవ్వాలి. సమస్యలకు తగిన పరిష్కారాలను చేతల ద్వారా వివరిస్తూ ఆలోచనాత్మక చైతన్యాన్ని నింపే విజనే కావాలి. ఈ నెల 12న జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఆ యువ భారతంపై ముఖచిత్ర కథనం. ప్రపంచంలో ఎక్కడాలేని యువత ఇండియాలోనే ఉంది. అది దేశ జనాభాలో 65% పైనే. చైనాలో 35% మాత్రమే. మరో 10-15 సంవత్సరాలు మాత్రమే ఇంత గొప్ప శక్తిని మనం ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. చాలా తక్కువ సమయం ఉంది. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే దేశాన్ని ఊహకు అందని విధంగా మార్చవచ్చు. ఆ అడుగులు కనీసం ఇప్పటి నుంచైనా పడితే బాగుంటుంది. ఎందుకంటారా? ప్రపంచం మనవైపు చూస్తున్నది. భారత్‌కు కళ్లు.. కాళ్లూ అయి నడిపిస్తున్నది యువజనమే కదా? భారతదేశ భవిష్యత్‌ను ఉన్నతంగా లిఖించి ప్రపంచానికి అందించే సత్తా యువతలో ఉందని భారత్ ఒక్కటే కాదు ప్రపంచ దేశాలూ భావిస్తున్నాయి. కాబట్టి నిద్రావస్థలో ఉన్న యువతలో ఇక మార్పు రావాల్సిందే. యువజన దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానందుడి ఆశయాలను అందిపుచ్చుకొని దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పాల్సిందే.
YOUVABHARATAM

మనం.. మన దేశం

భారత యువతపై ఇన్ని అంచనాలు.. అభిప్రాయాలు ఉన్నాయి. భావి తరానికి వెలుగు కణాల్ని విరజిమ్మే దివ్వెలుగా.. క్రమశిక్షణతో పనిచేసే సైన్యంగా భాసిల్లుతున్నప్పటికీ ఎక్కడో అక్కడ.. ఏదో తప్పిదం వల్ల కొంత యువత పక్కదారి పడుతున్నది. మార్పు కోసం సృష్టిస్తున్న టెక్నాలజీని కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారు. ఇంకొంతమంది జీవితం కన్నా పైపై సౌకర్యాల గురించి విపరీతంగా ఆలోచిస్తున్నారు. కానీ జీవితం అంటే ఇది కాదు. జీవితమంటే.. జీవిత పరమార్థమంటే ఒక జవాన్‌ది.. ఒక కిసాన్‌ది. ఘట్టమేదైనా.. రంగమేదైనా సరే మేము రెడీ అంటూ ధీమాతో.. భరోసాతో ప్రచండ శక్తియై ముందుకు సాగుతున్న శాస్త్రవేత్తది. పాలనలో ప్రజామోదయోగ్యమైన నాయకుడిది. జాతి ఆకాంక్షలు నెరవేరుస్తూ.. దేశానికి దిశా నిర్దేశనం చేసే ఆలోచనలూ అందిస్తున్న సాటి భారతీయ పౌరుడిది. సామాజిక.. రాజకీయ.. ఆర్థిక.. సాంకేతిక రంగాల్లో అంతకంతకూ అభివృద్ధిని విస్తరింపజేస్తున్న నీది.. నాది.. మనది.

అద్భుతాలకు రెడీనా?

చైనాలో సగటు వయసు 35 సంవత్సరాలు. జపాన్లో 47 సంవత్సరాలు. భారత ప్రజల సగటు వయసు 27.3 సంవత్సరాలు. దీన్ని బట్టే చెప్పొచ్చు.. దేశ ఉజ్వల ప్రగతికి దారులు తీస్తున్నది నవతరమే అని. విద్యా పరంగానూ.. నైపుణ్యంలోనూ ఎవరికీ తీసిపోని రీతిలో సత్తా చాటే అవకాశం పుష్కలంగా ఉంది. మహిళల ప్రాముఖ్యం.. ప్రాతినిధ్యం కూడా పెరిగే అవకాశం ఉన్నందువల్ల యువ జనాభాతో ఆర్థిక పరమైన ప్రయోజనాలు అపారంగా సిద్ధించే అవకాశం ఉంది. అగ్రరాజ్యమైన అమెరికా మొత్తం జనాభా.. ఇండియా యువ జనాభాతో సమానమంటే మరి అందరి దృష్టీ యువతపైన ఉండక వేరే దానిపైన ఎందుకు ఉంటుంది? దేశ జనాభాలో అరవై శాతం యువతే అంటే మనకు అద్భుతమైన మానవ వనరులున్నాయని చెప్పొచ్చు. కాకపోతే ఆ మానవ వనరుల్ని సక్రమంగా వినియోగించుకుంటే.. జాగ్రత్తగా కాపాడుకుంటే వారిని దేశ ప్రగతిలో భాగస్వాములను చేస్తే.. ప్రపంచ దేశాలకు ధీటుగా మనం ఇంకా ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేయొచ్చు.

సాంకేతికతలో సాటెవ్వరు?

భారతదేశంలో సృజనాత్మకతకు కొదువలేదు. క్రియేటివిటీని ఎలా అప్లయ్ చేయాలో తెలిసిన వాళ్లలో భారత యువత ముందుంటుందట. అందుకే ఇప్పుడు అద్భుత ఆవిష్కరణలకు మన దేశం వేదికైంది. కొత్త కొత్త స్టార్టప్‌లు ఏర్పాటు చేసి సాంకేతిక రంగంలో సరికొత్త అధ్యాయానికి తెరతీసిన ఘనత ఇండియాదేనని అమెరికా ప్రతినిధులు పలుమార్లు వెల్లడించారు. గతంలో ఇవాంకా ట్రంప్ కూడా భారతదేశ యువతరాన్ని ప్రశంసించారు. యువత ఎన్నో ఆలోచనలను.. కలలను సాకారం చేసేందుకు శ్రీకారం చుట్టుకున్న కార్యక్రమమే స్టార్టప్ ఇండియా. స్టార్టప్ అంటే డబ్బున్న శ్రీమంతులు చేసే పని కాదు. పిడికెడు మందికి ఉపాధి కల్పించేది కూడా స్టార్టపే. మేకిన్ అంటే భారత్‌లో తయారీ మాత్రమే కాదు.. భారత్ కోసం ఉత్పత్తి చేసే మేక్ ఫర్ ఇండియా అనే దిశగా యువత నడుస్తున్నది.
YOUVABHARATAM1

ఆలోచన మారాలి

స్టార్టప్స్.. పాలిటిక్సే కాదు.. విద్య.. ఉద్యోగ.. ఉపాధి.. ఉత్పత్తి రంగాల్లోనూ.. త్రివిధ దళాల్లోనూ.. భారత సైన్యంలోనూ యువతరం సత్తా చాటుతున్నది. క్రీడల్లో అయితే దేశానికే ఖ్యాతిని తీసుకొచ్చే విధంగా అద్భుతమైన ప్రదర్శనలిస్తూ క్రీడా భారత్‌గా దేశాన్ని నిలబెడుతున్నారు. ఒకరికొకరు సహకరించుకుంటూ దేశానికి దిశా నిర్దేశనం చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నా.. ఇన్ని మానవ వనరులు ఉన్నా.. ప్రతీ దేశానికి ఉన్నట్టే మనకూ కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించే బాధ్యత.. అవసరం యువతదే కాబట్టి అవకాశాల్ని సద్వినియోగం చేసుకుని.. ఇంకొందరికి అవకాశం కల్పించేలా యువతరం ఆలోచనలు చేయాలి. వాటిలో ముందుగా అవినీతిని అంతమొందించాలి. పేదరికాన్ని నిర్మూలించాలి. తీవ్రవాదం.. ఉగ్రవాదాలను తుదముట్టించాలి.

లీడర్‌షిప్

ప్పా రిశ్రామిక, ఆర్థిక రంగాల్లోనే కాదు.. పాలనారంగంలో కూడా యువతరం ఆసక్తి కనబరుస్తున్నది. అధినాయకత్వం నుంచి కిందిస్థాయి టీమ్ లీడర్ వరకు యువత మంచి నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తున్నది. నాయకుడు యువకుడు అయినప్పుడు.. యువత ఆలోచనలేంటి? వారి గోల్స్ ఎలా ఉంటాయి? వారి అవసరాలేంటి? వంటి విషయాలు వెంటనే పసిగట్టగలుగుతాడు. ఇప్పుడు ఇండియా అదే దారిలో వెళుతున్నది. ఈ సమూహంలో నుంచి వెళ్లినవాళ్లు ఎంతోమంది యంగ్ పొలిటీషియన్స్‌గా రాణిస్తున్నారు. యువత అవసరాలను తెలుసుకుని పాలనలో కొత్తదనాన్ని చూపిస్తున్నారు. పెరుగుతున్న సాంకేతికతను సద్వినియోగం చేసుకుని దానిని పాలనాపరమైన చర్యల్లోనూ భాగస్వామ్యం చేస్తూ ఎన్నో సమస్యలకు పరిష్కారాలు చూపిస్తున్న సంఘటనల్ని నిత్యం చూస్తున్నాం. అలాంటి కొందరి గురించి తెలుసుకుందాం.
YOUVABHARATAM2

Waste to Art

నోయిడాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల. డిప్లొమా ఇంజినీరింగ్ స్టూడెంట్ చౌదరీ ఆకాశ్ సింగ్ ఒకసారి ఫ్రెండ్స్‌తో కలిసి సమీపంలోని సరస్సుకు వెళ్లాడు. దేవాలయాల నుంచి సరస్సులో చేరుతున్న వ్యర్థాలను గమనించారు. ఆకాశ్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నాడు. దేశంలోని 50 లక్షలకు పైగా ఉన్న ఆలయాల పరిస్థితి ఇంతేనా? అనుకున్నాడు. వ్యర్థాలు ఇలా విడవొద్దని ఎంత చెప్పినా ఎవ్వరూ పట్టించుకోలేదు. అతని మాట పట్టించుకోలేదు. పైగా నువ్వో నాస్తికుడివి అనే ముద్రవేశారు. మనకెందుకులే అనే ఆలోచన వచ్చినా.. దేశం కోసం ఏం చేయలేనా? అనే మనసు మాటను గౌరవించి ఒక ఆలోచన చేశాడు. వ్యర్థాలను బూడిద చేసి దానితో కళాకృతులు చేయొచ్చని ఆలయాల అధికారులను ఒప్పించాడు. బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ యాజమాన్యంతో టైఅప్ అయ్యి ఇంక్యుబేషన్ సహకారం తీసుకొన్నారు. శిక్ష అనుభవిస్తున్న 40 మంది ఖైదీలకు ఆర్నెళ్లపాటు శిక్షణ ఇచ్చి ఎన్నో కళాకృతులు చేయిస్తున్నాడు. దేశం కోసం ఒకవైపు పర్యావరణాన్ని కాపాడుతూనే.. మరోవైపు ఖైదీల్లో సత్ప్రవర్తన పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారు ఆకాశ్.
YOUVABHARATAM3

Aqua Efficiency

ఐఐటీ గౌహతి.. డాక్టర్ కల్యాణ్ రైడోంగియా.. జుమీ డెకా.. కుందన్ సాహా.. సురేష్‌కుమార్.. హేమంత్‌కుమార్ రీసెర్చ్ స్కాలర్స్. మంచి స్కాలర్‌షిప్. మంచి గుర్తింపు కూడా ఉంది. అసైన్‌మెంట్స్ చేసుకుంటూ వెళ్తూ హాయిగా ఉండొచ్చు. కానీ చదివింది ఎందుకు? పరిశోధన విభాగాన్ని ఎంచుకున్నది ఎందుకు? అనే ఆలోచన ఎప్పుడూ మనసును తొలుస్తుండేది. అందుకే ఏదో అద్భుతం చేయాలని అనుకున్నారు. దేశానికి ఉపయోగపడే ఏదైనా మంచి కార్యక్రమం చేయాలని అనుకున్నారు. పునరుత్పాదక శక్తి గురించి అధ్యయనం చేశారు. వాళ్ల అటెన్షన్ నీటిపైన. మామూలుగా అయితే జలాశయ నీటి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు కదా? అది అందరూ చేసేది. ఇంట్లోకి వచ్చే నల్లా నీటితో కరెంట్ ఉత్పత్తి చేయాలనుకున్నారు. ఎలక్ట్రోకైనెటిక్ స్ట్రీమింగ్ పొటెన్షియల్ ప్రకారం ఈ అద్భుతం సృష్టించారు. నిజమే కదా? పర్యావరణం దెబ్బతినడం వల్లే కదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించేది? దానినలా వదిలేస్తే దేశ పరిస్థితి ఏమై పోవాలి? ఆ పరిస్థితిని నియంత్రిస్తేనే పునరుత్పాదక శక్తి ఎక్కడికక్కడ ఒడిసిపట్టుకోవచ్చని తలిచారు. గొప్ప ఇన్నోవేషన్‌కు శ్రీకారం చుట్టారు.
YOUVABHARATAM4

Plant For Plastic

ప్లాస్టిక్ వాడకం వల్ల కాలుష్యం పెరిగిపోతుంది అంటూ లబోదిబో మొత్తుకోవడం కాదు.. దాని నుంచి బయటపడే ఉపాయం ఆలోచిస్తే దేశం బాగుపడుతుందని అంటున్నాడు సతీష్ కుమార్ పెండ్యాల. ఇతనో స్వచ్ఛంద పర్యావరణ కార్యకర్త. ఉండేది హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో. ఒకవైపు అటవీ నిర్మూలన.. ఇంకోవైపు ప్లాస్టిక్ దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఒకే పనితో రెండు సమస్యలకు పరిష్కారం లభించాలనే ఐడియాతో ప్లాంట్ ఫర్ ప్లాస్టిక్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఇంట్లో కుప్పలుగా పేరుకుపోయి ఏం చేయాలో కూడా తెలియని వాళ్లకు సతీష్ మంచి సొల్యూషన్ చూయించాడు. ప్లాస్లిక్ వ్యర్థాలను తనకు ఇస్తే ఒక మొక్కను బహుమతిగా ఇస్తాడు. అదేంటి? ప్లాస్టిక్ చెత్తను అతడేం చేసుకుంటాడు? అంటే.. ఏం చేస్తాం మరి? మనకు లేని సోయిని అతడు తెలియజేస్తున్నాడు. టన్నుల కొద్దీ ప్లాస్టిక్ చెత్తను సేకరించి జీహెచ్‌ఎంసీ అధికారులకు అప్పగిస్తాడు. వాళ్లు దీనిని డంపింగ్‌కు తీసుకెళ్తారు. ఒకే దెబ్బకు చెట్ల పెంపకం.. ప్లాస్టిక్ బెడద తగ్గిపోతుండటంతో సతీష్ పనికి ఫలితం లభిస్తుంది అని చెప్పొచ్చు. దేశం కాలుష్య కోరల్లో ఉందని బాధపడేకంటే సతీష్‌లా ఆలోచిస్తే చాలు.
YOUVABHARATAM5

Dare To Care

ఆడవాళ్లపై అఘాయిత్యాలు ఇంతగా పెరిగిపోతున్నా ఇంకా నిశ్శబ్దంగా ఉంటే ఎలా? అంటూ మూమెంట్‌ను స్టార్ట్ చేసింది బెంగళూరుకు చెందిన ప్రియా వరదరాజన్. మహిళలపై ఘోరాలు జరుగుతున్నా మనకెందుకులే అనుకుంటే అది దేశద్రోహమే అవుతుందంటుంది ప్రియ. ఆడవాళ్ల భద్రత.. నేరాలను అరికట్టడానికి డేర్ టు కేర్ అనే ఉద్యమం చేపట్టారు. ఇప్పుడు దక్షిణ బెంగళూరు చుట్టూ వలంటీర్లు ఒక రక్షణ కవచంలా ఏర్పడ్డారు. వాళ్లంతా ఎవరంటే.. టీస్టాల్ నడిపేవాళ్లు.. పానీ పూరీ అమ్మేవాళ్లు.. కొబ్బరి బోండాల వ్యాపారులు.. కిరాణా షాపువాళ్లు.. పండ్లు విక్రయించేవాళ్లే. ఏదో ఒక వస్తువు కొనేందుకు వీరి దగ్గరకు రోజూ వందలాది మంది వస్తుంటారు కదా.. వాళ్లను ఒక కస్టమర్ కోణంలోనే కాకుండా ఫ్యామిలీ మెంబర్‌గా చూస్తూ.. వారు క్షేమంగా ఉన్నారో లేదో పసిగట్టాలి. ఒకవేళ వారిని ఎవరైనా వేధిస్తున్నట్లు అనిపిస్తే వెంటనే సమీప వలంటీర్లకు కాంటాక్ట్ అయ్యి వేధిస్తున్నవారిని పోలీసులకు అప్పగిస్తారు. వాళ్ల పని వాళ్లు చేసుకుంటూనే దేశం కోసం దేశంలోని ఆడవారి భద్రత కోసం ఆ మాత్రం పనిచేయలేమా? అనేది ప్రియ ఆలోచన.
YOUVABHARATAM6

Firefly Creative

స్నిగ్ధ నందూరి స్విట్జర్లాండ్‌లో ఫ్యాషన్ డిజైన్ కోర్సు చదివి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నది. యువత ఏం ఆలోచిస్తున్నారు? ఎలా ప్రవర్తిస్తున్నారు? అనే అంశాలపై ఆమె లోతైన అధ్యయనం చేసింది. యువత ఆలోచనా విధానం మార్చాలనే ఉద్దేశంతో ఫైర్‌ఫ్లయ్ స్టూడియో స్థాపించింది. డిజైన్ క్యాంప్స్ ఏర్పాటుచేసి యువతలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది స్నిగ్ధ. మెట్రోస్టేషన్స్.. రైల్వే స్టేషన్స్.. బస్టాండ్స్‌లో క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఉదాహరణకు మెట్రో స్టేషనే తీసుకుందాం. యువతే కాదు వయోవృద్ధులు కూడా ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. కానీ చూస్తున్నాం కదా? మన యువత చేతిలో మొబైల్ పెట్టుకొని ట్రావెలింగ్ కాయిన్ బాక్స్ దగ్గర గుంపులుగా చేరుతారు. అయ్యో.. ఆ లైన్లలో పెద్దవాళ్లు కూడా ఉన్నారన్న స్పృహ ఏమాత్రం ఉండదు. వృద్ధులు కాయిన్‌తో స్లాట్ ఓకే చేసుకొని.. పైకి ఎక్కేసరికి ఆలస్యం అవ్వొచ్చు. ఇలాంటి విషయాల్లో తన డిజైన్స్ ద్వారా యువతలో మార్పు తీసుకొచ్చి పెద్దవాళ్లకు గౌరవమిచ్చే దేశమని చాటి చెప్పడానికి కృషి చేస్తున్నది.
YOUVABHARATAM7


Vaccination On Wheels

భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం అంటారు కదా? నిజంగా యువత ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశం గురించి ఆలోచించాలి. ఐఐటీ హైదరాబాద్ స్టూడెంట్ జిగ్నేష్ లెక్క. తన ఆరోగ్యమొక్కటే కాదు.. దేశమంతా ఆరోగ్యంగా ఉండాలనుకున్నాడు జిగ్నేష్. మొబైల్ వాక్సినేషన్‌ను ప్రారంభించాడు. వాక్సినేషన్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని రూపొందించి పూణెలో దానిని తొలిసారిగా ప్రయోగించాడు. హెల్త్‌కేర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సహకారంతో ఈ వాక్సినేషన్ వెహికిల్‌ను స్కూళ్లు.. కాలేజీలకు వెళ్లి టీకాలు వేస్తారు. అంతేకాదు వాటి గురించి అవగాహన కూడా కల్పిస్తారు. జివిక హెల్త్‌కేర్ సొసైటీ జిగ్నేష్‌కు సహకరిస్తుంది. ఈ కార్యక్రమం ప్రపంచ ఆరోగ్య సంస్థ గైడ్‌లైన్స్ ప్రకారం పనిచేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు క్యాంప్‌లు కూడా ఏర్పాటుచేస్తున్నారు. ఏజెన్సీ ఏరియాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేసి ఆరోగ్యంపై సంపూర్ణ అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. సమాజం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన ఆరోగ్యానికి ఓ అర్థం ఉంటుందని.. దేశం ఆరోగ్యంగా ఉంటుందని జిగ్నేష్ అంటున్నాడు.
YOUVABHARATAM8

Economic Education

యువత అభివృద్ధి చెందాలి.. దేశాన్ని అభివృద్ధి చెందించాలి అంటారు కదా? మరి అభివృద్ధి ఎలా సాధ్యమో తెలుసా అంటున్నాడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెంకటేశ్ గెరిటి. జర్మనీలోని కొలోనెలో వెంకటేశ్ టెక్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. మనం చేసే ప్రతీ పని దేశానికి ఉపయోగపడినట్లే.. మనం సంపాదించే డబ్బు కూడా ప్రత్యక్ష్యంగానో.. పన్నుల రూపంలో పరోక్షంగానో దేశానికే చేరాలంటున్నాడు. యువత ఉద్యోగాల వేటను ఆపేసి రాజకీయాల్లోకి రావాలని పిలుపునిస్తున్నాడు. పెట్టుబడులు పెట్టి దేశ ఆర్థిక స్థితిగతులను మార్చే మేధావులుగా చలామణి కావాలలని వెంకటేశ్ అంటున్నాడు. ప్రాథమిక స్థాయి నుంచి కూడా చదువు విషయంలో అ అమ్మ.. ఆ ఆవు అన్నట్టుగా అ అంటే అభివృద్ధి అనేలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది.
YOUVABHARATAM9

Soul As A Race

మానసిక ఆరోగ్యం బాగుంటే ఏదైనా సాధించవచ్చు. మనం చూస్తుంటాం కదా? ఫుట్‌పాత్‌లపైన ఎంతమంది దిక్కూమొక్కూ లేకుండా పడి ఉంటారు. ఒంటిమీద బట్టలు ఉండవు.. తిండిపైన ధ్యాస ఉండదు. వాళ్లకు వాళ్లే ఏవేవో అరుస్తుంటారు. వాళ్లకు వాళ్లే పట్టరాని సంతోషంతో నవ్వుతూ ఉంటారు. అలాంటివాళ్లను చూసినప్పుడు ఏమనిపిస్తుంది? పిచ్చోళ్లు అనే కదా. కానీ వారు ఏ కారణం చేత అలా అయి ఉంటారో తెలుసుకుంటే ఒక్కొక్కరికి ఒక్కో గాథ ఉంటుంది. ఆ గాథలన్నింటినీ వింటే వారి సమస్యకొక పరిష్కారం దొరుకుతుంది. లేడీ లాజరస్‌గా పేరుగాంచిన ప్రియా వర్గీస్ ఈ పనే చేస్తున్నారు. సోల్ యాజ్ ఏ రేస్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దాని ద్వారా మెంటల్ హెల్త్ గురించి తెలియజేస్తున్నారు. మానసిక ఆరోగ్యం దేశానికి అవసరం.. అందరూ సంతోషంగా ఉన్నప్పుడే దేశం సుఖశాంతులతో కళకళలాడుతుంది. సోల్ యాజ్ ఏ రేస్ కార్యక్రమం ద్వారా ప్రియ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. మానసిక సంతోషానికి అందర్నీ దగ్గర చేసి హ్యాపీయెస్ట్ ఇండియాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు.
YOUVABHARATAM10

-దాయి శ్రీశైలం, సెల్: 9182777035

456
Tags

More News

VIRAL NEWS