దొంగ


Sun,September 15, 2019 01:06 AM

thief
మధ్యవయస్కుడైన షెల్డన్‌కు మంచి ఇల్లు, కుటుంబం ఉన్నాయి. తను వ్యాపారంలో అలసిపోయి ఇంటికి వచ్చాక భార్యతో కలిసి ఒకటి, రెండు బీర్లు తాగుతూ టీవీ చూసి భోజనం చేసి పడుకుంటాడు. ఆదివారాలు కుటుంబసభ్యులతో కలిసి పిక్నిక్‌కు వెళ్తాడు సముద్రపు ఒడ్డుకో, పడవ అద్దెకి తీసుకుని నదికో లేదా ఎమ్యూజ్‌మెంట్ పార్క్‌కో. అతను ఫ్లోరిడాలో కొన్న సెకండ్ కార్లని దేశంలో అన్ని రాష్ట్రాల డీలర్లకు ఎగుమతి చేస్తాడు. అతను కొన్ని ఖర్చులను పెంచి రాసి కొన్ని నగదు లావాదేవీలని మాత్రమే చేసి చాలా డబ్బుని బ్యాంక్‌లో డిపాజిట్ చేయకుండా ఇంట్లో దాస్తున్నాడు.
ఓ రాత్రి షెల్డన్ భార్య నైట్‌క్లబ్‌కి వెళ్దామని కోరింది. పెళ్ళికి ఎదిగిన కూతురు కూడా ఆ రాత్రి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి పడుకుంటానని చెప్పడంతో షెల్డన్ భార్యకా కోరిక కలిగింది.
తెల్లవారు ఝామున మూడు దాకా వాళ్ళు నైట్‌క్లబ్‌లో గడిపి ఇంటికి తిరిగి వచ్చారు. అతనిది కొత్త కారు కావడంతో తాగిన షెల్డన్ నెమ్మదిగా, జాగ్రత్తగా డ్రైవ్ చేసాడు. అతను కారుని పార్క్ చేసి తాళం చెవిని ఇంటి తలుపు రంధ్రంలో ఉంచుతూంటే అది లోపలకి తెరచుకుంది. దాన్ని గమనించిన అతని భార్య ఆదుర్దాగా చెప్పింది.

షెల్డన్! ఇంటికి తాళం వేయడం మర్చిపోయావు
వాళ్ళు లోపలకి వెళ్ళి లివింగ్ రూంలో లైట్లు వేయగానే, టేబిల్ సొరుగు పూర్తిగా బయటకి తీసి నేలమీద పడి ఉండటం గమనించారు. అందులోని చెక్‌బుక్స్, బిల్లులు, ఇతర కాగితాలు కార్పెట్‌మీద కుమ్మరించబడ్డాయి.
వెంటనే ఇద్దరూ డైనింగ్ రూంలోకి పరిగెత్తుకెళ్ళారు. అక్కడి షో కేస్ తలుపు తెరిచి ఉంది. అందులోని వెండి సామాను మాయమైంది. వెంటనే షెల్డన్ భార్య చిన్నగా కేక పెట్టింది. షెల్డన్‌కు ఇంట్లో దొంగ పడ్డాడని అర్థమయ్యాక వాడు ఇంకా ఇంట్లోనే ఉన్నాడేమో అనే ఆలోచన కలిగింది. అతను మెట్లెక్కి పైకి పరిగెత్తుతుంటే అతని భార్య అరిచింది.
దాన్ని వాళ్ళు తెరవలేకపోతే బావుండును
బెడ్‌రూం బయట డ్రెసర్ వాళ్ళకి కనిపించింది. దాంట్లోని బట్టలన్నీ కుమ్మరించి షెల్ఫ్ కిందిభాగం పైకి కనపడేలా బోర్లించారు. అక్కడ డబ్బు కవర్‌ను టేప్‌తో అతికించారేమోనని దొంగ చెక్ చేసాడని ఇద్దరికీ అర్థమైంది. క్లోజెట్‌లోకి వెళ్ళి షెల్డన్ లైట్ వెలిగించాడు. నేలలో బిగించిన స్టీల్ సేఫ్‌మీద ఉంచిన పాతబట్టలు, ఖాళీ చెప్పుల పెట్టెలు పక్కకి తొలగించి ఉన్నాయి. అది తెరచి ఉంది. పూర్తి ఖాళీగా ఉండటం చూసిన షెల్డన్ భార్య మరోసారి బాధగా అరిచింది.
షెల్డన్ తన ఛాతీని రుద్దుకున్నాడు. అప్పటికే అతనికి చెమటలు పట్టి, గుండె కొట్టుకునే వేగం పెరిగింది.

మొత్తం దోచేసాడు షెల్డన్ భార్య గొంతు పెగల్చుకుని చెప్పింది.
షెల్డన్ బాత్‌రూం తలుపు తెరచి లోపల దొంగ దాక్కున్నాడేమోనని చూసాడు. అదికూడా ఖాళీ. వెంటనే అతను టెలీఫోన్ రిసీవర్ ఎక్స్‌టెన్షన్ అందుకున్నాడు. పోలీసులకి ఫోన్ చేసి చెప్పాడు.
మా ఇంట్లో దొంగలు పడ్డారు. ఇప్పుడే ఇంటికి తిరిగి వచ్చాం.
మీ పేరు, చిరునామా చెప్పండి. విలువైనవేమైనా పోయాయా?
మా ఆవిడ నగలు, ఇంకా... చెప్తున్న షెల్డన్ నోటిని అతని భార్య చటుక్కున మూసేసింది.
అతనికి ఆమె ఆ పని ఎందుకు చేసిందో తేలిగ్గా అర్థమైంది.
హలో. ఇంకా?
అంతే.
ఓ ఐదు నిమిషాల్లో పోలీసులు మీ ఇంటికి వస్తారు. దయచేసి ఏమీ ముట్టుకోకండి అవతల నుంచి సూచన చెప్పాక లైన్ కట్టయింది.
మీరా సంగతి చెప్పకండి షెల్డన్ భార్య హెచ్చరించింది.
ఇద్దరూ పోలీసుల కోసం ఎదురు చూస్తూ నిస్పృహగా సోఫాలో కూలబడ్డారు. వాళ్ళు వచ్చే సమయానికి ఇద్దరికీ బాగా నిద్రొస్తోంది. డోర్ బెల్ విని షెల్డన్ భార్య తలుపు తెరచింది. యూనిఫాంలోని ఒకరు, సాధారణ దుస్తుల్లోని మరొకరు లోపలకి వచ్చి తమ పేర్లని, రేంక్‌లని పరిచయం చేసుకున్నాక డిటెక్టివ్ అడిగాడు.

మీరు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు?
నైట్‌క్లబ్‌కి.
ఇంట్లో ఇంకెవరూ లేరా?
లేరు. మా అమ్మాయి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళడంతో మేం నైట్‌క్లబ్‌కి వెళ్ళాం.
ముగ్గురూ ఇంట్లోంచి ఒకేసారి బయటికి వెళ్ళారా?
కాదు. ముందు మా అమ్మాయి. తర్వాత మేం వెళ్ళాం షెల్డన్ జవాబు చెప్పాడు.
మీరు బయటికి వెళ్తున్నట్లు మీ అమ్మాయికి తెలుసా?
తెలీదు.
మరి ఎవరికి తెలుసు?
ఎవరికీ తెలీదు. అప్పటికప్పుడు అనుకుని వెళ్ళాం షెల్డన్ భార్య చెప్పింది.
ఏమేం పోయాయి?
ఏ గదుల్లోంచి ఏమేం పోయాయో యూనిఫాంలోని సార్జెంట్ రాసుకున్నాడు. తర్వాత డిటెక్టివ్ ఇంట్లోని ప్రతీ అంగుళాన్నీ పరిశీలించి నల్ల అట్టగల పాకెట్ బుక్‌లో ఆ వివరాలు రాసుకున్నాడు. వాళ్ళు వెళ్ళాక షెల్డన్ భార్య తలుపు మూసి తన భర్తతో చెప్పింది.
రేపు నగలు పోయాయని ఇన్సూరెన్స్ కంపెనీకి రిపోర్ట్ చేయండి.
డబ్బు సంగతేం చేద్దాం?
మీకు తెలీదా? అది ఎలా చెప్పగలం?
కాని అది నా కష్టార్జితం షెల్డన్ బాధగా చెప్పాడు.
అవును. కానీ, అది ఇన్‌కం ట్యాక్స్ వాళ్ళ దృష్టిలో దొంగ సొత్తు. దానికి ట్యాక్సులు కట్టిన రుజువులు అడుగుతారు. అవి లేవు. పోలీసులకు కాని, ఇన్సూరెన్స్ కంపెనీలకు కాని దాని గురించి ఫిర్యాదు చేస్తే ఆ రిపోర్ట్ కాపీని నియమాల ప్రకారం వాళ్ళు ఐఆర్‌ఎస్ వాళ్ళకు పంపుతారు కదా.

thief2
ఇద్దరూ పోలీసుల కోసం ఎదురు చూస్తూ నిస్పృహగా సోఫాలో కూలబడ్డారు. వాళ్ళు వచ్చే సమయానికి ఇద్దరికీ బాగా నిద్రొస్తోంది. డోర్ బెల్ విని షెల్డన్ భార్య తలుపు తెరచింది. యూనిఫాంలోని ఒకరు, సాధారణ దుస్తుల్లోని మరొకరు లోపలకి వచ్చి తమ పేర్లని, రేంక్‌లని పరిచయం చేసుకున్నాక డిటెక్టివ్ అడిగాడు.


వాళ్ళు దొంగని పట్టుకుంటే మన నగలతోపాటు ఆ తొంభై ఒక్క వేల డాలర్లు కూడా వాడి దగ్గర దొరికితే? షెల్డన్ ప్రశ్నించాడు.
పోలీసులు దొంగల్ని పట్టుకోరు. నా నగలు ఇక నాకు దొరకవు. షెల్డన్ భార్య ఏడుస్తూ చెప్పింది.
అతను ఆమెను ఓదార్చాడు. షెల్డన్‌కి వెంటనే నిద్ర పట్టింది. కానీ, ఆమె ఆలస్యంగా నిద్రపోయింది.

ఎనిమిది రోజులు గడిచాయి. ఆ రాత్రి భోజనాల సమయంలో వారి ఇంట్లోని ఫోన్ మోగింది. రిసీవర్ అందుకుని మాట్లాడాక షెల్డన్ రిసీవర్‌ను చేత్తో మూసి, గొంతు తగ్గించి తన భార్యతో చెప్పాడు.
స్టేషన్‌కి వచ్చి మన నగలు గుర్తించమని అక్కడినుంచి ఫోన్.
డబ్బు గురించి ఏమన్నారు?
ఏం చెప్పలేదు.
కనుక్కోండి... ఒద్దు లెండి. పదండి. ఆమె చెప్పింది.
ఇద్దరూ వారి కారులో నిశ్శబ్దంగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. దారిలో ఆమె అడిగింది.
మీరు కారు డీలర్ కాబట్టి ఆ డబ్బుని ఇంట్లో ఉంచుకున్నారని చెప్పొచ్చుగా?
అది చాలా పెద్ద మొత్తం. వాళ్ళు తెలివితక్కువ వాళ్ళు కారు. లెడ్జర్‌లో, క్యాష్‌బుక్‌లో ఆ డబ్బు నమోదు చేసారా అని అడుగుతారు. తక్కువ మొత్తమైతే ఫర్వాలేదు. కానీ, తొంభై ఒక్క వేలు! కుదరదు. లేదా ఐఆర్‌ఎస్‌కి మనం దానికి రెండు రెట్లు చెల్లించాల్సి ఉంటుంది.
వాళ్ళు వెళ్ళిన గదిలో ముగ్గురు కూర్చుని ఉన్నారు. తమని పరిచయం చేసుకున్నాక అతని డ్రైవర్స్ లైసెన్స్ చూసి చెప్పారు.
కూర్చోండి.

ఒకరు బయటకి వెళ్ళి నిమిషంలో తెల్లజుట్టుగల యాభై ఏండ్ల వ్యక్తితో వచ్చారు. ఓ పోలీస్ ఆఫీసర్ పోయిన వారి బంగారు ఆభరణాలను వర్ణించమని కోరారు. మిసెస్ షెల్డన్ చెప్పేది రికార్డవుతున్నది.
అక్కడ జరిగేదాంతో తనకేం సంబంధం లేదన్నట్లుగా తమ వంక ఒక్కసారి కూడా చూడని ఆ తెల్ల జుట్టాయన దొంగని షెల్డన్‌కి అర్థమైంది.
ఓ పోలీస్ ఆఫీసర్ ఓ క్యాన్వాస్ సంచిని తెచ్చి దానికున్న జిప్‌ని తీసి అందులోంచి ఆ నగలని తీసి బల్లమీద ఉంచాడు. వారి వెడ్డింగ్ రింగ్ లోపలి భాగంలో వారిద్దరి పేర్లూ చెక్కి ఉన్నాయి.
ఆ ఆఫీసర్ ఆ నగలని బల్లమీద ఓ పద్ధతిలో ఉంచడాన్ని చూసి అతను ఇంకేదో అడగబోతున్నాడని ఆ దంపతులకి అర్థమైంది. అదేమిటో ఇద్దరూ గ్రహించారు కూడా.
మీ వెండి సామాను రేపు ఇతను అమ్మిన షాపులోంచి స్వాధీనం చేసుకుంటాం. ఇవి కాక ఇంకేమైనా ఉన్నాయా?
నాకు గుర్తున్నంత వరకు ఇంతే షెల్డన్ పొడి గొంతుతో చెప్పాడు.
మీ డబ్బు పోలేదా? అతను షెల్డన్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు.
డబ్బా? లేదే.
ఆ తెల్లజుట్టు దొంగ నిటారుగా కూర్చుని షెల్డన్ వంక ఆసక్తిగా చూసాడు.
ఇదికూడా ఇతని దగ్గర మాకు దొరికింది సంచిలోంచి ఐదు నోట్ల కట్టలను తీసి చూపించి పోలీస్ ఆఫీసర్ చెప్పాడు.
వాటిని చూడగానే షెల్డన్ మనసు బాధతో మూలిగింది. తన కష్టార్జితాన్ని తన సొమ్ము కాదని చెప్పడంలోని బాధని అతను అనుభవించాడు.

మొత్తం తొంభై ఒక్క వేల డాలర్లు.
షెల్డన్ దొంగ వంక చూసాడు. అతను నివ్వెరపోతూ షెల్డన్ వంక చూస్తున్నాడు.
ఇంత పెద్ద మొత్తాన్ని ఇంట్లో ఉంచుతానని ఎలా అనుకున్నారు? నాది కాదు.
అదేమిటి? ఇది అతని డబ్బే. అతని సేఫ్‌లోంచి తీసుకున్నాను ఆ దొంగ అరిచాడు.
మాది కాదు. షెల్డన్ భార్య కూడా చెప్పింది.
మీది కాదంటే ఇంకో దొంగతనాన్ని వీళ్ళు నా మీద రుద్దుతారు. నిజం ఒప్పుకోండి.
నిజమే చెప్పాను. చూస్తూ చూస్తూ ఇంత డబ్బుని ఎవరూ వదులుకోరు షెల్డన్ భార్య గట్టిగా చెప్పింది.
దొంగ వాళ్ళమీద అరుస్తుంటే అతన్ని మళ్ళీ సెల్‌లోకి తీసుకెళ్ళిపోయారు.
ఈ డబ్బుని మీరేం చేస్తారు? షెల్డన్ ఆసక్తిగా ప్రశ్నించాడు.
ఇది ఎవరిదో తెలుసుకుంటాం.
ఒకవేళ తెలుసుకోలేకపోతే? ఎవరూ స్టేషన్‌కి వచ్చి తమదని క్లెయిమ్ చేయకపోతే?
వేచి చూస్తాం.
ఒకవేళ ఎప్పటికీ ఎవరిదో మీరు కనుక్కోలేక పోతే? షెల్డన్ భార్య అడిగింది.
కొంతకాలం వేచి ఉన్నాక పరిశోధిస్తాం. ఈ డబ్బుమీద దీని యజమాని వేలిముద్రలు ఉంటాయి.
తిరిగి కార్లో వెళ్తుంటే షెల్డన్ భార్య చెప్పింది.
ఆ డబ్బుని మళ్ళీ తీసుకునే దారి ఆలోచించండి.
పోలీస్ స్టేషన్లో దొంగతనం చేయడం ఒకటే దారి అతను బాధగా చెప్పాడు.

ఇప్పుడు షెల్డన్, అతని భార్యలో మునుపటి ఉత్సాహం నశించి దిగులు బాగా అలుముకుంది. పార్టీలకు వెళ్ళడం మానేసారు. ఒకోసారి వారి కారు పోలీస్ స్టేషన్ పక్కనించి వెళ్తుంటే దానివంక చూడకుండా ఉండలేకపోతున్నారు. తమ డబ్బు అందులో తమ కోసం వేచి చూస్తున్నదని వాళ్ళకి తెలుసు.
ఏదో రోజు పోలీసులు వచ్చి డోర్ బెల్ కొడతారు. నెల తర్వాత?
రెండు నెలల తర్వాత?
ఏడాదికా?
కానీ, తప్పకుండా ఏదో రోజు వాళ్ళు తమ డోర్‌బెల్ కొట్టి తామిద్దరి వేలిముద్రలు తీసుకుంటారని ఆ దంపతులకు తెలుసు. అది గొప్ప మానసిక వేదనగా వాళ్ళ మనసులని తొలుస్తూ జీవితంలో ఉత్సాహాలన్నింటినీ చంపేస్తున్నది.
(ఆర్థర్ మిల్లర్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి

529
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles