ప్రేమను పంచే ఉంగరాలు!


Sun,October 20, 2019 03:52 AM

wedding
పెండ్లి.. నిశ్చిత్తార్థం.. వేడుక ఏదైనా.. ఉంగరాలు మార్చుకోవడం ఎప్పటి నుంచో వస్తున్న పద్ధతి.. బంగారం.. ప్లాటినం.. వజ్రాలు పొదిగిన ఉంగరాలు.. ఇలా వారి టేస్ట్‌కి తగ్గట్టు, వారి బడ్జెట్‌కి తగ్గట్టు.. ఉంగరాలు ఎంచుకోవడం చూస్తూనే ఉన్నాం.. ఒక చుట్టు ఉండి మధ్యలో రాళ్లు పొదగడమో.. మధ్యలో చిన్న డిజైన్ రావడమో తప్ప.. పెద్దగా ఉంగరాల మీద ఇంట్రెస్ట్ చూపించరు.. కానీ ప్రేమబంధం మరింత బలపడడానికి.. కాస్త స్పెషల్‌గా ఉంగరాలు ఎంచుకోవాలి.. అందుకే ఎలాంటి డిజైన్లయితే మీ బంధం మరింత బలం అవుతుందో.. ఆ డిజైన్లు మీ కోసం ప్రత్యేకంగా ఈ జంటకమ్మలో..
-సౌమ్య నాగపురి

wedding1

జంట పక్షులు

ప్రేమించుకొని ఒక్కటైన జంట లేదా ప్రేమతో ఒక్కటవుతున్న జంటను చూసి ఎవరైనా చిలుకాగోరింకల్లా ఉండమని కోరుకుంటారు. అలాగే ఆ పక్షులే ఉంగరాల మీద కలకాలం నిలిచేలా కూడా డిజైన్ చేయించుకోవచ్చు. అయితే.. వైట్ గోల్డ్, టంగ్‌స్టెన్ గోల్డ్ మీద అయితే ఈ పక్షులు మరింత అందంగా కనిపిస్తాయి. అలాగే చేతికి ఉంగరాలు పెట్టుకొని దగ్గరగా జరిపినప్పుడు.. పక్షులు రెండూ ఒక దానికొకటి చూస్తున్నట్లుగా డిజైన్ చేయిస్తే లవ్లీగా ఉంటాయి. కాకపోతే టంగ్‌స్టెన్ గోల్డ్.. మిగతా వాటికంటే కాస్త ధర ఎక్కువ. మీ జీవితంలో మరపురాని ఘట్టం కోసం ఆ కాస్త ఖర్చు భరించుకుంటామంటే అది మీ ఇష్టం. ఆ పక్షుల్లాగే మీరూ ఆనందంగా ఉండొచ్చు.

wedding2

సూర్య చంద్రుల కలయిక..

సూర్యచంద్రులు ఎప్పుడైనా కలుస్తారా? అలాగే వేరువేరుగా ఆలోచించే మనుషులను కలుపడం కూడా కష్టమే. కానీ పెండ్లి, ప్రేమ అనే బంధాలు వారిని ముడిపడేలా చేస్తాయి. అందుకే ఈ బంధానికి గుర్తుగా ఈ సూర్యచంద్రుల డిజైన్‌తో ఉంగరాలను చేయించుకోవచ్చు. మగవాళ్లు సూర్యుడు, ఆడవాళ్లు చంద్రుడి డిజైన్ చేయించుకోవాలి. అంటే వారి ఆలోచనా తీరును కూడా ఇవి ప్రతిబింబిస్తాయన్నమాట. ఇక ఈ ఉంగరాలు గోల్డ్, సిల్వర్ కాంబినేషన్‌లో చేయించుకుంటే మరింత బాగుంటాయి. కాస్త క్రాఫ్టింగ్ కరెక్ట్ చేసే వాళ్ల దగ్గర ఈ ఉంగరాలను చేయించుకోండి.

wedding3

గుండె చప్పుడు..నిశ్చితార్థం సమయంలో యూనిక్‌గా

ఉండాలనుకునే జంటలున్నాయి. పైగా ఉంగరానికి ఒక అర్థం ఉండాలని కోరుకుంటున్నాయి కొత్త జంటలు. అలాంటి వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే హృదయ స్పందన ఎలా ఉంటుందో అలా ఈ ఉంగరం డిజైన్ ఉంటుంది. మగవాళ్ల ఉంగరం మధ్యలో గ్యాప్ వస్తుంది. అది కూడా వంకలు వంకలుగా కట్ అయినట్టుగా ఉంటుంది. ఇక అమ్మాయి ఉంగరం సన్నగా, హృదయ స్పందనలా డిజైన్ ఉంటుంది. ఈ ఉంగరం కచ్చితంగా మగవాళ్ల ఉంగరం గ్యాప్‌లో పట్టే విధంగా డిజైన్ చేయించాలి. అప్పుడే ఒకరికొకరు అన్నట్లు ఈ ఉంగరానికి అర్థం అన్నమాట.

wedding4

అక్షరాలే ఉంగరాలు..

మీరు రొమాంటిక్ కపులా? అయితే మీలాంటి వారికోసమే ఈ డిజైన్ ఉంగరాలు. లవ్ యూ అనే అక్షరాలనే ఉంగరాలుగా మలిచే ట్రెండ్ వచ్చింది. కాకపోతే ఈ అక్షరాలు హెవీగా కాకుండా.. తేలికగా ఉండేలా డిజైన్ చేయించుకోవాలి. ఒకరినొకరు ఎంతో ప్రేమిస్తున్నామని ప్రమాణం చేస్తున్నట్లు ఈ రింగ్స్ ఉంటాయి. గోల్డ్, ప్లాటినమ్‌లతో చేసిన ఉంగరాలు బాగుంటాయి. ఒకవేళ కావాలనుకుంటే.. ఒకరు గోల్డ్, మరొకరు ప్లాటినం, లేదా ఇద్దరు ఒకే మెటల్‌తోనైనా చేయించుకొని వారి ప్రేమను చాటుకోవచ్చు.

wedding5

డీఎన్‌ఏలా సూపర్..

సరికొత్త డిజైన్ల కోసం ట్రై చేసే వారికి ఇది మంచి డిజైన్ అని చెప్పొచ్చు. డీఎన్‌ఏ ఆకారాన్ని మనం ఇక్కడ ఉపయోగించాం. వాటిని ఈ ఉంగరాల డిజైన్లలోకి మార్చి చూడండి. గోల్డ్, ప్లాటినంతో చేయించిన ఉంగరాలు మరింత చూడముచ్చటగా ఉంటాయి. స్పెషల్ డేని మరింత స్పెషల్‌గా మారుస్తాయి ఈ ఉంగరాలు. ఆడవాళ్ల ఉంగరాన్ని కాస్త డెకరేటివ్‌గా మార్చుకోవచ్చు. మగవాళ్ల ఉంగరం మధ్యలో పెద్ద స్టోన్, డైమండ్ ఇలా దేనైన్నా పొందుపరిచి.. కింద వైపు డీఎన్‌ఏ డిజైన్‌ని ఎంచుకోవచ్చు. లేదా సింపుల్‌గా మొత్తం గోల్డ్‌తో కూడా ఈ రింగ్‌ని మగవాళ్లు ఎంచుకోవచ్చు.

wedding6

ఆకర్షించేస్తాయి

ఒకరినొకరు ఆకర్షించుకునేలా ఉంటేనే ప్రేమ పుడుతుంది. అది పెండ్లికి దారి తీస్తుంది. మీలోనే ఆకర్షణ ఉండడం కాదు.. మీ ఉంగరాలు కూడా ఆకర్షించుకుంటే? ఆలోచన కొత్తగా ఉంది కదా! అది కూడా సగం హృదయాకారం ఒకరి దగ్గర, మిగిలిన సగం హృదయాకారం మరొకరి దగ్గర ఉండేలా ఉంగరాలు డిజైన్ చేయించుకోవాలి. దగ్గరగా వచ్చినప్పుడు అవి అతుక్కొని ఒక హృదయంలా మారిపోతుంది. అంటే.. రెండు హృదయాలు ఒక్కటైనట్లుగా ఈ ఉంగరాలు చెప్పకనే చెబుతాయి. ఈ రకమైన ఉంగరాలకు ఇప్పుడు ఎక్కువ గిరాకీ ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

wedding7

గుండె చిక్కుబడింది

హృదయం..దానికి ఒక తాళం కలిపిన ఈ ఉంగరం చూడముచ్చటగా ఉంటుంది. అంటే.. తనతోనే మీ గుండె లాక్ అయిపోయిందనే అర్థం ఈ ఉంగరం ద్వారా ప్రతిధ్వనిస్తుంది. ఇద్దరు ఒకేలాంటి ఉంగరాలు ధరిస్తే బాగుంటారు. వీటిని గోల్డ్, ప్లాటినంతో పాటు డైమండ్స్‌ని జతచేస్తే మరింత అందంగా కనిపిస్తాయి ఉంగరాలు. మరీ లావుగా కాకుండా సన్నగా ఉండేలా ఈ ఉంగరాలను డిజైన్ చేయించుకుంటే అందంగా కనిపిస్తాయి

wedding8

పేర్లతో ప్రేమ..

ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటుంది. దాన్ని వ్యక్తపరుచుకునే సందర్భం ఎప్పుడైనా వస్తుంది. అది పెండ్లి సమయంలోనో, నిశ్చితార్థం సమయంలోనో వెల్లడిస్తే అది రెట్టింపు అవుతుంది. అలా ఒకరి పేర్లను ఒకరి ఉంగరాల మీద రాయించుకుంటే అద్భుతంగా ఉంటుంది. లేదా వారికి నచ్చిన వస్తువులు, జంతువులు.. ఇలా ఏదైనా మీ ప్రేమ కనిపించేలా ఈ ఉంగరాలను డిజైన్ చేయించుకోవచ్చు. ఉంగరాలపై పేర్లతో పాటు లవ్ సింబల్, పువ్వులు ఇలా వేరే డిజైన్లను కూడా యాడ్ చేస్తే అది చూడడానికి చాలా బాగుంటుంది.

wedding9

ప్రేమ అనంతం

మీలో ఒకరిపై ఒకరికి దాచుకోలేనంత ప్రేమ ఉందా? అలా అయితే ఇలా ప్రేమను వ్యక్తపరుచుకోవచ్చు. లెక్కల్లో ఇనిఫినిటీ అనే సింబల్ అనంతంగా భావిస్తాం. కాబట్టి ముందువైపు ఈ సింబల్ ఉండేలా చూసుకోవాలి. లోపలి వైపు ఐ లవ్ యూ అనే అక్షరాలను పొందుపరిస్తే చాలు. వైట్ గోల్డ్, యెల్లో గోల్డ్‌లతో డిఫరెంట్‌గా ఈ ఉంగరాలను డిజైన్ చేయించుకోవచ్చు. ఈ ఉంగరాలకి అర్థం.. చివరి శ్వాస వరకు ఒకరినొకరం ప్రేమించుకుంటూనే ఉంటామని ప్రమాణం చేసినట్లు. మీ రోజు ఒక బ్యూటీఫుల్ మెమరీగా ఉండడానికి ఈ ఉంగరాల ఎంపిక మంచిది.

wedding10"ప్రేమను

రాజు.. రాణి..

మీ ప్రేమ సామ్రాజ్యానికి రాజు, రాణి మీరే! దీన్ని మీ ఉంగరాల్లో కనిపించేలా కూడా చేసుకోవచ్చు. అదెలా అనుకుంటున్నారా? మగవాళ్లు కింగ్ కిరీటాన్ని, ఆడవాళ్లు క్వీన్ కిరీటంలా ఉండే డిజైన్లను ఎంచుకోవచ్చు. టంగ్‌స్టన్‌తో మగవాళ్ల రింగ్, ప్లాటినంతో ఆడవాళ్ల ఉంగరాన్ని డిజైన్ చేయించుకుంటే బెటర్. కావాలనుకుంటే ఆడవాళ్ల ఉంగరంలో డైమండ్‌లు పొదిగితే ఉంగరం మరింత అందంగా కనిపిస్తుంది. డిఫరెంట్ థీమ్ కావాలనుకునే వాళ్లు ఈ ఉంగరాలను ట్రై చేయొచ్చు. అందరిలో ప్రత్యేకంగా కనిపించొచ్చు.

528
Tags

More News

VIRAL NEWS