ఎక్కడ ఏలాడో.. అక్కడే వేలాడి..


Sun,November 3, 2019 04:45 AM

9ఎంఎం, లాంగ్ బారెల్ గ్లిసెంటి ఆటోమేటిక్ పిస్టల్ ట్రిగ్గర్ నొక్కి ఉంది. ఓ మహిళ చేతిలో ఉందా పిస్టల్. గట్టిగా ఊపిరి తీసుకొని సెకన్ కాలంలో ట్రిగర్ వదిలింది. మొదటి బుల్లెట్ : ఎదురుగా ఉన్న ఓ బాడీలోకి చొక్కుకొని వెళ్లింది.ఆమె ఎవరినో తలుచుకుంది.చుట్టూ జనం, అరుపులు. ఎవరూ అడ్డు చెప్పడం లేదు. రెండో బుల్లెట్ : అదే బాడీలోకి, అదే పాయింట్‌లోకి దూసుకెళ్లింది. ఆమె కండ్లలో నీళ్లు తిరిగాయి. మూడో బుల్లెట్, నాలుగు, ఐదు ఇలా వరుసగా పేల్చింది. ఆమె శ్వాస వదిలింది. దూసుకెళ్లిన ప్రతి బుల్లెట్ తర్వాత ఆమె ఎవరినో తలుచుకుంది. ఇప్పడు ఆమెలో ఏదో సంతృప్తి. ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న క్షణం ఇదే అన్నట్టు భావించింది. మృతదేహాన్ని కూడా వదలకుండా ఆమె కాల్చేసింది. చచ్చుబడి ఉన్న ఆ ముఖం జనం గుద్దిన పిడిగుద్దులతో మాడిపోయింది. శరీరం నిండా రక్తపు చారికలున్నాయి. అక్కడక్కడా శరీరాన్ని ఎవరో ఒల్చినట్టు కనిపిస్తుంది. బహశా ఆ మనిషి చచ్చిపోయి ఐదారు గంటలు కావొస్తుందేమో. పక్కనే ఇంకా కొన్ని మృతదేహాలున్నాయి. ఒకరు వచ్చారు. ఆ శరీరం చేతులు పైకి ఎత్తారు.. చంకల కింద చేతులు చేర్చి, రోడ్డు మీదే ఈడ్చుకుంటూ తీసుకెళ్తున్నారు. చచ్చినా వదలకుండా జనం ఎందుకు అతని చావును ఇంకా హీనం చేస్తున్నారో అక్కడ అందరికీ తెలుసు! కొద్ది రోజుల్లోనే ప్రపంచానికీ తెలిసింది. ఈ భీతావహ చావు ఎవరిదో కాదు.. ఆ ప్రజలనే పాలించిన ఒకప్పటి అధ్యక్షునిది. నార్త్ ఇటలీ, మిలాన్ నగరం, పిజాలియా లొరేటో చౌరస్తా అది. ఉదయం ఎనిమిది గంటలు. ఏప్రిల్ 29, 1945 ఆదివారం.
Die

-వినోద్ మామిడాల, సెల్: 7660066469

చిన్నప్పటి నుంచీ అతను చాలా తెలివైనవాడు. మంచి రచయిత. సోషలిస్టు భావాలున్న జర్నలిస్టు, వక్త. ఉపాధ్యాయునిగా వృత్తిని ప్రారంభిద్దాం అనుకున్నాడు. కానీ అది తన జీవితం కాదని త్వరలోనే నిర్ణయించుకున్నాడు. అయినప్పటికీ ఇమ్మాన్యుయల్ కాంట్, జార్జ్ సోరెల్, కార్ల్ మార్క్స్ వంటి గొప్ప యూరోపియన్ తత్వవేత్తల రచనలను ఎంతో ఆతురతో చదివేవాడు. మార్క్సిస్ట్ సాహిత్యం గురించి అతనికి బాగా తెలుసు. తనను తాను గొప్ప మార్క్సిస్టుగా భావించేవాడు. ఓ దశలో అతని గదిలో కార్ల్‌మార్క్స్ ఫొటోను పెట్టుకున్నాడు. కారల్ మార్క్స్‌ను సోషలిజపు సిద్ధ్దాంతకర్తల్లో గొప్పవాడుగా అభివర్ణించాడు. అతను ఎవరో కాదు. కళల ప్రపంచంలో కలకాలం వర్ధిల్లాలనుకొని, అధికార మత్తులో విర్రవీగి ప్రపంచంలో కలకలం సృష్టించిన నియంత బెనిటో ముస్సోలిని.
అతనిలోని సోషలిస్టు భావాలను నమ్మి అధికారాన్నిచ్చిన ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేశాడు. హక్కులను అణగదొక్కి ఆధిపత్యం చెలాయించాడు. కార్పొరేట్ ప్రభుత్వాన్ని నడిపి నిరంకుశత్వ పాలన చేశాడు. చివరి రోజుల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోవాలనుకున్నాడు.
Die1

1902, స్విట్జర్లాండ్..

ఇటలీ నుంచి ముస్సోలిని స్విట్జర్లాండ్‌కు వలస వచ్చిన రోజులవి. ఆ సమయంలో జార్జ్ సోరెల్ తత్వవేత్త రచనలు ముస్సోలిని పై ప్రభావాన్ని చూపాయి. డిమాండ్ల కోసం సాధారణ సమ్మె, పెట్టుబడిదారీ విధానాన్ని పడగొట్టడం వంటి అంశాలు సోరెల్ నొక్కిచెప్పడం ముస్సోలినిని బాగా ఆకట్టుకున్నాయి. ఇట్లా స్విట్జర్లాండ్‌లోని ఇటాలియన్ సోషలిస్ట్ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. కార్మికులను సమీకరించడం, ఉపన్యాసాలతో ఉత్తేజపరచడంలో ముస్సోలిని అనుభవజ్ఞుడు. ఫలితంగా కొద్ది రోజుల్లోనే కార్మిక సంఘం కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాడు. కార్మికపక్ష రాతలతో, ఉత్తేజపూరిత ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకునేవాడు. 1903లో స్విట్జర్లాండ్‌లో లేబర్ యూనియన్ సమ్మె జరిగింది. ఈ సమ్మెలో ముస్సోలిని హింసను ప్రేరేపించాడు. దీనికి కారణంగా అతన్ని అరెస్టు చేసి ఇటలీ పంపించాడు. నాలుగు నెలలు జైలు శిక్ష అనుభవించాడు. ఇట్లా కొన్ని సందర్భాల్లో సోషలిస్టు పార్టీలో అతను కీలక సభ్యునిగా మారాడు. ఎంతలా అంటే సోషలిస్టు పత్రిక అవంతికి ఎడిటర్ అయ్యే వరకు. సోషలిస్టు భావాలతో ఉన్న అవంతి నుంచి బహిష్కరణకు గురవడానికి ఎక్కువ రోజులేమీ పట్టలేదు. ప్రత్యేకమైన ఎడిటోరియల్స్ రాస్తూనే ముస్సోలిని మతవాదాన్ని సమర్థించేవాడు. ఒక్కోసారి మతవాది అర్థం వచ్చే కలంపేరుతో వ్యాసాలు రాసేవాడు. ఇట్లాంటి తరుణంలో మొదటి ప్రపంచయుద్ధం ప్రారంభమైంది. దీనిపై ముస్సోలిని వైఖరి పార్టీ విధానాలకు పూర్తి భిన్నంగా ఉండేది. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా అతను వ్యక్తిగత విధానాలకు ప్రాముఖ్యం ఇచ్చేవాడు. హింస, తిరుగుబాటు, కక్షసాధింపు, మిలిటరిజం, మతవిశ్వాసాలతో ముందుకు వెళ్లేవాడు. యుద్ధకాలంలో ఇతని వైఖరి, తీవ్రమైన విధానాల వల్ల సోషలిస్టు పార్టీ, పత్రిక ముస్సోలినిని బహిష్కరించక తప్పలేదు.

1914,మొదటి ప్రపంచయుద్దం కాలం

మనందరం ఇటాలియన్లం. ఇటాలియన్లుగానే జీవిద్దాం. ఇప్పుడు ఉక్కుకు, ఉక్కు తోడైంది. మనం పోరాడుదాం. వివా ఎల్ ఇటాలియా! (ఇటలీలోనే జీవించండి.) అంటు ఉపన్యాసాలతో పరిస్థితులను ముస్సోలిని చేతుల్లోకి తీసుకున్నాడు. ఈ యుద్ధం కొనసాగుతున్న క్రమంలో పీపుల్ ఆఫ్ ఇటలీ అనే వార్తా పత్రికను స్థాపించాడు. జాతీయవాదం, మిలిటరిజం, హింసాత్మక సిద్ధ్దాంతాలతో తన తర్వాతి జీవితాన్ని నిర్దే శించుకున్నాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో షార్ప్ షూటర్‌గా పాల్గొన్నాడు. మిత్ర రాజ్యాల దళాలతో అతను విజయవంతంగా తిరిగి వచ్చాడు. ఆ యుద్ధంలో సోషలిస్టులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఒక సిద్ధాంతంగా సోషలిజం చాలావరకు విఫలమైందని అనుకున్నాడు. 1919 నాటికి సోషలిజం చచ్చిపోయింది అని భావించాడు. అప్పుడే 200 మందితో ఇటాలియన్ ఫాస్సి పేరుతో ఓ సంఘాన్ని ఏర్పాటు చేశాడు.
Die2

1920 ఇటలీ

అప్పటికే ఇటలీలో రాజకీయ వాతావరణం భిన్నంగా ఉంది. ఆ పరిస్థితుల్లో ఎవరు వచ్చినా ప్రత్యామ్నాయంగా భావించేట్టు ఉన్నారు అక్కడి ప్రజలు. ఈ క్రమంలోనే ముస్సోలిని విధానాలు విప్లవాత్మకంగా, సంప్రదాయబద్ధంగా ఉన్నాయని అక్కడి వారు భావించారు. అప్పటికే ఆయన ఎన్నో ఉపన్యాసా లతో ఇటలీవాసులను ప్రభావితం చేశాడు. గుర్తింపు తెచ్చుకోవాలి అనుకొని తహతహలాడే మాజీ సైనికులు, రచయితలు, జర్నలిస్టులు, మేధావులు అందరూ ముస్సోలిని పంచన చేరారు. ఈ నేపథ్యంతో 1921లో ఫాసిస్టు పార్టీని స్థాపించాడు. బ్లాక్ షర్ట్స్ పేరుతో బలగాలను సృష్టించాడు. ఈ బలగాలు కమ్యూనిస్టులతో, సోషలిస్టులతో గొడవలకు దిగేవి. ఇటలీ వీధుల్లో బ్లాక్ షర్ట్స్ వీరంగం అరాచకానికి దారి తీసింది.

1922 రోమ్

కార్మికుల హక్కులు, పని వేళలు, మైనర్లకు పని మినహాయింపు అంశాలతో రోమ్‌లో కవాతు చేశాడు. ప్రభుత్వంపై ఆందోళనకు దిగాడు. 30వేల మంది బ్లాక్ షార్ట్స్ బృందాలతో ప్రభుత్వ, సోషలిస్టు కార్యాలయాలపై దాడి చేశాడు. లిబరల్ ప్రభుత్వం దిగిపోయి, ఫాసిస్టు పార్టీకి అధికారం ఇవ్వాలని బీభత్సం సృష్టించాడు. చివరికి 1922 అక్టోబర్ 29న లిబరల్ పార్టీ అధ్యక్షుడు కింగ్ విక్టర్ ఇమాన్యుయల్, ముస్సోలినిని ప్రధానిగా నియమించాడు.
తొలిరోజుల్లోనే ముస్సోలిని తన విశ్వరూపాన్ని బయటపెట్టాడు. తనను తాను రాజుగా ప్రకటించుకున్నారు. Fascism should more appropriately be called Corporatism because it is a merger of state and corporate power. (ఫాసిజం అంటే కార్పొరేటిజం అనాల్సిందే.. ఎందుకంటే ఇది స్టేట్, కార్పొరేట్ శక్తిని బలపరుస్తుంది) అంటూ తన ప్రభుత్వాన్ని నడిపాడు. ముస్సోలిని ప్రభుత్వాన్ని ప్రజలు కొద్ది రోజుల్లోనే కార్పొరేట్ ప్రభుత్వంగా గ్రహించారు.

1940, రెండో ప్రపంచయుద్ద కాలం

1940లో జర్మని నియంత హిట్లర్ ఫ్రాన్స్ మీద దాడి చేసే పనిలో ఉన్నాడు. ఇటలీలో ముస్సోలిని తన సంస్కరణలతో చెలరేగిపోతున్నాడు. ఆఫ్రికావైపు చూస్తూ దాన్ని ఆక్రమించుకోవాలనుకుంటున్నాడు. ఆఫ్రికా ప్రజలను చంపేసి, ఇటలీ ప్రజలను అక్కడికి పంపాలి. అప్పుడు ఇటలీలో నేను చాతి నిండా ఊపరి పీల్చుకోవచ్చు.. ఇంత దారుణంగా ఉన్నాయి ముస్సోలిని ఆలోచనలు. అప్పటికే సామ్రాజ్యవాద ప్రభుత్వంగా ముస్సోలినికి పేరొచ్చింది. మరోవైపు సరిహద్దు దేశాలమీద దాడి చేసి ఇటలీలో కలుపుకున్నాడు. ఇంకా పెద్ద దేశాల మీద దాడి చేయడానికి సరిపడా సైనిక బలం లేదు. అందుకే హిట్లర్‌తో జతకట్టాడు. జర్మనీకి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరిపై యుద్ధం ప్రకటించాడు. దీంతో ముస్సోలినీ, హిట్లర్ మంచి మిత్రులయ్యారు. ఈ క్రమంలో 1941లో అల్బేనియా, గ్రీస్‌లపై దాడి చేస్తాడు ముస్సోలిని. హిట్లర్ సైనిక జోక్యం లేకపోతే అతను కాలగర్భంలో కలిసిపోయేవాడే.. తీవ్రమైన ముస్సోలిని విధానాల వల్ల, శత్రుదేశాల ఒత్తిడి పెరగడం వల్ల ఇటలీలో కలకలం రేగింది. ముస్సోలిని ప్రభుత్వం ఓపికను కోల్పోయింది. 1943 జూలైలో ఫాసిస్ట్ గ్రాండ్ కౌన్సిల్ ముస్సొలినిని కుర్చీ నుంచి దించేసింది. ఇటలీతో మితృత్వాన్ని సిసిలీ, ఆఫ్రికా ఉపసంహరించుకున్నాయి. ఇట్లాంకి అనేక కారణలతో ముస్సోలిని బలహీన పడిపోయాడు.
Die3

-ఇటాలియన్ రాజుకు విధేయులైనా బలగాలు ముస్సోలినిని బంధించాయి. ముస్సోలిని రోజులు దగ్గర పడ్డాయి.ఇటలీలో ముస్సోలిని తన సంస్కరణలతో చెలరేగిపోతున్నాడు. ఆఫ్రికా వైపు చూస్తూ దాన్ని ఆక్రమించుకోవాలనుకుంటున్నాడు. ఆఫ్రికా ప్రజలను చంపేసి, ఇటలీ ప్రజలను అక్కడికి పంపాలి. అప్పుడు ఇటలీలో నేను చాతి నిండా ఊపరి పీల్చుకోవచ్చు.. ఇంత దారుణంగా ఉన్నాయి ముస్సోలిని ఆలోచనలు.

-మనం అందరం ఇటాలియన్లం. ఇటాలియన్లుగానే జీవిద్దాం. ఇప్పుడు ఉక్కుకు, ఉక్కు తోడైంది. మనం పోరాడుదాం. వివా ఎల్ ఇటాలియా! (ఇటలీలోనే జీవించండి.) అంటూ ఉపన్యాసాలతో ముస్సోలిని పరిస్థితులను అతని చేతుల్లోకి తీసుకున్నాడు.

1548
Tags

More News

VIRAL NEWS