హరామ్


Sun,October 13, 2019 02:06 AM

Haram
మ్మీ (అమ్మ) ప్రవర్తనలో ఈమధ్య బాగా మార్పు కన్పిస్తున్నది నాకు. కడుపునిండా తింటలేదు, నోటి నిండ మాట్లాడ్తలేదు, కంటినిండ నిద్రవోతలేదు. ఏమైంది అమ్మీకు? వయసు మీదవడ్డది గదా చాదస్తం అప్పుడే వచ్చేసిందా. ఊరునుంచి తోల్కచ్చి నెలరోజులు గూడ కాలేదు. అప్పుడే పెద్దకొడుకు, మన్మల మీద పానం గుంజుతున్నదా? ఆఫీస్‌లో పని చేసుకుంటున్న నయీం ఆలోచనలు అమ్మ మీదకు మళ్ళాయి. మనసులో ఏదీ పెట్టుకోకుండా ముఖం మీదే అన్నీ అనేసే అమ్మ ప్రవర్తనలో ఎందుకింత మార్పు?
ఈ ప్రశ్న పదేపదే నయీంను కర్రను బాడిశ చెక్కినట్టు చెక్కుతున్నాయి.
ఉండబెట్టలేక ఇంటికి ఫోన్ చేశాడు. షమీం ఫోన్ ఎత్తింది.
అమ్మీ ఏం జేస్తున్నది ?
పండుకొని నిద్రలనే మాట్లాడుతున్నది షమీం సమాధానం వినగానే నయీంకి ఆఫీస్‌లో వుండబుద్ధికాలేదింక.
వెంటనే బాస్ దగ్గర పర్మిషన్ తీసుకుని ఇంటికి బయలుదేరాడు.
ట్రాఫిక్ సిగ్నల్స్ దాటుతూ వెళ్తున్నా గానీ అతని ఆలోచనలన్నీ అమ్మీ చూట్టే తిరుగుతున్నాయ్.
* * *
నాకు మూడేండ్లున్నప్పుడే నాన్న కాలంజేశిండు. పెద్ద పెండ్లాం, ఆమె పిల్లలు అప్పటికే పెద్దగైవున్నరు.
పప్పా సావుకు అమ్మనే కారణమని నిందమోపిర్రు.
ఇల్లు, పొలం, జాగ ఆకిర్కి పించిన్ పైసలు గూడ వాళ్ళ దిక్కే మల్పకున్నరు.
ఇంకో పెద్ద ఘోరం ఏం జేశిర్రంటే చట్టం దృష్టిల అమ్మీ, మేము లేకుంట కేసు కొట్టిపిచ్చుకున్నరు. అప్పటిసంది మా పాలనే అమ్మీ ఆశయం అయింది.
పప్పా మాకు ఒక ఫొటోల గుర్తులెక్క, సదువుకునేజాగల, కొలువుజేశే జాగల పప్పా పేరు మాకు వాడికకు అచ్చిందంతే.
అయినా అమ్మీ తన గుండెల కొండసుంటి దుఖ్ఖమున్నా గుండెలనే దింపుకున్నది. ఉన్న మా ముగ్గురికి పప్పాలేని లోటు తీర్చాలని అమ్మీ ఆరాటపడింది. పెద్దగా చదువుకోలేదు.
తన రెక్కలనే నమ్ముకున్నది.
వ్యవసాయం పనులన్నీ అమ్మీకి వచ్చు.
మాకోసం రోజువారీ కూలీ అవతారం ఎత్తింది.
ఎవరు నాటెయ్యాలని, కల్సుడు, పొలంగొట్టుడు..,

ఇట్ల ఏ పనైనా అమ్మీ పోయింది.
పొద్దుగాల్ల పదిగంటలనుంచి పొద్దిమీకి ఆరు గంటలదాక అమ్మీ పచ్చని శివారు మీద మా భవిష్యత్తు పచ్చగా వుండాలని కష్టవడ్డది.
తుర్కోల్ల ఆడోళ్ళు ఎప్పుడు బుర్కలనే వుంటరు. గనీ గా తుర్క బేగం శిన్నతనాన్నే ముండమోశింది.
గుడ్ల పొచ్చెలకెల్లి కోడిపిల్లలను తీశి పోదన జేస్కున్నట్టు సాదుకుంటున్నది.
నాగలేని కైకిలి జేస్కుంట అసలీమె తుర్కామెనేనా అన్నట్టు పనిజేస్తది అని వూర్ల అందరు అంటరు. అమ్మీకి ఊర్లనే గాదు సుట్టుపక్కల వూర్లల్ల గూడ మంచి పేరుంది.
అప్పట్ల పదిహేను రూపాల కైకిలి, సీస కల్లు ఇచ్చేటోళ్ళు. అమ్మీకి అప్పటిసందే కల్లు తాగే అలవాటువడ్డది.
పొద్దంత చేశిన కష్టం, పప్పా సచ్చిపోయిండనే పచ్చిగాయాలను మాన్పే మందు కల్లే అయింది అమ్మీకు.
ఈ ముచ్చట తెల్శిన ఆడకట్టు తుర్క ఆడోళ్ళు అమ్మీ గురించి ఎగతాళిగా మాట్లాడేటోళ్ళు.
ఏందమ్మ గా బేగం మొత్తం తెన్గు సోపతివట్టి అటే వోయేటట్టున్నది. ఒక నమాజు లేదు, ఒక రోజా లేదు.
దినాం కల్లు గూడ తాగుతదట. అల్లాహ్ మాఫ్ కరే.

థూ.. ఇసుంటోళ్ళు పక్కా దోజఖ్ (నరకం)కే వోతరు అని ఎంతమంది ఎన్ని మాటలతోని గుండెను పొడ్శినా ఎవరి మాటలు పట్టిచ్చుకునేది గాదు అమ్మీ.
ఇట్ల సుట్టుపక్కల ఊర్లల్ల అమ్మీలలాంటోళ్ళు శానామంది వున్నరు. మొగోడు సచ్చో, సరైన సదువు లేకనో, తరాలుగా వస్తున్న వ్యవసాయానికి అలవాటు పడిర్రు. ఎండకు, వానకు, సలికి రెక్కల కష్టం జేస్కునేటోళ్ళకు కల్లే అమృతం. పక్కా ముస్లిం అనుకునేటోళ్ళకు వీళ్ళంతా పక్కా దుష్మన్‌లు.
వాళ్ళు నమాజులు చేసి, రోజాలు వుండి, ఫిత్రేలు, జకాత్ లు ఇచ్చి ఇస్లాంను గౌరవిస్తున్నట్టు, వీళ్ళు కష్టంజెయ్యంది కడుపులకు రాదనుకునే బడుగుజీవులు వాళ్ళ దృష్టిల ఇస్లాంకు వ్యతిరేకులు??
ఎవరెన్ని అన్నా తన పని తనది అంతే. సాంప్రదాయవాదుల ఎదుట అమ్మీ ఎప్పుడూ ఓ దోషిలా ముఖానికి కొంగు అడ్డం పెట్టుకొని బతుకు పోరాటం జేస్తున్నది.
కైకిలి లేన్నాడు అమ్మీ ఉత్తగుండేదిగాదు. చీపురుగొయ్యలు కోస్కచ్చుడో, సుట్టాకులు, మొర్రాకులు తెంపుకచ్చుడో, గట్టుకువోయి పొయిలకు కట్టెలు ఏర్కచ్చుడో.., ఇట్ల ఏదన్న ఒక పని ముంగటేస్కునేది. కనీ ఖాళీగైతే అస్సలుండేదిగాదు.
కన్నకష్టంజేశి మమ్ములను పెద్దోల్లను జేశింది.
మంచిగ సదివిచ్చింది. నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన. అన్న సొంత వ్యాపారం జేస్కుంటున్నడు. అక్క లగ్గం అయి కాపురం జేస్కుంటున్నది.
అంత మంచిగనే వుందిగనీ కోడండ్ల విషయంల అమ్మీకి అవమానాలు తప్పలేదు.

కేవలం ఒక్క కల్లు తాగే మాటను ముంగటేస్తుంటరు.
కోడండ్ల ముంగట నేను తాగన్రా. అది తాగుడు హరామ్ అంటున్నరు. మీ పిల్లలు జూశినా నేర్సుకుంటరు. సాటుమాటుకు తాగుతా. మున్పటోలె సీస కల్లు గూడ పోతలేదు.
గిలాసెడు కల్లు తాగినా నా ఆత్మ తుర్తివడ్తది.
అది తాగకవోతె నాకు నిద్రవట్టది అని అమ్మీ ఇప్పుడు మాకు చిన్నపిల్ల లెక్కట అడుగుతుంటే..
చిన్నప్పుడు చారాణ కోసం అమ్మ శింగులు వట్టుకొని మేము గీమాడిన దినాలు యాదికచ్చినయి.
గుడ్లల్ల నీళ్ళు గిర్రున తిర్గినయి.
అన్నీ ఇచ్చిన అమ్మీ మమ్మల్ని కేవలం గా కల్లు మాత్రమే కోరుతున్నది. బంగారం బటువలు అస్సలు అడుగది. కల్లు తాగుడు తప్పు ఎట్ల అయితది ?
హదీస్ చెప్పనట్టు షరాబ్ హరామ్. చెట్టునుంచి అచ్చే కల్లు హరామ్ ఎట్ల అయితదని నేను ఇప్పుడిప్పుడే ప్రశ్నించుకుంటున్న.
కల్లుల గుల్ ఫారం కల్పతే అది పానానికి మంచిదిగాదు, సాంప్రదాయం లెక్కన జూస్కున్నా మంచిదిగాదు.
వాళ్ళు వీళ్ళు, కోడండ్లు అన్నట్టు నేను కల్లు తాగుతే నర్కానికి పోతాన్ర కొడ్కా?

నేనేం పాపం జెయ్యలే. మీకోసం జిందగీ మొత్తం కష్టానికి రైనువెట్టిన గదా అని అమాయకంగా అంటుంటే నా గుండెలో గుణపంతో పొడిచినట్టయ్యేది.
ఊకే ఏం అల్వాటు అమ్మీ కల్లు తాగుడు మానేస్తె గాదు? అని నేను గూడ అన్నగనీ తర్వాత అర్థంజేసుకునుడు సురువుజేశిన.
నా పెండ్లాం పిల్లలను నడ్పుకున ఒక మొగోన్నై ఎంత కింద మీద వడ్తున్న.. మరి ఒక ఆడిదై వుండి అమ్మీ మా ముగ్గుర్ని ఎట్ల సాదింది ? సదివిచ్చింది ? పెండ్లీలు పేరంటాళ్ళు ఎట్ల జేశింది ? ఒంటిగ యుద్ధమే జేశిన వీర వనిత అమ్మీ. పుట్టెడు కష్టాలు మరిచిపోనీకి గా గుక్కెడు కల్లు తాగుడు తప్పే కాదనిపిచ్చింది.
ఇగ ఆన్నుంచి నేను అమ్మీ కోసం మారిన.
కల్లు తాగే అల్వాటు లేదుగనీ అమ్మీకోసం దినాం ఆఫీస్ ఐపోంగనే బైక్ మీద మందు కల్పని తాజా చెట్టు కల్లు కోసం నానక్‌రాంగూడ సైడ్ పోయి ఒక బాటిల్ తెచ్చిస్తే దినాం పొద్దిమీకి ఒక గిలాస కల్లు తాగుతది. తుర్తిగ పండుకుంటది.
నేనుండె టోలీచౌకీ ఏరియాల మంచి కల్లు దొర్కది.
ఎప్పుడన్న కల్లు దొర్కన్నాడో, ఆఫీస్ ల లేట్ అయి కల్లు తేకపోతే ఆయాల్ల అమ్మీ ముఖం గుంజుకపొయ్యేది.
అలిగేది.
* * *
గుంభనంగా ఇంటికి పోయిండు. ఇంట్లకు అడుగు పెట్టంగనే అమ్మీ దినాం మాదిరి తన బ్యాగ్ వంక ఆశగా చూసింది. తనూ అమ్మీని చూస్తూ తెచ్చానన్నట్టు కండ్లతోనే సైగజేసి లోపలికి పోయిండు. అమ్మీ అంతలోనే తన ముఖం మాడ్చుకునుడు నయీం చూపులు దాటిపోలేదు.
లోపటి రూంలకు పోయిండు పిల్లలిద్దరూ ఆడుకుంటున్నరు. షమీం దురూద్ చదువుకుంటున్నది.
పిల్లలు తనను చూడగానే అబ్బూ తనకోసం ఏం తెచ్చాడా అని అల్లరిచేస్తూ అల్లుకుపోయారు.
వాళ్ళను ఎత్తుకుని కాసేపు లాలించి బ్యాగ్‌లో నుంచి చాక్లెట్లు, బిస్కెట్లు వారి చేతిలో పెట్టాడు.
మళ్ళీ హాల్లోకి వచ్చి తన బ్యాగులో వున్న కల్లు ప్యాకెట్ తీసి, గ్లాసులో పోసి అమ్మీకి ఇచ్చాడు.
దాన్ని చూడగానే అమ్మీ ముఖంలో వెలుగు.. అంతలోనే ఆవిరవుతున్న ఛాయలు.
నయీం బాత్‌రూంకి వెళదామని టవల్ తీసి వెళ్తుండగా అమ్మీ ఆ గ్లాసు కల్లును సింక్‌లో గుమ్మరిస్తుండటం చూసి షాకయ్యాడు.
స్నానం చేసి వచ్చి అమ్మీతో తీరంగా మాట్లాడదామని వెళ్ళాడు.
కాసేపటికి స్నానం ముగించుకుని వచ్చాడు.
మిగిలివున్న కల్లు ప్యాకెట్టు డస్ట్ బిన్‌లో వుంది.
అదిచూసి నయీం స్థాణువులా బిగుసుకుపోయాడు.

కోపంగా షమీం అని అరిచిండు.
షమీం వచ్చింది.
ఏందిది
నేనే పారేశిన
ఎందుకు
హరామ్(నిషిద్ధం) వస్తువులు తెస్తే ఇంట్ల బర్కతి ఉండదు. పైగా ఇది రంజాన్ నెల. నేను ఒక్కపొద్దులు వుంటున్న. అందుకే పారేస్తున్నా
షమీం మాటలతో నయీంకి మొత్తం అర్థమైపోయింది. నెలరోజుల నుంచి అమ్మీకు కల్లు బ్యాన్ చేసింది షమీమే అని అర్థమైంది. ఈ విషయంలో కోడలు అత్తను భయపెట్టినట్టు ద్యోతకమైంది.
ఊకో.. హరామ్ అంట హరామ్.. మనిషి కన్న ఎక్వనా?
అవును.. మన కోరికలను అదుపులో వుంచుకోవాలి. నమాజ్ సదవాలి, దువా చెయ్యాలి అమ్మీను, నయీంను హీనంగా చూస్తూ మాట్లాడుతున్నది షమీం.
హలాల్(అనుమతించబడింది), హరామ్ అనుకుంట కూసుంటే ఈ ప్రపంచంల మనం ఏ పని చెయ్యలేం అర్థమైందా? మనిషిగా ఆలోచించు కట్టుబాట్లు అనుకుంట తల్లి చిన్న కోరికను తీర్చలేకపోవడం కన్నా పెద్ద హరామ్ పని వేరేది వుండదు కోపంగా మాట్లాడుతున్నాడు నయీం.

మధ్యలో అమ్మీ అందుకుంది.
పోనియ్ బేటా.. నాకోసం మీరిద్దరు ఎందుకు గీసులాడుకుంటరు. నేను కల్లు తాగ ఇగ
నవ్వు ఊకో అమ్మీ.. వీళ్ళకి సాంప్రదాయాలు బాగా తలకెక్కి అవి పైత్యంగా మారినయి. అసుంటోళ్ళకు వేరే మనుషులు పశువుల లెక్క కానస్తరు. వాళ్ళకేదో అల్లాహ్ జన్నత్ (స్వర్గం) టికెట్ ఇచ్చేశినట్టే పోకట జూపిస్తుంటరు.
ఎవర్కీ తెలవని అల్లాహ్ కోసం తెలిసిన మనుషులను సాధిస్తుంటరు ఇసుంటోళ్ళే. అయినా మీదికి వోయినంక ఎవరి జవాబ్ వాల్లే ఇచ్చుకుంటరు గదా.. మరి ఈల్లకేంది నొప్పి? ఆక్రోషంతో ఊగిపోతున్నాడు నయీం.
వెంటనే షమీం అందుకుంటూ..శెప్పంగ ఇననోళ్ళను శెడంగ సూడాలంటరు అంది.
అట్లనా.. సరే ఒక సవాల్ అడుగుత జవాబియ్యు ఇగ.
మీ నాయిన ఏం జేస్తడు?
చిట్టీల కారోబార్ జేస్తడు
ఎన్నేండ్ల సంది?

నేను పుట్టకముందునుంచే
అయితే మీరు ఇంతవరకు తిన్నది, తాగింది, తొడిగిందంత హరామ్ సొమ్మే
అట్ల ఎట్ల అయితది?
ఎందుగ్గాదు.. ఆల్ల పైసల మీద ఈల్ల పైసల మీద మునాఫా(కమీషన్) కొట్టుడు హరామ్ గాకపోతే హలాలా? మిత్తి పైసలు తినుడు హరామ్ అని హదీస్ చెప్తున్నది గదా. నీ లగ్గం, మీ అన్నదమ్ములై, అక్కచెల్లెండ్లయి లగ్గాలు గా హరాం సొమ్ముతోనే చేశిండు
మీరంత ఉల్ట మాట్లాడుతున్నరు
మీరు జేస్తే రాజ పని, మంది జేస్తే లత్కోర్ పని గదా ? నీ ఇద్దరు అన్నలు రియలిస్టేట్ బిజినెస్ జేస్తున్నరు గదా అది గూడ హరామే. రూపాయి పెట్టబడి వెట్టి నూరు రూపాలు సంపాంచుతున్నరు గదా.
ఇంకోటి చెప్పుడు మరిశిన మీకు తెల్వకుంట మీ అయ్య, అన్నలు మస్తు బీర్లు, బ్రాండీలు తాగుతరు
అంటున్న నయీం కళ్ళు ఎర్రబడ్డాయి.
వాళ్ళు అవన్నీ చేశినా నమాజులు, జకాత్‌లు చేస్తరు. మీ అమ్మ ఏం జేస్తది?

నయీం ఒక్కసారిగా నవ్వాడు. ఆడుకుంటున్న పిల్లలు తండ్రినే చూస్తున్నారు.
లంగ పనులన్ని జేశి అల్లా నన్ను మన్నించని మజీద్ కు పోంగనే సరిపోయిందా ? ఆల్లకన్న ఏ పాపం జెయ్యకుండ నమాజ్ చెయ్యని మా అమ్మీ అసుంటోళ్ళే గొప్ప. అయినా అమ్మీ జుమ్మా నమాజ్ సదువుతది. ఇంకేమన్నవు.. మా అమ్మీ ఏం జేశిందా? తన బతుకును మాకోసం త్యాగం జేశింది. మీ చాచా వున్నడుగదా నడిగూడెపాయిన. ఆయినకు ఇద్దరు పిల్లలు అయినంక పెండ్లాం సచ్చిపోయింది. యాడాది తిర్గకముందే ఇంకొగామెను నికా జేస్కున్నడు. కనీ మా అమ్మీ గట్ల జెయ్యలేదు. మంచి వయసుల ఉన్నప్పుడే పప్పా కాలంజేస్తే అమ్మీ ఏరే షాదీ జేస్కోలె. అట్లనే వున్నది మాకోసం. నాకింకో డౌటేందంటే అమ్మీ ఇంకో లగ్గం జేస్కోకపోవడానికి కారణం తనకు జరంత తెలిసిన సాంప్రదాయమే గావచ్చు. సూశినవా సాంప్రదాయాలకు విలివిచ్చి ఎంతమంది ఎన్నిరకాలుగా నష్టపోతున్నరో? ఆ ముసుగుతోనే మూర్ఖులుగా మారుతున్నరు నీలెక్క అంటున్న భర్త ముఖంలోకి ఉడికిపోతూ చూసింది షమీం.
అవును మేము మూర్ఖులమే. మీరే మంచోళ్ళు గదా.. అత్తమ్మ బాధ్యతలు తీరిపోయినయి ఆమెను హజ్‌కు తీస్కపొమ్మంటే పైసల్లేవంటున్నరు. ప్రతీ ముసల్మాన్ హజ్ చెయ్యాలని హదీస్ చెప్తున్నది

మనుషులకు సాయం జెయ్యుండ్రి, వాళ్ళకు సాయపడుండ్రని ఖురాన్ చెప్తున్నది. కనీ మీరంత ఇంటి ముంగట్కి బిచ్చపోడు వస్తే బిచ్చం ఎయ్యరు. ఎందుకంటే బిచ్చం ఏసుట్ల గూడ వాడు మన కులపోడా కాదా అని జూస్తున్నరు
మీ పెద్దమ్మ హజ్ చేశింది, మీ మర్మన్న అన్నలు గూడ ఉమ్ర చేశివచ్చిర్రు. చెహ్రా(గడ్డాలు) పెంచిర్రు. నమాజ్, జమాత్‌లు అనుకుంట దీన్‌ల ఎక్క వుంటరు తెల్సా
తెల్సు తెల్సు.. ఎందుకు తెల్వది. మా హక్కును గుంజుకున్నరు వాళ్ళు, చట్టం దృష్టిల మేము ఫలానోని పెండ్లాం పిల్లలమని కాకుండ జేశిర్రు. పప్పా సంపదనతోని బిజినెస్‌లు, కొలువులు. అసుంటోళ్ళు ఎన్ని హజ్‌లు చేశినా పాపాత్కులే.
చేశిన పాపాలు కడుక్కున్న వాళ్ళు గవన్నీ జేస్తున్నరు. దీన్ పేరుతోని స్వర్గాన్ని కొట్టేయ్యాలని సూశే రకాలవి.
అల్లాహ్ అనేవాడుంటే అన్యాయం అయిపోయిన మాకు స్వర్గమే ప్రాప్తిస్తడేమో.
ఇంతవరకు మా పప్పా ఖబర్ (సమాధి) ఎక్కడుందో తెల్వది. మాకు తెల్వనియ్యరు. తెలుస్తే మల్ల పాలు పంచుకుంటమని వాళ్ళ భయం. మాకుండదా రంజాన్, బక్రీద్ పండుగులకు పోయి పప్పా ఖబర్ మీద ఇన్ని పూలు ఏశి రావాలని? అసుంటి మూర్ఖులు ఎన్నిజేశినా ఫుజూలె అంటున్న భర్త ముఖంలోకి చూడకుండా విసురుగా లోపలి గదిలోకి వెళ్ళిపోయింది షమీం.

అమ్మీని చూస్తున్న నయీం కళ్ళు చెమ్మగిల్లాయి.
అమ్మీ ఈ ఇల్లు నీది. నువ్వు ఎవరికి భయపడాల్శిన అవుసరం లేదు. గిలాసెడు కల్లు కోసం నువ్వు ఎవరి ముందు లాచార్ గావాల్సిన అవుసరం లేదు. నీ లెక్కట ఎండల ఎన్పలెక్కట మలమల మాడుకుంట కష్టవడితే నువ్వేందో వాళ్ళకు అర్థమయ్యేది. కడ్పుల సల్ల కదలకుంట ఇండ్లల్ల కూసుండి మస్తు మాట్లాడ్తరు ఇసుంటోళ్ళు. నువ్వు వాళ్ళ మాటలు పట్టిచ్చుకోకు అంటూ గ్లాసులో కల్లు అందించాడు.
అమ్మీ సంశయిస్తూనే గ్లాసు అందుకుంది.
కానీ కల్లు అమ్మీ గొంతు దిగలేకపోతున్నది. గడిగడికి కోడలు గది దిక్కు రందివోయి చూస్తున్నది.
మనసులో ఏమనుకున్నదో లేచి ఆ కల్లును సింకులో గుమ్మరించి వచ్చి అటు మొఖం పెట్టుకొని ముదురుకొని పడుకున్నది. అమ్మీని అంత నిస్సహాయంగా చూసి నయీం మనసు చివుక్కుమన్నది.
* * *
వారం గడిచింది. నయీం కల్లు ప్యాకెట్ తెచ్చుడు.. అమ్మీ సింకులో గుమ్మరించుడు అయితున్నది.
అమ్మీ కల్లు తాగుతలేదని నయీంకు అర్థమైంది గనీ ఏం చెప్పలేకపోతున్నాడు.
మనసులో మాత్రం మెరమెర పెట్టుకున్నడు.
ఆ రోజు ఏ ఫరిష్తా వచ్చి షమీం మనసును కడిగిండో.
నయీం ఆఫీస్ నుంచి రాగానే సంకకెల్లి బ్యాగ్ అందుకున్నది. కల్లు ప్యాకెట్ తీసి గ్లాసులో పోసి అత్తకు ఇచ్చింది.
అది చూసి నయీం జరుగుతున్నది కలనో నిజమో తెల్సుకోలేకపోయాడు? కండ్లు నులుముకొని చూశాడు.
అమ్మీ కూడా కోడలి చర్యకు బీరిపోయి చూస్తున్నది.
అమ్మీ.. అమ్మీ.. ఇగో తీస్కో. ఇయాలటి సంది నువ్వు ఎవరికి భయపడాల్సిన అవుసరం లేదు, తాగు అంటూ గ్లాసు అందించింది. అమ్మీ కొడుకును చూసింది. నయీం కండ్లల్లో ఆనందభాష్పాలు చూసి గ్లాసు అందుకున్నది.
షమీం లోపలికి వెళ్ళింది. ఆమెను అనుసరిస్తూ నయీం గదిలోకి వెళ్ళాడు.

షమీం నువ్వేనా? అన్నాడు.
అవును నేనే. నా మొగోడు, అత్త ఖుషీ కన్న నాకు ఏది ఎక్వగాదు. హలాల్ హరామ్ అనుకుంట ఎంతమంది రీతి తప్పిన బతుకులు బతుకుతున్నరో సమజైంది. చెప్పేటియి శ్రీరంగనీతులు దూరేటియి దొమ్మరి గుడిశెలు. మంచి మనసున్నది అత్తమ్మ. ఎంతో కష్షవడి బంగారమసుంటి నిన్ను పెంచి పెద్దజేశి నాకు భర్త అనే కన్నా వరంగ ఇచ్చింది అనాలె. నన్ను ఏనాడు కోడలు లెక్క సూడలేదు. కన్నబిడ్డె లెక్కనే సూశింది. అసుంటి మంచి అమ్మీను నేను గా కల్లు విషయంల తక్వజేశి మాట్లాడుడే హరామ్ అనిపిచ్చింది షమీం గొంతుల జీర.
షుక్రియానే.. నన్ను అర్తం జేస్కున్నందుకు షమీంను గాఢంగా అలుముకున్నడు నయీం.
కనిపించని జన్నత్ కోసం బతుకులు దోజఖ్ (నరకం) జేస్కునుడు సుత ఇష్టం లేదు నాకు అంటూ తన రెండు చేతులతో నయీం వీపును గట్టిగా ముడివేసింది షమీం.
Haram1

రచయిత పరిచయం

హుమాయున్ సంఘీర్ ఊరు కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం గోపాల్‌పేట్. ఇప్పుడు హైదరాబాద్‌లో ఉంటూ ఓ వెబ్ చానెల్‌లో ఉద్యోగం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి రాసే అభిరుచి ఉన్న సంఘీర్ సినిమాలకు పనిచేయాలని హైదరాబాద్ వచ్చారు. కొన్ని సినిమాలకు రచనా సహకారం అందించడంతో పాటు మరికొన్ని సీరియళ్లు.. సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన అనుభవం ఉంది. వివిధ పత్రికలలో కలుపుకొని ఇప్పటివరకు ఆయన రాసిన 25 కథలు ప్రచురితం అయ్యాయి. వెబ్ చానెల్స్ హవాను గుర్తించిన సంఘీర్ షార్ట్ ఫిలిమ్స్.. వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ గుర్తింపు పొందారు. ముఖ్యంగా మూలుగుబొక్క, ఏం బతుకురా నీది, తంగేడుపూలు వంటి లఘుచిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చాయి. ఇటీవల విడుదలైన దొరసాని సినిమాలో కామ్రేడ్ యాదగిరిగా వెండితెరపై కనిపించాడు.

పక్కా ముస్లిం అనుకునేటోళ్ళకు వీళ్ళంతా పక్కా దుష్మన్‌లు. వాళ్ళు నమాజులు చేసి, రోజాలు వుండి, ఫిత్రేలు, జకాత్ లు ఇచ్చి ఇస్లాంను గౌరవిస్తున్నట్టు, వీళ్ళు కష్టంజెయ్యంది కడుపులకు రాదనుకునే బడుగుజీవులు వాళ్ళ దృష్టిల ఇస్లాంకు వ్యతిరేకులు?? ఎవరెన్ని అన్నా తన పని తనది అంతే. సాంప్రదాయవాదుల ఎదుట అమ్మీ ఎప్పుడూ ఓ దోషిలా ముఖానికి కొంగు అడ్డం పెట్టుకొని బతుకు పోరాటం జేస్తున్నది.

అవును మేము మూర్ఖులమే. మీరే మంచోళ్ళు గదా.. అత్తమ్మ బాధ్యతలు తీరిపోయినయి ఆమెను హజ్‌కు తీస్కపొమ్మంటే పైసల్లేవంటున్నరు. ప్రతీ ముసల్మాన్ హజ్ చెయ్యాలని హదీస్ చెప్తున్నది మనుషులకు సాయం జెయ్యుండ్రి, వాళ్ళకు సాయపడుండ్రని ఖురాన్ చెప్తున్నది. కనీ మీరంత ఇంటి ముంగట్కి బిచ్చపోడు వస్తే బిచ్చం ఎయ్యరు.

876
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles