గుమాస్తాగా పనిచేసి.. సైకిల్‌ను తయారుచేశాడు!


Sun,December 1, 2019 02:56 AM

one
మనిషి జీవితం కొన్నేండ్లు సైకిల్‌ చుట్టూతే తిరిగింది. అందుకే సైకిల్‌ మానవ సంస్కృతిలో భాగమైంది. అభివృద్ధి అనేది సైకిల్‌కు ముందు.. సైకిల్‌కు తర్వాత అని విభజించాల్సి వస్తుందంటే మనతో సైకిల్‌ అనుబంధం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. విపరీతమైన కార్ల వినియోగం ఉన్న ఈ రోజుల్లో కూడా సైకిల్‌ సక్రమంగానే నడుస్తున్నది అంటే దాని అవసరం ఎలాంటిదో కూడా తెలుసుకోవచ్చు. నాడు.. రోజువారీ అవసరాల కోసం వినియోగంలోకి వచ్చిన సైకిల్‌.. నేడు.. ఆరోగ్యం, ఆహ్లాదం కోసం మనుగడ సాధిస్తున్నది. మనతో ప్రయాణం చేస్తున్న సైకిల్‌ గురించి తెలుసుకుందాం.

స్తువును కనిపెట్టిన వారి గురించి తెలుసుకోవడం ఎంత అవసరమో దానికి ప్రేరణ కలిగించిన వారి గురించి తెలుసుకోవడం కూడా అంతే అవసరం. సైకిల్‌ను కనిపెట్టింది ఎవరు? అని అడిగితే మూడో తరగతి విద్యార్థి అయినా ఠక్కున మెక్‌మిలన్‌ అని చెప్పేస్తాడు. అదే వాస్తవం కూడా. మెక్‌మిలన్‌ ఒక వడ్రంగి. చెక్క, ఇనుప పనిముట్లు చేయడం చిన్నప్పటి నుంచి అతనికి తెలుసు. ఇంట్లోవాళ్లంతా అదే పని చేస్తుంటారు కాబట్టి పనిని చూస్తూ నేర్చుకున్నాడు. పూర్తిస్థాయిలో అదే పనిలో ఉండకపోయినా ఆ పని తనపై ప్రభావం చూపింది. లోహాలు కరగదీయడం.. వాటితో పనిముట్లు చేయడంలో ప్రావీణ్యం సంపాదించాడు. మెక్‌మిలన్‌ ఇంట్లో కొలిమి దగ్గరే రకరకాల ప్రయోగాలు చేస్తుండేవాడు. ‘వద్దు’ అని తల్లిదండ్రులు ఎంత వారించినా.. ‘ఈ పనంటే నాకు ఇష్టం. అయినంత మాత్రాన నేను ఇదే పనిలో ఉండిపోతా అనే భయం అక్కర్లేదు. నాకు ప్రయోగాలు చేయడమంటే చాలా ఇష్టం. దయచేసి సహకరించండి. మీ వంతుగా ప్రోత్సహించండి’ అంటూ బతిమిలాడితే ఇంట్లోవాళ్లు ఓకే అన్నారు.
కానీ ఏం కనుక్కోవాలి? ఎలా కనుక్కోవాలి? అని ఆలోచిస్తున్న క్రమంలో డైస్‌ నమూనా గురించి తెలుసుకున్నాడు. దాని ఆధారంగా రూపొందించిన చలన యంత్రమే సైకిల్‌.
రెండు చక్రాలు రూపొందించాడు. వెనుక చక్రం ఇరుసుకి రెండు చట్రాలను అమర్చి వాటిని రెండు పొడుగాటి తులాదండాలకు కలిపాడు. వీటిని కాళ్లతో తోసినపుడు వాహనం ముందుకు కదులుతుంది. తొలిప్రయత్నంగా మెక్మిలన్‌ దీనిపై డంఫ్రీన్‌ నుంచి గ్లాస్కో వరకు 40 మైళ్ల దూరం ప్రయాణించాడు. రెండు రోజుల్లోనే గ్లాస్కో చేరుకున్నాడు.

పదేళ్ల తర్వాత..

జర్మనీకి చెందిన మెకానిక్‌ ఫిలిప్‌ హెనిరిక్‌ ఫిషర్‌ దీనికి కొన్ని మార్పులు సూచించగా ముందు చక్రానికి రెండు వైపులా పెడల్స్‌ను అమర్చారు. దీంతో కాళ్లను నేలపై నెట్టగానే వాహనం నెమ్మదిగా ముందుకు కదులుతుంది. కానీ.. ముందుకు నడుస్తున్నంత సేపు వాహనాలు ఎందుకు పడిపోవడం లేదో అర్థం కాలేదు. తర్వాతి ప్రయోగాల వల్ల ‘వాహన వేగం ఎక్కువయ్యే కొద్దీ దాని స్థిరత్వం పెరుగుతుంది.. అందువల్లే కిందపడిపోదు’ అనే విషయం తెలుసుకొని సైకిల్‌ను ఒక కొలిక్కి తెచ్చాడు. మెక్మిలన్‌గానీ.. హెనిరిక్‌కు గానీ సైకిల్‌కు ఓ రూపు తీసుకురావడానికి మాత్రం ఒకరు స్ఫూర్తిగా నిలిచారు. అతడి గురించి తెలుసుకోవడం చాలా అవసరం. సైకిల్‌ తయారీలో అలా ప్రేరణ నిలిచిన అతడే కార్ల్‌ డ్రైస్‌.

అది 1813..

జర్మనీ వీధుల్లో ఒక వింత వాహనంపై విహరిస్తున్నాడో యువకుడు. అందరూ అతడ్ని వింతగా చూడటం మొదలుపెట్టారు. కొందరు నవ్వుకుంటే.. మరికొందరు శభాష్‌ అని మెచ్చుకున్నారు. ఇంకొందరైతే ఇదేదో మాయ అనీ.. మంత్రం అనీ రకరకాలుగా చెప్పుకున్నారు. ఎందుకంటే.. అప్పటివరకు వారు అలాంటి వాహనాన్ని చూడలేదు. జంతువుల సాయంతో లాగే బండ్లను.. గుర్రాలను.. ఏనుగులను.. ఇంధనంతో నడిచే రైళ్లను చూశారు కానీ.. ఇంధన రహితంగా మనిషి సాయంతో నడిచే వాహనాన్ని చూసిన సందర్భాల్లేవు. ‘భళే ఉంది వాహనం’ అని దాన్ని చూస్తూ అలాగే ఉండిపోయారు జనాలు. ఒక కొయ్య చట్రం.. మధ్యలో కూర్చోవడానికి సీటు.. ఒకదాని వెనుక మరొకటి ఉండేలా రెండు చక్రాలు ఉన్నాయి ఆ వాహనానికి. ఆ యువకుడు సీటుపై కూర్చొని కాళ్లను నేలపై నెట్టుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ముంజేతులను ఇనుప కడ్డీలపై ఉంచాడు. ముందు చక్రానికి ఉన్న కొయ్య కడ్డీని చేతులతో తిప్పుతూ ఎలా అంటే అలా వెళుతున్నాడు.ఇదేంటి ఇలా కదులుతూ వెళ్తున్నది? ఎటువైపైనా కదులుతుంది? అని పిల్లలు కేరింతలు కొడుతూ వాహనం వెళ్తుంటే దాని వెంటే పరుగులు తీస్తున్నారు. ఏదో విజయం సాధించినట్టు జనాలు ఈలలు వేస్తూ అట్టహాసం చేశారు. వీటన్నింటినీ చూస్తూ ఆ యువకుడు తన వాహనాన్ని నడుపుతూ ముందుకు సాగిపోతున్నాడు. ఎవరికీ అర్థం కాలేదు. ఆ వాహనం ఎక్కడిదో.. ఎవరు తయారుచేశారో.. ఎలా కదులుతున్నదో ఎవరికీ తెలియలేదు అప్పటికీ.
ఆ నోటా.. ఈ నోటా తెలుసుకున్నారు అది సైకిల్‌ అని.

one1

ఇంతకూ సైకిల్‌ను కనుగొన్నది ఎవరు?

ఈ సందేహమూ వెంటాడుతూ వచ్చింది. సైకిల్‌ తయారు చేసి సంచలనం సృష్టించిన అతని పేరు బయట పడకుండా ఉంటుందా?
అతనే కార్ల్‌ డ్రైస్‌. ఓ పట్టుపట్టి తొలిసారిగా సైకిల్‌కు రూపమిచ్చి.. మెక్‌మిలన్‌ లాంటి వారికి ప్రేరణ కల్పించారు. సైకిల్‌ను రూపొందించిన తొలి శాస్త్రవేత్తగా తన పేరును చిరస్థాయిగా నిలబెట్టుకున్నారు.
కార్ల్‌.. అప్పటి ప్రభుత్వంలో పనిచేసే ఒక బడా అధికారి కొడుకు.ఏ తండ్రికైనా ఏమనిపిస్తుంది? తన కొడుకు తనకంటే పెద్ద పొజిషన్‌లో ఉండాలి అనిపిస్తుంది కదా? కార్ల్‌ వాళ్ల నాన్న కోరిక కూడా అదే. కొడుకు తనకంటే పెద్ద అధికారి కావాలని ఆశించాడు. కానీ కార్ల్‌ డ్రైస్‌కు మాత్రం అవేవీ ఇష్టం లేవు. తనకంటూ ఓ గుర్తింపు దక్కాలనీ.. తండ్రి పేరు చెప్పుకొని కాకుండా తానే స్వతహాగా ఎదగాలనే ఆశయం అతడిది. పైగా ప్రయోగాలు అంటే వ్యామోహం. అవును.. అతడి విషయంలో వ్యామోహం అనొచ్చు. అంతలా ప్రయోగాలను ఇష్టపడేవాడు కార్ల్‌.

ఒక రోజు..

ఉదయాన్నే లేచాడు. ఏవేవో ప్రయోగాలు ముందరేసుకుంటే వాళ్ల నాన్న కసురుకున్నాడు. ‘ఎప్పుడు ఏంట్రా ఆ పిచ్చి పనులు? నీకేం తక్కువ? ఓ మంచి అధికారి అయ్యి ఎదగాలని లేదు కానీ ఏదేదో చెత్త ముందరేసుకొని పిచ్చోడి లెక్క చేస్తుంటవ్‌?’ అన్నాడు వాళ్ల నాన్న. కార్ల్‌ నొచ్చుకున్నాడు. ‘రొటీన్‌గా ఆఫీసుకు వెళ్లడం.. సంవత్సరాల తరబడి ఒకే తరహా పని చేయడం.. నెల రోజులు కాగానీ జీతం తీసుకోవడం.. నెల రోజుల తర్వాత మళ్లీ ఇంకో నెల జీతం కోసం పనిచేయడం నాకు నచ్చవు. నా పనులు మీకు నచ్చకపోతే వదిలేయండి. అంతేకానీ నిందించకండీ’ అని కోపంగా అరిచాడు. ‘ఐతే.. ఇది కూడా విను. ఇంట్లో నీ పిచ్చి పనులు చేయడానికి అవకాశం లేదు. నీకు అంత వాటిమీద షోకు ఉంటే బయట ఎక్కడన్నా చేసుకోపో’ అని ఇంట్లో నుంచి పంపించేంత పనీ చేశాడు. ఇదే అవకాశం అనుకున్నాడు కార్ల్‌. ఇంట్లోనే ఉంటూ లేనిపోని పనులన్నీ నెత్తినేసుకోవడం ఎందుకని భావించి ఓ కార్ఖానాలో మామూలు గుమాస్తాగా చేరాడు. అక్కడైతేనే ప్రయోగం చేసుకోవచ్చు. ఇంకేదైనా కొత్త విషయం తెలుసుకోవచ్చు అనేది తన ఆలోచన. చిన్నప్పటి నుంచి సాంకేతిక విషయాల్లో అభిరుచి.. ఉత్సుకత ఉన్నప్పటికీ యాంత్రిక శాస్త్రం చదివే అవకాశం రాలేదు. అదో వెలితిగా భావించేవాడు. కార్ఖానాలో పనిచేయడం వల్ల ఆ లోటు పూడ్చుకోవచ్చనుకున్నాడు. మరింత పట్టుదలతో తన పనులు చేస్తూ వెళ్లాడు.

అలా..

సైకిల్‌ను రూపొందించే అవకాశం కార్ల్‌కు దొరికింది. అయితే పని వదిలేసి.. తన వ్యక్తిగత పనులకు ఎక్కువ సమయం కేటాయించడమే కాకుండా స్వతహాగా సైకిల్‌ను రూపొందించడం వీధుల్లో ప్రదర్శించడాన్ని ఆయన పనిచేసే కార్ఖానా యాజమాన్యం తప్పుబట్టింది. ఏదో ఒకటి తయారుచేసి ఇలా వీధుల్లో ప్రదర్శించడం క్రమశిక్షణా రాహిత్యం అవుతుందని హెచ్చరించింది. కార్ల్‌ నుంచి సరైన వివరణ రాకపోవడంతో ఉద్యోగంలో నుంచి తీసేసింది.
ఎప్పుడైతే అతని ఉద్యోగం పోయిందని తెలిసిందో అప్పుడు తన గురించి విమర్శలు.. ఆరోపణలూ రావడం మొదలైంది. ‘ఎట్లాగూ మునిగిన.. ఆ మునిగేదేదో నిండా మునిగితే అయిపోతుంది కదా’ అనే ధోరణి పెరిగిపోయింది. పనికి మరింత పదును పెట్టాడు. సైకిల్లో మార్పులకు శ్రీకారం చుట్టాడు. 16 గంటల్లో చేరుకోవాల్సిన గమ్యాన్ని కేవలం 4 గంటల్లోనే చేరుకునేట్లు సైకిల్‌ను అప్‌డేట్‌ చేశాడు. ధృవీకరణ కూడా పొందాడు. కానీ, ఎవరూ దీని గురించి పట్టించుకోలేదు. సొంత ఊర్లో అయితే ఇంకా ఘోరం. ‘ఏదో కనుక్కున్నవంట ఏమైంది? పే.. ద్ద సైంటిస్టువైనట్టు బిల్డప్‌ ఇస్తున్నవేం కథ?’ అంటూ అవహేళన చేశారు. మనిషి నడిచేటప్పుడు తన బరువును ఒక కాలినుంచి మరో కాలికి మార్చటంలో ఎక్కువ శక్తిని వినియోగిస్తాడు కదా.. మరి ముందుకు వెళ్తున్నప్పుడు శరీరాన్ని ఒకే స్థితిలో స్థిరంగా ఉంచగల సాధనం నిర్మించటానికి వీలవుతుందా? అని ప్రశ్నించుకొన్నాడు. ఈ ఆలోచన ఇప్పటివరకూ ఎవరికీ రానట్టున్నది. నిటారుగా ఉండటం అసాధ్యమా? నిటారుగా ఉంచడం అనుకున్నదానికంటే చాలా తేలిక అని నిరూపించి తన వింత వాహనాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. 1851లో దుర్భర దారిద్య్రంలో అతడు మరణించాడు.

one2

కార్ల్‌ తర్వాత..

కార్ల్‌ చనిపోయాక అతడు రూపొందించిన వాహనం మాత్రం వాడుకలోనే ఉన్నది. చాలాకాలం వరకు కార్ల్‌ కనిపెట్టిన సైకిల్‌ సాయంతో రైల్వే అధికారులు తమ పనులను వేగంగా చేయగలిగారు. ఏదైనా మరమ్మతులు ఉంటే లేక రైల్వే పనుల పర్యవేక్షణ ఉంటే ఈ సైకిల్‌ మీద ప్రయాణించి సకాలంలో చేరుకునేవారు. ఇంగ్లండ్‌, ఫ్రాన్స్‌, అమెరికా దేశాల్లో దీనిని రోజువారీ పనులు చేసేందుకు విరివిగా ఉపయోగించడం ప్రారంభించారు. దాదాపు 20 యేండ్లకు మెక్మిలన్‌ తన ప్రయోగానికి పదును పెట్టి.. కార్ల్‌ ప్రయోగాన్ని నమూనాగా తీసుకొని కొన్ని మార్పులు చేస్తూ కొత్తరకం సైకిల్‌ను మనకు అందించాడు. సైకిల్‌ రూపకర్తగా పేటెంట్‌నూ పొందాడు. ఐక్యరాజ్యసమితిలోని వియన్నా కన్వెన్షన్‌ 1968 ప్రకారం సైకిల్‌ను ఒక వాహనంగా, నడిపేవానిని చాలకునిగా గుర్తించింది. చాలా దేశాలలో దీనికి లైసెన్సులు కూడా అమల్లో ఉన్నాయి. చీకటిలో రహదారిమీద వెళ్ళేటప్పుడు ముందు, వెనుక డైనమో సహాయంతో వెలిగే దీపాలు ఉండాలి. కొన్ని దేశాలలో పాదచారులు, బండ్లు, ఇతర వాహనాల కోసం గంటకూడా తప్పనిసరి.

టైర్లలో గాలి నింపి నడిపే సౌలభ్యం ఏర్పడిన తర్వాత సామాన్య ప్రజలు సైకిల్‌ను ఎక్కువగా వాడటం మొదలు పెట్టారు. 1888లో ప్రపంచంలోని మొత్తం సైకిళ్ల సంఖ్య 3,00,000 అయితే 1975 నాటికి ఈ సంఖ్య 7.5 కోట్లకు పెరిగింది. ఒక్క బ్రిటన్‌లోనే 1.2 కోట్ల సైకిళ్లు ఉన్నాయి. హాలెండ్‌, డెన్మార్క్‌ దేశాల్లో సగటు సైకిళ్ల సంఖ్య జనాభాలో దాదాపు సగం ఉంటుంది.ఎలాంటి శబ్ద కాలుష్యం లేకపోవడం.. దాని బరువు కంటే డజన్‌ రెట్ల బరువును మోసుకెళ్లే నైపుణ్యం ఉండటం.. మనిషి పరుగెత్తే వేగం కంటే ఆరు రెట్ల వేగంతో ప్రయాణించే అవకాశం ఉండటం.. అన్ని రకాల రోడ్లపై ప్రయాణించడం.. ఎక్కడైనా సరే ఆపడానికి వీలుండటం వల్ల ఇప్పటికీ అందరి ఆదరణా పొందుతున్నది సైకిల్‌.

424
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles