అమెరికా శత్రువు


Sun,October 27, 2019 02:04 AM

ముందు, వెనక రెండు మిలటరీ వాహనాలు రాగా ఓ లిమజిన్ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాం మీదకి చేరుకుంది. ఆ మిలటరీ వాహనాల్లోంచి కిందికి దిగిన యూనిఫారాల్లోని ఆరుగురు లిమజిన్‌లోని బ్రిగేడియర్ జనరల్ బ్రేవ్‌మేన్ శవపేటికని బయటకి తీసి, ప్లాట్‌ఫాం మీద ఆగిన రైల్లోని ప్రత్యేక ఫ్యునరల్ కంపార్ట్‌మెంట్లో ఉంచారు. ఆయన మృతదేహానికి వీడ్కోలు చెప్పడానికి వచ్చిన దాదాపు పాతికమందిలో డజనుమంది సివిలియన్స్, మిగిలిన వారు యూనిఫాంలోని మిలటరీ ఉద్యోగస్థులు. ఆయన బంధుమిత్రులైన సివిలియన్స్‌లో కొందరు అదే రైల్లో ఆయనతోపాటే వెళ్తున్నారు. వారంతా కంట తడి పెట్టారు. కానీ, మిలటరీ యూనిఫాంలోని ఒకడు ఏడవడం గమనించి వాళ్ళు కొద్దిగా ఆశ్చర్యపోయారు.

అతను బ్రేవ్‌మేన్‌కి పద్దెనిమిదేళ్ళు డ్రైవర్‌గా పని చేసాడు ఒకరు వాళ్ళతో చెప్పారు.
ఆ ఫ్యూనరల్ కంపార్ట్‌మెంట్ లోపలి కార్పెట్, తెరలన్నీ నల్లవి. సార్జెంట్ మెక్‌గేర్ లోపలి కిటికీ తెరలని మూసేసాడు. ఆయన స్వగ్రామం దాకా ఆ శవపేటిక వెంట ఉండి కెప్టెన్ మెడ్లీతోపాటు దాన్ని ఆయన బంధువులకి అప్పగించే బాధ్యత మెక్‌గేర్‌దే.ఇరాక్ యుద్ధంలో బ్రిగేడియర్ జనరల్ బ్రేవ్‌మేన్ లిక్కర్ కొనుగోళ్ళల్లో కొన్ని అవకతవకలకు పాల్పడి డబ్బు కొట్టేసాడని, ఆ డబ్బుని షేర్లలో పెట్టుబడి పెట్టి చాలా గడించాడనే అభియోగం ఉంది. ఈ ఆరోపణ మీద వచ్చేవారం ఆయన ఓ ప్రత్యేక మిలటరీ కోర్ట్‌లో హాజరవాల్సి ఉండగా కొద్ది గంటల క్రితం హార్ట్ ఎటాక్‌తో మరణించాడు. నెబ్రెస్కాలోని ఒలోగా అనే చిన్న ఊళ్ళో ఎన్నడూ ఆగని ఆ రైలు ఆగే ఏర్పాటుని మిలటరీ అధికారులు చేసారు.
crime-story

రైలు ఈల వేసి బయలుదేరుతుండగా ప్లాట్‌ఫాం మీది అన్ని రేంకుల వాళ్ళు దానికి సెల్యూట్ చేసారు. క్రమంగా రైలు వేగం పుంజుకొని కనుమరుగయ్యాక అంతా బయటకి నడిచారు. చాలామంది సివిలియన్స్ ఆ రైల్లో ఆయన గ్రామానికి వెళ్తున్నారు. శవం భద్రత దృష్ట్యా మిలటరీ పోలీసులు ఇద్దరు పక్క కంపార్ట్‌మెంట్లోనే ప్రయాణిస్తున్నారు. మరో పదహారు గంటలపాటు సార్జెంట్ మెక్‌గేర్‌కి ఆ శవమే కంపెనీ. అతను ఓ సీట్లో కూర్చుని ఎదుటి సీట్‌మీద కాళ్ళుంచి సిగరెట్ ముట్టించాడు. అతను ఆ జనరల్ యూనిట్లో ఎక్కువ కాలం పని చేయడంతో ఆయనమీద గౌరవంతో ఆ డ్యూటీని వేయించుకున్నాడు.క్రమంగా రైలు న్యూ ఇంగ్లండ్‌ని వదిలి పశ్చిమం వైపు ప్రయాణించసాగింది. అతను ఓ నవలని తెరిచాడు. అరగంట తర్వాత అతను ఎలక్ట్రిక్ కాఫీ మేకర్‌లో నాలుగు కప్పుల నిండుగా కాఫీని తయారు చేసుకున్నాడు. ఆ కంపార్ట్‌మెంట్ నించి పక్క కంపార్ట్‌మెంట్‌కి ఉన్న కనెక్టింగ్ డోర్‌కి ఇటువైపు గడియ పెట్టి ఉంది. అవతల కెప్టెన్ మెడ్లీ ఉన్నాడు.
రైలు ఆరుగంటలు ప్రయాణించాక అది జరిగింది.

అకస్మాత్తుగా సార్జెంట్ మెక్‌గేర్‌కి ఆ శబ్దం వినిపించింది. అది చెక్కని తట్టే శబ్దం. వెంటనే అతను లేచి వెళ్ళి తలుపు లోపల గడియని తీసి తెరచి అవతలి కంపార్ట్‌మెంట్లోకి చూసాడు. తలుపు అవతల ఎవరూ లేరు. దాన్ని మూస్తుండగా మళ్ళీ అదే శబ్దం వినిపించింది. అతను తలుపు మూసాడు. చెవులు రిక్కించి ఆ శబ్దం శవపేటిక లోంచి వస్తున్నదని గ్రహించగానే కొద్దిగా ఆశ్చర్యం, కొద్దిగా ఆనందం కలిగాయి. దాని దగ్గరకి వెళ్ళి చెవి ఆనించి విన్నాడు. సందేహం లేదు. లోపలి నించే అనుకున్నాడు.ఆ శవపేటికకి బిగించిన ఇనుప బద్దీలని వాటిని విప్పతీయడానికి తీసుకెళ్ళే పరికరంతో వెంటనే తొలగించాడు. తర్వాత శవపేటిక గడియకున్న తాళాన్ని తన జేబులోని తాళం చెవితో తెరిచాడు. తక్షణం భయంగా ఓ అడుగు వెనక్కి వేసాడు.
సార్జెంట్ మెక్‌గేర్! గుడ్ ఆఫ్టర్‌నూన్. నా కాళ్ళు తిమ్మిరెక్కాయి. చేతిని పట్టుకుని నన్ను జాగ్రత్తగా బయటకి తీయి కళ్ళు తెరచి చూసే బ్రిగేడియర్ జనరల్ బ్రేవ్‌మేన్ కోరాడు.

మెక్‌గేర్ ఆశ్చర్యానికి అంతు లేదు.మీరు అత్యంత అదృష్టవంతులు సర్ సెల్యూట్ చేసి ఆనందంగా చెప్పి ఆయన బయటకి రావడానికి సహాయం చేసాడు.కొద్దిసేపాగి ఆయన తేరుకున్నాక మళ్ళీ చెప్పాడు.
పన్నెండు గంటల క్రితం మీరు మరణించారని మిలటరీ డాక్టర్ సర్టిఫై చేసారు సర్. మీకు ట్వంటీవన్ గన్ సెల్యూట్‌కి మీ ఊళ్ళోని స్మశానంలో ఏర్పాట్లుకూడా పూర్తయ్యాయి. మిమ్మల్ని టీవీ వాళ్ళు, పత్రికా విలేకరులు తప్పకుండా ఇంటర్వ్యూ చేస్తారు సర్.ఆయన్ని ఓ సీట్లో కూర్చోపెట్టి వేడి వేడి కాఫీ ఇచ్చాడు. ఆయన తను ఎక్కడున్నాడో తెలిసినా ఆశ్చర్యపోనందుకు మెక్‌గేర్‌కి ఆశ్చర్యం వేసింది.
మీరు చచ్చి మళ్ళీ బతికినందుకు సంతోషంగా లేదా సర్? అడిగాడు.నిజానికి నేను మరణించలేదు సార్జెంట్ బ్రిగేడియర్ జనరల్ చెప్పాడు.నిన్న మధ్యాహ్నం మీ ఆఫీస్‌లో మీకు హార్ట్ ఎటాక్ వచ్చింది సర్. కల్నల్ మేసన్ మిమ్మల్ని పరీక్షించి మీరు మరణించారని సర్టిఫై చేసారు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది సర్.వారు పొరబడ్డారని నాకు తెలుసు సార్జెంట్. నాకు హార్ట్ ఎటాక్ వచ్చినట్లు నటించాను.
నటించారా?అవును నవ్వాడు.

అసాధ్యం సర్. ఏ డాక్టర్ ముందూ ఎవరూ అలా నటించలేరు సార్. గుండెని ఎవరూ ఆపలేరు.
అది నిజమే. కానీ, అందుకు నేనో ఇంజక్షన్ తీసుకున్నాను. అది కోమా, హార్ట్ ఎటాక్ లక్షణాలని ఇస్తుంది. రెండోది, కల్నల్ మేసన్ నేను జీవించి ఉన్నానని తెలిసీ కావాలనే నా డెత్ సర్టిఫికేట్ మీద సంతకం చేసాడు.మరోసారి మెక్‌గేర్ నిర్ఘాంతపోయాడు.దానికి ఎంత శిక్ష పడుతుందో నాకు తెలీదు కాని అవి చాలా నేరపూరిత చర్యలు సార్.పట్టుబడితేనే సార్జెంట్, పట్టుబడితేనే.నాకేం అర్థం కావడం లేదు సార్.
కూర్చో. వివరిస్తాను. నేను వచ్చే సంవత్సరం రిటైరయ్యే పంతొమ్మిది సంవత్సరాల సర్వీస్‌గల జనరల్ గ్రేడ్ ఆఫీసర్ని. కాని నా మీద కోర్టులో కేసు నడుస్తున్నది. అందులో నేను ఓడిపోతే నా రేంక్‌ని కెప్టెన్ రేంక్‌కి తగ్గిస్తారు. దాంతో రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ డబ్భై ఐదు శాతం తగ్గిపోతాయి. పైగా నేను అవమాన భారం భరించాలి. శిక్షకూడా పడుతుంది. అది కనీసం ఏడేళ్ళనుంచి పద్నాలుగేండ్ల జైలు శిక్ష, భారీ జరిమానా కూడా ఉంటుంది. వీటినుంచి తప్పించుకోవడానికి నేనీ నాటకం ఆడాల్సి వచ్చింది. ఇప్పుడా ప్రమాదం లేదు.
మెక్‌గేర్ ఆశ్చర్యంగా, నమ్మలేనట్లుగా చూసాడు.

అంతేకాదు, నాకు మిలటరీలో, సివిల్ కంపెనీల్లో వచ్చే ఇన్సూరెన్స్ సొమ్ము కూడా నా భార్యకి ముడుతుంది. తర్వాత మేము మెక్సికోకి వెళ్ళి అక్కడ స్థిరపడతాం. ఆ ప్రభుత్వం నన్ను మెక్సికోనుంచి అమెరికాకి పంపదు. అలాంటి ఒప్పందం ఈ రెండు దేశాల మధ్య లేదు. కాబట్టి, నేను తిరిగి అమెరికాకు వచ్చే బెడద ఉండదు బ్రిగేడియర్ జనరల్ బ్రేవ్‌మేన్ చెప్పాడు.ఈ అన్ని సమస్యల నుంచి బయట పడటానికి మీరు మిలటరీ ఫ్యూనరల్‌ని పరిష్కారంగా ఎన్నుకున్నారన్న మాట. కొత్త పేరు, కొత్త ఐడెండిటీ, కొత్త దేశం మిమ్మల్ని రక్షిస్తాయి. మీకు కల్నల్ మేసన్ ఎందుకీ సహాయం చేసారు? సార్జెంట్ అడిగాడు.
లక్ష డాలర్లు. అది నాకు సముద్రంలో నీటి చుక్క. నేను కావాలని చేసిన అప్పులు అంతకు ఏభై రెట్లు. ఇక వాటిని నా భార్య కాని, ఇతర వారసులు కాని తీర్చాల్సిన పని లేదు. నేను మరొకరికి కూడా లక్ష డాలర్లు ఇవ్వాల్సి ఉంది సార్జెంట్ ఆయన నవ్వుతూ చెప్పాడు.

ఎవరికి సార్?
నీకే. ఈ పథకంలోని ముఖ్య పాత్రధారుల్లో నీదికూడా ప్రధాన పాత్రే. ఈ రహస్యాన్ని కాపాడటానికి నీకు లక్ష డాలర్లు ఇవ్వదలచుకున్నాను.ఎప్పుడు సర్? సార్జెంట్ మెక్‌గేర్ అడిగాడు.వెంటనే. శవపేటికలో నీకు ఇవ్వాల్సిన డబ్బుకూడా వెంట తెచ్చాను.కానీ, కెప్టెన్ మెడ్లీ రైల్లోంచి మీ శవపేటికని దింపబోయే ముందు పరిశీలిస్తాడు. అందుకే అతను పక్క కంపార్ట్‌మెంట్లో వస్తున్నాడు సార్. ఆ ఇనుప పట్టీలని ఎందుకు తెరిచావని నన్ను వివరణ అడుగుతాడు.శవపేటికలో కొత్త పట్టీలు ఉన్నాయి. నేను లోపలకి వెళ్ళాక వాటిని మళ్ళీ బిగించు. పట్టీలని బిగించే చిన్న యంత్రాన్ని కూడా అందులో తెచ్చాను. ఊడదీసిన పట్టీలని శవపేటికలోనే ఉంచవచ్చు. దాచడానికి వడ్రంగి లోపల రహస్య అరని అమర్చాడు. ఇంకాస్త కాఫీ ఇవ్వు సార్జెంట్. చివరగా శవపేటికలో మరో ఇంజక్షన్ తెచ్చాను. మా ఊళ్ళో రైలు ఆగడానికి పది నిమిషాల ముందు దాన్ని ఇంజెక్ట్ చేసుకుంటాను. అది నాలుగు గంటలు నన్ను శవంలా మారుస్తుంది. మా ఆవిడ శవపేటికలోని నన్ను బయటకి తెచ్చి అందులో పుస్తకాలు ఉంచి మళ్ళీ ఇనుప పట్టీలని బిగిస్తుంది. శవపేటికని పాతగానే నా కథ ముగుస్తుంది ఆయన గర్వంగా చెప్పాడు.

శవపేటికలో దాచిన లక్ష డాలర్లున్న కవర్ని తీసి సార్జెంట్‌కి ఇచ్చాడు. ఇద్దరూ ఇరాక్‌లో యుద్ధం గురించి మాట్లాడుకుంటూ కాలక్షేపం చేసారు.టైం చూసుకుని మరో పది నిమిషాల్లో రైలు ఆగుతుందనగా బ్రేవ్‌మేన్ ఇనుప పట్టీలని రహస్యపుటరలో ఉంచి, ఇంజెక్షన్ తీసుకుని శవపేటికలో పడుకున్నాడు. సార్జెంట్ కొద్దిసేపు వేచి చూసాడు. స్పృహలో లేని జనరల్ బ్రేవ్‌మేన్ ఊపిరి చాలా బలహీన పడి, గుండెచప్పుడు లీలగా వినపడుతున్నది. అతను శవపేటికని వెదికితే లోపల అనేక సన్నటి రంధ్రాలు కనిపించాయి. బయటకి అవి కనపడకుండా ఇత్తడి అలంకారాలు ఉన్నాయి. వాటి ద్వారా లోపల గాలి ఆడుతుంది. తను చదివే పుస్తకంలోని చదివిన పేజీలని చింపి బాత్‌రూంలోని సింక్‌లో వాటిని నానపెట్టి తర్వాత ఆ గుజ్జుని ఆ రంధ్రాల్లో లోపల నించి కూరాడు. తన షేవింగ్ కిట్‌లోని బేండ్ ఎయిడ్‌తో లోపల ఆ రంధ్రాలని మూసేసాడు.
శవపేటికకి ఇనుపపట్టీలని ఆ యంత్రంతో బిగించాడు.బ్రేవ్‌మేన్! అమెరికా శత్రువులని నాశనం చేస్తానని మిలటరీలో చేరినప్పుడు మీరు నాతో బైబిల్‌మీద, రాజ్యాంగం మీద ప్రమాణం చేయించారు. దానికి కట్టుబడి ఉన్నాను శవపేటిక వంక చూస్తూ చెప్పాడు.రైలు వేగం తగ్గి, బయటనుంచి మిలటరీ బేండ్ వినిపించడంతో రైలు ప్లాట్‌ఫాం మీదకి చేరిందని అతను గ్రహించాడు.బ్రేవ్‌మేన్ చాలా గొప్ప జనరల్ కెప్టెన్ మెడ్లీ చెప్పాడు.
అవును సర్ సార్జెంట్ బదులు చెప్పాడు.
(జెర్రీ జేకబ్సన్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి

559
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles