పద్య రత్నాలు-25


Sun,October 27, 2019 01:04 AM

ఎంత ధన్యుడవో కదా!

దశకంఠుని బరిమార్చియు
కుశలముతో సీత దెచ్చి కొనియు నయోధ్య
న్విశదముగ కీర్తి నేలితి
దశరథ రామావతార ధన్యుడ కృష్ణా!
-శ్రీ కృష్ణ శతకం

తాత్పర్యం:రామావతారంలో దశరథ మహారాజుకు సుకుమారునిగా జన్మించితివి. ఆసాంతం అద్భుతమైన రామావతారాన్ని పరిసమాప్తి చేశావు. పది తలల రావణాసురుని హతమార్చావు. సీతమ్మతో క్షేమంగా అయోధ్యా నగరానికి వచ్చావు. యుగయుగాలుగా కీర్తింపదగ్గ స్థాయిలో రాజ్యాన్ని పరిపాలించావు. నీవెంత ధన్యుడవో కదా కృష్ణా!
entha-danyudavo

భక్తిమార్గమే శిరోధార్యం

భవకేళీమది రామదంబున మహాపాపాత్ముడై వీడు న
న్ను వివేకింపడటంచు, నేను నరకార్ణో రాశిపాలైన బ
ట్టవు, బాలుండొకచోట నాటతమితోడ న్నూతగూలంగ దం
డ్రి విచారింపక యుండునా కటకటా శ్రీకాళహస్తీశ్వరా!
- శ్రీ కాళహస్తీశ్వర శతకం

తాత్పర్యం:ఎవరికైనా భక్తిమార్గమే కదా శిరోధార్యం. అది తెలియక, మాయామోహంలో పడి ఎన్నెన్నో పాపాలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడం తగునా! తప్పులు చేసే పిల్లలను సక్రమమార్గంలో పెట్టవలసిన బాధ్యత తండ్రిది కాదా? కొడుకు పొరపాటున బావిలో పడితే తండ్రి చూస్తూ ఊరుకొంటాడా? నేను కూడా నరకకూపంలో పడకుండా చూడవయ్యా స్వామీ!
bhakthi-margame

ప్రేమతోనే జయించాలి!

అదను దలంచికూర్చి ప్రజనాదర మొప్ప విభుండు కోరినన్
గదిపి పదార్థ మిత్తురటు కానక వేగమె కొట్టి తెండనన్
మొదటికి మోసమౌ, బొదుగు మూలము గోసిన బాలుగల్గునే
పిదికిన గాక భూమిబశుబృందము నెవ్వరికైనా భాస్కరా!
- భాస్కర శతకం
Premathone

తాత్పర్యం:పాలిచ్చే గోవునైనా, శ్రమకోడ్చే పశువులనైనా మచ్చికతో ఆదరింపజేసుకోవాలి. కానీ, పాలకోసం పొదుగును కోయడం, పనుల కోసం హింసించడం మంచిదికాదు. పాలకుడు కూడా ప్రజల మనసును తెలుసుకొని పన్నులు విధించాలి. అలా కాకుండా దౌర్జన్యానికి దిగితే వారి మనసు గెలువలేరు. కనుక, దేనినైనా ప్రేమతోనే జయించాలి మరి.


వైకుంఠవాసా, కరుణించవా!

నరసింహా! నీ దివ్యనామ మంత్రముచేత దురితజాలము లెల్ల దోలవచ్చు
నరసింహా! నీ దివ్యనామ మంత్రముచేత బలువైన రోగముల్ పాపవచ్చు
నరసింహా! నీ దివ్యనామ మంత్రముచేత రివు సంఘములు సంహరింపవచ్చు
నరసింహా! నీ దివ్యనామ మంత్రముచేత దండహస్తుని బంట్ల దఱుమవచ్చు
భళిర! నే నీ మహామంత్ర బలముచేత
దివ్య వైకుంఠ పదవి సాధించవచ్చు!
భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
- నరసింహ శతకం
vaikunta

తాత్పర్యం:పావనమైన నరసింహ మంత్ర ప్రభావంతో అన్ని పాపాలనూ తొలగించుకోవచ్చు. తీవ్ర రోగాలను దూరం చేసుకోవచ్చు. విరోధులను మట్టుపెట్టవచ్చు. యమభటులనైనా పారిపోయేలా చేయవచ్చు. నీ నామ మహత్తును తెలుసుకోవడం ఎవరి తరమూ కాదు. నేనైతే చక్కగా దివ్యమైన ఆ వైకుంఠ పదవినే సాధిస్తాను. అనుగ్రహించు స్వామీ!

230
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles