వైరాగ్యం


Sun,November 3, 2019 04:04 AM

రాజకుమారుడు చిన్నతనం నుంచే దైవభక్తి గలవాడు. ఆధ్యాత్మిక చింతనగలవాడు. గురువుల బోధనల్ని పసితనం నుంచీ వినడం వల్ల అతనిలో వైరాగ్య బీజాలు పడ్డాయి. సామ్రాజ్యానికి రాజు కావడం కన్నా సత్యాన్వేషణలో సన్యాసిగా మారడమే గొప్పగా భావించాడు. హిమాలయ పర్వతాలకు వెళ్ళాలని దృఢంగా నిశ్చయించాడు.రాజుకు ఈ సంగతి తెలిసి మంత్రితో ఎలాగైనా తన కొడుకు మనసు మార్చమని చెప్పాడు.మహామంత్రి యువరాజు దగ్గరికి వచ్చి యువరాజా! ఎందుకు మీరు హిమాలయాలకు వెళ్ళాలని సంకల్పించారు అని అడిగాడు.యువరాజు నేను సృష్టికర్త సాన్నిధ్యాన్ని కోరుకుంటున్నాను. ఆయన చేసే అద్భుతాల్ని సందర్శించాలని ఆశిస్తున్నాను. అందుకనే హిమాలయాలకు వెళదామనుకుంటున్నాను అన్నాడు.మహామంత్రి యువరాజా! ఈ ప్రపంచమే అద్భుతాలతో నిండి ఉంది. ఇటువంటి ప్రపంచాన్ని వదిలి పెట్టడం కోరి కష్టాల్ని కొని తెచ్చుకోవడమే. మీ ప్రయత్నాన్ని విరమించండి అన్నాడు.యువరాజు చలించలేదు.మరుసటిరోజు మహామంత్రి ఒక మంత్రవేత్తను యువరాజు దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ మంత్రవేత్త మంత్రతంత్రాలలో, అద్భుతాలు ప్రదర్శించడంలో ఆరితేరినవాడు. తన మాయాజాలంతో మనుషుల్ని దిగ్భ్రమలో ముంచెత్తుతాడు.మంత్రవేత్త అక్కడకు తన భార్యతోపాటు వచ్చాడు. అతను యువరాజుతో యువరాజా! ఆకాశంలో దేవదానవ యుద్ధం జరుగుతున్నది. నేను ఆ యుద్ధంలో దేవతల పక్షంలో పోరాడడానికి వెళుతున్నాను. నేను వచ్చేదాకా నా భార్యను మీ దగ్గరుంచుతాను అన్నాడు.ఆ మాటల్ని యువరాజు యథాలాపంగా తీసుకున్నాడు.మంత్రవేత్త ఒక లావుపాటి తాడును ఆకాశంలోకి విసిరాడు. ఆశ్చర్యంగా అది ఆకాశంలో నిచ్చెనలా నిలబడింది. మంత్రవేత్త ఆ తాడుపై పాకి ఆకాశంలోకి అదృశ్యమైపోయాడు. ఆకాశంలో ఘోర యుద్ధం జరుగుతున్నట్లు కత్తుల శబ్దం, రక్తవర్షం, బీభత్స వాతావరణం నెలకొంది.
MARMIKA

ఇదంతా చూస్తున్న జనం భయభ్రాంతులయ్యారు. అంతలో ఆకాశం నుంచి రక్త గాయాలతో మాంత్రికుడు ధబీమని కిందపడ్డాడు. కొన ఊపిరితో ఉన్న అతని మీదపడి అతని భార్య భోరున విలపించింది.కాసేపటికి మంత్రవేత్త కన్నుమూశాడు. అతని అంత్యక్రియలకు అంతా సిద్ధం చేశారు. అతని భార్య అతనితో పాటు సహగమనం చేస్తానన్నది. ఎంత వారించినా వినలేదు. చితి పేర్చారు. మంటపెట్టారు. మంత్రవేత్త అతని భార్య కాలిబూడిదగా మారిపోయారు.అందరూ చిత్రంగా చూస్తున్నారు. యువరాజు మాత్రం నిర్వికల్పంగా ఉన్నాడు. అంతలో ఒక మెరుపు మెరిసింది. మంత్రవేత్త అతని భార్య అందరిముందు ప్రత్యక్షమయ్యారు. జనాలు కరతాళధ్వనులు చేశారు. మహామంత్రి యువరాజా! చూశావు కదా! ఇంతకు మించి నువ్వు ఏ అద్భుతాలకోసం హిమాలయాలకు వెళతావు? అన్నాడు.మహామంత్రి మాటలు పట్టించుకోకుండా యువరాజు మంత్రవేత్తతో ఇంత అద్భుత శక్తిని మీరు సాధారణ జనానికి పంచవచ్చు కదా! అన్నాడు. అది కుదరదు అన్నాడు మంత్రవేత్త.మరి మీ కొడుకుకు చెబుతారా? అన్నాడు.తప్పక అతను నా వారసుడు కదా! అన్నాడు.అవును. మీరన్నది నిజం. నేను దేవుని వారసుణ్ణి అవుదామనుకున్నాను. ఈ అనంత సృష్టికర్త ఎంత అద్భుతశక్తి సంపన్నుడో నా ఊహకే అందడం లేదు. ఆయన దయకోసం దీవెన కోసం నేను హిమాలయాలకు వెళ్ళాలి. క్షణికమైన మంత్రశక్తి కోసంకాదు. శాశ్వతమైన పారలౌకిక శక్తికోసం ఆయన అన్వేషణలో మునుగుతాను అని యువరాజు హిమాలయాలకు వెళ్ళిపోయాడు.

-సౌభాగ్య

200
Tags

More News

VIRAL NEWS