కొత్తదారి వెతుక్కుంటున్నాయి


Sun,October 20, 2019 01:35 AM

రోడ్డు మీద వాహనాలు అటూ ఇటూ తిరుగుతున్నాయి. కాకుల గుంపు తమ నోటికి కరచుకుని తీసుకొచ్చిన వాల్‌నట్‌లను ఆ రోడ్డుపై వేశాయి. కొద్దిసేపటి తర్వాత ఒక్కొక్క కాకి వచ్చి వాహనాల చక్రాల కిందపడి నలిగిన వాల్‌నట్ ముక్కలను తీసుసుకెళ్లి ఆరగించాయి. కొన్నేండ్ల క్రితం ఇవే కాకులు వాల్‌నట్స్ తినడానికి మరోలా ప్రయత్నం చేసేవి. ఇప్పుడు వాటి ప్రవర్తనలో మార్పు వచ్చింది. పట్టణీకరణ వల్ల జంతువులు, పక్షులు తమకు కావాల్సిన ఆహారాన్ని సమకూర్చుకోవడానికి కొత్తదారి వెతుక్కుంటున్నాయి.

anole
అనోల్ బల్లి: కరీబియన్ సముద్రంలోని ప్యూర్టోరికోలో ఉండే అనోల్ అనే బల్లులకు ఓ ప్రత్యేకత ఉన్నది. పట్టణ ప్రాంత జీవనానికి బాగా అలవాటుపడిన జీవుల్లో ఇది ఒకటి. ఇవి సాధారణంగా రాళ్లు, చెట్లపై తిరుగుతాయి. పట్టణీకరణ వీటికి పెద్ద సవాలుగా మారింది. నున్నటి గోడలు, కిటికీలతో వీటికి పాకడం కష్టంగా మారింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మనుగడ సాగించేందుకు అవసరమైన మార్పులు వీటిల్లో వచ్చాయి. ఉపరితలానికి శరీరం మరింత బాగా అతుక్కునేలా పొడవైన కాళ్లను పట్టణ ప్రాంత అనోల్ బల్లులు వృద్ధి చేసుకున్నాయి.

anole3
ఆకారంలో మార్పులు: డార్విన్స్ ఫించెస్ పక్షులకు జీవశాస్త్ర చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. పసిఫిక్ మహాసముద్రంలో దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్ దేశానికి చెందిన గాలపగోస్ ఐలాండ్స్‌లో ఈ పక్షులపై చార్లెస్ డార్విన్ అధ్యయనం చేశారు. సహజ ఎంపిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడంలో ఈ అధ్యయనం డార్విన్‌కు ఎంతగానో ఉపయోగపడింది. ఈ పక్షుల ముక్కులు వేర్వేరు పరిమాణాల్లో, ఆకారాల్లో ఉండేవి. వివిధ దీవుల్లో కొన్ని రకాల నిర్దిష్టమైన ఆహారానికి ఇవి అలవాటుపడ్డాయి. అమెరికాలో అరిజోనా రాష్ట్రం టుక్సన్ నగరంలోని ఫించెస్ శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఫించెస్ పక్షులతో పోలిస్తే టుక్సన్‌లోని ఉన్న ఫించెస్ పక్షులకు పొడవైన, వెడల్పైన ముక్కులు ఉన్నాయి. ఇలా ఉండటం వల్ల పక్షులకు ఆహారం కోసం పెట్టే ఫీడర్లలో పొద్దుతిరుగుడు విత్తనాలను సులువుగా తీసుకోగలుగుతున్నాయి.

anole1
పట్టణానికి మకాం: పెరిగ్రిన్ రాబందులు కీటకాలను తినే వలస పక్షులను తింటాయి. ఈ క్రమంలో డీడీటీ అనే రసాయన ఎరువును ప్రమాదకర స్థాయుల్లో తీసుకోవడం వల్ల వీటికి అంతరించిపోయే ముప్పు ఎదురైంది. అంతకుముందు తమ ఆవాసాలు ధ్వంసమవుతుండటంతో ఈ పక్షులు పట్టణాల్లో ఆశ్రయం పొందాయి. ఇవి నగరాల్లో ఎత్తైన భవంతులు, ఇతర నిర్మాణాలపై గూళ్లు ఏర్పాటు చేసుకోవడం నేర్చుకున్నాయి. నగరాల్లో కనిపించే పావురాలు, గబ్బిలాలు వంటి జీవులను తిని ఇవి బతికాయి. ఇరవయ్యో శతాబ్దం మధ్యలో చాలా ప్రాంతాల్లో రసాయన ఎరువుల కారణంగా ఈ పక్షి మనుగడకే ముప్పు ఏర్పడింది.

anole5
భూగర్భంలో మనుగడ : రెండో ప్రపంచ యుద్ధ సమయంలో లండన్ భూగర్భ స్టేషన్లలో తలదాచుకొన్న పౌరులు ఏవో జీవులు తమను తీవ్రంగా కుట్టాయని చెప్పారు. అవే క్యూలెక్స్ మాలెస్టస్ దోమలు. క్యూలెక్స్ పీపియన్స్ అనే దోమ జాతి ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఎలాంటి పరిస్థితులకైనా ఈ దోమలు ఇట్టే అలవాటు పడిపోతాయి. ఈ జాతి దోమల్లో లండన్ అండర్‌గ్రౌండ్ దోమ ప్రత్యేకమైంది. పరిస్థితులకు అలవాటు పడటంలో ఇది ఒక అడుగు ముందుంది. క్యూలెక్స్ పీపియన్స్ దోమలు భూ ఉపరితలంపై నివసిస్తాయి. క్యూలెక్స్ మాలెస్టస్ దోమలు భవనాలు, ఇతర నిర్మాణాల్లో, భూగర్భంలో మనుగడ సాగిస్తాయి. క్యూలెక్స్ పీపియన్స్ సాధారణంగా పక్షులను కుడతాయి. క్యూలెక్స్ మాలెస్టస్ మనిషి రక్తం రుచిమరిగాయి. క్యూలెక్స్ మాలెస్టస్ దోమను తొలిసారి 18వ శతాబ్దంలోనే గుర్తించారు. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ బలగాల బాంబు దాడుల నుంచి ప్రాణాలు కాపాడుకొనేందుకు లండన్ వాసులు నగరంలోని ఈ సొరంగాల్లో తలదాచుకున్నారట. ఆ విధంగా ఈ దోమలకు లండన్ అండర్‌గ్రౌండ్ దోమలనే నిక్‌నేమ్ వచ్చింది. క్యూలెక్స్ మాలెస్టస్ దోమలు భూగర్భంలోని పరిస్థితులకు అలవాటు పడ్డాయి. నిల్వ ఉన్న నీటికీ అలవాటు పడ్డాయి.

anole6
బ్లాక్‌బర్డ్ పాడే వేళల్లో మార్పులు: కామన్ బ్లాక్‌బర్డ్ అంటే ఇది కోకిల తరహా పక్షి. ప్రపంచంలో అత్యంత ప్రాచీన కాలం నుంచీ ఇది ఉన్నది. ఈ పక్షుల్లో గ్రామీణ ప్రాంత పక్షులతో పోలిస్తే పట్టణ ప్రాంత పక్షుల్లో నగర జీవనం పెను మార్పులు తీసుకొచ్చింది. ఐరోపా, ఉత్తర అమెరికాల్లో పట్టణ ప్రాంత బ్లాక్‌బర్డ్స్ ఏకంగా ఒక కొత్త జాతిగా రూపాంతరం చెందుతున్నాయట. జన్యుపరంగా గ్రామీణ, నగర ప్రాంత పక్షుల మధ్య తేడాలు ఉన్నాయని జీవశాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పక్షుల్లో నగర ప్రాంత పక్షులు పొట్టిగా ఉంటాయి. వీటి ముక్కు కొంచెం పెద్దగా ఉంటుంది. ఇవి చలికాలంలో వలస వెళ్లవు. నగరాల్లోని శబ్ద కాలుష్యం వల్ల ఈ పక్షులు పాడే తీరులో, పాడే వేళల్లో మార్పులు వచ్చాయి. అడవుల్లోని పక్షులు సూర్యోదయం వేళ కూస్తుంటాయి. పట్టణంలో ఉండే పక్షులు మాత్రం సూర్యోదయానికి కొన్ని గంటల ముందే కూస్తున్నాయట.

anole4
మెట్రో ఫ్రాగ్స్: టుంగారా కప్పలు మెక్సికో నుంచి దక్షిణ అమెరికా ఖండంలోని ఉత్తర భాగం వరకు ఉష్ణమండల అటవీ ప్రాంతంలో ఉంటాయి. శృంగారం కోసం ఆడకప్పలను ఆకర్షించేందుకు మగకప్పలు తమదైన రీతిలో శబ్దాలు చేస్తాయి.ఈ కప్పలను తినే జీవులు కూడా వీటి జాడను గుర్తించేందుకు కూడా మగకప్పల మాదిరే అరుస్తాయి. గ్రామీణ ప్రాంత కప్పలతో పోలిస్తే నగర ప్రాంత కప్పల్లో ఈ అరుపుల్లో స్పష్టమైన తేడా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. పట్టణ ప్రాంతాల్లో ఆడకప్పలను ఆకర్షించేందుకు మగకప్పలు సంక్లిష్టమైన శబ్దాలు చేయడం అలవాటు చేసుకొన్నాయని వారు కనుగొన్నారు. పట్టణ ప్రాంత కప్పలకు (మెట్రో ఫ్రాగ్స్)కు శత్రుభయం కూడా తక్కువే.

235
Tags

More News

VIRAL NEWS