సిబ్బి మీద విరిసే పూల సింగిడి


Sun,September 29, 2019 02:34 AM

పూలతో దేవున్ని పూజించడం అనేది సర్వసాధారణం. కానీ ఆ పూలనే దేవునిగా పూజించడం ప్రపంచంలో తెలంగాణలో తప్ప మరెక్క డా కనిపించదు. ప్రకృతి ప్రసాదించిన పూలను తొమ్మిది రోజులూ భక్తితో పూజించి బతుకమ్మా అని వేడుకోవడం తెలంగాణ మట్టి సంప్రదాయం. ఈ తొమ్మిది రోజులూ తెలంగాణ ఇండ్లన్నీ పూలవనాలై విరబూస్తాయి. ఎన్ని తరాలు మారినా మారని మన సంస్కృతి సంప్రదాయాల జానపద పండుగ బతుకమ్మ. సిబ్బిమీద విరిసే పూలసింగిడి మన బతుకమ్మ. ప్రకృతిని స్త్రీగా పూజించే పూలపండుగ బతుకమ్మ.

రామ రామ రామ ఉయ్యాలో - రామనే శ్రీరామ ఉయ్యాలో
రామ రామ నంది ఉయ్యాలో -రాగమేత్తరాదు ఉయ్యాలో
నెత్తిమీద సూర్యుడా ఉయ్యాలో-నేలవన్నేకాడ ఉయ్యాలో
పాపిటలో చెంద్రుడా ఉయ్యాలో - బాలాకుమరుడా ఉయ్యాలో
పెద్దలకు వచ్చింది ఉయ్యాలో -పెత్తరమాసము ఉయ్యాలో
బాలలకు వచ్చింది ఉయ్యాలో - బతుకమ్మ పండుగ ఉయ్యాలో


బతుకమ్మ పాటలు ఎక్కువగా రామాయణ, భారత, భాగవతం మొదలైన పౌరాణిక కథావస్తువుతో ఉంటాయి. ప్రతిపాటలోనూ మానవజీవితం, కష్టాలు, కన్నీళ్లు, శ్రమైక సౌందర్యం, బంధాలు, అనుబంధాలు, హాస్యం ఇలా నవరసాలూ పెనవేసుకుంటాయి.
ఒక్కేసి పువ్వేసి చందమామ అంటూ ఇల్లిల్లూ గానసంద్రంలో ఓలలాడుతుంది తెలంగాణ. ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మతో ఒక్కటవుతారు. ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన ఉన్నా బతుకమ్మ సందర్భంగా ఒక్కదగ్గర చేరి స్థాయిల్ని మరచి హోదాలను మరచి తెలంగాణ సంస్కృతిని నెత్తికెత్తుకుంటారు. తెలంగాణకే ప్రత్యేకమైన అపురూపమైన కానుక బతుకమ్మ. ప్రకృతిని ప్రేమించడం తెలంగాణ సంస్కృతికి ఉన్న మహోన్నత లక్షణం. ప్రకృతి ప్రసాదిత పూలను పేర్చి బతుకునీయవమ్మా అంటూ బతుకమ్మను కొలిచే అరుదైన పండుగ బతుకమ్మ.
BathukammaFest

పూల జాతర

బతుకమ్మ పండుగ రోజుల్లో తెలంగాణలో ఎక్కడ చూసినా తొమ్మిది రోజులు పూల జాతరే. ఊరూరా పూలవనమే. తంగేడు, గునుగు, కట్లపూలు, బీరపూలు, బంతిపూలు, సీతజెడలపూలు, లిల్లిపూలు, తామరపూలు, తీగమల్లె, బొడ్డుమల్లె, మందారాలు, కట్లపూలు ఇలా తీరొక్కపూలను ఎనిమిది రోజులు సిబ్బిలోనో, పళ్లెంలోనో వరుస క్రమంలో పేర్చుకుని అందరూ ఒకచోట చేరి బతుకు పాటలు పాడుతూ దగ్గర ఉన్న చెరువులు, పుట్టలు, దేవలయాల్లో వాటిని నిమజ్జనం చేస్తారు. ఇక చివరిరోజు సద్దుల బతుకమ్మ లేదా పెద్ద బతుకమ్మను జరుపుతారు. ఆరోజు తాంబాలంలోనో, పెద్ద పల్లెంలోనో ముందు గుమ్మడి ఆకులు వేసి వాటి అంచులదాకా కత్తిరించి వేస్తారు. గుమ్మడి ఆకులమధ్య గుమ్మడిపూల రెక్కలు విడదీసి పరుస్తారు. తెల్లని గునుగుపూలకు ఇష్టమైన రంగులు అద్దుతారు. ముందు తంగేడుపూలు, ఆ తరువాత రంగురంగుల పూలతో బతుకమ్మను పేరుస్తారు. ఇది కిందినుంచి వెడల్పుతో ఉండీ పైకి వచ్చేకొద్దీ గోపురంగా బతుకమ్మను అలంకరిస్తారు. ఏ ఇంట్లో అయినా ఒకే బతుకమ్మను పేర్చరు. ఒకటి పేరిస్తే అశుభమని తెలంగాణ ఆడబిడ్డలు భావిస్తారు. అందుకే తల్లి బతుకమ్మ అని పెద్ద బతుకమ్మను, పిల్ల బతుకమ్మ అని చిన్న బతుకమ్మను పేరుస్తారు. బతుకమ్మ చుట్టూ సద్దులుపెట్టి నీళ్లారగించి దండంపెట్టి సాయంత్రం పూట దేవలయాలు, ప్రత్యేకంగా సిద్ధం చేసిన ప్రాంతాల్లో రాత్రి వరకు బతుకమ్మ ఆడుతారు.ఆ తరువాత సద్దుల బతుకమ్మను ఊరుమ్మడి చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. అనంతరం ఇంటి నుండి తెచ్చుకున్న సద్దులను ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయినం అని ఒకరికొకరు పంచుకుంటారు.

అలంకరణ

బతుకమ్మను పేరుస్తూ అలంకరణ చేసే సందర్భంలోనూ పాటలు పాడుతారు. బతుకమ్మను పేర్చేంతవరకు అత్యంత నిష్టతో ఉంటారు. సద్దుల బతుకమ్మను పేర్చేదాకా ఒక్కపొద్దుంటారు. బతుకమ్మను పేర్చిన తరువాత ఆ కటిక నేలమీద పెట్టరు. నేలపై ముత్యాల ముగ్గులేసి, ఎత్తైన గద్దెమీదనో, పీటమీదనో పెడుతారు. ఆగరువత్తులు, కొవ్వొత్తులు వెలిగిస్తారు. బండారి(పసుపు)తో గౌరమ్మను చేస్తారు. ఈ గౌరమ్మను బతుకమ్మ నెత్తిమీద పెడతారు. పుసుపు ముద్దను తయారుచేసి (బతుకమ్మ ఆకారాన్ని పోలినదిగా గోపురంగా) చేసి బతుకమ్మ పైన పెడతారు. కొత్తబట్టను (రైక మలుపు ఇదీ తిక్రోణాకారంలోనే ఉంటుంది). నవధాన్యాలు, బంగారు పిసరు ఇలా అన్నీ కలిపి కొత్తగుడ్డలో కట్టుకొని చెరువుగట్టుకు మహిళలంతా కదిలిపోతారు.
BathukammaFest1

సత్తుపిండిలు

బతుకమ్మతోపాటు తొమ్మిదోనాడు సద్దులు కట్టుకుని చెరువుగట్టుకు పోతారు. ఈ సద్దుల వెనుక శాస్త్రీయత, భక్తిభావం, ఆరాధనాభావం, ప్రదర్శనా భావం ఉన్నాయి. కొత్తపంటలు ముఖ్యంగా మక్కజొన్న, నువ్వులు, వేరుశెనగ, పెసళ్లు ఇలా అన్ని రకాల కొత్త పంటలు బతుకమ్మనాటికి చేతికి అందుతాయి. వీటిని నూరిగానీ, ఇసిరిగానీ పిండి (పౌడర్) చేస్తారు. ముద్దలుగా చేస్తారు. మక్కజొన్న రొట్టె, బెల్లం కలిపి ముద్దలు చేస్తారు. ఈ ఆహారం పౌష్టికాహారానికి పెట్టింది పేరు. బతుకమ్మ సద్దుల్లో సత్తుపిండిదే అగ్రస్థానం. తెలంగాణ మాగాణంలో ఆహారపంటగా విస్తారంగా పండిన చారిత్రక ఆనవాళ్లకు సత్తుపిండి ప్రతిరూపం.మక్కజొన్నల్ని దోరగా ఏంచి (వేపుడు) పిండి పట్టిస్తారు. ఆ పిండిలో చక్కరగానీ, బెల్లం కానీ కలుపుతారు. అలా కలిపిందే సత్తుపిండి.

ఇళ్లంతా పండుగే

తెలంగాణలో ఏ పండుగకు వచ్చినా రాకపోయినా ఆడబిడ్డలు బతుకమ్మ పండుగకైతే తప్పనిసరిగా తల్లిగారింటికి వస్తారు. కొత్తగా పెళ్లి అయినవాళ్లు ముందుగానే వచ్చినా అర్రెంనాటి (ఆరో రోజు) వరకు కొందరు, చివరికి సద్దులనాడైతే అవ్వగారింటికి రాని ఆడబిడ్డలు దాదాపుగా అరుదనే చెప్పాలి. ఇల్లిల్లూ పిల్లలూ పెద్దలతో నిండిపోతుంది. కొత్తబట్టలు, ఉన్నంతలో సొమ్ములు ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలన్నీ తెలంగాణ ఆడబిడ్డల ఒంటిమీద తిష్టవేస్తాయి. ఉన్నంతలో సొమ్ములు పెట్టుకొని బతుకమ్మను ఎత్తుకుంటరు. అందుకే తెలంగాణ తొవ్వల మీద సద్దుల బతుకమ్మనాడు టన్నుల కొద్దీ బంగారం పారుకుంటూ పోతుందని పెద్దలంటారు. అంటే ఆ స్థాయిలో ఆడపడచులు తమకున్నంతలోనే సంపదను ప్రదర్శిస్తారనీ ప్రతీతి. తెలంగాణ దారులన్నీ పీతాంబరాలుగా మారిపోతాయి. శక్తికొలది ఇంటిల్లిపాదీ కొత్తబట్టలూ కట్టుకుంటారు. మామూలు రోజుల్లో ఏ చీరలు కట్టుకున్నా సద్దుల బతుకమ్మరోజు మాత్రం మహిళలు ఎక్కువగా పట్టుపీతాంబరాలు కట్టుకుంటారు.

ఉద్యమాల పండుగ

నాటి తెలంగాణ రైతాంగ సాయుధపోరాటం నుంచి నేటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం దాకా బతుకమ్మతో సంస్కృతి మమేకమై ఉద్యమించింది. నిజాం కాలంలోనూ, 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమకాలంలోనూ బతుకమ్మ పండుగను పోరాట రూపంగానే జరుపుకున్న సందర్భాలున్నాయి. ఇక సకలజనుల సమ్మెలో కూడా బతుకమ్మ నిరసనకు అతిగొప్ప ప్రేరణగా నిలిచింది. ఉద్యమకారులకూ ఉత్సాహాన్నిచ్చింది.
BathukammaFest2

తొమ్మిది రకాల బతుకమ్మ నైవేద్యాలుబతుకమ్మ ఆడే 9రోజులపాటు ప్రతిరోజూ ఓ రకమైన నైవేద్యం సమర్పిస్తారు.

ఎంగిలి పూల బతుకమ్మ: మహా అమవాస్యరోజు బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రమాస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.

అటుకుల బతుకమ్మ : ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.

ముద్దపప్పు బతుకమ్మ : ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.

నానే బియ్యం బతుకమ్మ : నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.

అట్ల బతుకమ్మ : అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు..

అలిగిన బతుకమ్మ : ఈరోజు ఆశ్వయుజ పంచమి. నైవేద్యమేమి సమర్పించరు.

వేపకాయల బతుకమ్మ : బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.

వెన్నముద్దల బతుకమ్మ : నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు.

సద్దుల బతుకమ్మ : ఆశ్వయుజ అష్టమి నాడు దుర్గాష్టమిని జరుపుకుంటారు. ఐదు రకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్ రైస్, కొబ్బరన్నం, నువ్వులన్నం. తొమ్మిదిరోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు ఉపయోగిస్తారు.

610
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles