రామకోటి పుస్తకాలే లావాదేవీలుగా..బ్యాంకుకాని బ్యాంకు


Sun,December 1, 2019 02:29 AM

ram_temple
బ్యాంకు అంటే నగదు డిపాజిట్‌ చేయడం. విత్‌డ్రా చేయడం. చెక్కులు విడిపించుకోవడం, రుణం పొందడం. మనకు తెలిసినవి ఇవే. కానీ అస్సలు నగుదుతో సంబంధం లేని బ్యాంకులు ఉంటాయంటే నమ్ముతారా? అక్కడ కూడా ఖాతాదారులుంటారు. అక్కడ కూడా పాస్‌బుక్‌లుంటాయి. ఎప్పటికప్పుడు వాటిని అప్‌డేట్‌ చేస్తారు. అది ప్రపంచంలోనే ఏకైక నగదు రహిత బ్యాంకు. దాని గురించి బోలెడు
విషయాలు..

రఘునందన్‌

వయసు 87 ఏండ్లు. ఆయనది అలహాబాద్‌. వయసులో ఉన్నప్పుడు బట్టలునేసేవాడు. పదేండ్లుగా ఆయన ప్రతి సోమవారం ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నాడు. ఏడాది నుంచి ఆరోగ్యం సహకరించట్లేదు. డిగ్రీ చదువుతున్న మనవడిని వెంట తీసుకెళ్తున్నాడు. ప్రయాగ్‌రాజ్‌ వెళ్లిన ప్రతిసారి ఆయన భుజానికి ఓ సంచి వేలాడుతూ ఉంటుంది. బ్యాంకులో లైన్‌లో నిల్చుంటాడు. కౌంటర్‌ దగ్గరికి వెళ్లగానే చేతి సంచిలోని రెండు పుస్తకాలు తీసి ఇస్తాడు. పాస్‌బుక్‌ను అప్డేట్‌ చేయించుకుంటాడు. మళ్లీ ఇంటికి వెళ్లిపోతాడు.

నగదు సేవల్లేని బ్యాంకు ఇది

ప్రయాగ్‌రాజ్‌లో ఓ బ్యాంకుంది. దానిపేరు రామ్‌నామ్‌ బ్యాంకు. ఇక్కడ నగదు లావాదేవీలుండవు. ఏటీఎంలు, చెక్‌బుక్‌లు ఉండవు. భక్తులు ‘రామనామం’తో రాసిన పుస్తకాలను ఇక్కడ డిపాజిట్‌ చేస్తుంటారు. ఏ మతం వారైనా ఈ బ్యాంకులో ఖాతాను తెరవవచ్చు. ఖాతాదారుల పేరు మీద పాస్‌బుక్‌ ఇస్తారు. ఖాతా తెరిచిన వెంటనే ఒక్కొక్కరికి రామనామాన్ని లిఖించేందుకు 5 పుస్తకాలు ఇస్తారు. 30 పేజీలు గల పుస్తకంలో ఒక్కో పేజీలో 108 గడులుంటాయి. వీటిలో ‘శ్రీరామ’ అని రాయాల్సి ఉంటుంది. ఇందులో లక్షకు పైగా ఖాతాదారులున్నారు. అయోధ్యతీర్పు నేపథ్యంలో ఖాతాన తెరవడానికి చాలామంది ముందుకొస్తున్నారు.
ram_temple1

బ్యాంకును ప్రారంభించారిలా..

అది 2007. ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళ. ఆరోఘాట్‌. ఓ వ్యక్తి ‘రామనామాన్ని లిఖించండి.. పుణ్యాన్ని మీ పేరున రాసుకోండి’ అంటూ పెద్ద బ్యానర్‌ కట్టారు. అక్కడ ఉచితంగా పుస్తకాల్ని కూడా పంచుతున్నాడు. వచ్చిన భక్తులంతా ఆ పుస్తకాలను తీసుకెళ్తున్నారు. ఓ భక్తుడు మాత్రం పుస్తకం తీసుకొని వెళ్లకుండా ‘రాసిన తర్వాత మళ్లీ ఇవి ఎక్కడ ఇవ్వాలి’ అనడిగాడు. ఆ ప్రశ్నకు సమాధానం కోసం చాలామంది ఆలోచించారు అక్కడున్న రామభక్తులు. ఆ తర్వాత ‘రామ్‌నామ్‌ సేవా సంస్థాన్‌' అనే ఓ సంస్థను ఏర్పాటు చేశారు. పుస్తకాలన్నీ డిపాజిట్‌ చేయాలనే ఉద్దేశ్యంతో ఈశ్వర్‌చంద్ర అనే వ్యాపారి ప్రయాగ్‌రాజ్‌లో ‘రామ్‌నామ్‌ బ్యాంక్‌' అనే నగదురహిత బ్యాంకును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆయన మనవడు అశుతోష్‌ వర్షిణ్‌ బ్యాంకు వ్యవహారాలన్నీ చూసుకుంటున్నాడు. ఎప్పటికప్పుడు ఖాతాదారులు రాసిన రామనామాన్ని పది మంది సిబ్బందితో లెక్కింపజేస్తారు. వాటిని పాస్‌బుక్‌లలో కంప్యూటర్లలో పొందుపరుస్తారు.

లిఖిస్తారిలా..

రామ్‌నామ్‌ బ్యాంకు వారిచ్చే బుక్‌లెట్‌లో ఏ భాషలో అయినా రామనామాన్ని లిఖించవచ్చు. అయితే కొన్ని నిబంధనలకు లోబడి మాత్రమే రామనామాన్ని రాయాల్సి ఉంటుంది. మనసులో రాముని రూపాన్ని తలుచుకుంటూ, రామనామాన్ని జపిస్తూ ‘రామ’ అని రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్కరు ఎన్ని పుస్తకాలైనా రాయవచ్చు. వయసుతో కూడా సంబంధం లేదు. అయోధ్య తీర్పు వెలువడిన నేపథ్యంలో నవంబర్‌ 9 ఉదయం 10:30 గంటలకు తీర్పు వెల్లడించిన నేపథ్యంలో అదే రోజు రామ్‌నామ్‌ బ్యాంక్‌ ఖాతాదారులకు బోనస్‌ ప్రకటించింది. నవంబర్‌ 9 మధ్యాహ్నం నుంచి 10న తెల్లవారుజామున వరకు రాముడి పేరును 1.25 లక్షల సార్లు పుస్తకంలో రాసి బ్యాంకులో డిపాజిట్‌ చేస్తే అవార్డులు అందజేస్తామని ప్రకటించింది. అలా రాసిన ఖాతాదారులు 1.25 లక్షలు అదనంగా రాసినట్లుగా లెక్కిస్తామని బ్యాంకు వెల్లడించింది. రామ్‌నామ్‌బ్యాంకు ఖాతాదారులు రామనామాన్ని రాసి ఇక్కడ డిపాజిట్‌ చేస్తున్నారు. కాబట్టి అందరూ దీన్ని ‘రాముడి కరెన్సీ’ అని పిలుస్తుంటారు. శ్రద్ధతో రాస్తున్నారు కాబట్టి రాసే సమయాన్ని ‘రామ్‌నామ్‌ జప్‌' అని సంబోధిస్తున్నారు. రామ నామాన్ని రాసి రామ్‌నామ్‌ బ్యాంక్‌లో డిపాజిట్‌ చేస్తే అనుకున్నది నెరవేరుతుందని ఖాతాదారులల విశ్వాసం.
రామ్‌నామ్‌ బ్యాంక్‌ను మా తాతగారు స్థాపించారు. మొదట్లో రెండు వందల మంది ఖాతాదారులుండే వారు. రామనామాన్ని లిఖించి బ్యాంకులో డిపాజిట్‌ చేస్తే మంచి జరుగుతుందని తెలుసుకొని చాలామంది ఖాతాదారులుగా చేరారు. రాముడి సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే మా లక్ష్యం. ప్రజల్ని సన్మార్గంలో నడిపించేందుకు ఈ బ్యాంకు నిర్వహణ ప్రస్తుతం నేను చూసుకుంటున్నాను. బ్యాంకు ప్రారంభం నుంచి ఖాతాదారులు లిఖించిన పుస్తకాలన్నీ భద్రంగా ఉన్నాయి.
- అశుతోష్‌ వర్షిణ్‌, రామ్‌నామ్‌ బ్యాంకు నిర్వాహకులు, ప్రయాగ్‌రాజ్‌

304
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles