నెట్టిల్లు


Sun,October 6, 2019 02:14 AM

జీవితమంటే ఓ ఆసక్తికరమైన కథే. సృజనాత్మకతకు పదును పెట్టి, అక్షరరూపం ఇస్తే అందరినీ ఆకట్టుకుందా కథ. అలాంటి కథలతో లఘుచిత్రాలు తీస్తున్నారు ఈతరం యువత. ప్రేమ, కుటుంబం, జీవితం వస్తువు ఏదైనా కథకు అర్హమే. ఇలాంటి కథావస్తువుతోనే కిందటి వారం యూట్యూబ్‌లో లఘు చిత్రాలు వచ్చాయి.

వరించే ప్రేమిక

దర్శకత్వం: శ్రీకాంత్‌
నటీనటులు : పావని, హరిప్రసాద్‌

రాహుల్‌ సివిల్స్‌కు సిద్ధం అవుతున్న అభ్యర్థి. ఐదో ప్రయత్నంలో కూడా అర్హత సాధించలేక పోతాడు. పరీక్ష రాయడానికి మరో అవకాశం ఉన్నా భయపడతాడు. ఓడిపోతున్నా అనుకుంటాడు. ఈ విషయం అంతా అతని ప్రియురాలు అధ్యకు చెప్పాలని ఆమెను కలుస్తాడు. తన జీవితం, సివిల్స్‌ పరీక్ష, విఫలం అంతా చెప్తాడు. జీవితంలో స్థిరపడకుండా పెండ్లి చేసుకుంటే ఆమెను బాగా చూసుకోలేను అంటాడు. ప్రేమ, పెండ్లి గురించి భయపడతాడు. అప్పుడు అధ్య కలుగజేసుకొని అతనికి ఆత్మవిశ్వాసం నింపుతుంది. సివిల్స్‌లో అర్హత సాధించ లేకపోతే ఇంకా ఏదీ సాధించలేవని అర్థం కాదు. దానికి భయపడి జీవితంలో ఇబ్బంది పడడం సరికాదు. ‘నువ్వు ఓడిపోయినా సరే, మన ప్రేమ గురించి మా ఇంట్లో ఒప్పిస్తాను. మనం కచ్చితంగా పెండ్లి చేసుకుందాం’ అంటుంది. ‘తల్లిదండ్రులను అర్థం చేసుకునే పిల్లలు, పిల్లలను అర్థం చేసుకొనే తల్లిదండ్రులు ఉంటే ఏ ప్రేమా ఓడిపోదు. ఇప్పుడు మన ప్రేమ కూడా ఓడిపోదు’ అని చెప్తుంది. ఇలా నమ్మకం ఉన్న చోట ప్రేమ నిలబడుతుందనే సందేశంతో లఘుచిత్రం ముగుస్తుంది.

Total views 6,741+(సెప్టెంబర్‌ 28 నాటికి)
published on Sep 27, 2019అమరం అఖిలం ఈ ప్రేమ

దర్శకత్వం: గోపి
నటీనటులు : సాగర్‌, భవాని

మూడేండ్ల తర్వాత రాధను కలిసేందుకు వెళ్తాడు గోపి. అంతకు ముందు వాళ్లిద్దరూ ప్రేమికులు. పెండ్లి చేసుకుందాం అనుకుంటారు. అంతా బాగుంది అనుకున్నప్పుడే రాధ వాళ్ల ఇంట్లో ఆమెకు పెండ్లి సంబంధాలు చూస్తారు. కానీ ఆ పెండ్లి రాధకు ఇష్టం ఉండదు. తల్లిదండ్రులు తీవ్రంగా ఆవేదన చెందుతారు. వారి పరిస్థితి ఆమెకు వివరిస్తారు. దీంతో వారిని అర్థం చేసుకున్న ఆమె పెండ్లికి ఒప్పుకోక తప్పదు. ఇట్లా ప్రేమను త్యజించి పెండ్లి చేసుకున్న రాధను కలుస్తాడు గోపి. ఇప్పుడు రాధకు ఓ పాప. చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్తుంది. గోపి కూడా అలాగే స్పందిస్తాడు. ఇలా చాలా సేపు మాట్లాడుకుంటారు. రాధా ఆనందంగా కనిపిస్తుంది. ఆమె సంతోషంగా ఉందని అర్థం చేసుకుంటాడు గోపి. అతను వెళ్లిపోయాక రాధ తీవ్రంగా బాధపడుతుంది. ఆమె బాధగా ఉన్నా అని తెలిస్తే గోపి ఎంత బాధపడతాడో అమెకు తెలుసుకాబట్టి ఎంత ఆవేదన ఉన్నా సంతోషంగా ఉన్నట్టు నటిస్తుంది. అదే ప్రేమంటే అనే సందేశంతో లఘుచిత్రం ముగుస్తుంది.

Total views 2,057+ (సెప్టెంబర్‌ 28 నాటికి)
Published on Sep 27, 2019నిన్ను తలచి

దర్శకత్వం: భానవీన్‌ అల్లసాని
నటీనటులు : శ్రావణి, గణేశ్‌

అంకిత, అభి ప్రేమికులు. వేర్వేరు కంపెనీల్లో ఉద్యోగం చేస్తారు. కొన్ని రోజుల తర్వాత ఇద్దరూ దూరం అవుతారు. ఆ దెబ్బకు అభి ఉద్యోగం మానేస్తాడు. కొద్ది రోజుల విరామం తర్వాత వేరే కంపెనీలో చేరతాడు. కానీ ఆ బాధ నుంచి బయటకు రాడు. కొంత కాలం తర్వాత అదే కంపెనీలోకి ఓ అమ్మాయి వస్తుంది. ఆమె బాధ్యత అభికి అప్పగిస్తాడు ఆ కంపెనీ బాస్‌. ఆమెను తీసుకెళ్లి వర్క్‌ ప్లేస్‌ చూపిస్తాడు అభి. తర్వాత క్యాంటీన్‌కు వెళ్తాడు. ఈ క్రమంలోనే ఆ అమ్మాయి వస్తుంది. ‘ఎలా ఉన్నావు’ అని అడుగుతుంది. ఆమెనే ‘అంకిత’. ఇద్దరూ దూరమయ్యాక పరిస్థితుల గురించి మాట్లాడుకుంటారు. ఉద్యోగం, జీవితం ఎలా సాగుతుందో తెలుసుకుంటారు. ఈ లఘుచిత్రంలో విడిపోయి, కలిసిన అంకిత, అభి మళ్లీ ఒక్కటవుతారా లేదా అనేది యూట్యూబ్‌లో చూడండి.

Total views 2,749+ (సెప్టెంబర్‌ 28 నాటికి)
Published on Sep 26, 2019నా బాధ్యత

దర్శకత్వం: బాల
నటీనటులు : శ్రావణి, వివేక్‌

రవికి ఇరవై ఏండ్లు. పేదకుటుంబం. వ్యవసాయం చేసుకుంటూ బతుకీడుస్తారు. అతను ఏదైనా పని చేస్తేఆసరా అవుతుందని భావిస్తారు తల్లిదండ్రులు. కానీ అతను మాత్రం ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాడు. అది తప్పా వేరేది చేయలేనని ఏండ్ల కొద్ది చదువుతూనే ఉంటాడు. కాలం గడిచే కొద్ది కుటుంబ ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. కారణంగా రవితో తండ్రి ఆవేదన చెందుతాడు. గవర్నమెంట్‌ ఉద్యోగం రాదనీ, వేరే పని చేతకాదని భావించి కుంగిపోతాడు రవి. వేరే దిక్కులేక ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటాడు. అతరి స్నేహితుడు గమనిస్తాడు. రవికి మధ్యతరగతి పరిస్థితుల, తల్లిదండ్రుల గురించి చెప్తాడు. ‘ప్రభుత్వ ఉద్యోగం కాకపోతే చాలా పనులున్నాయి. అవి చేతకాకనా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావ్‌' అని అంటాడు. ‘తల్లిదండ్రుల గురించి ఆలోచించు, వాళ్లు ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలో ఆలోచించు’ అని చెప్తాడు. ఈ మాటలను అర్థం చేసుకున్న రవి ఇంటికి వెళ్తాడు. ‘మీ సంతోషం కోసం ఏం చేయడానికైన సిద్ధంగా ఉన్నా’ అని తండ్రితో అంటాడు. తల్లి కూడా సంతోషిస్తుంది.

Total views 250+ (సెప్టెంబర్‌ 28 నాటికి)
Published on Sep 28, 2019

- వినోద్‌ మామిడాల, సెల్‌: 7660066469

131
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles