అమ్మ పండుగ


Sun,November 3, 2019 04:19 AM

నాని మంచిగున్న వారా!? ఫోన్లో అవ్వ.ఆ.. మంచిగున్న, నువ్వు మంచిగున్నవాయే?మంచిగున్న గాని పండక్కు ఎప్పుడత్తున్నవ్ రా?ఏవోనే నాకు సెలవు దొరికేతట్టు లేదు, అత్తనో రానో, బతుకమ్మ పండుక్కి రాను గని, అత్తే దసరకత్త ఏం నౌకర్రా నీది నీ నౌకరి సల్లగుండ. నౌకరద్దు ఏవద్దు. సప్పిడెంట బంజేయ్. సేసుకుంటే మనకి యవుసం లేదా అబ్బ అట్ల గాదే, కొత్త కొత్తగ గదా ఇప్పుడే సెలవడుగుతే ఏవంటరో. అయిన మనకి పండగ లేదు గదనే, అచ్చి ఏం జెయ్యాలే ఈ మధ్యనే మా పాలోల్లు ఒకలు చనిపోయిర్రు. మాకు పండుగుండది అదే అడిగా అవ్వని. అమ్మమ్మ ఫోన్ జేసింది పండుగక్కి రమ్మని, మనవడు నేను అత్తం తియ్యి అన్న సరే నేను ఎట్నో జేసి అత్త తియ్యి సరే, తిన్నావా మరే!? ఆ తిన్న, ఇగ ఉండే. నాకు పని ఉంది, రెడీ అయ్యి మల్ల ఆఫీస్‌కి పోవాలే మాది కరీంనగర్ దగ్గర చిన్న ఊరు. హైదరాబాద్లో ఇంజినీరింగ్ చేసి ఇక్కడే ఈ మధ్య జాబ్‌లో జాయిన్ అయ్యాను. కార్పొరేట్ జాబ్, దసరాకి తప్ప మిగతా రోజులకి సెలవులు ఇవ్వరు.
Amma_Panduga

జాబులో జాయినయినప్పటి నుండి దసరా సెలవుల గురించే నా ఆలోచన. మిగతా పండగలు ఎలా ఉన్నా, ఇది పెద్ద పండగ ఆయే, చివరికి ఎలాగో మా మేనేజర్ అయిదు రోజులు సెలవు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. రాత్రి 12.00కి ఎక్కితే మబ్బుల 5.30 వరకు ఇంటి దగ్గర ఉన్న. ఇంటికి వెళ్ళేసరికి అవ్వ అలుకు జల్లుతున్నది. నన్ను చూసిందో లేదో చేతులు దబదబా కడుక్కొని వచ్చి గట్టిగా అలుముకుంది. అవ్వ నన్ను ఎంత మిస్ అవుతుందో ఆ కౌగిలిలో తెలుస్తుంది. ఎన్నింటికి ఎక్కినవురా బస్సు రాత్రి పన్నెండున్నర అయింది గావచ్చే నిద్రుందో లేదో, పోయి కొంచం సేపు పండుకపో, నేను లేపుత గని సరే, లేపు పండుకుంట అని పోయి పండుకున్న.నేను లేచేసరికి అవ్వ తయారయ్యింది. పట్టుగుచ్చు పువ్వు, బంతి పువ్వు, గున్క పువ్వు, పోకబంతి పువ్వు సంచుల్లో సర్దుతుంది. అవ్వ మొఖం వెలుగుతున్నది. తన పుట్టింటికి పోవాలని ఎంత తొందరో. మా బాపుకు, మా ఇద్దరి మేనమామలకి ఏదో చిన్నప్పటి గొడవ. వాళ్ళ ఇంటికి ఎక్కువగా పంపించెటోడు కాదు. ఇంట్లో ఏవైనా చిన్న చిన్న పండుగలకి అప్పుడప్పుడు అవ్వ పోయేది. కానీ, నేను ఎప్పుడో చిన్నప్పుడు పోయిన. దసరా, సంక్రాంతి అసొంటి పండగలకి ఎప్పుడూ పోలే. ఒక ఇరవయి సంవత్సరాల తర్వాతనేమో అవ్వ బతుకుమ్మ పండగ తన పుట్టింట్లో చేసుకునుడు.

పండగ రెండ్రోజులుంది కదనే, ఇయ్యల్ల పోయి ఏం జేత్తం, ఇవన్ని సర్దుతున్నవ్. ఎల్లుండి పోదం తియ్యి సరదాకి అన్న అవ్వతో. నువ్వు గూడ మీ అయ్య లెక్కనే జేత్తవ్ ఏందిరా, ఆడిదానికి పుట్టింటికి పోవాలని పాణం ఎట్ల గోట్టుకుంటదో మీకేం తెలుసు. నువ్వు పుట్టినెరుకల పోయిన అంటే మల్ల పోలే బతుకమ్మ పండుక్కి అవ్వకి గుడ్లల్ల నీళ్ళు తిరిగినయ్. ఉత్తగన్న తియ్యే, ఇయ్యాల్లనే పోదం, మా దోస్తులది ఎవల్దన్న బండి అడుక్కత్త, అచ్చినంక పోదం అట్ల అనంగనే అవ్వ ఖుషి అయింది.మా దోస్తుగాని బండి తీసుకొని పొలం దగ్గరికి వెళ్లి అక్కడే స్నానం చేసా. తర్వాత ఇంటికచ్చేసరికి అవ్వ అన్నీ సర్దిపెట్టింది. మా బాపుకోమాట చెప్పి బయల్దేరినం.ఈ నాలుగైదు రోజులు ఎట్ల అన్డుకొని తింటడో మనిషి అంటూ బండి ఎక్కుతూ అంది అవ్వ. పుట్టింటికి వెళ్ళాలని ఉన్నా మా నాన్న ఎలా తింటాడో అని మా అవ్వ బాధ.ఊరికి పోయేసరికి మా అమ్మమ్మ ఆకిట్ల కూసోని ఎవల్తోనో ముచ్చట్లు పెడుతున్నది. మమ్మల్ని చూసి దగ్గరికచ్చి అలుముకుంది. మా అవ్వని చూసి మా అమ్మమ్మకి, అమ్మమ్మని చూసి మా అవ్వకి గుడ్డల్ల నీళ్ళు తిరిగినయి. అట్లనే కొంచం సేపు ఉండిపోయిర్రు. మా పెద్దమామ అప్పుడే అచ్చినట్లున్నడు, చెల్లే ఇప్పుడే అత్తున్నవా? అన్నడు.ఆ, ఇప్పుడే అత్తున్న అన్న అంది అవ్వ.ఆకిట్ల ఎంతసేపు ఉంటరు గని ఇంట్లకు వోర్రి అన్నడు. లోపలి నుండి మా పెద్దత్తమ్మ, నీళ్ళు తెచ్చిస్తే అవ్వ నేను కాళ్ళు కడుక్కొని లోపలికి పోయినం.తమ్ముడు ఎటుపోయిండే, కనవడతలే అంది అవ్వ.ఎడ్లకు నీళ్ళు పెట్టత్తా అని పోయిండు, నేను ఇదివరదాకా ఆన్నే ఉన్న అని నా వైపు తిరిగి అల్లుడు, నౌకరి అయిదంట, ఏపాటి దొరుకుతున్నయి అన్నడు మామ. ఇప్పుడిప్పుడే గద అన్న, ఓ ఇరవయి వెయిల దాక అత్తున్నయ్. మెల్ల మెల్లగ పెర్గుతయంట అంది అవ్వ.మా ఇద్దరు మామలకి మగ పిల్లలు లేరు. ఇద్దరికి ఇద్దరు ఆడపిల్లలే. మా అవ్వ ఎప్పుడు అడుగుతుండేది మా పెద్దన్న బిడ్డని సేసుకోరా అని. నువ్వు ఎవ్వలని సేసుకొమ్మంటే ఆల్లనే సేసుకుంట అనేవాన్ని.అందరు మరదళ్ళు ఒకటే దగ్గర కూసున్నరు. ఇద్దరు మరదళ్ళు గున్క పువ్వు మరత పెడుతుంటే ఇంకిద్దరు మరదళ్ళు బంతి పువ్వులు గుచ్చుతున్నారు. ఇంతమంది మరదళ్లలో నన్ను ఏ మరదల్ని చేసుకోమ్మంది? బంతి పువ్వులు కుచ్చే మరదళ్ళు చిన్న మరదళ్ళు అని అర్థం అవుతున్నది. ఇంకిద్దరి మరదళ్లలో ఎవలో.

మా అవ్వ అచ్చిందని తెలిసి సూసుటనికి ఎవలో ముసలామే అచ్చింది. రాజేశ్వరి అచ్చిందట ఏది అని మా అమ్మమ్మని అడిగింది.ఇప్పుడే ఇంట్లకు వోయింది. అట్ల కూసో అని నా దిక్కు సూసుకుంట మనవడు అంది అమ్మమ్మ.ఏందీ..!? రాజేశ్వరి కొడుకా, ఇంత పెద్దగైండా, మీసాలచ్చినయి పిలగానికి, మన్వడా నన్ను గుర్తువట్టినవా?, చిన్నప్పుడు నన్ను ఎద్దులెక్క అంబాడువని దున్ను.. దున్ను.. అనుకుంట ముడ్డెనుక ముళ్ళు గట్టి పట్టి పొడిచినవు అంది. ఆ అమ్మ అట్ల మొహమాట పడకుంట అంటుంటే నాకు సిగ్గయింది. ఒక మరదలు పిసుక్కుమని నవ్వినట్లు ఇనచ్చి ఆ సిగ్గు కొంచెం ఎక్కువైంది.మరే, నలుగురు మరదళ్లల్ల ఏ మరదల్ని సేసుకుంటవోయ్ ఏం మాట్లాడాలో అర్థం కాలే, నలుగురు మరదళ్ల దిక్కు చూసా. ఒక మరదలు మాత్రం బాగా సిగ్గు పడుతున్నది. బాహుశా పెద్ద మరదలు ఆమెనే అయుంటది. ఒక్కల్నెందుకు, సేసుకుంటడు. నల్గురిని సేసుకుంటడు. అందరి పొత్తుల ఒక్కడే బావాయే అంది అప్పుడే లోపలికి వస్తూ ఇంకో ముసలమ్మ. నా కోడల్లేమో గానీ, మీరే సేసుకునే తట్టున్నారు గద నా కొడుకుని లోపల నుండి బయటికత్తు అంది అవ్వ. ఆల్లు అట్నే కారడ్డం ఆడ్తరు, నీకు నానమ్మలైతరు అంది అవ్వ నా దిక్కు తిరిగి. అవ్వని సూడక చాలా రోజులైందని సూసుటనికి అచ్చిరంట. అవ్వ ఆల్లతో పరేష్కాలు ఆడుతూ మాట్లాడుతూవుంటే చాల బాగా అన్పించింది. అవ్వని ఇంత ఖుషీగా ఎప్పుడూ జూల్లే. ఆళ్ళతో మాట్లాడుతూ తన చిన్నప్పటి రోజుల్ని గుర్తుకు తెచ్చుకుంటుంది. అవ్వ వాళ్లతో మాట్లాడుతుంటే ఇంకో ఇద్దరు అవ్వ వయసు ఉండేవాళ్ళు అచ్చిర్రు. ఆళ్ళతో మాట్లాడుతుంటే అవ్వ సిన్నప్పటి దోస్తులని అర్థం అయింది. అవ్వ ఎవరినేవరినో కలవాలని ఆళ్ళతో అంటుంది. అవ్వ కలవాలనుకునే వాళ్ళు కొందరు వాళ్ళ అత్తగారి ఇంటిదగ్గరే ఉన్నారని తెలిసి బాధపడింది.ఇప్పటి ఆడోల్లు బతుకమ్మలు ఆడరుల్ల, ఏవైనా డీజేలు పెట్టుకోవాలి ఎగరాలే, ఓ పాట లేదు పద్యం లేదు అంది మొదట పరేష్కం ఆడిన అమ్మ.
అవును పెద్దవ్వ, గంట సేపటి కోసం చీరలు గొనాలే, నగలు కొనాలే. ఆడేది అద్దగంట అయితే, గంటలు గంటలు దుకాన్ల పొంటి తిరగాలే మా చిన్నమామ ఇంట్లకి వస్తూనే అన్నాడు. మా అవ్వని సూసి ఎప్పుడచ్చినవ్ అక్క? అన్నడు.

ఇప్పుడే అచ్చిన, మరదలేదిరా? అంది. బంతి పువ్వులు అమ్ముకరాను అంగట్లకు వోయింది అని నా దిక్కు తిరిగి అల్లుడు గూడ వచ్చినట్లుండు, తిన్నారా అన్నడు. నేను తిన్న అన్నట్లు సైగ చేసా, మా మామ లోపలికి పోయిండు. మా చిన్నమామ పెద్ద మామలాగా గంభీరంగా ఏం లేడు. కొంచం సరదాగానే ఉండేలాగానే ఉన్నాడు.చిన్నప్పుడు రాజేశ్వరి ఎట్లా పాడేది. దీని పాట కోసం ఈ వాడకట్టు ఆ వాడకట్టు అని లేకుండా అందరు పిల్సుకపోయేటోళ్ళు అంది రెండో ముసలమ్మ.చిన్నప్పుడు, అది ఇంటికాడ ఏడుండేది. రెండు మూడు సార్ల పక్కూరోల్లు గూడా తీసుకపోయేటోల్లు. ఒకసారి దొరగారింటికాడ పాట పాడే దానికి శీర గూడ ఇచ్చిన్రు గర్వంగా చెప్పుకుంది మా అమ్మమ్మ. అందరి నోటి నుండి మా అవ్వ చిన్నతనం గురించి తెలుసుకుంటూ ఉంటే ఏదో తెలియని ఆనందం కలుగుతున్నది. అవ్వ చిన్నతనాన్ని నేను చూడకపోవచ్చు గాని వాళ్ళ మాటల ద్వారా తెలుసుకున్నా. సిన్నప్పటి రోజులు గుర్తస్తే ఎవలకీ ఆనందంగ ఉండదు? మా అవ్వ బాల్యం అంత ఇక్కడే తన పుట్టింట్లో, పుట్టిన ఊళ్ళో ఉంది. పుట్టిల్లంటే అమ్మా నాన్నలే కాదు బాల్యం. పాపం ఎంత మిస్ అయిందో మా అవ్వ ఇన్నేండ్లు.రాత్రి అందరూ ఒక సోట కూసుండి ముచ్చట్లు పెట్టుకుంటున్నం. నాకు నా పెద్ద మరదలెవరో తెలిసిపోయింది. అప్పుడప్పుడు నా వైపు తొంగి చూస్తున్నట్లు నా అనుమానం. కానీ, నా చూపులకి దొరకట్లేదు. మా మామలిద్దరు లోపలకి పోయి పండుకున్నరు. మా అత్తమ్మలు, అవ్వ, అమ్మమ్మ, మరదళ్ళు ఒక దగ్గర సేరి ముచ్చట్లు పెడ్తున్నరు. అందరి ఆడవాళ్ళ మధ్య నేను ఒక్కన్నే ఉన్న. ఇక్కడ ఫ్రెండ్స్ ఇంక బామ్మరుదులు ఎవరూ లేకపోయే సరికి అవ్వ కొంగు పట్టుకొని తిరగాల్సి వస్తున్నది. మరదళ్లతో టైం స్పెండ్ చేద్దాం అంటే వాళ్ళకు సిగ్గే, నాకూ సిగ్గే. ఇప్పుడు కూడా అవ్వ వొళ్ళో పడుకొని వాళ్ళ మాటలు వింటున్న. అత్తమ్మా నువ్వు పాటలు మంచిగ పాడుతవంట కదా, ఒక పాట పాడవా? అని మా చిన్న మరదలు అడిగింది.

ఇప్పుడు ఏడ గుర్తున్నయి బిడ్డ అన్ని మర్చిపోయిన అబ్బ పాడత్తమ్మ! ప్లీజ్ బతిలాడే సరికి అవ్వ కాదనలేక పోయింది. చిన్నన్న శ్రీకృష్ణా నీ బిడ్డానడుగస్తి.. అనుకుంటూ ఒక పాట పాడింది అవ్వ. అవ్వ ఇంత మంచిగ పాడుతుందని ఎప్పుడు తెలవది. ఒక ఆడబిడ్డ నీ బిడ్డని నా కొడుక్కి సేసుకుంట అని తన అన్నని అడిగితే, మీకు ఆస్తి గిట్ల ఏం లేదు నేను ఇవ్వను పొమ్మంటు సాగుతుంది ఈ పాట. తర్వాత ఇంకో పాట పాడింది, పాలిచ్చి పండబెట్టి బాలానాగామ్మో.. నీల్లకంటా పోతినే బిడ్ద బాలా నాగమ్మ. ఒక తల్లి తన కూతురిని వాళ్ళ ఆరండ్లు చంపి.. అన్నం వండే కుండలో పెడితే, అది తెలియని ఆ తల్లి ఆ కుండలోనే అన్నం వండుతుంది. అన్నం కలిపేటప్పుడు తన బిడ్డ శరీర భాగాలు చూసి వర్ణిస్తూ ఏడ్చుకుంటూ పాడే పాట.అవ్వ పాడే ప్రతి పాటలో ఒక కథ ఉంది, మంచి అర్థం ఉంది. చిన్నప్పుడు ఎక్కడికి పోయినా అందరు అవ్వని పాటలు పాడుమనేటోల్లంట. మంగళారతి పాటలు, పెండ్లిలల్ల, సేన్లల్ల నాట్లేసేటప్పుడు కూడా పాడేదంట. చిన్నప్పుడు నా బిడ్డని నువ్వు నాట్లేయ్యకపోయినా ఏంగాదు గానీ పాట పాడుదువుదా అని కైకిలికి తీసుకుపోయేటోళ్ళు, నా బిడ్డని అంది అమ్మమ్మ. నువ్వు పెద్దదానివి అయినప్పుడు కూడా మంగళారతి పాట మీ అత్తనే కదనే పాడింది అంది మా పెద్ద మరదలు దిక్కు చూసుకుంటు. తను సిగ్గుతో కూడిన కోపంతో మా అమ్మమ్మ తొడమీద కొట్టింది.
గిట్ల కొడెత నా మనవడు నిన్ను సేసుకోడు అంది అమ్మమ్మ. ఆడకట్టోళ్ళు అందరచ్చి అవ్వను తీసుకుపోయిర్రు. కోలలు ఆడుదాం పాటలు పాడుదువుదా అని. అవ్వ చిన్నప్పుడు రాత్రి ఎక్కువగా కోలలు ఆడెటోల్లంట. రేపు పెద్ద బతుకమ్మ పండుగ. కోలలు ఆడిన తర్వాత అత్తమ్మలు, అవ్వ సత్తి పిండి చేస్తే మరదళ్ళు గున్క పువ్వు కట్టలకు కలర్లు అద్దిర్రు.

అవ్వ అత్తమ్మలు కలిసి బతుకమ్మ పేర్చిండ్రు. చిన్నమామ బతుకమ్మని తీసుకెళ్ళి అనుమండ్ల గుండి దగ్గర పెట్టిండు. ప్రతి సంవత్సరం ఇక్కడే బతుకమ్మ ఆడుతారంట. అవ్వని చూసి చాలమంది పలకరించిర్రు. కనబడిన చాలామందికి నా కొడుకు అంటూ నన్ను చూపించింది. చాలామంది అవ్వనే పాడమన్నరు. అవ్వ పాడే పాట వినాలని అనిపించినా అంతమందిలో సరిగ్గా వినిపించలే. తర్వాత మైక్ పెట్టిన్చిర్రు. అవ్వ పాడేది వినుకుంటూ కూర్చున్నాను. రాత్రి అయిన తర్వాత అందరూ ఊరి చెరువు దగ్గరికి తీసుకెళ్ళి బతుకమ్మల్ని నిమర్జనం చేసిర్రు. బతుకమ్మలు నిమజ్జనం చేసి వచ్చిన తర్వాత సత్తి పిండితో అచ్చుకో ఆయినం, పుచ్చుకో ఆయినం.. నాది కొత్త సిబ్బి నీది పాత సిబ్బి అంటూ ఆడుకున్నారు. సద్దులల్ల తెచ్చుకున్న సత్తుపిండి ఒకరికొకరు పంచుకొని తిన్నరు. బతకమ్మల మీది పసుపుతో చేసిన గౌరమ్మని సెంపలకి అద్దుకున్నరు. మా అత్తమ్మలు అవ్వకి వదిన మరదళ్ల వర్సయినోల్లు అమ్మకి సెంపల నిండా పసుపు పూసిర్రు. అవ్వ వాళ్లతో చిన్నపిల్లలా ఆడుతుంటే చూడటానికి ముచ్చటేసింది.
ఇంటికచ్చినంక అవ్వతో అవ్వ, నిన్నొకటి అడగన్నాయే అన్న. ఏందిరా, అడుగు అంది. నువ్వు గింత మంచిగ పాటలు పాడుతున్నవు కదా, మన ఇంటి దగ్గర ఎప్పుడు పాడలేఎందుకు పాడలేదుర. పాడిన, కాని బతుకమ్మ పండక్కు పాడేదాన్ని. అప్పుడు నీ ఆట నీదేనాయే నా పాటలు ఇన్నవా? గిట్ల ఇంట్లకూసున్నప్పుడైతే ఉత్తగ ఎప్పుడు పాడలే అయితే నువ్వు పాడే పాటలన్నీ అబ్సర్వ్ చేసినా, పాటలన్నీ ఎవరో కష్టాలు పడినట్లే ఉన్నయి. సీతమ్మ కష్టాలో, ఎల్లమ్మ దేవి లేదా ఎవరైనా ఒక రాణి కష్టాలో. ఇట్ల అన్నీ కష్టాల చుట్టే తిరుగుతున్నాయి ఎందుకు?అవ్వ కొంచం సేపు సమాధానం ఇవ్వలే. ఏదో ఆలోచించింది. నువ్వు సిన్నప్పుడు నాకు మీ బల్లె సారు చెప్పిండని ఒక కథ సేప్పినవ్ ఆదికుందా?ఏం కథ?!ఒక చిన్న పిలగాడు ఆల్ల బాపు సెప్పులు కొనివ్వలేదని ఏడ్సుకుంట ఇంట్ల నుండి పోతడు . అవతల కాళ్ళు లేని మనిషిని సూసి అయ్యో నాకు చెప్పులు లేవని ఏడ్తున్న, ఇతనికి కళ్ళే లేవని బుద్దచ్చి ఇంటికి పోతడు అవ్వ తన మాటల్లో చెప్పింది. చిన్నప్పుడు మా తెలుగు టీచర్ చెప్పిన కథ సారాంశం అది.

ఆ కథకి అవ్వను నేను అడిగిన దానికి ఏం సంబంధమో అర్ధం కాక చూసిన. బతుకమ్మ ఆడేది అందరు ఆడోల్లె, ఒక్కొక్కలకి ఒక్కో కట్టం ఉంటది. ఒక్కో పాటల ఒక్కో దేవుని కట్టం ఉంటది. కట్టంయే కాదు ఉత్త పాటలు కూడ ఉంటయి. ఈ కట్టం ఉండే పాటలల్ల ఒక్కో దేవునికి ఒక్కో రాజుకు ఒక్కో కట్టం ఉంటది. ఆ పాటలు ఇనే ఆడోల్లకు అన్పియ్యదా ఆ దేవాన దేవతుల్లకి, రాజాకరాజులకే కట్టాలు తప్పలే, మనమెంత అని అంది.అవ్వ ఇంత లోతుగా ఆలోచిస్తుందని ఎప్పుడూ అనుకోలే. మొదటిసారి అవ్వ ఒక ఫిలాసఫర్‌లాగ కనబడింది.మా ఇద్దరు మామలకి మగ పిల్లలు లేరు. ఇద్దరికి ఇద్దరు ఆడపిల్లలే. మా అవ్వ ఎప్పుడు అడుగుతుండేది మా పెద్దన్న బిడ్డని సేసుకోరా అని. నువ్వు ఎవ్వలని సేసుకొమ్మంటే ఆల్లనే సేసుకుంట అనేవాన్ని.అందరు మరదళ్ళు ఒకటే దగ్గర కూసున్నరు. ఇద్దరు మరదళ్ళు గున్క పువ్వు మరత పెడుతుంటే ఇంకిద్దరు మరదళ్ళు బంతి పువ్వులు గుచ్చుతున్నారు. ఇంతమంది మరదళ్లలో నన్ను ఏ మరదల్ని చేసుకోమ్మంది? బంతి పువ్వులు కుచ్చే మరదళ్ళు చిన్న మరదళ్ళు అని అర్థం అవుతున్నది.
ఇంకిద్దరి మరదళ్లలో ఎవలో.

రచయిత పరిచయం

ఎగుర్ల గణేశ్‌ది జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు. తల్లిదండ్రులు మల్లయ్య, రాజవ్వ. అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్‌లో ఎంబీఏ చేసిన గణేశ్ ఐహెచ్‌ఎస్ మార్కెట్ కంపెనీలో సీనియర్ అనలిస్ట్‌గా పని చేస్తున్నారు. చిన్నప్పటి నుంచీ కళలు.. సాహిత్యం అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే జీజే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై లఘు చిత్రాలు నిర్మిస్తున్నారు. నమస్తే తెలంగాణ కథల పోటీల్లో విజేతగా నిలిచిన అమ్మ పండుగ ఆయన రాసిన మొదటి కథ కావడం విశేషం.

నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజా గ్రంథాలయం కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ (రూ. 10,000/-)

-ఎగుర్ల గణేష్, సెల్: 97016 72285

676
Tags

More News

VIRAL NEWS