దోపిడీదారుడు


Sun,October 20, 2019 02:02 AM

ఫార్లే మొహం పాలిపోయి, అతని ఉఛ్వాస నిశ్వాసలు పెరిగాయి. తను ఓ నిర్ణయం తీసుకోవాలని గ్రహించాడు. క్షణంలో బల్లమీద శామ్యూల్స్ ఉంచిన రివాల్వర్‌ని తీసుకుని అతనికి గురి పెట్టాడు.
-మల్లాది వెంకట కృష్ణమూర్తి

crime-story
పొట్టిగా, లావుగా ఉండి, శారీరక బలం పెద్దగా లేని ఫారేకి, అతని శత్రువులు, మిత్రులు దోపిడీదారుడు అనే ముద్దుపేరు పెట్టారు. మేథస్సుతో అతను బాస్ అయ్యాడు. అతని బాడీగార్డ్ బెన్‌కి శారీరక బలం ఉంది, కాని మెదడు లేదు.ఇప్పుడు నన్ను చూడటానికి వచ్చే శామ్యూల్స్ పెద్ద మనిషి. వెన్నెముక లేనివాడు. ఐనా మనం అప్రమత్తంగా ఉండాలి ఫార్లే తన బాడీగార్డ్‌కి చెప్పాడు.మాజీ పోలీసైన బెన్ అర్థమైందన్నట్లుగా తలూపి అడిగాడు. రెండు, మూడేండ్ల క్రితం మిమ్మల్ని చంపుతానని బెదిరించిన -
అతనేనా ఈ శామ్యూల్స్? అతని పేరు శామ్యూల్స్ అని గుర్తు.
-శామ్యూల్సన్. కానీ, అంతా శామ్యూల్స్ అంటుంటారు.
-అతను మూర్ఖుడు కాదు. మిమ్మల్ని చంపాలనే ఆలోచనతో వస్తున్నాడేమో?
-నీ సలహాకి థాంక్స్. అతని దుస్తులు వెదికి ఆయుధాలు ఉంటే తీసేసుకుని లోపలకి పంపు.

ఎస్సార్.
-ఇక నోరు మూసుకుని వెళ్ళు.
-బెన్ ఆ గదిలోంచి బయటికి వెళ్ళాడు. అతని మొహం అవమానంతో ఎర్రబడటం ఫార్లే గమనించలేదు.
అహంకారైన ఫార్లే తన సిబ్బందిని పురుగులా తీసేస్తుంటాడు. సలహాలు వినడానికి ఇష్టపడడు. ఇతరులు అభివృద్ధి చేసిన వ్యాపారాలని నయానో, భయానో స్వాధీనం చేసుకుంటుంటాడు. అందువల్ల సంపదతోపాటు అతనికి శత్రువులు కూడా పెరిగారు. ఏదైనా చట్టపరిధిలోనే చేస్తుంటాడు కాబట్టి, ఫార్లే మీద వేసిన కేసుల్లో ఎవరూ గెలువలేదు. ఓడిన వాళ్ళ కన్నీళ్ళని చూస్తూ ఫార్లే అనేకసార్లు పకపక నవ్వాడు. వ్యాపారం అనేది తనని నిలబెట్టుకోవడానికి కాక ఎదుటివారి సంపదని కొట్టేయడానికి ఉపయోగించేది అని నమ్మిన ఫార్లే తనకి లాభాన్ని, ఎదుటివాళ్ళకి నష్టాన్ని కలిగించడానికే వ్యాపారం అనేమాట వాడుతుంటాడు. చాలామంది బతిమాలుతారు. అరుదుగా ఎవరైనా హింసాత్మకంగా ప్రవర్తిస్తారు. అలాంటి వారిలో శామ్యూల్స్ ఒకడు.

-ఐదు నిమిషాల తర్వాత శామ్యూల్స్.. ఫార్లే అవుటర్ ఆఫీస్ గదికి చేరుకున్నాడు. బెన్ అతని ఐడెంటిటీ కార్డ్‌ని చూసాక అతని కోటు, ప్యాంట్ జేబులని తడిమాడు. చంకకింద -హోల్‌స్టర్‌లోని రివాల్వర్‌ని తీసుకుని చెప్పాడు.
-తిరిగి వెళ్ళేప్పుడు ఇస్తాను.ఇంటర్‌కంలో చెప్పాడు.
-మిస్టర్ శామ్యూల్స్‌ని పంపిస్తున్నాను.
-పంపు చెప్పి ఫార్లే తక్షణం టేబుల్ కుడి సొరుగులోంచి తన రివాల్వర్‌ని తీసి, దాని సేఫ్టీ కేస్‌ని తీసి బయటకి కనపడకుండా ఒళ్ళో ఉంచుకున్నాడు.
-అతను లోపలకి వచ్చాక ఫార్లే మర్యాదగా చెప్పాడు.
-హలో మిస్టర్ శామ్యూల్స్. దయచేసి కూర్చోండి.
-శామ్యూల్స్ అతని ఆహ్వానాన్ని, మైత్రీ పూర్వక చిరునవ్వుని విస్మరించాడు. నించునే ఫార్లే వంక తీక్షణంగా చూసాడు.
-మీరే సహాయం కోరి వచ్చారు? ఫార్లే అతని వంక పరీక్షగా చూస్తూ అడిగాడు.
-నా వ్యాపారాన్ని తిరిగి నాకు ఇచ్చేయ్.
-ఫార్లే ఫక్కున నవ్వి అడిగాడు.
-జోక్స్ వద్దు. ముందు కూర్చోండి. తర్వాత విషయానికి రండి.
-నేను సీరియస్‌గానే చెప్తున్నాను ఫార్లే.
-అది ఉపయోగం లేని ఆశ. నేను ఎవరో మీకు తెలుసు. నా గురించి చాలా విన్నారు. నేను ఎవరికీ, ఏదీ తిరిగి ఇవ్వనని మీకు తెలుసు. నాకేదైనా లాభదాయకమైన విషయం తెలిస్తే చెప్పు, లేదా వెళ్ళు ఫార్లే కఠినంగా చెప్పాడు.
-వెంటనే కాదు. నా వ్యాపారం నాకు తిరిగి ఇస్తే మరో రెండేండ్లలో నా లాభాల్లో నీకు ఇరవై శాతం భాగం ఇస్తాను.
-నీకు ఇవ్వకపోతే ఆ ఎనబై శాతం కూడా నాదే అవుతుంది.

-అంటే, నా వ్యాపారం తిరిగి ఇవ్వవా?
ఇవ్వను.
-నువ్వు ఇస్తావని నేనుకూడా అనుకోలేదు. ఆ వ్యాపారాన్ని అంత అభివృద్ధిలోకి తేవడానికి నాకు ముప్పయి ఏండ్లు పట్టింది ఫార్లే.
-నువ్వు నీ పనిని సమర్థవంతంగా చేసావు.
-దాని అభివృద్ధికి నేను నా రక్తమాంసాలని ధారపోసాను.
-ఆసక్తికరం. కానీ, అది నాకు ఉపయోగపడే సమాచారం కాదు.
-వాళ్ళు నిన్ను దోపిడీదారుడు అని ఊరికే పిలువడం లేదు ఫార్లే. ఇతరులు ఓ కల గని దాన్ని నిజం చేసుకుంటారు. నువ్వు వేటాడి దాన్ని కొట్టేస్తావు.
-నేను నా వ్యాపారాన్ని చట్టపరిధిలోనే చేస్తాను శామ్యూల్స్.
-నువ్వు నన్ను చావు దెబ్బ తీసావు.
-అతనేదైనా చేస్తే సరిగ్గా అప్పుడే చేస్తాడని ఊహించిన ఫార్లే తలుపు వంక చూసాడు. దానికి అవతల బెన్ సిద్ధంగా ఉంటాడని ఫార్లేకి తెలుసు.
-ఇంకేదన్నా ఉందా? నేను బిజీగా ఉండే వ్యాపారస్థుడ్ని.
-ఆఖరి విషయానికి వస్తాను.

-ఏమిటది?
-ముందు నేను నిన్ను చంపాలని అనుకున్నాను. కానీ, అది నా వల్ల కాదు.
సంతోషం.
-తర్వాత ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను.
-అది బాధా నివారణలో అత్యంత మంచిది. మరా పని ఎందుకు చేయలేదు?
-కానీ, నాకో మంచి ఆలోచన తట్టింది. నువ్వు నన్ను చంపాలి.
-ఏమన్నావు? ఫార్లే ఆశ్చర్యంగా అడిగాడు.
-నువ్వు ఇప్పుడు నన్ను చంపాలి. తనని బాధించిన వాడి ఇంటి గుమ్మం దగ్గర కత్తితో పొడుచుకుని మరణించడాన్ని హరాకిరి అంటారు. అది జపాన్‌లోని ఆచారం. అప్పుడు -ప్రపంచానికి ఇద్దరిలో ఎవరిది తప్పో స్పష్టంగా తెలుస్తుంది. కానీ, ఆత్మహత్య వల్ల ఆ ప్రయోజనం కలుగదు కాబట్టి, హరాకిరిని ఇంకో అడుగు ముందుకు తీసుకెళ్ళి ఇక్కడికి -వచ్చాను. నువ్వు నన్ను దోచుకున్నావు కాబట్టి నువ్వే నన్ను చంపాలి. ప్రపంచానికి నువ్వు ఎలాంటి వాడివో ప్రదర్శించదలచుకున్నాను.
-నీకు పిచ్చెక్కింది. బయటకి నడు ఫార్లే అసహనంగా అరిచాడు.
-నువ్వు అన్నింటినీ చట్టపరిధిలోనే చేయడానికి అలవాటు పడ్డావు కాబట్టి, ఇంతదాకా ఎవర్నీ చంపి ఉండవు. చాలామంది నీ దోపిడీలవల్ల బాధని అనుభవించారు. ఇప్పుడు -నువ్వు హంతకుడు అవడంలోని బాధని కూడా అనుభవించు. దాంతో నీకు నిద్ర పట్టని చాలా రాత్రులని నేను ఇవ్వబోతున్నాను. ఆ తర్వాత దోపిడీ చేసే కాఠిన్యం నీ లోంచి తొలగిపోవచ్చు.

-నువ్వు చాలా ఒత్తిడిలో ఉన్నావని నాకు తెలుసు శామ్యూల్స్. ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో. నేను నిన్ను ఎట్టి పరిస్థితుల్లో చంపను.
-శామ్యూల్స్ తన పాదాల దగ్గర ప్యాంట్ అంచులో దాచిన రివాల్వర్‌ని తీసి ఫార్లే బల్లమీద అతనికి ఎదురుగా ఉంచి ఆజ్ఞాపిస్తున్నట్లుగా చెప్పాడు.
-దీన్నిండా గుళ్ళు నింపాను. సేఫ్టీ కేస్ తీసి పేల్చడానికి సిద్ధం చేసాను. తీసుకుని నాకు గురి పెట్టి ట్రిగ్గర్ లాగు.
-నువ్వు పిచ్చివాడివై ఉండొచ్చు. కాని నేను కాదు. వెళ్ళు. లేదా మెంటల్ హాస్పిటల్‌కి పంపుతాను.
-అకస్మాత్తుగా శామ్యూల్స్ ప్యాంట్ రెండో అంచుకింద నించి రెండో రివాల్వర్ తీసి ఫార్లేకి గురిపెట్టి కఠినంగా చెప్పాడు.
-నీకున్న రెండు అవకాశాలు చెప్తున్నా విను. నన్ను నువ్వు చంపు. లేదా నిన్ను నేను చంపుతాను. రెంటిలో నీ చాయిస్ ఏదో నాకు అనుమానం లేదు.
-నీకు కావాల్సిందల్లా విశ్రాంతి శామ్యూల్స్. నీ మనసు చెదిరింది. అంతే. వెళ్ళు ఫార్లే అనునయంగా చెప్పాడు.
-విశ్రాంతి నా జబ్బుని కుదర్చదు ఫార్లే. నాకు చావాలని ఉంది. రివాల్వర్‌ని అందుకో.
-వ్యాపారం విషయంలో ఇందాకటి నీ ప్రపోజల్‌ని అంగీకరిస్తాను.
-ఇందాక చెప్పిందే నీ నిర్ణయం. తాత్కాలికంగా ఈ ప్రమాదం లోంచి బయట పడటానికి అది నువ్వు ఆడే అబద్ధం. తర్వాత నీ పథకం కూడా నాకు తెలుసు. రివాల్వర్‌ని అందుకో ఫార్లే శామ్యూల్స్ ఆజ్ఞాపించాడు.
ఊహు.
-ఐతే నేను సినిమాల్లోలా అంకెలు లెక్క పెడతాను. ఐదు లెక్క పెట్టాక నా రివాల్వర్‌ని కాలుస్తాను. అంతకు ముందే నువ్వు నన్ను చంపడం మంచిది ఫార్లే. ఒకటి...

-నీ కుటుంబం గురించి ఆలోచించావా?
-రెండు.. ఆలోచించాను. వాళ్ళకి నా ఇన్సూరెన్స్ సొమ్ము వెళ్తుంది. మూడు..
-నన్ను మోసం చేయలేవు. నువ్వీ ఆటని ఆడలేవు ఫార్లే బలహీన కంఠంతో చెప్పాడు.
-నన్ను వెంటనే చంపు ఫార్లే. నన్ను ప్రాణాలతో ఉంచితే నేను నిన్ను చంపుతాను. ఈ దూరంలోంచి కాలిస్తే గురి తప్పదు.
ఫార్లే మొహం పాలిపోయి, అతని ఉఛ్వాస నిశ్వాసలు పెరిగాయి. తను ఓ నిర్ణయం తీసుకోవాలని గ్రహించాడు. క్షణంలో బల్లమీద శామ్యూల్స్ ఉంచిన రివాల్వర్‌ని తీసుకుని -అతనికి గురి పెట్టాడు. తన ప్రాణం కోసం ఒత్తిడితో తీసుకున్న నిర్ణయం వల్ల తనకి తెలీకుండానే, యాంత్రికంగా దాన్ని ఖాళీ అయ్యేదాకా కాల్చాడు. శామ్యూల్స్ శరీరం నేల కూలిపోయింది.
-అంతదాకా తలుపుకి చెవి ఆనించి విన్న బెన్ ఆదుర్దాగా లోపలకి ప్రవేశించాడు. అతని చేతిలోని రివాల్వర్ రెండుసార్లు పేలి, ఫార్లే వెనక గోడలోకి గుళ్ళు గుచ్చుకుని ప్లాస్టర్ కిందకి రాలింది.
-ఫార్లే నీరసంగా తన కుర్చీలోంచి లేచి నేలమీద పడున్న శామ్యూల్స్ శవం వంక చేష్టలుడిగి చూస్తూండిపోయాడు.
బెన్ శవం దగ్గరకి వెళ్ళి అతని చేతిలోంచి జారిపడ్డ రివాల్వర్‌ని అందుకుని ఫార్లేకి గురిపెట్టి రెండుసార్లు కాల్చాడు. ఛాతీలో గుళ్ళు గుచ్చుకోగా ఆశ్చర్యంగా చూస్తూ ఫార్లే వెనక కుర్చీలోకి అడ్డదిడ్డంగా పడ్డాడు.
-బెన్ అతని దగ్గరకి వెళ్ళి మరణించాడని నిర్ధారణ చేసుకున్నాక తన చేతిలోని శామ్యూల్స్ నించి తీసుకున్న రివాల్వర్ మీది వేలిముద్రలని తుడిచి దాన్ని తిరిగి శామ్యూల్స్ చేతిలో ఉంచాడు.

-ఇలాంటి అవకాశం ఇంకోసారి రాదు నాన్నా. నీ అత్మహత్యకి బాధ్యుడ్ని శిక్షించాను ఫార్లే బాధితుడైన తన తండ్రికి బెన్ నివాళిగా చెప్పాడు. కొద్ది నిమిషాల తర్వాత వచ్చిన పోలీస్ లెఫ్టినెంట్ శవాలని పరిశీలించాక బెన్ చెప్పాడు.
-గన్ ఫైట్‌లో ఇద్దరూ ఒకర్నొకరు చంపుకున్నారు. నా రివాల్వర్ గురి తప్పి గుళ్ళు గోడలో గుచ్చుకున్నాయి. దోపిడీదారుడు చివరికి తన పాపానికి శిక్షని అనుభవించాడు. కానీ, తగిన శిక్ష కాదు. చాలా చిన్న శిక్ష.
-(మైఖేల్ జురాయ్ కథకి స్వేచ్ఛానువాదం)

276
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles