కొలిమి నేర్పిన పనితో.. అచ్చుయంత్రం ఆవిష్కరించాడు!


Sun,November 3, 2019 04:37 AM

జర్మనీలోని మెయింజ్ పట్టణం. సంపన్న కుటుంబాలు ఎక్కువగా ఉండే ప్రాంతం. అక్కడ సంపన్న వర్గాల మధ్య నిత్యం పోటీ ఉండేది. తరచూ కొట్లాటలు జరిగేవి. ఆధిపత్యం కోసం సాగే ఈ అంతర్యుద్ధాల వల్ల సామాన్య జనజీవనానికి తీవ్ర ఇబ్బందులు కలిగేవి. ఇలా ప్రతీయేటా మెయింజ్ నుంచి వేరే ప్రాంతాలకు ప్రజలు వలస వెళ్లేవారు. ఒక సంవత్సరం చెలరేగిన ఘర్షణలకు పెద్ద సంఖ్యలో కుటుంబాలన్నీ ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాయి. నీతిగా పనిచేసుకుంటూ బతుకుతున్న జుర్ లాదెన్.. వైరిచ్ కుటుంబానికి ఇది నిజంగా దుర్దినం. జుర్ లాదెన్ టంకశాలలో పనిచేస్తాడు. అతని భార్య వైరిచ్ గృహిణి.

-దాయి శ్రీశైలం, సెల్: 9182777035
GUTEN

అది క్రీస్తు శకం 1428వ సంవత్సరం. పిల్లలకు ఏ కష్టం తెలియకుండా బతుకుతున్న వారు సంపన్నవర్గాల మధ్య ఆధిపత్య పోరువల్ల వలస వెళ్లాల్సి వచ్చింది. మెయింజ్ పరిసరాల్లోని పట్టణాలను ఆశ్రయించినా అక్కడ ఉపాధి కష్టమవుతుందనుకొని బంగారం.. లోహ పరిశ్రమల్లో పని దొరుకుతుందని ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌కు వలస వెళ్లారు. కొత్త ఊరు.. కొత్త వ్యక్తులు.. పూట గడవడం కోసం ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి. ఎక్కువ కాలం లోహ పరిశ్రమల్లో పనిచేయడం వల్ల అనారోగ్యంతో లాదెన్ చనిపోయాడు. వైరిచ్ బాగా కుంగిపోయింది. కుటుంబ భారమంతా తనమీదే పడింది. కానీ వైరిచ్‌కి పనికోసం బయటకు వెళ్లిన అనుభవం లేదు. తిరిగి మెయింజ్‌కు వెళ్లిపోదామని అక్కడి పరిస్థితి గురించి వాకబు చేయగా.. పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదని తెలిసింది. ఎట్లయితే అట్లాయె.. ఇక్కడే ఉండి పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలని అనుకున్నది వైరిచ్. కానీ భర్త లేడనే బెంగ ఎక్కువవడంతో తనకు ఆరోగ్యం సహకరించలేదు. తల్లి పరిస్థితి చూస్తూ కూడా ఇంటి దగ్గరే ఉండలేం అనుకున్నాడు ఆమె కొడుకు. కుటుంబ అవసరాల కోసం ఎంతో కొంత డబ్బు సంపాదించాలి అనుకున్నాడు. ఫలానా పని చేస్తే బాగా డబ్బులు వస్తాయి.. ఫలానా పని అయితే ఫ్యూచర్‌లో ఉపయోగపడుతుంది అని సావధానంగా చెప్పేవారు ఎవరూ లేరు. ఏ పనిచేయాలి? కుటుంబ అవసరాల కోసం ఎంత డబ్బు అవసరం? అని బాగా ఆలోచించి ఆ అబ్బాయి దినసరి భత్యం మీద వైన్ కంపెనీలో వర్క్ బాయ్‌గా చేరాడు. చిన్నతనంలోనే కార్మికుడిగా పనిచేయాల్సి రావడం పట్ల అతడెప్పుడూ ఆందోళన పడలేదు. కాకపోతే ఈ పని చేస్తే భవిష్యత్‌లో ఏదైనా ఉపయోగం ఉంటుందా? లేదా? అనే విషయం గురించి మాత్రం బాగా ఆలోచించేవాడు.. ఒక్కొక్కసారి ఆందోళన చెందేవాడు కూడా. ఎంత చేసినా ఆర్థిక పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేకపోవడం వల్ల ఏదైనా సొంతంగా చిరు వ్యాపారం మొదలుపెట్టాలని అనుకున్నాడు అతను.

ముగ్గురు స్నేహితులతోకలిసి అద్దాల వ్యాపారం మొదలుపెట్టాడు. లాభాలు రాలేదు. కానీ మనస్పర్ధలు పుష్కలంగా వచ్చాయి. మిత్రమా.. నేను కొట్లాడటానికో.. సమయ పాలనకో మీతో కలిసి వ్యాపారం చేయాలి అనుకోలేదు. నా పరిస్థితి బాగా లేదు. నాకు డబ్బులు కావాలి. ఇంతలా పెట్టుబడి పెట్టే స్థోమత నాకు లేదు. ఉన్నదల్లా మీరు తోడుగా ఉంటారనే ధైర్యంతో మీతో కలిసి అద్దాల వ్యాపారంలోకి వచ్చాను. కానీ ఇక్కడ పరిస్థితి వేరేలా ఉంది. దానికితోడు మన ముగ్గురి మధ్యలో ప్రారంభంలో ఉన్నప్పటి సఖ్యత ఇప్పుడు లేదు. ఎవరికి తోచినంత డబ్బు వారు తీసుకెళ్తున్నారు. వ్యాపారంలో డబ్బు అనేది పెద్దమొత్తంలో పోగైతే ప్రయోజనం ఉంటుంది తప్ప.. ఎప్పటి సొమ్ము అప్పుడే ఖర్చు అయితే వ్యాపారం నడవదు. చూస్తూ ఉండండి మీరు.. అతి త్వరలో మనం వ్యాపారాన్ని మూసేయాల్సి వస్తుంది అని చెప్పాడు. కానీ పార్టనర్స్‌లో మార్పు రాలేదు. ఇక చేసేదేమీ లేక వారితో విడిపోయాడతను. ఆయన పరిస్థితి నడిసంద్రపు నావ లెక్క అయ్యింది. పనిలేక.. డబ్బుల్లేక చాలా విసిగిపోయాడు. ఎవరికీ చెప్పకుండా ఒకరోజు ఎటో పారిపోయాడు.
GUTEN1

14వ శతాబ్దపు ఐరోపా నూతన మార్పులకు కొలువైంది. క్రమంగా పెరుగుతున్న జనాభా.. వేగంగా అధికమవుతున్న అవసరాలు.. అధిగమించాల్సిన సమస్యలు.. కొత్త ఆవిష్కరణలు.. దూరతీరాలకు ప్రయాణాలు ఏవేవో సుదూర ప్రాంతాల వారు తమ వింతలు విడ్డూరాలు చెప్తుంటే స్థానికులు ఆశ్చర్యపోయేవారు. తామూ వాటిని ప్రత్యక్షంగా చూడాలని అనుకొని ఓడల్లో బయలుదేరేవారు. తమ అనుభూతుల్ని అక్షరబద్ధం చేసేవారు. మెయింజ్ పట్టణంలో ఉన్నప్పుడు తండ్రితో కొలిమి దగ్గర పనిచేసినప్పటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. నాన్నతోపాటు తాను కూడా కొంతకాలం అక్కడ పనిచేశాడు. లోహాల్ని కొలిమిలో కాల్చడం.. బంగారాన్ని సరైన సైజులో కోయడం.. వాటిపై ముద్రలు వేయడం.. క్రమపద్ధతిలో పేర్చడం వంటి పనులన్నీ చేయడం చూసి వాళ్ల నాన్నగారి స్నేహితులు ప్రశంసించిన సంఘటనలు గుర్తుకొచ్చాయి. లాదెన్.. మీ అబ్బాయి మీతో సమానంగా పనిచేస్తున్నాడు. చాలా ముచ్చటేస్తున్నది. దయచేసి మీవాడు చేసే పని వద్దని చెప్పకండి. లోహాన్ని కాల్చే విధానం.. దానిని ముద్రణకు పెట్టే పద్ధతి చాలా అనుభవం ఉన్నవాడిలా ఉన్నాయి. కొన్ని పనులు సొంతంగా ప్రయోగిస్తున్నాడు. భవిష్యత్‌లో మంచి నైపుణ్యంగల వృత్తిలో రాణిస్తాడు. ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించగల సత్తా మీవోడికి ఉన్నది అని టంకశాలలో తోటివారు తన నైపుణ్యం గురించి అనుకున్న మాటలు మనసును తాకాయి.
వారు చెప్పినంత కాకపోయి ఉండొచ్చు కానీ.. ఎంతో కొంత నాకు లోహ ముద్రణ పనిలో నైపుణ్యం ఉంది. ఎంతసేపూ డబ్బు.. పని అంటూ పారిపోవడం.. పరేషాన్ కావడం ఎందుకు? టాలెంట్‌కు పదును పెడితే సరిపోతుంది కదా? కొత్త కొత్త ప్రయోగాలు చేయొచ్చు కదా? ఒకవేళ దశ బాగుండి ఆ ప్రయోగాలు ఫలిస్తే డబ్బు వస్తుంది.. చేతినిండా పని దొరుకుతుంది అని మనసులో అనుకున్నాడు. ఆ రోజుల్లో గ్రంథాలను చదవాలంటే వాటికి నకళ్లు తయారుచేయడం తప్ప మరో మార్గం లేదు. ఎన్ని కాపీలు కావాలంటే అన్నింటినీ చేత్తో రాయాల్సిందే. గొప్ప గ్రంథాలను ఇలా తిరగరాసేందుకు జమీందార్లు తమ ఆస్థానాల్లో ప్రత్యేకంగా లేఖకుల్ని నియమించుకునేవారు. ఇది శ్రమతోకూడిన పని కావడంతో ఆలస్యం అయ్యేది. ఈ నేపథ్యంలో గూటెన్‌బర్గ్ మెదడు పదునెక్కింది. ఇలా ఎంతకాలం లేఖకులపై ఆధారపడాలి? అక్షరాలను పొందుపర్చి ముద్రితం చేసే అవకాశం లేదా? అనే ఆలోచనల్లోంచి ముద్రణ యంత్రం కనిపెట్టాలనుకున్నాడు అతను. ఏడెనిమిదేండ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కావాల్సిన కసరత్తు చేశాడు. ఒకప్పుడు నాణాల తయారీలో పొందిన నైపుణ్యానికి సానబెట్టాడు. ముద్రనకు మూలాలు సమకూర్చాడు. బంగారం నాణాల తయారీకి ఉపయోగించే ప్రెస్ పరికరాలను సేకరించాడు. తన అవసరాలకు తగ్గట్లుగా వాటిని మార్చుకున్నాడు. సీసంతో అక్షరాలను రూపొందించాడు. ప్రతీ అక్షరాన్ని దేనికదే విడివిడిగా పోతపోశాడు. తిరిగి వాటిని పదాలుగా.. పంక్తులుగా.. పుటలుగా తీర్చిదిద్దే ఏర్పాట్లు చేశాడు. కుడి ఎడమలుగా వేలాది టైపుల్ని కూర్చి ముద్రణాయంత్రాన్ని కనిపెట్టాడు.
GUTEN2

ఆ మహానుభావుడే జోహన్నస్ గుటెన్‌బర్గ్. ఆయన కృషి ఫలితమే ఇప్పుడు మనం క్షణాల్లో ప్రింటింగ్ చేస్తున్నాం. గుటెన్‌బర్గ్ 1448లో అజ్ఞాతం వీడి మెయింజ్ పట్టణానికి తిరిగి వచ్చాడు. ముద్రణ యంత్రాన్ని ప్రారంభించడమే తరువాయి. అయితే దానికి భారీగా పెట్టుబడి కావాలి. అంత సొమ్ము తన దగ్గర లేదు. అందుకే జాన్‌ఫుస్ట్ అనే మిత్రుడి దగ్గర ఆరుశాతం వడ్డీకి పెద్ద మొత్తాన్ని అప్పుగా తీసుకున్నాడు. అనంతరం ఫుస్ట్ వ్యాపార భాగస్వామి అయ్యాడు. ప్రింటింగ్ ప్రారంభమైంది. మొట్ట మొదట జర్మన్ కవితల్ని ముద్రించాడు. 1453 నాటికి బైబిల్‌ను ముద్రించడానికి సన్నాహాలు చేశాడు. 1282 పేజీల బైబిల్ ముద్రణకు రెండేండ్లు పట్టింది. 130 కాపీలు ప్రింట్ చేశాడు. నేటికీ ఇందులోని 40 కాపీలు చాలా మ్యూజియంలలో భద్రంగా ఉన్నాయి. ఈ బైబిల్ ముద్రణలో ప్రతీ పుటలోనూ 42 పంక్తులు ఉంటాయి. అందుకే దీనిని 42 లైన్ల బైబిల్ అంటారు. యంత్రం ద్వారా ముద్రితమైన తొలి గ్రంథం ఇదే. కాపీలు బయటకు వస్తున్న తరుణంలో గుటెన్‌బర్గ్‌కు కోలుకోలేని సమస్య ఎదురైంది. అందమైన బైబిల్‌ను ప్రజలకు అందివ్వాలన్నది గూటెన్ ఆలోచన. కానీ సంపాదించాలన్నది ఫుస్ట్ ఆలోచన. దీంతో భేదాభిప్రాయాలు వచ్చాయి. ఫుస్ట్ కోర్టుకెక్కాడు. గుటెన్‌కు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వచ్చింది. డబ్బులు పోయాయి. అప్పులు మిగిలాయి. ఏళ్లతరబడి శ్రమించిన ప్రింటింగ్ ప్రెస్ ఫుస్ట్ పరమైంది. తీవ్ర మానసికవ్యథ అతడికి మిగిలింది. దీనికి తోడు వయసు మీదపడటం వల్ల అంధత్వం.. ఇతర అనారోగ్య సమస్యలు వెంటాడాయి. 1468లో గుటెన్‌బర్గ్ కన్నుమూశాడు. తర్వాత కొన్నాళ్లకు ఫుస్ట్ చేసింది మోసం అనీ.. అధికారులు గుర్తించారు. ముద్రణ అందించిన తొలి వ్యక్తి గుటెన్‌బర్గ్ అని నిర్ధారించారు.

ఆ రోజుల్లో గ్రంథాలను చదవాలంటే వాటికి నకళ్లు తయారుచేయడం తప్ప మరో మార్గం లేదు. ఎన్ని కాపీలు కావాలంటే అన్నింటినీ చేత్తో రాయాల్సిందే. గొప్ప గ్రంథాలను ఇలా తిరగరాసేందుకు జమీందార్లు తమ ఆస్థానాల్లో ప్రత్యేకంగా లేఖకుల్ని నియమించుకునేవారు. ఇది శ్రమతోకూడిన పని కావడంతో ఆలస్యం అయ్యేది.

474
Tags

More News

VIRAL NEWS