కొత్త ఉద్యోగం


Sun,September 29, 2019 01:47 AM

జార్జ్ గత ముప్పయి ఐదేండ్లుగా పోస్ట్‌మేన్‌గా పని చేస్తున్నాడు. వర్షం, మంచు, ఎండ, పొగమంచు ఎలాంటి వాతావరణంలోనైనా అతను నడిపే ఎరుపు, తెలుపు, నీలం రంగుల ఉత్తరాల వ్యాన్ ప్రతీ ఇంటి మెయిల్ బాక్స్‌ముందు ఆగడం, వాటిలో అతను ఉత్తరాలు వేయడం జరుగుతూనే ఉంటుంది.ఆ ఊరి శివార్లలో కొత్త కాలనీలు ఏర్పడినప్పుడల్లా సిబ్బంది డ్యూటీలలో మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. అలా జార్జ్ గత మూడేండ్లుగా ఓ కాలనీకి పోస్ట్‌మేన్‌గా పని చేస్తున్నాడు. ఆ ఇండ్లవాళ్ళు అతన్ని హలో జార్జ్ అని పలుకరిస్తూంటారు. ఓ రోజు ఓ ముసలావిడ ఇంటి బయట కుప్పకూలి ఉండటం గమనించిన జార్జ్ వ్యాన్ దిగి ఆవిడ దగ్గరకి పరిగెత్తుకెళ్లాడు. ఆవిడకి పక్షవాతం వచ్చిందని గ్రహించి వెంటనే అంబులెన్స్‌కి ఫోన్ చేసాడు. తక్షణం వైద్య సహాయం అందడంతో ఆమె త్వరగా కోలుకుంది. ఆ కాలనీ వాసులు కృతజ్ఞతగా అతనికి అభినందన పార్టీని ఏర్పాటు చేశారు. జార్జ్ తన ఉద్యోగాన్ని అంత ఇదిగా ప్రేమించేవాడు.ఎవరికీ తెలీని చిన్న రహస్యం ఉత్తరాల్లో ఏముందో అతనికి తెలుసు. అన్ని సంవత్సరాలుగా పని చేయడంతో ఎవరికి ఎలాంటి ఉత్తరాలు వస్తాయో, ఎవరికి ఏ బ్యాంకుల్లో ఎకౌంట్స్ ఉన్నాయో, వారి పిల్లలు, తల్లిదండ్రులు ఎక్కడ జీవిస్తున్నారో, వారి పుట్టినరోజులు, మ్యారేజ్ ఏనివర్సరీ తారీకులు... ఇలా ప్రతీ వారికి సంబంధించిన చాలా సమాచారం జార్జ్‌కి తెలుసు.
LetterBox

కాలేజీనుంచి సీట్ రావడం లేదా తిరస్కరించబడే ఉత్తరాలు, విడాకుల పత్రాలు లాంటి జీవితాలను మార్చివేసే ఎన్నో లెటర్స్ అతని చేతులమీదుగా బట్వాడా అయ్యాయి. పెట్టెల పరిమాణం, బరువు, ఆకారాలనుబట్టి వాటిలో ఏం వచ్చాయో అతను తెలుసుకోగలిగేవాడు. తనతోపాటు ఆ కాలనీలోని చాలామంది వృద్ధులవడం, వాళ్ళ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవడం, మూడు చక్రాల సైకిళ్ళని వదిలి రేసు బైకుల్ని నడపడం మొదలైనవి అతను గమనించేవాడు. పాతవాళ్ళు వెళ్ళి ఆ కాలనీలోకి కొత్తవాళ్ళు రావడం, ఇంటి బయటి లాన్లు, తోటలు మారడం మొదలైనవి కూడా గమనించేవాడు.ఓ రోజు మస్కోవిటోస్ (కుటుంబం) ఆ కాలనీలోని ఓ ఇంటికి కొత్తగా వచ్చారు. ఎవరూ వాళ్ళని చూడలేదు. కొందరు వాళ్ళ డోర్ బెల్‌ని నొక్కినా తలుపు తెరచుకోకపోవడంతో స్నేహపూర్వకంగా తాము చేసి తెచ్చిన ఆహార పదార్థాలను గుమ్మం దగ్గర వదిలి వెళ్ళేవాళ్ళు. మస్కోవిటోస్ నుంచి థాంక్ యు కార్డులు కాని, ఫోన్ కాల్స్ కాని వచ్చేవి కావు.

జార్జ్! ఆ ఇంట్లోవాళ్ళని చూశావా? చాలామంది అడిగేవాళ్ళు.లేదు. మీరు? జార్జ్ అడిగేవాడు.వాళ్ళను ఎవరూ చూడలేదు. ఏషియన్ కరెన్సీ వ్యాపారం చేసే జిమ్ అనే అతను నిత్యం తన ఆఫీస్‌కు తెల్లవారు ఝామున మూడుకి వెళ్ళేవాడు. అతను మాత్రం ఒకటి, రెండుసార్లు మస్కోవిటో (వ్యక్తి) నీడను చూసాడు. మొదట ఇంటిబయట కాంపౌండ్ వాల్ వెలిసింది. తొమ్మిది అడుగుల ఎత్తు గోడమీద మూడు అడుగుల ఇనుప కంచె. దాన్ని నిర్మించిన పనివారికి కూడా మస్కోవిటో కనపడలేదు. మస్కోవిటో పిల్లలు తొమ్మిది, పన్నెండేండ్ల వాళ్ళు బోర్డింగ్ స్కూల్లో ఉన్నారని, అతను ఆర్థిక వ్యాపారంలో ఉన్నాడనే వదంతులు ప్రచారంలోకి వచ్చాయి. అతనికి వచ్చే ఉత్తరాల గురించిన సమాచారం జార్జ్ ఎవరితో పంచుకోకూడదు. ఉద్యోగంలో చేరినప్పుడు ఉత్తరాల విషయంలో రహస్యాన్ని పాటిస్తానని ప్రమాణం కూడా చేశాడు. మస్కోవిటోకి వచ్చే వాటిలో వ్యక్తిగత ఉత్తరాలు ఉండేవి కావు. కేమన్ ఐలండ్స్, న్యూజిలేండ్, మలేషియా, మాల్దీవులు, మారిషస్‌లలోని బ్యాంక్‌ల చిరునామాలతో చాలా ఉత్తరాలు వస్తుండేవి. స్థానిక బ్యాంక్‌ల నుంచి అతనికి ఎన్నడూ ఉత్తరాలు రాలేదు. అది తప్పని తెలిసినా జార్జ్ రెండు కవర్లమీది ఫ్రం ఎడ్రస్‌లని రాసుకుని వాటి గురించి ఇంటర్నెట్లో వెదికాడు. అనేక వ్యాపార సంస్థల నుంచి, ట్రేడ్ అసోషియేషన్స్ నుంచి అవి మోసపూరిత కంపెనీలని అనేక హెచ్చరికలు కనిపించాయి. ఫ్రం ఎడ్రస్‌లు ఎప్పుడూ విదేశాల్లోని పోస్ట్‌బాక్స్ నంబరే ఉండేది. మస్కొవిటో కేడిలాక్ కారు అద్దాలకి నల్లఫిల్మ్ అతికించి ఉండటం, అర్ధరాత్రి దాటాక, ఉదయం ఐదు లోపల అది అనేకసార్లు బయటికి వెళ్ళి రావడం చాలామంది గమనించారు.మస్కోవిటోస్ గురించి చిన్న చిన్న వదంతులు విన్నాక జార్జ్‌కి ఓ రోజు ఓ ఆలోచన వచ్చింది. నెమ్మదిగా కేమన్ ఐలండ్స్ నుంచి వచ్చిన కవర్లలోని ఎనిమిది పేజీల డాక్యుమెంట్స్‌ని బయటికి తీసి తన ఐఫోన్‌తో ఫొటోలు తీసి మళ్ళీ లోపల ఉంచి సీల్ వేసాడు. ప్రతీ పోస్ట్‌మేన్‌కి ఇది తెలిసిన విద్యే. దారిలో ఊడిపోయిన సీల్‌ని తిరిగి వేయడానికి ప్రతీ పోస్టల్ వ్యాన్‌లో ప్రత్యేక జిగురు ఉంటుంది. అమెరికా బయటి అకౌంట్ స్టేట్‌మెంట్స్, ఇన్‌వెస్ట్‌మెంట్స్, ట్యాక్సులు చెల్లించని చట్ట వ్యతిరేకమైన పెట్టుబడులకు చెందిన కాగితాలవి. అది మస్కోవిటోకి శిక్ష పడటానికి సరిపోయే సాక్ష్యం అని జార్జ్‌కి తెలుసు. అతను కేవలం ఆసక్తితో మాత్రమే వాటిని చూసేవాడు తప్ప ఎవరికీ ఆ వివరాలు చెప్పేవాడు కాదు.

ఓ రోజు జార్జ్‌కో కొత్త ఆలోచన వచ్చింది. తను చూసిన ఆ పత్రాల్లోని నియమాల్లో చిన్న మార్పులని చేయసాగాడు. తర్వాత వాటిని మళ్ళీ టైప్ చేసి, ఫోర్జరీ చేసి, అసలుది చింపేసి వాటిని కవర్లో ఉంచి బట్వాడా చేయసాగాడు. ఓ సాధారణ పోస్ట్‌మేన్ ఇలాంటి పని చేస్తాడని మస్కోవిటో ఊహించలేడని అనుకున్నాడు. వాటిని పంపిన వారే ఆ మార్పులతో పంపారని మస్కోవిటో భావిస్తాడని అనుకున్నాడు. అవి టైపింగ్‌లో జరిగిన పొరపాట్లుగా పంపినవాళ్ళు భావించచ్చు.త్వరలోనే జార్జ్ ప్రతీ కవర్లోని పత్రాలని జాగ్రత్తగా చదివి వాటిలో కొత్త పత్రాలని ఉంచసాగాడు. అనేక డొల్ల కంపెనీల నుంచి వచ్చే పత్రాలవి. జార్జ్‌కి ఆర్థిక నేరాల గురించి, ట్యాక్సులని ఎగ్గొట్టడం గురించి, కరెన్సీలని ఎలా మార్చుకోవాలి, ట్యాక్స్ లేకుండా తిరిగి దేశంలోకి ఎలా తెప్పించుకోవాలి మొదలైన వివిధ పద్ధతులన్నీ క్రమంగా అర్థం అవసాగాయి. ఇండోనేషియాలో 1050 ఎకరాల భూమిని కొన్న పత్రం చదివాక జార్జ్ గూగుల్ మ్యాప్‌లో వెదికితే అలాంటి చిరునామా గల భూమి ఆ దేశంలో లేదని తెలిసింది. దాని అమ్మకం డబ్బు ఉరుగ్వేలోని మాంటివిడియో అనే ఊళ్ళోని బ్యాంక్‌కి బదిలీ అయింది. జార్జ్ గూగుల్ చేస్తే ఆ పేరుగల బ్యాంకే లేదు. అంటే, లేని భూమిని అమ్మడం, లేని బ్యాంక్‌కి బదిలీ చేయడం, డబ్బుని నేరపూరితంగా ట్యాక్సులు ఎగ్గొట్టడానికే అని గ్రహించాడు.కొన్ని అతనికి అర్థమయ్యేవి, కొన్ని అయ్యేవి కావు. కానీ, పత్రాలను మళ్ళీ టైప్ చేసి కాంట్రాక్ట్‌లోని నియమాలను మార్చి, సంతకాలని ఫోర్జరీ చేసి మళ్ళీ వాటిని కవర్లలో ఉంచి అతికించేవాడు. వారి సంతకాల నమూనాలు తణిఖీ చేయడానికి మస్కోవిటో దగ్గర ఉంటాయని జార్జ్ భావించలేదు. ఐ.ఆర్.ఎస్ (అమెరికన్ ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్)లో వెదికితే మస్కోవిటో పేరే అతనికి కనపడలేదు. తను ఫొటో తీసిన కవర్లలోని పత్రాలతో అతనిమీద పోస్టల్ మోసాలు చేస్తున్నాడని పై అధికారులకి ఫిర్యాదు చేయవచ్చు. కానీ, అది యు.ఎస్ పోస్టల్ నియమాలకి వ్యతిరేకం. పోస్ట్‌మేన్‌గా తనకి తను బట్వాడా చేసే ఉత్తరాల్లోని విషయాలు తెలుసుకోవడం నేరం. మస్కోవిటోని ప్రాసిక్యూట్ చేసే కోర్టులో ఆ నేరం మీద తననీ ప్రాసిక్యూట్ చేస్తారు. తను చేసిన మార్పులు, చేర్పుల గురించి మస్కోవిటోకు ఇంకా తెలీదని జార్జ్ గ్రహించాడు. అతను రాత్రుళ్ళు తన ఇంట్లోని డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని పత్రాలను మళ్ళీ టైప్ చేసి ఇంటర్నెట్‌లోని ఫాంట్ లైబ్రరీలోంచి ప్రత్యేక అక్షరాలను డౌన్‌లోడ్ చేసుకుని అసలు పత్రాల, కాగితాలకి సరిపడే కాగితాలను కొని, ఫోర్జరీ డాక్యుమెంట్లను తయారు చేసి కవర్లలో ఉంచేవాడు. అతని భార్య మూడేండ్ల క్రితం మరణించింది. అప్పటి నుంచి రాత్రుళ్ళు ఏం చేయాలో తోచని జార్జ్‌కి ఇది కాలక్షేపంగా మారింది. అతను ఈ పని చేయడానికి కారణం ముప్పయి ఐదేండ్లుగా పోస్ట్‌మేన్‌గా విసుగు చెందే ఊద్యోగం చేయడం. ఇది అతని జీవితంలో కొత్త ఉత్తేజాన్ని తెచ్చింది.

ఓ రోజు జార్జ్ మస్కోవిటో పోస్ట్‌బాక్స్ దగ్గరకి వెళ్తే దానికో కాగితం అతికించి ఉంది. దయచేసి ఈ రోజు ఉత్తరాలని లోపలకి తెస్తారా? మిమ్మల్నో ప్రశ్న అడగాలి.జార్జ్ తన పోస్టల్ వ్యాన్‌ని అందరికీ కనపడేలా బయటే ఉంచి వారి డోర్ బెల్ నొక్కాడు. మస్కోవిటో తలుపు తెరిచాడు. ఆయన చాలా లావుగా, పొట్టిగా, ప్రతీ అవయవం మాంసంతో నిండి వృద్ధుడిలా కనిపించాడు. జార్జ్ స్నేహపూర్వకంగా నవ్వాడు. ఎవరైనా ఉత్తరాలను మధ్యలో తెరచి చదువవచ్చా? అంటే? ఎక్కడో ఓ చోట కవర్ని తెరవవచ్చా? ఎక్కడ? ఎక్కడైనా. అది నాకు తెలియాలి మస్కోవిటో కోపంగా అడిగాడు.అలా జరుగుతుందని నేను అనుకోను సర్. ఇది చాలా అరుదైంది. నా ముప్పయి ఐదేండ్ల సర్వీస్‌లో ఇలాంటి సమస్య ఎన్నడూ వినలేదు. మీరు కోరితే పోస్ట్‌మాస్టర్‌కి ఫిర్యాదు చేస్తాను.వద్దు. అలాంటిది జరగవచ్చా అని తెలుసుకోవడానికి అడిగాను. అంతే. మస్కోవిటో కొద్దిగా భయంగా చెప్పాడు.సరే. మీరు ఎప్పుడు ఫిర్యాదు చేయమన్నా చేస్తాను. తిరిగి తన వ్యాన్‌లోకి ఎక్కాక జార్జ్ నవ్వుకున్నాడు. బహుశ మస్కోవిటోని అనేకమంది కాంట్రాక్ట్‌లోని నియమాలని మార్చడం మీద ప్రశ్నించి ఉండచ్చు. లేదా అతను వాళ్ళని తప్పు పడుతుండవచ్చు. అతను క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వస్తే బహుశ భాగస్వాములు అతనిమీద మండి పడుతుండాలి. విశ్వాసం కోల్పోవడం, అనుమానం కలగడం ఆ వ్యాపారంలో మంచిది కాదు, ముఖ్యంగా ముఖాముఖీ చూసుకోకుండా చేసే వ్యాపారంలో.వర్షం, మంచు, ఎండ ఏమున్నా జార్జ్ ఉత్తరాల బట్వాడాను మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు. రాత్రుళ్ళు డైనింగ్ టేబిల్ ముందు కూర్చుని కాంట్రాక్ట్‌లలో చిన్న చిన్న మార్పులు చేస్తూనే ఉన్నాడు. దానివల్ల తనకేం లాభమో జార్జ్‌కి బోధపడలేదు.

ఓ రోజు జార్జ్ మస్కోవిటో పోస్ట్‌బాక్స్‌లో ఉత్తరాలు వేస్తూంటే అతని కోసం ఎదురు చూసే మస్కోవిటో తలుపు తెరిచి పిలిచాడు.దయచేసి ఓసారి లోపలకి వస్తావా? స్నేహపూర్వక ఆసక్తితో కూడిన అతని కంఠాన్ని విని వ్యాన్‌లోంచి దిగి ఆయన వెంట లోపలకి వెళ్ళాడు. లోపల నలుగురు మగాళ్ళు ఉన్నారు. వారిలోని ఒకరి చేతిలో రివాల్వర్ ఉంది.కూర్చోండి పోస్ట్‌మేన్ రివాల్వర్ ఉన్న వ్యక్తి చెప్పాడు. మాట తీరునిబట్టి అతను ఈస్ట్రన్ యూరోపియన్ దేశాలకు చెందిన వాడని జార్జ్ గ్రహించాడు. జార్జ్‌కి కొద్దిగా భయం వేసింది. వారిలోని ఒత్తిడిని అతను గ్రహించాడు. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత రివాల్వర్ వ్యక్తి చెప్పాడు.అమెరికన్ పోస్టల్ నియమాల ప్రకారం ఉత్తరాలను తెరవడం నేరం. నీకు ఈ విషయం తెలిసే ఉంటుంది. ఆ నేరానికి నీకు శిక్ష పడచ్చు.జార్జ్ బదులు మాట్లాడలేదు. ఇంట్లో ఇంకెవరూ ఉన్నట్లు లేరు. పిల్లలు బోర్డింగ్ స్కూల్లో, భార్య బహుశా షాపింగ్‌కి వెళ్ళుండవచ్చు.మేమంతా నీ కోసం వేచి ఉన్నాం. నువ్వు సరిగ్గా సమయానికి నిమిషం తేడా లేకుండా వస్తుంటావు. ఈ పని నువ్వు చేస్తున్నావని మేము చెప్తే మా భాగస్వామి మస్కోవిటో మొదట నమ్మలేదు. అసలు అతనికా ఆలోచనే రాలేదు. బోడిగుండు వ్యక్తి మస్కోవిటో వైపు కోపంగా చూస్తూ చెప్పాడు.నువ్వు చేసిన నేరానికి నిన్నేం చేయాలో మేం నిర్ణయించుకున్నాం.
జార్జ్‌లోని భయం అధికమైంది. తన జీవితం ఇక్కడితో అంతమౌతుందా? సమాధానంగా ఆ గదిలో రివాల్వర్ పేలింది. గురి తప్పలేదు. అతను గురిపెట్టిన చోటే గుండు దిగింది, మెదడులోకి. చట్టవిరుద్ధమైన పథకాలను రూపొందించిన మస్కోవిటో నుదుట్లోకి. ఆయన వెనక్కి వాలిపోయాడు. జార్జ్ పక్షవాతం వచ్చినట్లుగా కదల్లేక పోయాడు. అతను ఊపిరి పీల్చే వేగం అధికమైంది. మిగిలిన ఇద్దరూ మస్కోవిటో చేతులను ఛాతీమీద ఉంచారు.

ఇతను ఇలాంటి కాలనీలో ఉండకూడదు కదా జార్జ్? ఎత్తయిన కాంపౌండ్ వాల్స్, బలమైన గేటు. కారు అద్దాలకి నల్లటి ఫిల్మ్స్, ఇరుగు పొరుగుని దూరంగా ఉంచడం ఇతని తప్పులు. అందరిలో ఒకడిగా కలిసిపోతే ఎవరికీ అనుమానం రాదు. ప్రత్యేకంగా ఉంటే అందరి కళ్ళూ వాళ్ళ మీదే. ఎంతటి మూర్ఖుడంటే, పోస్ట్‌మేన్ కాంట్రాక్ట్‌లని మారుస్తున్నాడని కూడా గ్రహించలేకపోయాడు. జాగ్రత్త లేని మనిషి. అవునా జార్జ్? మా వ్యాపారంలో పోస్ట్‌మేన్‌కూడా మాకు ఉండే మంచిమిత్రుల్లో ఒకరు.వాళ్ళు మస్కోవిటో శవాన్ని లోపలకి తీసుకెళ్ళారు.ఇది నీ పనే అని మేం ఊహించాం. నీలాగే మేం కూడా కొద్దిగా రీసెర్చ్ చేసాం. నీ భార్య మేగీ మరణించాక ఇంట్లో ఒంటరితనం. వర్షం, మంచు, ఎండ. ఐనా, నీ బాధ్యతను విస్మరించావు. మా వ్యాపారాన్ని అధ్యయనం చేశావు. కానీ, నీకు పూర్తిగా అర్థం కాలేదు. ఆ భాగాన్ని మేం బోధించగలం. త్వరలో నువ్వు రిటైరవబోతున్నావు. ఇప్పటి నుంచే నువ్వు మా భాగస్వామివి. తిరస్కరిస్తే మస్కోవిటో హత్య నీ మీదకి వస్తుంది. హత్యాయుధం మీద నీ వేలిముద్రలు ఉంటాయి. ఏ క్షణంలోనైనా దాన్ని పోలీసులకి అందచేయగలం.వాళ్ళు ప్లాస్టిక్ షీట్‌లో శవాన్ని చుట్టి టేప్ అతికించారు.నువ్వు సహాయం చేస్తే శవాన్ని నీ వ్యాన్‌లోకి ఎక్కిస్తాం. దీన్ని ఎక్కడ పారేయాలో చెప్తాం. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డవుతుంది. నీకున్న జ్ఞానం, నైపుణ్యం నీ పెట్టుబడి. నువ్వు ఎప్పటిలానే ఉద్యోగం చేస్తూ ఉత్తరాల్లోని ముఖ్యమైనవి తెచ్చిస్తుండు. మస్కోవిటో లాంటి వాళ్ళు ఈ కాలనీలో చాలామంది ఉన్నారు. వారి చిరునామాలు నీకు ఇస్తాం.తనకి ఇంకో అవకాశం లేదని జార్జ్ గ్రహించాడు.(జోనాథన్ స్టోన్ కథకి స్వేచ్ఛానువాదం)

ఎంతటి మూర్ఖుడంటే, పోస్ట్‌మేన్ కాంట్రాక్ట్‌లని మారుస్తున్నాడని కూడా గ్రహించలేకపోయాడు. జాగ్రత్త లేని మనిషి. అవునా జార్జ్? మా వ్యాపారంలో పోస్ట్‌మేన్‌కూడా మాకు ఉండే మంచిమిత్రుల్లో ఒకరు.
వాళ్ళు మస్కోవిటో శవాన్ని లోపలకి తీసుకెళ్ళారు.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి

537
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles