వాస్తు


Sun,October 20, 2019 12:48 AM

vasthu

వరండా మీద ఇల్లు కట్టుకోవచ్చా?


-పి.లక్ష్మీబాయి, మేడ్చల్‌
ఇల్లును కింద కట్టినప్పుడు దానికి తూర్పులో, ఉత్తరంలో కొందరు ఎంతో ఇష్టంతో వరండా (పోర్టికో) వేసుకుంటారు. తద్వారా అది ఇంటి ముందు చక్కని ఖాళీ స్థలాన్ని, దాంతో మంచి ఆహ్లాద వాతావరణాన్ని ఏర్పాటు చేస్తుంది. దాని కిందే చాలా సందర్భాల్లో వాహనాలు కూడా పెడుతుంటారు. దిగుతుంటారు. మేడమీదకు వచ్చేసరికి మనసు మార్చుకొని ఆ పోర్టికో భాగాన్ని ఇంట్లోకి కలుపుకోవాలి అనుకుంటారు. అది సరైన విధానం కాదు. కింద ఎలా వరండాగా, వసారాగా ఉందో అలాగే పై భాగంలో కూడా దానిని ఓపెన్‌గానే వదిలి యథాతథంగా వాడుకోవాలి. అప్పుడే శాస్ర్తానికి మనోల్లాసానికి అది ఎంతో దోహదపడుతుంది. ఇల్లు అంటే ఉండబుద్ధికావాలి. అలాకాక సగం రూము వేసుకొని సగం ఓపెన్‌పెట్టి దానిని ముఖం లేని గృహంగా మార్చుకోవద్దు. మీరు కింద ఎలా కట్టారో పైన కూడా అలాగే తూర్పు వరండా వదిలి కట్టుకోండి.

ఉత్తరం వైపు ఈశాన్యంలో ఎదురురోడ్డు ఉంది. దక్షిణం వైపు మొత్తం ప్లాట్‌కి ఎదురు రోడ్డు ఉంది. ఎటువైపు ఇల్లు కట్టాలి?


-బి.అంజిరెడ్డి, కల్లూరు
ఉత్తర ఈశాన్యం రోడ్డు రావడం చాలా శుభకరం. అయితే ‘మూత ముద్దుగా ఉంది. కుండ అడుగు పగిలి ఉంది’ అన్నట్టు మీ ఫ్లాటుకు తిరిగి దక్షిణంలో దక్షిణం భాగం అంతా మింగేలా వీధి ఎదురు రావడం మంచిది కాదు. మీరు ఇల్లు ఎటువైపు కట్టాలనే విషయం కాదు. అసలు ఆ స్థలంలో ఇల్లు కట్టాలా వద్దా అని ముందు ఆలోచించాలి. పెద్ద మురికి కాలువలో బిందెడు మంచి నీళ్లు పోసినట్టు దక్షిణం వీధిపోటు ఉన్న ఆ స్థలానికి ఈశాన్యం వీధిపోటు పనిచేయదు. ప్రధానంగా వీధులు ఎదురు వచ్చినప్పుడు వెంటనే ఇంటి నిర్మాణం చేపట్టవద్దు. సరైన ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలి. మీ స్థలంలో నివాస గృహం కట్టే ఆలోచన ముందు మానుకోండి. దాంట్లో ఏ రకమైన మార్పుచేర్పులు చేయలేము. ఇంటికోసం కాకుండా షాపింగ్స్‌ మొదలైనవి వ్యాపార నిర్మాణాలు చేపట్టడానికి ప్రణాళిక చేయండి. ఇల్లును అక్కడ కట్టవద్దు.

మాది పడమర ఎత్తువున్న స్థలం. అందులో సెల్లార్‌, ఆఫీసు, ఇల్లు ఎలా కట్టుకోవాలి?


-వి.ఆర్‌. కావ్య, లింగంపల్లి
స్థలం పడమర ఎత్తు ఉన్నప్పుడు ఆ స్థలంలో కాస్త జాగ్రత్తలు తీసుకొని మంచి గృహం కట్టుకోవచ్చు. ముందుగా ఆ స్థలాన్ని శుద్ధి చేసి తూర్పు రోడ్డు నుండి పడమర ఎత్తు ఎన్ని ఫీట్లు ఉందో చూసుకొని పడమరలోని ఎత్తునుబట్టి తూర్పు భాగాన్ని స్టిల్ట్‌గా మార్చుకోవాలి. తద్వారా సహజ సిద్ధంగా తూర్పు గేటు నుండి రోడ్డు లెవెల్‌లోనే చక్కని ఫ్లోరింగ్‌ వస్తుంది. దాంతో దక్షిణం వైపు ఆఫీసును, ఉన్న స్థలానికి అనుకూలంగా నిర్మించాలి. మిగతా భాగం ఉత్తరం వైపు పార్కింగ్‌ ఏర్పాటు చేయాలి. ఇక ఎత్తయిన పడమర భాగం మీద స్టిల్ట్‌ రూఫ్‌మీద సరైన నైరుతి భాగాన ఇంటికొరకు ప్లాన్‌ చేయాలి. ఆ ఇంటికి కింది నుండి వాయవ్యంలో లేదా ఆగ్నేయంలో మెట్లు, లిఫ్ట్‌ పెట్టుకొని చేరుకోవచ్చు. పైభాగాన్ని భూమిగా భావించి చక్కని ప్రహరీతో వాస్తు ఇల్లు కట్టుకోవచ్చు.

మ్యారేజ్‌ హాల్‌కు మెట్లు రెండు చోట్ల రావాలి. ఎక్కడ పెట్టాలి?


stage
-కుడుముల భారతి, బోయిన్‌పల్లి
వివాహ స్థలం నిర్ణయించాక అందులో తూర్పు లేదా ఉత్తర ముఖంగా మండపాన్ని నిర్మించాలి. వీధులను బట్టి వివాహ నిర్మాణానికి రెండువైపులా మెట్లు రావాలి. అలాగ లిఫ్టులు కూడా పెట్టుకోవాలి అంటే ఆగ్నేయం లేదా వాయవ్యంలో ఏర్పాటు చేయాలి. రోడ్డు పడమర వైపు ఉన్నప్పుడు దానికి పడమర నైరుతిలో అలాగే ఉత్తరం వైపు వాయవ్యంలో మెట్లు, లిఫ్ట్‌ పెట్టుకోవచ్చు. దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు దక్షిణ నైరుతిలో మెట్లు, లిఫ్ట్‌, అలాగే పశ్చిమ నైరుతిలో కూడా మెట్లు పెట్టవచ్చు. ఉత్తరం రోడ్డు వచ్చినట్లయితే పడమర నైరుతిలో ఉత్తర వాయవ్యంలో మెట్లు -లిఫ్ట్‌ పెట్టుకోవచ్చు. ఈశాన్యాలు ఎట్టిరీతిలో మెట్లు - లిఫ్ట్‌లు రావద్దు.
SUDHHALA
సుద్దాల సుధాకర్‌ తేజ
[email protected]
Cell: 7993467678

281
Tags

More News

VIRAL NEWS