పత్రికా ఎడిటర్ ఘోరహత్య


Sun,November 17, 2019 02:21 AM

ఆగస్టు 22, 1948 చప్పల్ బజార్, కాచిగూడరాత్రి 1.30 గంటలు..ఖుదాఫీస్.. ఇక ఉంటా.. దగ్గరి మిత్రునికి ఆ రోజు వీడ్కోలు చెప్పాడు నర్సింగ్‌రావు. నర్సింగ్‌రావుకు షేక్ హ్యాండ్ ఇచ్చి సహచరునితో కలిసి బయల్దేరాడా మిత్రుడు. గేటు మూసేసి ఇంట్లోకి అడుగు పెట్టాడు నర్సింగ్‌రావు.రోడ్డుమీద ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తున్నారు. చప్పల్ బజార్ ఎప్పటిలాగే నిర్మానుష్యంగా ఉంది. చీకటితో..నర్సింగ్‌రావు ఇంట్లోకి అడుగులు వేస్తున్నాడు.ఇంతలోనే ఓ శబ్దం. బయట తుపాకీ పేలిన శబ్దం..కొద్దిక్షణాల్లోనే నర్సింగ్ రావు ఇంటి తలుపులు ఎవరో తడుతున్న శబ్దం..
CHIVARI-PAGE

1945, ఏప్రిల్ మాసం..

రయ్యత్ దినపత్రికా కార్యాలయం, హైద్రాబాదు.నీకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం దొరకడానికి, భవిష్యత్‌లో అభివృద్ధి చెందడానికి అన్ని అర్హతలున్నాయి. కానీ ఆర్థికంగా బాగుపడే అవకాశమేలేని ఈ పత్రికారంగానికి ఎందుకింత ప్రధాన్యం ఇస్తున్నావు? మొదటి ప్రశ్న వేశాడు రయ్యత్ పత్రికా ఎడిటర్ మందముల నరసింగరావు ఎదురుగా కూర్చున్న ఓ వ్యక్తిని. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఏ జర్నలిజంలో పట్టభద్రుడు ఎదురుగా ఉన్నది. 25-26 ఏండ్లుంటాయి. నీకు ఆదర్శమెవరు? రాజకీయలపై నీ అభిప్రాయమేంటి? రెండోసారి ప్రశ్నించాడు.పత్రికా రచన క్షేత్రస్థాయిలో ఉండే ఆర్థిక అవకాశాలు చాలా తక్కువని నాకు తెలుసు. నా తల్లిదండ్రులకు విరుద్ధంగా ఈ రంగానికి ప్రాముఖ్యాన్ని ఇస్తున్నాను. ఈ క్షేత్రం ద్వారా నిరంకుశత్వంపై, అణచివేతపై నా కలాన్ని ఖడ్గంగా ఉపయోగిస్తాను. అతని గుండెల్లోంచి గర్వంగా దూసుకొచ్చింది మొదటి ప్రశ్నకు జవాబు. అతని ముఖంలో ఒక ప్రకాశం, రూపంలో ఓ ఆకర్షణ కనిపిస్తున్నది. రెండో ప్రశ్నకు జవాబు కూడా వచ్చింది. నేను ఎంఎన్ రాయ్ సిద్ధాంతాలను అనుసరిస్తాను. రయ్యత్ పత్రికావిధానాలకు లోబ డి పని చేస్తాను అని వాగ్దానం చేశాడు. ఈ రెండు జవాబులు వచ్చింది ఎవర్నించో కాదు..ఆ జవాబులకు కట్టుబడి జర్నలిజంలో నిక్కచ్చిగా పని చేసి, 28 ఏండ్ల వయసులోనే రజాకర్ల చేతిలో ఘోర హత్యకు గురైన ఇమ్రోజ్ పత్రికా ఎడిటర్ షోయబుల్లాఖాన్. తెలంగాణలో స్వేచ్ఛ కోసం నిజాం పాలనలో ఆఖరి అమరుడతనే..

1945 ఏప్రిల్, హైద్రాబాదు..

హైద్రాబాదు నిజాం చేతిలో ఉన్న రోజులవి. రాష్ట్ర రాజకీయాలు, వ్యవస్థాపక వ్యవహారాలన్నీ క్లిష్టపరిస్థితుల్లో ఉన్నాయి. మరోవైపు భారత కాంగ్రెస్ నాయకులు, జాతీయవాదులు, కమ్యూనిస్టులు నిజాంపై పోరాడుతున్నారు. ఆ సమయంలో దాదాపు అన్నీ ఉర్దూ పత్రికలే. కొన్ని పత్రికలు నిజాం విధానాలను ఎండగట్టేవి. అలాంటి వాటిలోనే రయ్యత్ ఒకటి. పూర్తి జాతీయవాద భావాలతో, కాంగ్రెస్ విధానాలను బలపరిచే పాలసీతో నడుస్తున్నది. నిజాం పాలన నుంచి విముక్తిపొంది రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవాలని కాంక్షిస్తున్నది. 1945 ఏప్రిల్.. రాష్ట్రంలో కల్లోల వాతావరణం కొనసాగుతున్నది. అప్పుడే రయ్యత్‌లో పని చేసే నలుగురు సబ్‌ఎడిటర్లు రాజీనామాలు చేసి వారి దారిలో వారు వెళ్లిపోయారు. ఇప్పుడు కనీసం ఆ పత్రికకు ఇద్దరు సబ్ ఎడిటర్లయినా అవసరమైంది. ఎడిటర్ నరసింగరావు తన మిత్రులకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న షోయబుల్లా ఖాన్ రయ్యత్‌లో పని చేయడానికి వచ్చాడు. అతను ఇక్కడికి రాకన్న ముందే తేజ్ అనే ఉర్దూ పత్రికలో సబ్‌ఎడిటర్‌గా చేశాడు. సమస్యలపై పాలకులను నిలదీస్తూ ప్రజలను చైతన్యవంతులను చేసింది తేజ్. ఇది నిజాంకు నచ్చకపోవడంతో పత్రికపై నిషేధం విధించాడు. దీంతో షోయబ్ అప్పుడే రయ్యత్‌లో చేరాడు. 75 హాలి* రూపాయల జీతంతో రయ్యత్‌లో షోయబ్ సబ్‌ఎడిటర్‌గా చేరాడు. ఆ పత్రికతో నిజాంను ఎత్తిపొడిచే వ్యాసాలు, విమర్శనాత్మక కథనాలతో ప్రజల్ని చైతన్యవంతులను చేయడంలో విజయవంతం అయ్యాడు షోయబ్.

(హాలి = స్వాతంత్య్రానికి ముందు హైదరాబాద్ రాష్ట్రంలో మొఘల్ చక్రవర్తి పేరు మీద నాణేలు విడుదలయ్యేవి. కొన్నాళ్లుకు అవి అషఫ్‌ఝా పేరుతో హాలి సిక్కా నాణేలుగా చలామణిలోకి వచ్చాయి. వీటిమీద ఒకవైపు చార్మినార్, మరోవైపు నాణెం విలువ ఉండేది.) జూన్ 11, 1947(భారత స్వాతంత్య్రానికి రెండు నెలల ముందు)దేశం బ్రిటీష్ సంకెళ్లను తెంచుకొని స్వేచ్ఛా వాయువులు పీల్చుకొనే తరుణం ఆసన్నమైంది. హైద్రాబాదు రాష్ట్రంలోనూ త్రివర్ణపతాకం రెపరెపలాడబోతుందని అందరూ అనుకున్నారు. కానీ అప్పుడే నిజాం అందరి కలను చిధిమేస్తూ ఓ నినాదాన్ని ప్రకటించాడు.అన్ అల్ మాలిక్ ..నేనే సార్వభౌమాధికారి. హైదరాబాద్ రాష్ర్టాన్ని దేశంలో విలీనం చేసేదే లేదు అన్నాడు. రయ్యత్‌లో షోయబ్ ఈ నిరంకుశత్వాన్ని ఎప్పటికప్పుడూ ప్రజల ముందు ఉంచుతూనే ఉన్నాడు. నిజాం ఇలాంటి ప్రకటనలతో రెచ్చిపోతున్నాడు.వార్తలనే ఆస్ర్తాలుగా ప్రయోగిస్తున్నాడు షోయబ్ అజాద్ హైద్రాబాద్ అంటూ నిజాం మరింత దౌర్జన్యం చేస్తున్నాడు. వీధుల్లో ప్రజలను బెదిరిస్తున్నాడు.ఎలాగైనా స్వాతంత్య్రం సాధించాల్సిందే అని, ప్రజలను చైతన్యవంతం చేసే కథనాలిస్తున్నాడు షోయబ్.

ఆగస్టు 15, 1947

దేశంలో జాతీయతా స్ఫూర్తి ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నది. సంస్థానాలు విలీనమయ్యాయి. బ్రిటీషువారు వెళ్లిపోయారు. దేశమంతా స్వేచ్ఛా సంబురాలు జరుపుకుంటున్నది. హైద్రాబాద్ అట్టుడుకుతున్నది. జాతీయ జెండా ఎగరేయడానికి ఎందరో ఉద్యమకారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడక్కడా ఉద్రిక్తతల నడుమ జెండాలను ఎగురవేశారు. మరోవైపు ఎక్కడికక్కడా అరెస్టులు, అరాచకాలు. నిజాం ఈ స్వాతంత్య్రాన్ని హైద్రాబాద్‌కు దక్కనివ్వలేదు. అతనికి వ్యతిరేకంగా ప్రజాగ్రహం బగ్గుమంది. ఉద్యమాలు ఉవ్వెత్తున లేచాయి. సమరభేరి మోగింది. రయ్యత్‌లో షోయబ్ అక్షరాలకు పదును పెడుతున్నాడు. ఉద్యమానికి పత్రిక ద్వారా ఊతమిస్తున్నాడు. దీంతో ఈ పత్రిక నిజాంకు కంటిలో నలుసుగా మారింది.

1947 అక్టోబర్ మాసం

నిజాం ప్రభుత్వ గూఢాచార విభాగ అధికారి ఫజల్ రసూల్ ఖాన్ రయ్యత్ కార్యాలయానికి వచ్చాడు. పత్రికపై నిషేధాజ్ఞలు అందించాడు. ఇట్లా రయ్యత్‌ను కూడా నిజాం నిలిపేశాడు. తల్లిలాంటి పత్రిక రేపటి నుంచి వచ్చే అవకాశం లేదన్న విషయం షోయబ్‌ను బాధించింది. అందులో పని చేసే హిందూ, ముస్లింలంతా కంటతడి పెట్టుకున్నారు. కన్నీరుమున్నీరవుతున్న షోయబ్ దగ్గరకు వచ్చాడు ఎడిటర్. నువ్వు నా వైపు చూసి ఆలోచించు. సంపాదకునిగా నేను నీ కన్నా ఎక్కువ బాధపడాలి అంటూ ఓదార్చాడు. నిజాం పాలనలో అట్లా రయ్యత్ గొంతును నొక్కేశారు. కానీ ఇంకో గొంతు ప్రజల కోసం పుట్టుకొని రావడానికి ఎక్కవ రోజులేం పట్టలేదు.

1947 నవంబర్ మాసం

అప్పటికే రజాకార్ల నాయకుడు ఖాసింరజ్వీ రాష్ట్రంలో బీభత్సాన్ని సృష్టిస్తున్నాడు. మరోవైపు రయ్యత్ మూతపడడంతో ప్రత్యామ్నాయ పత్రిక అనివార్యమైంది. అప్పుడే షోయబ్ నేతృత్వంలో కొత్త పత్రిక ఇమ్రోజ్ ఆవిర్భవించింది. మందముల నరసింగరావు, బూర్గుల రామకృష్ణరావు సహకారంతో ఇమ్రోజ్ మొదటి కాపీ 15 నవంబర్ 1948న వెలువడింది. కాచిగూడలోని రామకృష్ణరావు ఇంట్లోనే దీని కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ కేం ద్రంగా షోయబ్ వార్తలు వెలువరిస్తున్నాడు. సాయంగా బావమరిది ఇస్మాయిల్‌ఖాన్ ఎప్పుడూ ఉండేవాడు. ఖాసిం రజ్వీ నడుపుతున్న ఇత్తెహాదుల్ ముసల్‌మీన్ సంస్థ అరాచకాలు పరాకాష్ఠకు చేరుతున్నాయి. ప్రజలపై దాడులు, మహిళలపై అత్యాచారాలు.. ఈ ఘటనలు అందరినీ భయభ్రాంతులకు గురిచేశాయి. షోయబ్ వీటిని ఎప్పటికప్పుడూ ఎండగడుతున్నాడు. రజ్వీ దుశ్చర్యలపై నిర్భయంగా వార్తలు రాస్తున్నాడు. దురహంకారాన్ని ప్రతిఘటిస్తూ ముక్కుసూటి రచనలు చేస్తున్నాడు. మరోవైపు యూనియన్ విలీనంలో కావాలని అతని సిద్ధాంతాలను అనుసరిస్తూనే కమ్యూనిస్టు పార్టీ చేస్తున్న తెలంగాణ సాయుధ పోరాటాన్ని బలపరుస్తున్నాడు. ప్రజలను చైతన్యం చేస్తూ సర్కారు నిరంకుశత్వంపై నిప్పులు కురిపిస్తున్నాడు. ఇట్లా ఇమ్రోజ్ పత్రిక నిజాంకు, రజ్వీకి ఇంకా కుంపటిగా మారింది. సమయం చూసి షోయబ్‌కు తగిన శాస్తి చేయాలనుకున్నారు.

ఆగస్టు 19 -1948.. జమ్రద్ మహల్ టాకీసు, అబిడ్స్ ఏరియా

రజ్వీ నేతృత్వంలో రజాకార్ల సభ జరుగుతున్నది. రజ్వీ ఉప్పెపై ఊగిపోతున్నాడు. హిందువులను, భారత ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ అరుస్తున్నాడు. మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా రాస్తే.. రాసిన ఆ వేళ్లను తెగ్గోస్తాం.. చేతులను నరికేస్తాం, ఎవరైనా మాట్లాడితే నాలుకలు పీకేస్తాం. అంటూ రెచ్చి పోయాడు. ఇమ్రోజ్ పత్రిక మీద పరోక్షంగా విద్వేషాన్ని వెల్లగక్కాడు. అనునయులను ఉసిగొల్పాడు. అంతే కాకుండా ఢిల్లీ ఎర్రకోటపై ఆసఫ్‌జాహీ జెండాను ఎగురవేస్తాంఅని ప్రగల్భాలు పలికాడు. ఇలాంటి మాటలతో సభలో నిప్పుల వాన కురిసింది..

ఆగస్టు 20, 1948, ఉదయం

ఆ మీటింగ్ వార్తను విశ్లేషిస్తూ షోయబ్ ఇమ్రోజ్‌లో ఎడిటోరియల్ రాశాడు. రజ్వీ మాటలు అర్థరహితమనీ, అతన్ని బలపరిచేందుకు జనాలే లేనప్పుడు ఢిల్లీలో జెండా ఎలా ఎగురవేస్తాడని సూటిగా ప్రశ్నించాడు. ఆ రోజు రాష్ట్రంలో ఇదే ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. రజ్వీకి ఇది మరింత కోపం తెప్పించింది.

ఆగస్టు 21- 1948

ఎలాగైనా షోయబ్‌ను ఖతం చేయాలని రజ్వీ పథకం వేశాడు. నిప్పుల కుంపటిగా మారిన ఇమ్రోజ్‌ను తొలగించాలనుకున్నాడు. అర్ధరాత్రి దాటుతున్నది. షోయబ్ ఆఫీస్‌లో విధి నిర్వహనలో ఉన్నాడు. ఆ రోజు పని దాదాపు అయిపోవచ్చింది. ఇంటికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు.

ఆగస్టు 22, 1948

సమయం : రాత్రి 1.00 గంటలు ఆ రోజుపని ముగిసింది. షోయబ్, ఇస్మాయిల్‌ఖాన్ ఆఫీసు బయటకొచ్చారు. మిత్రుడు నర్సింగరావూ వచ్చాడు. అక్కడ కొంతసేపు మాట్లాడుకుంటున్నారు. సమయం 1.30 గంటలు.. బాబు! మె జా రహాహు నర్సింగ్‌రావుతో అన్నాడు షోయబ్. ఖుదాఫీస్.. ఇక ఉంటా.. వీడ్కోలిచ్చాడు నర్సింగ్‌రావు. షేక్ హ్యాండ్ ఇచ్చి ఇస్మాయిల్‌ఖాన్‌తో కలిసి బయటకు అడుగులవేశాడు షోయబ్.గేటు మూసేసి ఇంట్లోకి అడుగు పెట్టాడు నర్సింగ్‌రావు.చప్పల్ బజార్ ఎప్పటిలాగే నిర్మానుష్యంగా ఉంది. రోడ్డుమీద ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తున్నారు.చౌరస్తా దాటి నాలుగడుగులు వేశారో లేదో.. వెనకనుంచి నలుగురు అగంతకులు షోయబ్ మీద దాడి చేశారు. ఒకడు తుపాకీ పేల్చాడు. షోయబ్ ఛాతిలోకి మూడు బుల్లెట్లు దూసుకెళ్లాయి. షోయబ్ నేలకొరిగాడు. మరో ఇద్దరు కత్తితో వచ్చి షోయబ్ కుడి చేతిని నరికేశారు. దాన్ని రోడ్డు మీద విసిరేశారు. అడ్డుగా వచ్చిన ఇస్మాయిల్‌ఖాన్ పైనా దాడి చేశారు. అతని చేతివేళ్లను నరికేశారు.
ఎవరో తడుతున్న తలుపులను నర్సింగరావు తీశాడు. బయట దాడి విషయం తెలియజేశాడు వాచ్‌మన్. సోదరునితో కలిసి వీధిలోకి పరిగెత్తాడు నర్సింగరావు. దాడి చేసిన అగంతకులు పారిపోతున్నారు. కొద్ది సేపటికే జనం గుమిగూడారు.రక్తపు మడుగుల్లో ఉన్న షోయబ్‌ను, ఇస్మాయిల్ ఖాన్‌ను వెంటనే ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు.

ఉస్మానియా జనరల్ ఆస్పత్రి రాత్రి సుమారు 2.30 గంటలు

నిస్సహాయ స్థితిలో షోయబ్‌ను, ఇస్మాయిల్‌ను ఆస్పత్రికి తీసుకొచ్చారు. వారితో షోయబ్ భార్య కూడా ఉంది. ఆమె గర్భిణి. పట్టరాని దుఖంతో ఉంది. షోయబ్ బెడ్‌మీద ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత స్పృహలోకి వచ్చాడు. ఒకరిని పిలుచుకున్నాడు. స్వాతంత్య్ర సంగ్రామంలో నా కలాన్ని శాయశక్తులా ఉపయోగించాను. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఇమ్రోజ్ పత్రిక నడవాల్సిందే. ఏ కారణంతోనూ అది ఆగడానికి వీల్లేదు. ఆ మాటలు అన్న కొద్ది క్షణాల్లోనే షోయబ్ ఊపిరి ఆగింది. నిరంకుశత్వంపై కలాన్ని ఎక్కుపెట్టిన ఆ అక్షరయోధుడు ఆర్ధరాత్రి అలా నిశ్శబ్దంగా అమరుడయ్యాడు. తెలంగాణలో స్వాతంత్య్రాన్ని కాంక్షిస్తూ ఆ పత్రికా ఎడిటర్ ప్రాణాలర్పించాడు..

అదే రోజు ఉదయం..

ఈ ఘటనతో నగరం అట్టుడికింది. జాతీయవాదాన్ని బలపరిచే ఎందరో ముస్లిం ఎడిటర్లకు రజ్వీ నుంచి ఇవే హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రజలు రోడ్ల మీదకొచ్చారు. పెద్ద ఊరేగింపు జరుపుదాం అనుకున్న షోయబ్ అంతిమయాత్రపై కూడా సర్కార్ నిరంకుశత్వం ప్రదర్శించింది. పిరికి నిజాం సర్కార్ బందూకుల మధ్య షోయబ్ మృతదేహాన్ని హడావుడిగా గోషామహల్ కబరస్థాన్‌కు తరలించింది. అక్కడే ఖననం చేయించింది.చరిత్రలో నిశ్శబ్దంగా షోయబ్ ప్రస్థానం ముగిసింది. అవును మరి ! నియంతృత్వానిది పరాకాష్ఠ అయితే ప్రశ్నించే గొంతులదే గొడవంతా..అన్యాయానిదే అధికారమైతే ఎదిరించే కలాలదే వేదనంతా.

ఆ వీరుడి త్యాగం, అతని కల వృథా కాలేదు. షోయబ్ మరణించిన 25 రోజులకు సెప్టెంబర్ 17న హైద్రాబాదును దేశంలో విలీనం చేస్తున్నట్టు సైన్యానికి లొంగిపోయాడు నిజాం. అంతకు వారం రోజుల ముందే అంటే సెప్టెంబర్ 10న రజ్వీ కేసులు కోర్టులో నిరూపితమయ్యాయి. అందులో షోయబ్ హత్యకేసు ఒకటి. ఈ నేరం కారణంగా రజ్వీకి యావజ్జీవ శిక్ష ప్రకటించింది కోర్టు.

అదేరోజు ఉస్మానియా జనరల్ ఆస్పత్రి రాత్రి సుమారు 2.30 గంటలు

ఛాతిలో బుల్లెట్ గాయాలు, తెగిన కుడిచేయి నుంచి ఉడుకు రక్తం బొటబొటా రాలుతున్నది. రక్తపు మరకలతో బెడ్‌మీద కనిపిస్తున్నాడో వ్యక్తి. పక్కనే నిండుగర్బిణి నిల్చుంది. ముఖంలో పట్టరాని ఆవేదన. ఆమెకు కొంత దూరంలోనే తీవ్రగాయాలతో ఇంకొకతను. నిస్సహాయ స్థితిలో ఉన్నాడాయన. మరో నలుగురైదుగురు అక్కడక్కడా నిల్చున్నారు. అందరి ముఖాల్లో ఒక్కటే విచారం. బెడ్‌మీద ఉన్న వ్యక్తి స్పృహలోకి వచ్చాడు. ఒకరిని పిలుచుకొని ఏవో మాటలు చెప్తున్నాడు. కొద్దిసేపటితర్వాత ఆ అర్ధరాత్రి అక్కడ విషాదం తాండవించింది. ఎక్కడో ఓ సముద్రపు అల ఉవ్వెత్తున ఎగిసి పడింది. జ్వాలై లేచిన ఓ నిప్పుకనిక కారుచీకట్లో కలిసింది. అతని ఊపిరి ఆగింది. దాని తాలూకు విషాదం తెల్లవారేలోపు హైద్రాబాదు రాష్ట్రమంతా వ్యాపించింది. హైద్రాబాదు అట్టుడికింది. కొందరు భయపడ్డారు. ఇంకొందరు తిరగబడ్డారు.

-వినోద్ మామిడాల, సెల్: 7660066469

537
Tags

More News

VIRAL NEWS