ఆంగ్లం సత్యం.. బోధన నిత్యం!


Sun,September 15, 2019 01:02 AM

ఆంగ్లం అంటేనే హడల్.. అర్థం కాని పాఠాలు.. బుర్రకెక్కని గ్రామర్.. అత్తెసరు మార్కులు.. గ్రామీణ విద్యార్థులకు అది మరింత సవాల్‌తో కూడుకున్న సబ్జెక్ట్.. అలాంటి ఆంగ్లాన్ని అతి సులభం చేశాడు ఈ మాస్టారు. పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని, ఆంగ్లానికి ఉన్న ప్రాధాన్యాన్ని గమనించి తేలికగా నేర్పించే మార్గాన్ని కనిపెట్టాడు శంకరభక్తుల సత్యం.
DNGLISH

బోధనాంశాలు..

ఆంగ్ల భాషాపటాల (Charts) ద్వారా పదకోశం(Vocabulary), ఆంగ్ల వాక్య నిర్మాణానికి ఆధారమైన వాక్య నిర్మాణ పట్టిక (Tenses Table), క్రియా రూపాలు(Forms Verbes), భాషాభాగాలు(Parts of speech), సర్వనామాల పట్టిక (Prounouns Table), పోస్టర్లు (Posters), ఉత్తరాల నమూనాలు (Letter Writing), ఆహ్వాన పత్రికలు(Invitation Cards), కథలు రాయడం (Story Writing), వర్ణనలు (Descriptions), సహాయక క్రియల పట్టిక (Helping Verbs-Chart), మొదలైన భాషకు ఆధారమైన భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను (Communications Skills గోడలపై ముద్రించిన ఆంగ్లభాషా వ్యాకరణాంశాలు విద్యార్థుల మనస్సుల్లో చెరగని ముద్ర వేస్తాయని ఆ టీచర్ నమ్మకం. ఇలాంటి ప్రయోగం వల్ల ఇంగ్లిష్ నేర్చుకోవడం ఒక నిరంతర ప్రక్రియగా మారి విద్యార్థులు భాషపై పట్టు సాధిస్తున్నారని పలువురు టీచర్లు కొనియాడుతున్నారు.

గోడలపై చిత్రాలు, పదాలు వేయించడం, ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విద్యార్థుల్లో విద్యపై ఆసక్తి పెంపొందిస్తున్నారు. తను పనిచేస్తున్న పాఠశాలలోని తరగతి గదులను ఆంగ్ల భాషా భాండాగారాలుగా మార్చి ఆంగ్ల భాష భావ వ్యక్తీకరణ అంశాలను విద్యార్థులకు సులువుగా అర్థం అయ్యేటట్లుగా పట్టికల రూపంలో మార్చి, ఆంగ్ల వ్యాకరణను ఎప్పుడూ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు.


ప్రయోగ ఫలితం

ఆధునిక టెక్నాలజీ సహాయంతో అతి తక్కువ ఖర్చుతో భావ వ్యక్తీకరణ అంశాలు (Discourses) వ్యాకరణాంశాలను విద్యార్థులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసిన ఈ ప్రయోగం సత్పలితాలనిస్తున్నది. విద్యార్థులు 150 క్రియా రూపాలను సులువుగా చెప్పగలుగుతున్నారు. వాక్య నిర్మాణాలను స్వతహాగా రాయగలుగుతున్నారు. భావ వ్యక్తీకరణ అంశాలపై విద్యార్థులు పట్టు సాధిస్తున్నారు. 12 రకాల ఆంగ్ల వాక్య సూత్రాలను చెప్పగలుగుతున్నారు. ప్రయోగాత్మకంగా ఆంగ్ల బోధన ఆవశ్యకతలను 20 ఏళ్ల క్రితమే గుర్తించి 2011లో జెడ్పీపీఎస్ పెనుగొండ మండలం కేసముద్రంలో ఆంగ్లభాష ప్రయోగశాలను ఉమ్మడి జిల్లాలోనే మొదటిసారిగా ఏర్పాటు చేసి పలువురు విద్యాశాఖాధికారుల ప్రశంసలు పొంది, సర్కారు పాఠశాలలకు ఆదర్శంగా నిలిచారు.

DNGLISH2

నిత్య విద్యార్థి

వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలం చంద్రుగొండ గ్రామానికి చెందిన డాక్టర్ సత్యం కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులను ఆంగ్లభాషలో నిష్ణాతులను చేయడమే లక్ష్యంగా ఆంగ్ల భాషా ప్రయోగశాలను ఏర్పాటు చేశాడు. మారుమూల గ్రామాల్లో చదువుతున్న విద్యార్థులకు ఆంగ్లాన్ని సులువుగా బోధించేందుకు ప్రతీ పాఠశాలను ఆంగ్ల భాషా ప్రయోగశాలగా మార్చాలనేది తన లక్ష్యమని, ఆంగ్లంలో వెనుకబడిన విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అంటున్నారు ఆయన. సులువుగా బోధించడం ప్రతీ ఆంగ్ల ఉపాధ్యాయుడి వృత్తిలో ఒక భాగం కావాలని ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థులకు రాష్ట్ర జాతీయ స్థాయి విద్యా ఉద్యోగావసరాలకు ఆంగ్ల భాషను బోధించాల్సిన అవసరం ఉందనేది అయన అభిప్రాయం.

వంద రోజుల్లో ఆంగ్లం

శంకరభక్తుల సత్యం ఓవైపు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తూనే చెన్నైకి చెందిన డాక్టర్ జేకే రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెలువడుతున్న ది ఇంగ్లిష్ రీసెర్చ్ ఎక్స్‌ప్రెస్, ది ఇంగ్లిష్ ఇండియా.. మహారాష్ట్రకు చెందిన న్యూ మ్యాన్ పబ్లికేషన్స్ అనే పత్రికలకు సంపాదకుడిగా పనిచేశారు. అంతేకాకుండా 2002 నుంచి 2006 వరకు పదో తరగతి స్టడీ మెటీరియల్ తయారీలోనూ సేవలందించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యాశాఖ మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన వంద రోజుల్లో ఆంగ్లం అనే కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్‌గా సేవలందించారు.

DNGLISH3

సామాజిక కార్యక్రమాలు

జయశంకర్ సేవాసమితి ఏర్పాటుతో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సార్ జయంతి, వర్ధంతి కార్యక్రమాల సందర్భంగా సార్ స్వగ్రామమైన వరంగల్ రూరల్‌జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో మెగా వైద్యశిబిరం ఏర్పాటు చేసి వందలాది మంది రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, మందులను అందజేశారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలల్లో మొక్కలు నాటడం, విద్యార్థులకు క్విజ్ తదితర పోటీలను నిర్వహించి వారిలోని ప్రతిభను వెలికితీస్తున్నారు. అలయన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ అనే సేవా సంస్థ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న సత్యం మాస్టారు వృద్ధాశ్రమాల్లో అన్నదానంతోపాటు పండ్లు పంపిణీ చేశారు. దివ్యాంగ పిల్లల విద్యాభివృద్ధికి విరాళాలు సేకరించి అందజేస్తున్నారు. ముఖ్యంగా ములుగు జిల్లా ఏటూరునాగారం లాంటి వెనుకబడిన గిరిజన ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు దుస్తులు, గొడుగులు, స్కూల్ బ్యాగులు పంపిణీ చేస్తున్నారు.

-దాసరి ధనుంజయ, సెల్: 9010617575

428
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles