పల్లెకు ప్రగతి శోభ


Sun,October 6, 2019 01:46 AM

village-development-plan
పల్లె గొప్పదా? పట్నం గొప్పదా? అని ఒకప్పుడు ఉపన్యాస పోటీలు పెట్టేవారు. పట్నాల్లో ఉండే పిల్లలు సైతం పల్లె గొప్పదనం గురించి మాట్లాడేవారు. ఎందుకంటే పల్లెలంటే గౌరవం, మమకారం. కానీ గత ప్రభుత్వాలు పల్లెల గురించి ఎన్ని మాటలు చెప్పినప్పటికీ వాటి విచ్ఛిన్నానికి దారితీసే విధానాలనే అమలు చేశాయి. నగరీకరణకు, పట్టణీకరణకు దారులు సుగమం చేశాయి. దీంతో వ్యవసాయం దెబ్బతిన్నది. వృత్తులు నాశనమయ్యాయి. వాటిని అంటిపెట్టుకొని వున్న శ్రమైక జీవన సంస్కృతి ప్రాభవాన్ని కోల్పోయింది. అందుకే స్వరాష్ట్రంలో మన ప్రభుత్వం ఈ జాఢ్యాలను తొలగించి కొత్త విధానాలతో ప్రగతికి పట్టం కట్టింది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో జరిగిన జీవన విధ్వంసం సృష్టించిన దుష్పరిణామాలను అధిగమించడానికి,
వర్తమాన సామాజిక స్థితిగతులకు సరిపోయే నూతన చట్టాలను ప్రభుత్వం అమలులోకి తెస్తున్నది. సమున్నత లక్ష్య సాధన కోసం సాగుతున్న ఈ ప్రగతి ప్రస్థానంలో అందరినీ భాగస్వాములను చేస్తున్నది. అవుతున్నారు. నెల రోజుల నుంచి ఇవ్వాళ్టి వరకూ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ‘30 రోజుల ప్రణాళిక’ ఫలితాలు మన కండ్ల ముందున్నాయి. ఇలాంటి ప్రణాళికలతో భవిష్యత్తును సుందరంగా నిర్మించుకోవడానికి ప్రజలు చైతన్యవంతులవుతున్నారు. ఇట్లా దీర్ఘకాలికంగా తెలంగాణను వెంటాడుతున్న సమస్యలకు ప్రభుత్వ విధానాలతో శాశ్వత పరిష్కారాలను సాధించుకొంటున్నం. ఆదర్శవంతమైన పాలనతో దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాం.

- తంగళ్లపల్లి సంపత్‌, నమస్తే తెలంగాణ స్టేట్‌ బ్యూరో
సెల్‌: 9182777029

village-development-plan1
సర్కార్‌ పిలుపునిచ్చిన ‘30 రోజుల ప్రణాళిక’కు మంచి స్పందన వచ్చింది. అధికారులు, నాయకులు, ప్రజలంతా అభివృద్ధి పనుల్లో, పారిశుధ్య నివారణ పనుల్లో హోరాహోరీగా నడుంబిగించారు బహిరంగ మల, మూత్ర విసర్జనకు తెర పడింది. వీధుల వెంట ఉండే మురికి కాల్వలు పరిశుభ్రమయ్యాయి. వీధులు మొక్కలతో పచ్చదనం పర్చుకుంటున్నాయి. విద్యుద్దీపాలతో పల్లెలు వెలుగుతున్నాయి. ప్రమాదకరంగా ఉండే ఇనుప స్తంభాలు తొలిగిపోయాయి. గతంలో లేని విధంగా ప్రణాళిక సైన్యం గ్రామాల్లో శ్రమదానాలు, పారిశుధ్య పనుల్లో, మొక్కలు నాటడంలో భాగస్వామ్యం అయ్యారు.
village-development-plan2

అందుకే ప్రగతి ప్రణాళిక

సుపరిపాలన కోసం, అవినీతిని అంతమొందించడం కోసం గతంలో ఉన్న చట్టాలు సరిపోవని నూతన పంచాయతీ రాజ్‌ చట్టాన్ని, నూతన పురపాలక చట్టాన్ని మన ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏండ్ల నుంచి నిధులు లేక, అభివృద్ధి లేక తల్లడిల్లిన తండాలు, గూడెంలు, శివారు గ్రామాలకు పంచాయతీ హోదా వచ్చింది.
village-development-plan3

కలిసికట్టుగా.. గ్రామ స్టాండింగ్‌ కమిటీలు

కొత్త చట్టం ద్వారా ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడానికి గ్రామాల్లో స్ఫూర్తిమంతమైన కమిటీలు ఏర్పాటయ్యాయి. 15 మందికి తక్కువ కాకుండా నాలుగు స్టాండింగ్‌ కమిటీలను ఎన్నుకున్నారు. పంచాయతీ వార్డు సభ్యులతో పాటు గ్రామానికి చెందిన యువతీ యువకులు, విద్యావంతులతో కమిటీలు ఏర్పాటయ్యాయి. ఇప్పటి వరకూ స్టాండింగ్‌ కమిటీలంటే కేవలం జిల్లా పరిషత్‌లో మాత్రమే కనిపించేవి. జడ్పీటీసీ, ఎంపీపీలతో స్టాండింగ్‌ కమిటీలను ఏర్పాటు చేసి, జిల్లా స్థాయిలో ఆయా పనుల నిర్వహణపై చర్చించేవారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పంచాయతీ రాజ్‌ చట్టంతో గ్రామస్థాయిలో స్టాండింగ్‌ కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు ఇస్తుంది. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత గ్రామస్థాయిలో అందరి మీదా ఉన్నది. ప్రజలందరి భాగస్వామ్యంతోనే గ్రామాల రూపురేఖలు మారుతాయి.
village-development-plan4

స్పష్టత అవసరం

అభివృద్ధి ప్రణాళికలను స్పష్టంగా అమలు చేయాలంటే మౌలిక విషయాల పట్ల స్పష్టత అవసరం. గ్రామ పంచాయతీ అంటే సర్పంచ్‌ మాత్రమే అని , సర్పంచే సర్వాధికారి అనే భావన తప్పు. సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులు అంతా కలిస్తేనే గ్రామపంచాయతీ. ప్రజల విస్తృత భాగస్వామ్యం ప్రతిఫలించే గ్రామ పాలనావిధానం కోసం అనేక ప్రగతిదాయక మార్పులు చట్టంలో చోటుచేసుకున్నాయి. సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులతోపాటు ప్రతి గ్రామ పంచాయతీలో ముగ్గురు కో ఆప్షన్‌ సభ్యులుంటారు. కొత్త చట్టంలోని సెక్షన్‌ 7(3) ప్రకారం గ్రామాభివృద్ధిపై స్ఫూర్తి కలిగిన విశ్రాంత ఉద్యోగి లేదా సీనియర్‌ సిటిజన్‌ను మొదటి కో ఆప్షన్‌ సభ్యుడిగా, గ్రామంలోని వివిధ సంఘాల అధ్యక్షుల్లో ఒకరిని రెండో కో ఆప్షన్‌ సభ్యుడిగా, గ్రామాభివృద్ధికి విరాళమిచ్చే దాతల్లో ఒకరిని మూడో కో ఆప్షన్‌ సభ్యుడిగా ప్రభుత్వం నియమిస్తుంది. ఓటింగ్‌ హక్కు తప్ప, వార్డు సభ్యులకుండే అన్ని అధికారాలు కో ఆప్షన్‌ సభ్యులకుంటాయి. గ్రామ పంచాయతీకి తగు సూచనలు చేయడానికి, గ్రామాభివృద్ధి పట్ల పట్టింపు కలిగిన గ్రామ పెద్దలతో వేసే స్టాండింగ్‌ కమిటీలు ఉంటాయి. చట్టంలోని సెక్షన్‌ 49 ప్రకారం పారిశుధ్య నిర్వహణకు, వీధి దీపాల నిర్వహణకు, మొక్కల పెంపకానికి, తదితర పనులకు ప్రత్యేక కమిటీలుంటాయి. ఇట్లా నాలుగు రకాల స్థాయీ సంఘాలుంటాయి. ఒక్కో సంఘంలో గ్రామ జనాభాను బట్టి 15 లేదా 20 లేదా 30 మంది సభ్యులుంటారు. అన్ని స్థాయీసంఘాల్లో కలిపి 60 నుంచి 120 మంది వరకు సభ్యులుంటారు. వారికి అప్పగించిన అన్ని విషయాలను సమీక్షించే అధికారం ఈ కమిటీలకు ఉంటుంది. ఈ కమిటీలుచేసిన సూచనలను కచ్చితంగా పరిశీలనలోకి తీసుకోవాలనే నిబంధన సెక్షన్‌ 49 (3) ద్వారా పేర్కొన్నారు. 26 గ్రామ కమిటీల ద్వారా ఆదర్శగ్రామంగా రూపుదిద్దుకున్న వరంగల్‌ జిల్లా గంగదేవిపల్లిని స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వం ఈ కమిటీల ఏర్పాటుకు పూనుకొన్నది.
village-development-plan5

ఓ పద్ధతి ప్రకారం ..

ప్రత్యేక కార్యాచరణలో ఆదర్శవంతమైన విధానాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రణాళికా విధానాలు గ్రామసభల ఆమోదం పొందాలి. దానికి అనుగుణంగానే స్థానిక సంస్థలు నిధులు ఖర్చు చేయాలి. తద్వారా పల్లెలు, పట్టణాలు ఓ పద్ధతి ప్రకారం ప్రగతి సాధించడానికి సరైన దారి ఏర్పడుతుంది. పల్లెలను ప్రగతి కేంద్రాలుగా, ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా పంచాయతీ రాజ్‌ విభాగాన్ని సంస్థాగతంగా బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.గ్రామాభివృద్ధి లక్ష్యాలను నెరవేర్చడం కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు మరింత నిబద్ధతతో, కార్యదీక్షతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం పొందేలాగా సేవలందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది.
village-development-plan6

పల్లె జీవనానికి ప్రోత్సాహం

గ్రామీణ పరిశ్రమలకు, చేతివృత్తులకు ప్రభుత్వం విశేషమైన ప్రోత్సాహం ఇస్తున్న విషయం కండ్ల ముందట కనిపిస్తున్నది. నేత, గీత తదితర వృత్తి సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. అన్ని వర్గాల ప్రజల పండుగలకు ప్రభుత్వం సమాన హోదా కల్పించింది. అందరి మనోభావాలను గౌరవిస్తూ, ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిరక్షిస్తున్నది. దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలకు చెందిన పిల్లలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన కార్పొరేట్‌ స్థాయి విద్య అందించడానికి 906 గురుకుల పాఠశాలలు నిర్వహిస్తున్నది. ఈ విషయంలో మనం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాం.

ఉమ్మడి రాష్ట్రంలో పల్లెలు సమగ్ర అభివృద్ధికి నోచుకోలేదు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం నూతన పంచాయతీ రాజ్‌ చట్టం ద్వారా కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసింది. ఏండ్ల నుంచి నిధులు లేక, అభివృద్ధి లేక తల్లడిల్లిన తండాలు, గూడెంలు, శివారు గ్రామాలకు పంచాయతీ హోదా వచ్చింది.
village-development-plan7
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో గ్రామపంచాయతీలు : 8,684.
తెలంగాణలో ఏర్పాటైన కొత్త గ్రామపంచాయతీలు : 4383
మొత్తం గ్రామ పంచాయతీలు : 12,751
తండాలు, గూడెంలు : 2551
వందశాతం గిరిజనులున్న గ్రామపంచాయతీలు : 1326
షెడ్యూల్‌ గ్రామపంచాయతీలు : 1311


రాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయతీలు ఆవిర్భవించిన తొలినాళ్లలోనే నిధులు మంజూరయ్యాయి. 14వ ఆర్థిక సంఘం నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించింది.

గ్రామపంచాయతీ నిధులు

- అట్లా తొలిసారి అన్ని గ్రామపంచాయతీలకు అందిన నిధులు : రూ. 1132 కోట్లు .
- వీటి ద్వారా జనభా ప్రాతిపాదికన ప్రతిగ్రామానికి అందే నిధులు : రూ. 3 లక్షల నుంచి రూ. 20 లక్షలు వరకూ..
- 30 రోజుల ప్రణాళికలో భాగంగా అన్ని గ్రామపంచాయతీలకు సెప్టెంబర్‌లో అందిన నిధులు : రూ. 339 కోట్లు. వీటిని ప్రతినెలా అందిస్తారు.
- ఈసారి బడ్జెట్‌లో పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు కేటాయించిన మొత్తం బడ్జెట్‌ : రూ.18,237 కోట్లు
- దీనిలో ప్రగతి పద్దు : రూ.14,165 కోట్లు
- గ్రామ పంచాయతీల కోసం బడ్జెట్‌ : రూ. 2714 కోట్లు
- మున్సిపాలిటీలకు : రూ. 1764 కోట్లు

village-development-plan8

గ్రామాలకు పౌరసేవ కేంద్రాలు

కేవలం జిల్లా, మండల, పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ఈ-సేవ, మీ-సేవ కేంద్రాల సేవలు పల్లె సమగ్ర సేవా కేంద్రాల (ఈ-పంచాయతీ) ఏర్పాటుతో గ్రామాల్లోకి విస్తరించాయి. డిగ్రీ అర్హతగల యువతను ఎంపికచేసి వారికి ఐటీశాఖ ద్వారా ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి శిక్షణ ఇచ్చారు.
village-development-plan9
ఇంటర్నెట్‌ సేవలు : ప్రస్తుతం బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్టివిటీ అందుబాటులో ఉన్న పంచాయతీల్లో పల్లె సమగ్ర కేంద్రాల పేరుతో ఈ-పంచాయతీల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా రాష్ట్రంలోని బిజినెస్‌ కరస్పాండెంట్‌ (బీసీ) కేంద్రాల్లో బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని కల్పించి, పంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాటు చేశారు.రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది.
village-development-plan10
ఈ- పంచాయతీల ద్వారా సేవలు: జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ, వాటిలో పత్రాల్లో సవరణలు, పిల్లల పేర్ల మార్పు, ఇంటిపన్ను, బ్యాంకుల అర్థిక సేవలు, స్వయం సహాయక సంఘాల ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ, ఆసరా పింఛన్ల చెల్లింపులు, ఉపాధి హామీ పథకం చెల్లింపులు, మీ-సేవ కేంద్రాల సేవలు, ఇతర ప్రభుత్వ సేవలు.

మీ-సేవ, ఈ-సేవ ద్వారా 24 సేవలు : పౌరుల వద్దకే ప్రభుత్వ సేవల నినాదంతో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా మీ-సేవ, ఈ-సేవ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిద్వారా రాష్ట్రంలో వేలమందికి ఉపాధి లభించడమేకాకుండా విస్తృతంగా పౌరసేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఇవి 30 రకాల సేవలను అందిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 24 రకాల సేవలు, గ్రేటర్‌ హైదరాబాద్‌లో అదనంగా మరో 6 రకాల సేవలు అందిస్తున్నాయి.
village-development-plan11

ప్రజలు తలుచుకుంటే..

పచ్చదనం, పరిశుభ్రత, అభివృద్ధితో పల్లెలు కళకళలాడాలని, తెలంగాణ గ్రామాలు అభ్యుదయ, ఆదర్శ గ్రామాలుగా రూపుదిద్దుకోవాలనే సంకల్పం ప్రభుత్వం పెట్టుకుంది. అందుకే కొత్త చట్టాన్ని రూపొందించింది. గ్రామ పాలనలో గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చేందుకు, గ్రామాలు బాగుపడాలనే ఏకైక లక్ష్యం సాధించడంకోసం చేసిన చట్టంలో, రాష్ట్ర ప్రభుత్వం తన అధికారాలకు కూడా కత్తెర విధించుకొని చిత్తశుద్ధిని ప్రదర్శించింది. కాబట్టి నిబద్ధతతో అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలి. ప్రభుత్వంతో పాటు పౌరులూ పని చేయాలి. ఉద్యమ స్పూర్తితో పనిచేస్తే తప్పక మంచి ఫలితాలు వస్తాయి. దీనికి ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి. ప్రజల భాగస్వామ్యంతోనే వరంగల్‌ జిల్లా గంగదేవిపల్లి ఆదర్శ గ్రామమైంది. ఆ గ్రామంలో 26 గ్రామ కమిటీలున్నాయి. నిజామాబాద్‌ జిల్లా అంకాపూర్‌ గ్రామం అభివృద్ధికి, ముఖ్యంగా మహిళా సాధికారతకు సాక్ష్యంగా నిలబడింది. అట్లాగే తెలంగాణలో ప్రజల కృషితో ఆదర్శంగా మారిన గ్రామాలున్నాయి. అవే ఇవి..

మద్యం అమ్మరు : 2014లోనే మద్యాన్ని పూర్తిగా నిషేధించిన గ్రామంగా వరంగల్‌ రూరల్‌ పర్వతగిరి మండలం కల్లెడ నిలిచింది. కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌ గ్రామంలోనూ మద్య నిషేదం ఉంది. వీటితోపాటు ఎన్నో ఊర్లలో మద్యనిషేధం ఉంది.

ఇంటింటికీ మరుగుదొడ్డి : జనగామ జిల్లా దేవరుప్పుల మండలం గొల్లపల్లి గ్రామంలో ఇంటింటికీ మరుగుదొడ్డి ఉంది, 168 ఇండ్లు, 558 మంది ఓటర్లు ఉన్నారు. బహిరంగ మలవిసర్జనకు దూరంగా ఉండాలని, ఇంటింటికీ వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకున్నారు. ఇటీవల అధికారులే ఓడీఎఫ్‌ పల్లెగా ప్రకటించారు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తున్న గ్రామంగా సర్కారు గుర్తించి.. నిర్మల్‌ భారత్‌ పుస్కార్‌ ఆవార్డును అందజేసింది.

సకల వసతుల మాదాపూర్‌ : 2016-17 ఏడాదిలో రాష్ట్రంలో ఉత్తమ గ్రామ పంచాయతిగా అవార్డు అందుకున్న గ్రామం... కరీంగనర్‌ జిల్లా గన్నేరువరం మండలం మాదాపూర్‌. రైతు కళ్లాలు, ఫాంఫౌండ్‌లు, పశుపాకలు, ఇంకుడుగుంతలు, సీసీ రోడ్లు ఇలా సకల సౌకర్యాలతో ఈ గ్రామం ఆదర్శంగా నిలిచింది.

అక్షరాలు నేర్చుకున్న గ్రామం : వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లి అక్షరాలు నేర్చుకున్న గ్రామంగా నిలిచింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 1084 మంది ఉన్నారు. చదవురాని వారందరికీ విద్యనందించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఇందుకోసం చదువుకున్న వారందరూ బృందాలుగా ఏర్పడ్డారు. చదువుకొని వారిని గుర్తించారు. దత్తత తీసుకొన్నారు. రాత్రి సమయంలో అక్షరాలు నేర్పించారు. వంద శాతం అక్షరాస్యతను సాధించారు. ఈ ఒకటే కాకుండా అనేక అంశాల్లో నూరు శాతం అభివృద్ధితో ఇది ఆదర్శంగా నిలిచింది.

ఇంటర్నెట్‌ గ్రామం : రాష్ట్రంలో మొదటిసారిగా ఇంటర్నెట్‌ అందుకున్న గ్రామం నిజామాబాద్‌ జిల్లా నందిపేట మండలం సిద్ధాపూర్‌. గ్రామంలో నిరక్ష్యరాస్యతను తగ్గించడానికి అందరూ కలిసి పని చేశారు. 95 శాతం అక్షరాస్యతను సాధించారు. ఈ గ్రామం వంద శాతం పన్ను వసూళ్లు, వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణంలో ముందుంది. ఇట్లా ఈ గ్రామాలే కాకుండా రాష్ట్రంలో ఎన్నోగ్రామాలు ఆదర్శానికి ఉదాహరణగా నిలుస్తున్నాయి. ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యంతోనే ఈ ఘనతను సాధిస్తున్నాయి.
village-development-plan12

గ్రామ పంచాయతీ కర్తవ్యాలు

గ్రామాల్లో సేవలను, సౌకర్యాలను గ్రామ పంచాయతీలపై భారం పడకుండా, ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రభుత్వమే నేరుగా కల్పిస్తున్నది. ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నది. వాటిని విజయవంతం చేయాల్సిన కర్తవ్యం పంచాయతీల పై ఉంది.

పారిశుధ్య నిర్వహణ : గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ పంచాయతీలపై ఉన్న ప్రధాన బాధ్యత. చెత్తను ఎత్తేసి, డంపింగ్‌ యార్డులో వేసి, ఆ చెత్తను కంపోస్టు ఎరువుగా పొలాల్లో వినియోగించేలా పంచాయతీలు బాధ్యత తీసుకోవాలి. ఎవరైనా రోడ్డుపై చెత్త వేస్తే రూ.500 జరిమానా విధించే నిబంధన చట్టంలో ఉంది. ప్రజల్లో చైతన్యం కలిగించి, గ్రామాలను అద్దంలా తీర్చిదిద్దాలి.
village-development-plan13
పచ్చదనం : గ్రామంలో మొక్కలు పెంచి, వాటిని రక్షించడం గ్రామ పంచాయతీలకున్న ప్రధాన కర్తవ్యాల్లో మరో ముఖ్యమైన అంశం. గ్రామాలను చెట్లతో, పరిశుభ్రమైన వాతావరణంతో తీర్చిదిద్దాల్సిన బాధ్యత పంచాయతీలదే. ఊరంతా చెట్లతో కళకళలాడాలని సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులు అనుకుంటే చేయలేరా? గ్రామస్థులంతా కలిసి ఊరును పచ్చగా, పరిశుభ్రంగా మార్చుకున్న ఉదంతాలు మన రాష్ట్రంలోనే ఎన్నో ఉన్నాయి. తోటి గ్రామాల్లో సాధ్యమయిన మార్పు, తమ గ్రామంలో ఎందుకు సాధ్యం కాదని ప్రజలంతా ఆలోచించుకోవాలి. గ్రామాల్లో నాటిన వాటిలో 85 శాతం మొక్కలను సంరక్షించాలి. పది మొక్కలైనా, వందమొక్కలైనా సరేవాటిలో 85 శాతం సంరక్షించాలి. వెయ్యి మొక్కలు నాటి, పది మొక్కలను బతికించడంకాదు, నాటే పది మొక్కలైనా బతికించాల్సిందేనని ప్రభుత్వం చెప్తున్నది.

స్వీయ ఆదాయం : గ్రామపంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వాలిచ్చే నిధులతోపాటు పంచాయతీలు స్వీయ ఆదాయాలపై దృష్టి పెట్టాలి. ప్రస్తుత లెక్కల ప్రకారం 500లోపు జనాభా ఉన్న పంచాయతీలకు కనీసం రూ.లక్ష స్వీయ ఆదాయం, మేజర్‌ పంచాయతీలకు రూ.4 నుంచి రూ. 5 లక్షల వరకు వస్తుందని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. గ్రామపంచాయతీ విధించే పన్నులు, ఇంటి పన్నులు, ప్రత్యేక పన్ను, ఫ్యాక్టరీలుంటే ప్రైవేట్‌ పన్నులు, వాటర్‌ ట్యాక్స్‌, జాతరలు, తీర్థయాత్రల పన్ను లు, వ్యాపార లైసెన్సుల ద్వారా పన్నులు వసూలు చేసి ఆదాయాన్ని పెంచుకోవచ్చు.

ఇంకా : వీధి దీపాల నిర్వహణ, పన్నుల వసూలులాంటి రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యతలు కూడా గ్రామ పంచాయతీలకుంటాయి. చెట్లకు నీళ్లు పోయడానికి, చెత్త ఎత్తిపోయడానికి గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు సమకూర్చాలనే ఆలోచనను ప్రభుత్వం చేస్తున్నది. నిధుల విషయంలో ఖచ్చితంగా వ్యవహరించే రాష్ట్రం తెలంగాణ తప్ప, దేశంలో మరొకటి లేదు. ప్రజలందరి ఉమ్మడి భాగస్వామ్యంతో గ్రామాభ్యుదయం సాధించేందుకు కొత్త చట్టం ద్వారా ప్రభుత్వం మార్గనిర్దేశనం చేస్తున్నది.
village-development-plan14

ప్రణాళిక-ఫలితాలు

పొదలు, తుమ్మచెట్లు, పిచ్చి మొక్కలను
తొలగించిన ప్రాంతాలు : 2.35 లక్షలు
శ్రమదానం చేసిన పంచాయతీలు : 12,750

వైకుంఠధామాలు మొత్తం: 9484
ఇప్పటి వరకూ నిర్మించినవి : 3789
నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నవి : 5695

డంపింగ్‌ యార్డులు

మొత్తం : 7595
పూర్తయినవి: 2706
తుదిదశలో ఉన్నవి: 1549
ప్రారంభదశలో ఉన్నవి : 3340
నిధులు రూ. 114 కోట్లు మంజూరు.
ఒక్కో డంపింగ్‌ యార్డుకు రూ. 1.50 లక్షలు

పాఠశాలలు, అంగన్‌వాడీలు శుభ్రం

ప్రైమరీ స్కూళ్లు-15వేలు
ప్రాథమికోన్నత పాఠశాలు- 4వేలు
ఉన్నత పాఠశాలలు-4339
శుభ్రం చేసి అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వాస్పత్రులు -4195
10878 ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో శ్రమదానం చేశారు.

శ్రమదానం... పాదయాత్ర

-- అధికారులు ప్రజాప్రతినిధులు పాదయాత్రలు చేసినగ్రామాలు : 12,751
-- బ్లీచింగ్‌ చేసిన వీధులు 1029
-- చదును చేసిన ప్రాంతాలు 63 వేలు
-- పూడ్చి వేసిన వినియోగం లేని బావులు : 25వేలు
-- పల్లెప్రగతిలో పూర్తి చేసిన మరుగుదొడ్లు : 37359
-- తడి, పొడి చెత్త డబ్బాలు పొందిన ఇండ్లు : 20 లక్షలు
-- వేలాడే వైర్లను లాగిన ప్రాంతాలు : 1.45 లక్షలు
-- చెడిపోయిన తర్వాత తొలగించిన విద్యుత్‌ స్తంభాలు : 85 వేలు
-- వాటి ప్రాంతంలో వేసిన కొత్త స్తంభాలు 70 వేలు
-- ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ లైట్లు : 4 లక్షలు

హరితమయం

మొత్తం మొక్కలు : 21.44 కోట్లు
దారుల వెంట నాటిన మొక్కలు: 38,801 కిలోమీటర్లు- 1.08 కోట్లు
బ్లాక్‌ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలు : 3.22 కోట్లు
17,375 సంస్థల పరిధిలో నాటిన మొక్కలు : 38.80 లక్షలు
4.08 లక్షల మంది రైతులకు పంపిణీ చేసిన మొక్కలు : 3.86 కోట్లు

వార్షిక ప్రణాళిక

రాష్ట్రంలోని 12,751 గ్రామాల్లో వార్షిక ప్రణాళిక రూపుదిద్దుకుంది. పల్లె ప్రగతిలో భాగంగా 30 రోజుల ప్రణాళిక అనంతరం 365 రోజుల ప్రణాళికను రూపొందించారు. దీనిలో భాగంగా అన్ని పంచాయతీలు వార్షిక ప్లాన్‌ను ప్రభుత్వానికి అప్పగించాయి. దీనిలో ప్రతీవారం వీధుల్లో, నెలకోసారి గ్రామంలో కలిసికట్టుగా శ్రమదానం చేయాలని తీర్మానం చేసుకున్నారు. అదే విధంగా 12,740 గ్రామాల్లో హరిత ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు.

- సెప్టెంబర్‌ 25 నాటికి పంచాయతీరాజ్‌ శాఖ అందించిన వివరాలు..

గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వ ప్రణాళికలను, గ్రామాన్ని అవగాహన చేసుకోవడం ద్వారా అనేక విషయాలు తెలుస్తాయి. గ్రామీణ ప్రజల అభివృద్ధికి ఏయే అవకాశాలు ఉన్నాయో, పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో అవకాశాలను ఎలా అందుకోవాలో తెలుస్తుంది. అప్పుడు గ్రామీణ ప్రణాళికను రూపొందించుకోవడం సాధ్యపడుతుంది. కాబట్టి గ్రామాభివృద్ధిపై అందరూ
ముందడుగు వేసి గ్రామాలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉంది.

626
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles