గూడు చేరిన పక్షులు


Sun,September 15, 2019 01:06 AM

Gudu-cherina-pakshullu
సాయంత్రం వేళ మార్కెట్ బాగా సందడిగా ఉన్నది. ఎప్పటిలా కూరగాయలు కొంటున్నాడు రాఘవయ్య. ఇంతలో అతనికి తన చిన్ననాటి మిత్రుడు రామచంద్రయ్య ఎదురుపడ్డాడు. నమ్మలేకపోయాడు.
హరే! నువ్వు రామచంద్రానివి కదూ! అన్నాడు వెంటనే తేరుకొని.
చూసీ చూడనట్టు చూశాడు రామచంద్రం. తర్వాత తనూ గుర్తుపట్టి అన్నాడు-
భలే గుర్తు పట్టావురా నన్ను. మనం కలవక పది, పదిహేనేండ్లు అయ్యింది కదా! అయినా, ఏందిరా నువ్వు ఒక్కసారి కూడా ఫోన్ చేయవు. బాగున్నారా పిల్లలు, వదిన గారు?
ఆ.. అందరం బాగున్నాం. ఇంతకూ నువ్వెలా ఉన్నావ్? రాఘవయ్య.
నాకేం! ఒక పాప, బాబు, మా ఆవిడ అందరం బావున్నాం. కానీ...... రామచంద్రం.
ఆ కానీ.. ఆపేసావేం, చెప్పు. రాఘవయ్య.
మా వాడు ఇప్పుడు లిటిల్ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. కానీ, ఇంట్లో నాకు, వాళ్ళమ్మకు అస్సలు గౌరవమివ్వడు. వంకర టింకరగా మాట్లాడతాడు. ఇంటికి వచ్చిన బంధువులను ఏదోలా చూస్తాడు. ఏమోరా.. బాబు, నాకు వాడు ఈ జన్మలో అర్థం కాడు. ఎప్పుడు చూసినా స్మార్ట్‌ఫోనులో మునిగిపోతాడు. నా బాధంతా ఒక్కటే, వాడికి పెద్దవారంటే అస్సలు గౌరవం ఉండదు. నా మతిమండ! ఏవేవో చెప్తున్నా. అసలే నువ్వు కలువక కలువక కలిసావ్. ఇవన్నీ ఎప్పుడూ ఉంటాయి గానీ, పదా.... మా ఇంటికి వెళదాం. రామచంద్రం.
ఇప్పుడు వద్దురా, ఇంకోసారి ఎప్పుడన్నా వస్తా. ఇప్పుడు కొంచెం పనుంది అని రాఘవయ్య అంటే, ససేమిరా ఒప్పుకోని రామచంద్రం ఏదో ఒకటి చెప్పి ఇంటికి తీసుకువెళతాడు.

అలా ఆ ప్రాంతం చేరుకోగానే, రామచంద్రం అన్నాడు.
మీ ప్రాంతంలో కూడా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయారా?
మా ఊళ్ళో అయితే వీధి అంతా పూలు. ఇండ్లన్నీ ఆడబిడ్డలతో కళకళలాడుతాయి. సాయంత్రం అవగానే మా చెవుల నిండా భక్తి పాటలే వినిపిస్తాయి అని ఇంటికి వెళ్తున్న సమయంలో చెప్పాడు రాఘవయ్య.
ఇల్లు చేరుకోగానే రామచంద్రం బిడ్డ ఎదురుపడి -
నాన్నా.... ఏం పండ్లు తెచ్చావ్ నాకు? అని అడగ్గానే, రాఘవయ్యకు తన కూతురు జ్ఞాపకం వచ్చింది.
ఇంట్లో ఓ మూలన సోఫాలో రామచంద్రం కొడుకు బంటి కనిపించాడు.
స్మార్ట్‌ఫోనులో తలపెట్టాడు. కాదు, అందులోకి దూరేశాడు. ఏవేవో గేమ్స్ ఆడుతున్నట్టున్నాడు.
రాఘవయ్య వంక బంటి వింతగా చూశాడు.
నిజంగానే ఈ పిల్లవాడు రామచంద్రం చెప్పినట్లే ఉన్నాడుగా..రాఘవయ్య మనసులో అనుకున్నాడు.

అవును, రామా! అమ్మానాన్నలు ఎక్కడా? రాఘవయ్య అడిగాడు.
సమాధానం చెప్పలేక రామచంద్రం గొంతు మూగబోయింది.
అప్పటి దాకా నిశ్శబ్దంగా ఫోనులో గేమ్స్ ఆడుతున్న బంటి హఠాత్తుగా గొంతు విప్పాడు.
తాత నానమ్మలు చేవెళ్లలో ఉన్న మాధవి ఓల్డ్ ఏజ్ హోంలో ఉన్నారు.
రాఘవయ్య ఆశ్చర్యపోయాడు. మనసులో రామచంద్రంపై బాగా కోపం వచ్చింది.
ఏంటి రామా ఇది? అడిగాడు రాఘవయ్య.
ఆ..అది కాదురా.... నసిగాడు రామచంద్రం.
నువ్వేం చెప్పే ప్రయత్నం చెయ్యకు. నాకిప్పుడు అంతా అర్థమైంది. నీ కొడుకు బంటి ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో. వాడు పండుగకు ఇంటికి వచ్చిన బంధువులతో ఎందుకు మర్యాదగా పలకరించటం లేదో, ఇంకా మీతోనే ఎందుకలా ఉంటున్నాడో! ... అరేయ్ రామా! ఒక్కమాట చెప్తా వింటావా? సూటిగా ప్రశ్నించాడు రాఘవయ్య.
ఆ.. చెప్పు రామచంద్రం.
నువ్వు ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకుడివి. గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నావు. మొన్నా మధ్యనే ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డ్‌కూడా వచ్చిందని విన్నాను. సంఘంలో ఇంత మంచి పేరు సంపాదించి, గొప్ప హోదాలో ఉండి, ఇలా చెయ్యటం తప్పు కాదా? ఇంతకూ ఓల్డ్ ఏజ్ హోంలో ఎందుకు వేశావ్‌రా అమ్మానాన్నలను..? కాస్తా కోపగించుకుంటున్నట్టుగానే అన్నాడు రాఘవయ్య.
గత్యంతరం లేక అన్నట్టుగా రామచంద్రం నోరు విప్పాడు.
ఏం చెప్పమంటావు నన్ను. నేనేం చెప్పినా నా మాట ఎవరూ వారు వినరు. ప్రతి దానికీ విసిగిస్తారు. నేను ఉద్యోగానికి, భార్య ఆఫీసుకు, పిల్లలు స్కూలుకు. ఇలా అందరూ బయటికి వెళ్తే ... వాళ్లను చూడటానికి ఎవరూ ఉండరని ఓల్డ్ ఏజ్ హోంలో వేసా. అక్కడైతే వారిని అన్ని విధాల చూడడానికి పనిమనుషులు, కావాల్సినవన్నీ అందుబాటులో ఉంటాయి.
అప్పుడు రాఘవయ్య అన్నాడు-
అన్నీ ఉంటాయి కానీ, కన్న కొడుకు మాత్రం కళ్ళముందు ఉండడు కదరా!
కాసేపు ఆగి రామచంద్రం కేసి చూశాడు. అతను తల దించుకొన్నాడు. చెప్పాడు మళ్లీ రాఘవయ్య.
ఒరేయ్... నీ పిల్లల చదువుకు వాళ్లు అడ్డంకిగా మారారా? అసలు వారిపై నువ్వు ఎలాంటి ప్రేమ చూపించావు? వారికివ్వాల్సిన గౌరవాన్ని కూడా నువ్వు ఇవ్వలేదని అర్థమవుతున్నది. కాబట్టే, నీ కొడుకు నువ్వు చేసేదంతా చూసి ఆ విధంగా తయారయ్యాడు...

ఒక ఇరవై ఏండ్ల తరువాత నిన్ను కూడా ఈ బంటి ఓల్డ్ ఏజ్ హోంలో వేయడని గ్యారంటీ ఏముంది? అయినా, నువ్విలా చేయటం ఏం బాగా లేదురా. పదిమందికి చెప్పే స్థాయిలో ఉండి, నువ్వే ఇలా చేస్తే దానికేమైనా అర్థం ఉంటుందా? అరేయ్! చంద్రం.. మనం మన తల్లిదండ్రులను ఏ విధంగా చూస్తే, రేపు మన పిల్లలు మనల్ని అదే విధంగా చూస్తారు. పెద్దవాళ్ళు శేష జీవితంలో ఏం కోరుకుంటార్రా.... గుప్పెడు ప్రేమ, ముద్ద అన్నం. ఇవేరా వాళ్లు కోరుకునేవి. వారికీ వయసులో ఈ మాత్రం కూడా చేయలేని కన్న కొడుకులు ఉన్నా, లేనట్టే!

నువు ఇలా చేస్తున్నట్లు, నీ కొడుకు నీకు చేయక ముందే జాగ్రత్త పడు రామా! వెళ్ళు, తొందరగా వెళ్లి అమ్మానాన్నలను ఇంటికి తీసుకురా. రామా, చివరగా....ఒక్కమాట. మనల్ని మొదటిసారి బడికి పంపినపుడు తల్లిదండ్రులపై మన కోపం బడిగంట మోగే వరకే ఉండేది. గుర్తుందా నీకు? కానీ, కన్నకొడుకులు, కూతుళ్ళపై వారి ప్రేమ అలా కాదు. వారి గుండెగంట ఆగేవరకూ ఉంటుంది. కాదంటావా?
ఇదంతా విన్న రామచంద్రం కన్నీళ్ళు తుడుచుకొన్నాడు.
నేను ఒక అధ్యాపకుడిగా ఉండికూడా ఈ మాత్రం ఆలోచించలేదు. నన్ను క్షమించురా. ఈ రోజు నా కళ్ళు తెరిపించావ్ అంటూ గబగబా చేవెళ్ళ బయలుదేరాడు.

అక్కడ ఓల్డ్ ఏజ్ హోంలోకి వెళ్ళగానే రామచంద్రంకు మాటలు రాలేదు. అమ్మానాన్నలిద్దరూ చాలా ముభావంగా కనిపించారు. మరోసారి కన్నీళ్లు బయటకు కనిపించకుండా లోలోపలే దు:ఖాన్ని దిగమింగుకున్నాడు. వారిని తన వెంట తీసుకెళుతున్నట్టు నిర్వాహకులకు చెప్పాడు.
తాత నానమ్మలను తనవెంట తీసుకొస్తున్న దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నాడు బంటి. ఆ పిల్లవాడిలో తన నాన్నమీద ఎప్పుడూ లేనంతా గౌరవం కలిగింది. నాన్నా!.. అని ఎంతో సంతోషంగా పలకరించాడు. బంటి ఉత్సాహాన్ని చూసి రామచంద్రం ఆశ్చర్యపోయాడు.
Gudu-cherina-pakshullu
ఒక ఇరవై ఏండ్ల తరువాత నిన్ను కూడా ఈ బంటి ఓల్డ్ ఏజ్ హోంలో వేయడని గ్యారంటీ ఏముంది? అయినా, నువ్విలా చేయటం ఏం బాగా లేదురా. పదిమందికి చెప్పే స్థాయిలో ఉండి, నువ్వే ఇలా చేస్తే దానికేమైనా అర్థం ఉంటుందా? అరేయ్! చంద్రం.. మనం మన తల్లిదండ్రులను ఏ విధంగా చూస్తే, రేపు మన పిల్లలు మనల్ని అదే విధంగా చూస్తారు. పెద్దవాళ్ళు శేష జీవితంలో ఏం కోరుకుంటార్రా.... గుప్పెడు ప్రేమ, ముద్ద అన్నం. ఇవేరా వాళ్లు కోరుకునేవి. వారికీ వయసులో ఈ మాత్రం కూడా చేయలేని కన్న కొడుకులు ఉన్నా, లేనట్టే!

-ఘనపురం సుదర్శన్,
[email protected]

742
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles