ఆటలో ఆణిముత్యాలు


Sun,September 8, 2019 03:59 AM

సై అంటే సై.. నువ్వా? నేనా? అంటూ గిరిగీసి.. బరిలోకి దిగి.. ప్రత్యర్థిని మట్టి వ్యూహాలు.. ప్రతివ్యూహాలు వేస్తూ.. ఆశలు సన్నగిల్లుతున్నా ఆత్మవిశ్వాసంతో లక్ష్యంవైపు దూసుకెళ్లడమే ఆట. గ్రౌండ్‌లో ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు వికెట్ల మధ్యన పరుగులు తీస్తుంటే.. ఆ పరుగుల కన్నా వేగంగా మన మనసు ఉరకలేస్తుంది. బ్యాడ్మింటన్‌ పోటీల్లో దిగ్గజాలు హోరాహోరీ పోటీ ఇస్తుంటే మనలో ఉత్కంఠ మొదలవుతుంది. అథ్లెటిక్స్‌లో వందల కిలోల బరువును అవలీలగా ఎత్తుతా మనలో ఏదో తెలియని బలం పుంజుకుంటుంది. ఆటకు.. మనకు ఉన్న అవినాభావ సంబంధం అలాంటిది. ఆట.. కేవలం పతకాల కోసం ఆడేది కాదు.. గెలిస్తే.. చాంపియన్లుగా నిలిస్తే ఆ క్రీడాకారుడి దేశానికి, గుర్తింపు వస్తుంది. మనవాళ్లురా.. అని సగర్వంగా చెప్పుకునే ధైర్యాన్నిస్తుంది. తమ నైపుణ్యం ద్వారా తెలుగునేలకు కీర్తి కిరీటం తొడిగి.. క్రీడాజ్యోతిని వెలిగించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ చాంపియన్లు.. వాళ్లను తీర్చిదిద్దుతున్న అకాడమీల గురించి ముఖచిత్ర కథనం.
P.-V.-Sindhu

banner
ఆటవల్ల.. ఆడేవారికి ఉల్లాసం.. చూసేవారికి ఉత్సాహం పదింతలు పెరుగుతుంది. మామూలుగా ఇంటి దగ్గర ఏదో సరదాకు ఆడే ఆటలో గెలిస్తేనే పట్టరాని ఆనందంతో ఎగిరి గంతేస్తాం. ఏదో సాధించిన అనుభూతి పొందుతాం. అలాంటిది.. జాతీయ, క్రీడల్లో విజయఢంకా మోగించిన వారి విజయోత్సాహం ఎలా ఉంటుంది? వారి ప్రాంతమెంత సంబురపడుతుంది? అత్యంత ప్రజాదరణ కలిగిన బ్యాడ్మింటన్‌, క్రికెట్‌, జిమ్నాస్టిక్స్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, బాక్సింగ్‌, ఆర్చరీ, చెస్‌ వంటి క్రీడల్లో చాంపియన్లుగా నిలిచి విజయాల వెలుగులు విరజిమ్ముతున్న తెలుగు తేజాల జాబితాలో చాలామందే ఉన్నారు. వారు సాధించిన ఘనత తెలుసుకుందాం.
sindhu

విజయ సింధూరం

ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో అయిదు పతకాలు అందుకున్న ఘనత ఇప్పటివరకూ చైనా దిగ్గజం జాంగ్‌ నింగ్‌దే. అలాంటి అరుదైన రికార్డును తెలుగు బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పీవీ సింధు తిరగరాసింది. వరల్డ్‌ బాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో ఏకంగా స్వర్ణ పతకం అందుకొని తెలుగు తెగువను ప్రపంచదేశాలకు చాటిచెప్పింది. ఆరు సంవత్సరాల క్రితం పద్దెనిమిదేండ్ల వయసులో తొలిసారి ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో పోటీపడి కాంస్యం గెలిచిన సింధు, మరుసటి ఏడాదీ దాన్ని పునరావృతం చేసింది. భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారులెవరికీ ఇప్పటిదాకా సాధ్యంకాని పసిడిని కొల్లగొట్టిన సింధును యావత్‌ దేశం కొనియాడుతున్నది. పుల్లెల గోపీచంద్‌ శిష్యరికంతో ఆసియా క్రీడలు, కామన్‌వెల్త్‌ వేదికలపై రజతాలతోపాటు రియో ఒలింపిక్స్‌లో వెండి పతకాలు అందుకున్నది. బ్యాడ్మింటన్‌లో పీవీ సింధుతోపాటు మరికొందరు తెలుగు ఆణిముత్యాలు ఉన్నారు. వారెవరంటే..

సాయి ప్రణీత్‌: హైదరాబాద్‌కు చెందిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు సాయిప్రణీత్‌ ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పురుషుల విభాగంలో పతకం సాధించాడు. 1983లో పురుషుల సింగిల్స్‌ విభాగంలో ప్రకాశ్‌ పదుకొనె కాంస్యం తెచ్చాడు. ఆయన తర్వాత మరోమారు మెడల్‌ తీసుకువచ్చిన యువ క్రీడాకారుడు ప్రణీత్‌కు అర్జున అవార్డు కూడా లభించింది.

గాయత్రి గోపీచంద్‌: పుల్లెల గోపీచంద్‌ కుమార్తె అయిన గాయత్రి గోపీచంద్‌ 14 ఏండ్లకే జాతీయ స్థాయిలో 3 అండర్‌ 17-టైటిళ్లు కైవసం చేసుకున్నది. అండర్‌ 19-నేషనల్‌ లెవల్లో విజేతగా నిలిచింది. 2018లో జరిగిన ఏషియన్‌గేమ్స్‌లో భారత్‌ నుంచి ప్రాతినిధ్యం వహించింది. యోనెక్స్‌ సన్‌రైజ్‌ ఆలిండియా జూనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో గాయత్రికి టాప్‌ సీడింగ్‌ దక్కింది.

సాత్విక్‌ సాయిరాజ్‌: అమలాపురానికి చెందిన సాత్విక్‌ సాయిరాజ్‌ బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లో రాణిస్తున్నాడు. గోల్డ్‌ కోస్ట్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో చిరాగ్‌ శెట్టితో కలిసి పురుషుల డబుల్స్‌లో రజత పతకం సాధించాడు. కామన్వెల్త్‌ క్రీడల్లో పతకమే లేని భారత్‌కు తొలిసారి ఆ ఘనతను సాధించిపెట్టాడు. సాత్విక్‌-చిరాగ్‌ జోడీ కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ టీమ్‌ ఈవెంట్‌లో స్వర్ణం సాధించడంలోనూ కీలకపాత్ర పోషించింది.

సిక్కిరెడ్డి: హైదరాబాద్‌కు చెందిన 25 ఏండ్ల సిక్కిరెడ్డి మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల తర్వాత ఆ స్థాయిలో విజయకేతనం ఎగురవేస్తున్నది. గోల్డ్‌ కోస్ట్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో అశ్వినీ పొన్నప్ప జతగా కాంస్య పతకం సాధించింది. డబుల్స్‌లో అశ్వినితో కలిసి సయ్యద్‌ మోదీ టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. ప్రణవ్‌ చోప్రా జోడీగా హైదరాబాద్‌ ఓపెన్‌లో రజతం అందుకున్నది.

కిదాంబి శ్రీకాంత్‌: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన కిదాంబి శ్రీకాంత్‌ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్‌లో సత్తా చాటాడు. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ స్థాయిలో 10వ ఉన్నాడు. సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ పురుషుల టైటిల్‌ గెలుచుకున్న తొలి భారతీయుడు కావడం విశేషం.

జిమ్నాస్టిక్స్‌ అరుణ


Aruna-Reddy
భారత జిమ్నాస్టిక్స్‌లో దీపా కర్మాకర్‌ తర్వాత ఆస్థాయి పేరు తెచ్చుకున్న క్రీడాకారిణి బుద్దా అరుణా రెడ్డి. హైదరాబాద్‌కు చెందిన అరుణ అంతర్జాతీయస్థాయిలో పతకం సాధించాలన్న తన స్వప్నాన్ని సాకారం చేసుకున్నది. 2018 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌లో జరిగిన జిమ్నాస్టిక్స్‌ వరల్డ్‌ కప్‌లో మహిళల వాల్ట్‌ ఈవెంట్‌ ఫైనల్లో కాంస్య పతకం సాధించింది. దీంతో ఈ మెగా ఈవెంట్‌లో వ్యక్తిగత విభాగంలో పతకం నెగ్గిన తొలి భారత మహిళా జిమ్నాస్టిక్‌ చాంపియన్‌గా అరుణ చరిత్ర సృష్టించింది.

మేఘన: హైదరాబాద్‌కు చెందిన క్రీడాకారిణి గుండ్లపల్లి మేఘన రెడ్డి జిమ్నాస్టిక్స్‌లో ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. అండర్‌ -21 రిథమిక్‌ జిమ్నాస్టిక్స్‌ ఆల్‌ అరౌండ్‌ విభాగంలో 39.30 పాయింట్ల స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. ఇండియా నుంచి అతి చిన్న వయసులో రిథమిక్‌ జిమ్నాస్ట్‌ ఇంటర్నేషనల్‌ అవార్డు పొందిన విజేతగా నిలిచింది. 2018లో కామన్‌ వెల్త్‌ గేమ్స్‌లో భారతదేశం తరఫున పాల్గొని సత్తా చాటింది. నెస్‌ జియోనా అంతర్జాతీయ టోర్నమెంట్‌లో అత్యధిక స్కోరు సాధించింది.

చెస్‌ చాంపియన్‌ హారిక


Harika-Dronavalli
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన ద్రోణవల్లి హారిక ప్రపంచ స్థాయి విజయాలతో అతి స్వల్ప కాలంలోనే గ్రాండ్‌ మాస్టర్‌ హోదా సంపాదించింది. ప్రపంచ మహిళల చెస్‌ పోటీల్లో మూడు కాంస్య పతకాలు సాధించి అంతర్జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేసింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన చెస్‌ పోటీల్లో విజయకేతనం ఎగురవేసింది. కామన్‌ వెల్త్‌ చదరంగపు క్రీడల్లో మహిళా విభాగంలో రెండో స్థానంలో నిలిచింది. 2007లో అర్జునతోపాటు ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నది.

గ్రాండ్‌ మాస్టర్‌లు: చెస్‌లో గ్రాండ్‌ మాస్టర్‌ హోదాను అందుకుని సంచలనం సృష్టిస్తున్నాడు వరంగల్‌కు చెందిన ఇరిగేసి అర్జున్‌. తెలంగాణ నుంచి తొలి గ్రాండ్‌ మాస్టర్‌గా అవతరించి చర్రితకెక్కాడు. ఈ 14 ఏండ్ల చిచ్చరపిడుగు వరల్డ్‌ యూత్‌ చెస్‌ ఒలింపియాడ్‌లో రజత పతకం కైవసం చేసుకుని, గ్రాండ్‌ మాస్టర్‌ హోదాను సార్థకం చేసుకున్నాడు. కామన్‌వెల్త్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ అండర్‌ 16- ఓపెన్‌ విభాగంలో విజేతగా నిలిచాడు. హైదరాబాద్‌కు చెందిన మరో యువ చెస్‌ సంచలనం హర్ష భరత్‌ కోటి గ్రాండ్‌మాస్టర్‌ హోదాను దక్కించుకుని తెలంగాణ రాష్ట్రం నుంచి రెండో గ్రాండ్‌ మాస్టర్‌ హోదా పొందాడు.

గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు సరైన శిక్షణ ఇస్తే ఎంతోమంది హిమదాస్‌లు తయారవుతారు. అందుకోసం సాట్స్‌ తరఫున కృషి చేస్తున్నాం. పల్లెల్లో ప్రజలకు ఆటల పట్ల సరైన అవగాహన లేదు. ఇప్పుడున్న క్రీడా వ్యవస్థలో మార్పులు తీసుకువస్తే ఎక్కువ మంది చాంపియన్లు తయారవుతారు. నిష్ణాతులయిన కోచ్‌లతో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. క్రీడాకారులు అరుదైన విజయాలను అందుకుంటూ తెలంగాణ రాష్ర్టానికి మంచి గుర్తింపు తెస్తున్నారు.
Venkateswara-Reddy
-అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డి, సాట్స్‌ చైర్మన్‌

రికార్డుల మిథాలీ

mithali
భారత మహిళాక్రికెట్‌ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ 203 వన్డే ఇంటర్నేషనల్స్‌లో తొలిసారి బరిలోకి దిగి చరిత్ర సృష్టించింది. 36 ఏండ్ల మిథాలీ 10 టెస్టు మ్యాచ్‌లు, 89 టీ20 మ్యాచ్‌లు ఆడింది. పుట్టింది రాజస్థాన్‌ అయినా, హైదరాబాద్‌లోనే పెరిగింది. 2005లో వన్డే పగ్గాలు చేపట్టిన మిథాలి రాజ్‌ ఇప్పటి వరకు 123 వన్డేల్లో భారత జట్టుకు నాయకత్వం వహించి, గతంలో117 వన్డేలకు బాధ్యతలు నిర్వహించిన చార్లెట్‌ ఎడ్వర్డ్స్‌ను అధిగమించింది. వన్డేల్లో 7 సెంచరీలు, 52 అర్థ సెంచరీలు కలిపి మొత్తం 59 సార్లు 50 పరుగులు దాటిన తొలి క్రికెటర్‌గా నిలిచింది. 200 వన్డేల్లో 6,622 పరుగులు చేసి మహిళా క్రికెట్‌ చరిత్రలో అత్యధిక రన్స్‌ సాధించిన ఘనత దక్కించుకున్నది. రిఫరీ లక్ష్మి: గండికోట సర్వలక్ష్మి క్రికెట్‌లో జీవితాంతం పోరాడి యాభై ఏండ్ల వయస్సులో గుర్తింపు పొందింది. చిన్నప్పటి నుంచి క్రికెటే లోకంగా పెరిగిన ఆమె జోనల్‌ స్థాయి నుంచి ఐసీసీ వరకూ వెళ్లింది. బౌలర్‌గా, కెప్టెన్‌గా, రిఫరీగా ఎన్నో బాధ్యలు నిర్వహించిన ఆమె ఐసీసీ ఉమెన్‌ రిఫరీగా ఎంపికైంది. ఇండియా నుంచి ఐసీసీ వరకూ వెళ్లిన మొదటి మహిళా రిఫరీగా లక్ష్మి రికార్డు సృష్టించింది. లక్ష్మిది ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి.

శిక్షణ కేంద్రాలు

stadium
స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ స్టేట్‌ (సాట్స్‌) ఆధ్వర్యంలో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. లాల్‌ బహుదూర్‌ స్టేడియం, గచ్చీబౌలీలోని జిఎమ్‌సిబి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌, హైదరాబాద్‌ యూనివర్సిటీ క్యాంపస్‌లో షూటింగ్‌ రేంజ్‌, యూసఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్‌ స్టేడియం, సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియం, ఉస్మానియా యూనివర్సిటీలో సైక్లింగ్‌ వెల్డ్రోమ్‌, హుస్సేన్‌ సాగర్‌ వద్ద బోట్స్‌ క్లబ్‌లో వాటర్‌ స్పోర్ట్స్‌, సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌ వంటి ఎనిమిది కేంద్రాల్లో 28,109 మంది క్రీడాకారులకు వివిధ విభాగాల్లో శిక్షణ ఇచ్చారు. ట్రైనింగ్‌ పొందిన వారిలో 55 మంది అంతర్జాతీయ స్థాయిలో ఆడారు. అథ్లెటిక్స్‌, ఫుట్‌బాల్‌, బ్యాడ్మంటన్‌, టెన్నిస్‌, వాలీబాల్‌, ఆర్చరీ, వెయిట్‌ లిఫ్టింగ్‌ వంటి విభాగాల్లో 20 బంగారు పతకాలు, 27 రజత పతకాలు, 47 కాంస్య పతకాలు సాధించారు. క్రీడాకారులకు పలు విభాగాల్లో శిక్షణ ఇస్తూ ఆర్థిక సహకారం అందిస్తున్నారు.

ఒలంపిక్స్‌లో ఆడే క్రీడాకారులకు ప్రత్యేకంగా తర్ఫీదు ఇస్తున్నారు. మండలం, నియోజకవర్గం, జిల్లా స్థాయిల్లో క్రీడా మైదానాలను అభివృద్ధిపరచడం, వాటిని నిర్వహించడంతోపాటు క్రీడా సామగ్రిని అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన చాంపియన్లకు అవసరమయిన సౌకర్యాలు అందిస్తూ వారిని జాతీయ, అంతర్జాతీయ పోటీలకు పంపుతున్నారు. మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి, జిల్లా స్థాయికి పంపుతారు. మెరిట్‌ను బట్టి విద్యార్థులకు చదువుతోపాటుక్రీడలపై శిక్షణ ఇచ్చేందుకు హకీంపేటలో తెలంగాణ స్టేట్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌, వరంగల్‌ జిల్లా హన్మకొండలో రీజినల్‌ స్పోర్ట్స్‌ హాస్టల్‌, కరీంనగర్‌లో రీజినల్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌, ఆదిలాబాద్‌లో తెలంగాణ స్పోర్ట్స్‌ స్కూల్‌, ఖమ్మం అథ్లెటిక్స్‌ అకాడమీ, వనపర్తిలో హాకీ అకాడమీ, సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో వాలీబాల్‌ అకాడమీలున్నాయి.

వీటి ద్వారా ప్రస్తుతం 1067మంది క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారు. ఈ కేంద్రాల్లో చేరేందుకు ప్రతి ఏటా జులైలో అడ్మిషన్లు నిర్వహిస్తుంటారు. విద్యార్థులు కనబరిచిన ప్రతిభను, అర్హతనుబట్టి వారికి అవసరమైన విభాగంలో ట్రైనింగ్‌ ఇస్తారు. హకీంపేటలో ప్రస్తుతం 400మందికి పైగా విద్యార్థులున్నారు. వీరిలో 223 మంది బాలురు, 186 మంది బాలికలున్నారు. ఇక్కడ 29 విభాగాల్లో శిక్షణ ఇచ్చేందుకు 29 మంది కోచ్‌లున్నారు. వరంగల్‌ జిల్లా హన్మకొండలో రీజినల్‌ స్పోర్ట్స్‌ హాస్టల్‌ ఉన్నది. ఇక్కడ 4 వతరగతి నుంచి డిగ్రీ వరకు ఉన్నది. శిక్షకులతో విద్యార్థులను చాంపియన్లుగా తీర్చిదిద్దుతున్నారు. క్రీడలపై శిక్షణ ఇచ్చేందుకు కరీంనగర్‌లో మరొక క్రీడా పాఠశాల ఉన్నది. ఇక్కడ 4 నుంచి 10 తరగతి వరకు అందుబాటులో ఉన్నది. ఆదిలాబాద్‌లో ఇంకో క్రీడా పాఠశాలను ఏర్పాటు చేశారు. ఇందులో 4, 5 తరగతులు చదివే విద్యార్థులున్నారు. ఇతర రాష్ర్టాల్లో జరిగే టోర్నీలకేకాకుండా, జాతీయస్థాయిలో జరిగే ఆటల పోటీలకు హాజరయ్యే క్రీడాకారులకు రవాణా, |సతి ఖర్చులు ఇస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు.

ప్రోత్సహిస్తున్నాం:
dinakar-babu-sats-md
క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తెలంగాణ సర్కారు ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అందులో భాగంగానే విద్యతోపాటు సౌకర్యాలు కల్పిస్తూ వారికి అవసరమైన శిక్షణ ఇస్తున్నాం. గతంతో పోలిస్తే విద్యార్థుల్లో క్రీడాసక్తి పెరిగింది. ముఖ్యంగా బాలికలు ముందుకు వస్తున్నారు. ఇది మంచి పరిణామం. ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంతో మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నారు.
-దినకర్‌ బాబు, సాట్స్‌ , ఎండి.

వెయిట్‌లిఫ్టర్‌ రాహుల్‌


rahul
గుంటూరు జిల్లా స్టూవర్టుపురానికి చెందిన వెయిట్‌లిఫ్టర్‌ రాగాల వెంకట రాహుల్‌ 2018 కామన్‌వెల్త్‌ క్రీడల్లో 85 కిలోల విభాగంలో పతకం సాధించాడు. 2017లో గోల్డ్‌ కోస్ట్‌లో జరిగిన కామన్‌ వెల్త్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలిచాడు. 2014లో జరిగిన ఆసియా యూత్‌ లిఫ్టింగ్‌లో రెండు గోల్డ్‌ మెడల్స్‌ సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకూ వెయిట్‌ లిఫ్టింగ్‌ విభాగంలో నాలుగు స్వర్ణ పతకాలను సాధించి అరుదైన ఘనత దక్కించుకున్నాడు.

ప్రియదర్శిని : జయశంకర్‌భూపాలపల్లి జిల్లాకు చెందిన ప్రియదర్శిని 2015లో పుణెలో జరిగిన కామన్‌వెల్త్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించింది. ఇందులో 44కిలోల విభాగంలో స్నాచ్‌-53, క్లీన్‌ అండ్‌ జర్క్‌-75 కిలోలతో మొత్తం 128 కిలోల బరువు ఎత్తి బంగారు పతకాన్ని అందుకున్నది. హర్యానాలో జరిగిన జాతీయ స్థాయి పోటీలో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నది.

చాంపియన్లకు చిరునామా


Gopichand-academy
2001లో ఆల్‌ ఇంగ్లాండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ గెలిచిన రెండో షట్లర్‌గా అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు పుల్లెల గోపీచంద్‌. ఆ తర్వాత కోచ్‌గా స్థిరపడిపోయాడు. క్రీడా రంగంలో ఆయన అందించిన సేవలకు ద్రోణచార్య, అర్జున, పద్మభూషణ్‌ వంటి అవార్డులు వచ్చాయి. గోపీచంద్‌ అకాడమీ చాంపియన్లకు చిరునామాగా మారింది. 2004 గచ్చీబౌలీలో 5 ఎకరాల స్థలంలో పుల్లెల గోపీచంద్‌ అకాడమీ ప్రారంభమయింది. ఇక్కడ ఎంతోమందిని టాప్‌ ప్లేయర్లుగా తీర్చిదిద్దారు. బ్యాడ్మింటన్‌, జిమ్నాస్టిక్స్‌, టేబుల్‌ టెన్నిస్‌, ఫుట్‌బాల్‌ వంటి విభాగాల్లో శిక్షణ ఇస్తారు. ఇప్పటి వరకూ ఇక్కడ 2 వేలమంది క్రీడాకారులు శిక్షణ పొందారు. ఈ అకాడమీలో క్రీడాకారులే కాకుండా 200 మంది కోచ్‌లు తర్ఫీదు పొందారు. పీవీ సైనా నెహ్వాల్‌, కిదాంబి శ్రీకాంత్‌, కశ్యప్‌, గురుసాయిదత్‌, సిక్కిరెడ్డి, సాత్విక్‌ సాయి రాజ్‌ వంటి చాంపియన్లు గోపీచంద్‌ అకాడమీలో శిక్షణ పొందిన వారే. ఇక్కడ 17 నాన్‌ ఏసీ బ్యాడ్మింటన్‌ కోర్టులు, జిమ్‌, రెసిడెన్సియల్‌ రూమ్స్‌ ఉన్నాయి. ప్రపంచ పారా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన మానసి జోషి గోపీచంద్‌ అకాడమీలోనే కోచింగ్‌ తీసుకున్నది. ప్రపంచ పారా బ్యాడింట్మన్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన తొలి క్రీడాకారిణి ఈమె.

ఉచిత శిక్షణ:
kammela-sai-baba
క్రీడల ద్వారా పేద విద్యార్థుల్లో మార్పు తీసుకువచ్చి వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నాం. తెలుగురాష్ర్టాల్లోని ప్రభుత్వ, కళాశాలలు, పాఠశాలల్లో అత్యాధునిక క్రీడా పరికరాలు అందిస్తూ, ఉచితంగా శిక్షణ ఇస్తున్నాం. ఇతర దేశాల్లో క్రీడా రంగానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తుంటారు. అందుకోసమే మన దేశం కంటే వారికే ఎక్కువ పతకాలు వెళుతున్నాయి.
-కమ్మెల సాయి బాబా, స్పోర్ట్స్‌ కోచింగ్‌ ఫౌండేషన్‌, వ్యవస్థాపక కార్యదర్శి

అంతర్జాతీయ స్థాయిలో పోటీ: దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి వచ్చి మా దగ్గర శిక్షణ పొందుతున్నారు. బ్యాడ్మింటన్‌ విభాగంలోనే ప్రతి ఏటా 150 మంది ప్రత్యేకంగా ట్రైనింగ్‌ తీసుకుంటున్నారు. నిష్ణాతులైన కోచ్‌లతో ఇక్కడ శిక్షణ ఇస్తున్నాం. ఇంటర్నేషనల్‌ లెవల్లో గట్టి పోటీ ఇవ్వడమేకాకుండా, స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సొంతం చేసుకున్న క్రీడాకారులూ ఉన్నారు.
-రాజేందర్‌, బ్యాడ్మింటన్‌ హెడ్‌ కోచ్‌, పుల్లెల గోపీచంద్‌ అకాడమీ

పేదపిల్లలకుప్రత్యేక

హైదరాబాద్‌లోని స్పోర్ట్ట్‌ కోచింగ్‌ ఫౌండేషన్‌ పేద పిల్లల క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి, ఆటల్లో ఆణిముత్యాలుగా తీర్చిదిద్దుతున్నది. ఇక్కడ శిక్షణ పొందినవారిలో ఎంతోమంది చాంపియన్లు ప్రపంచానికి పరిచయ ఫౌండేషన్‌ ద్వారా 300 పాఠశాలలకు చెందిన లక్ష మంది పేద విద్యార్థులు ఉచితంగా శిక్షణ పొందారు. 15మందికి పైగా కోచ్‌లను నియమించి, వాలీబాల్‌, ఫుట్‌బాల్‌, బాక్సింగ్‌, బ్యాడ్మింటన్‌, టెన్నిస్‌, క్రికెట్‌ వంటి విభాగాల్లో ప్రత్యేకంగా తర్ఫీదు ఇస్తున్నారు. నాన్‌ ప్రాఫిట్‌ ఆర్గనైజేషన్‌ అయిన స్పోర్ట్ట్‌ కోచింగ్‌ ఫౌండేషన్‌ సేవలను గుర్తించిన భారత సర్కారు ఉత్తమ స్వచ్ఛంద సేవా పురస్కారాన్ని అందించింది. హైదరాబాద్‌లోని పలు సర్కారీ బడుల్లో క్రీడామైదానాలను ఏర్పాటు చేసి మరింతమందిని ఆటలవైపు మళ్ళిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన పలువురు క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు.

బాక్సింగ్‌ జరీన్‌


zarin
నిఖత్‌ జరీన్‌ :
నిజామాబాద్‌ ఆణిముత్యం నిఖత్‌ జరీన్‌ అంతర్జాతీయ బాక్సింగ్‌ కోచ్‌ చిరంజీవి దగ్గర ఓనమాలు నేర్చుకొని అంతర్జాతీయ బాక్సింగ్‌ చాంపియప్‌లో ఆరు స్వర్ణ పతకాలు సాధించింది. జాతీయ స్థాయి బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లోమరో ఎనిమిది బంగారు పతకాలను కైవసం చేసుకున్నది. 2009లో అథ్లెటిక్స్‌లో కాంస్య పతకంతో పరిచయమైన నిఖత్‌ జరీన్‌ విజయవాడలో జరిగిన ఫైకా (ఖేల్‌ ఇండియా) అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో 100, 200 మీటర కాంస్యం సొంతం చేసుకున్నది. 2011లో మొట్టమొదటి ప్రపంచ జూనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం నుంచి ఇదే జోరు కొనసాగిస్తూ.. 2018-19 ప్రపంచ సీనియర్‌ బాక్సింగ్‌లో రజతం గెలుచుకొని 51 విభాగంలో మేరీకొమ్‌తో సమానంగా ఒలింపిక్‌ స్థానం కోసం సాధన చేస్తున్నది.

హుసాముద్దీన్‌: నిజామాబాద్‌ జిల్లా బాక్సర్‌ హుసాముద్దీన్‌ ప్రతిష్ఠాత్మక గోల్డ్‌ కోస్ట్‌ కామన్‌వెల్త్‌ క్రీడల్లో 56 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించి భవిష్యత్‌ ఆశాకిరణంగా ప్రశంసలు అందుకున్నాడు. 2018లో ఢిల్లీ ఆతిథ్యమిచ్చిన ఇండియా ఇంటర్నేషనల్‌ ఓపెన్‌లో కంచు పతకం నెగ్గాడు. జర్మనీలో జరిగిన కెమిస్ట్రీ కప్‌లో చాంపియన్‌గా నిలిచి అంతర్జాతీయ టోర్నీలో స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధించాలనే ప్రయత్నంలో ఉన్నాడీ బాక్సర్‌.

విభిన్న ఆటల్లో


Jyothi
ఆర్చరీ జ్యోతి: విజయవాడకు చెందిన 23 ఏండ్ల వెన్నం జ్యోతి సురేఖ విలువిద్యలో బాణంలా దూసుకెళ్తూ ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో రెండు కాంస్య పతకాలు గెలుపొందింది. గతేడాది ఏడు అంతర్జాతీయ పతకాలు సాధించింది. కాంపౌండ్‌ విభాగంలో దేశంలో నంబర్‌వన్‌ ఆర్చర్‌గా కొనసాగుతున్నది. షాంఘై ఆర్చరీ వరల్డ్‌ కప్‌ స్టేజ్‌-1లో నెగ్గింది. ఇప్పటి వరకు జ్యోతి మూడు స్వర్ణాలు, 11 రజతాలు, 10 కాంస్యాలు సాధించింది.

షూటర్‌ సింగ్‌: హైదరాబాద్‌కు చెందిన స్టార్‌ షూటర్‌ ఈషాసింగ్‌ 62వ జాతీయ షూటింగ్‌ చాంపియన్‌షిప్స్‌లో 3 స్వర్ణాలు సాధించింది. జర్మనీలో జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ ప్రపంచ కప్‌లో 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఈషాసింగ్‌ కాంస్యం దక్కించుకుని మన ఖ్యాతిని ప్రపంచానికి చాటుతున్నది.

టేబుల్‌ టెన్నిస్‌ నైనా: హైదరాబాద్‌కు చెందిన నైనా జైస్వాల్‌ టేబుల్‌ టెన్నిస్‌లో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో ప్రతిభ చాటుతున్నది. ఇటీవల హర్యానాలో జరిగిన జూనియర్‌, యూత్‌ జాతీయ అంతర్‌ రాష్ట్ర టీటీ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గింది. తెలంగాణ నుంచి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. నేషనల్‌ లెవల్లో 2011, వరుసగా హాట్రిక్‌ విజయాన్ని సొంతం చేసుకున్నది. జూనియర్‌ డబుల్స్‌లో సిల్వర్‌ మెడల్‌ సాధించింది. క్యాడెట్‌ గర్ల్స్‌ టీమ్‌లో జాతీయ స్థాయి చాంపియన్‌గా ఒకటి, సింగిల్స్‌లో మరొకటి రెండు విభాగాల్లో బంగారు పతకాలు గెలిచింది. సబ్‌ జూనియర్‌ గర్ల్స్‌ విభాగంలో వరుసగా గోల్డ్‌ మెడల్స్‌ అందుకున్నది.

వాటర్‌స్పోర్ట్స్‌ అలేఖ్య: వాటర్‌ స్పోర్ట్స్‌లో ప్రతిభ చూపుతున్నది హైదరాబాద్‌కు చెందిన మహిళ అలేఖ్య మహరాజ్‌. 2011లో జరిగిన వరల్డ్‌ సెయిలింగ్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించింది. అంతకు ముందే రాష్ట్ర, జాతీయ పోటీల్లో పతకాలు సాధించింది. స్పెయిన్‌లో జరిగిన పోటీల్లో జె/80 బోట్‌తో అలేఖ్య టీమ్‌తో పాల్గొన్నది. ఇండియా నుంచి పాల్గొన్న బృందాల్లో మొదటి స్థానం సాధించింది. ‘మహిళలకు, బాలికలకు స్ఫూర్తిగా నిలిచేందుకు రానున్న అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటాను’ అంటున్నది అలేఖ్య.

తైక్వాండో సాయి: ఉత్తర కొరియాలో జరిగిన తైక్వాండో మార్షల్‌ ఆర్ట్స్‌ చాంపియన్‌ షిప్‌లో గోల్డ్‌మెడల్‌ సాధించాడు మన హైదరాబాద్‌ కుర్రాడు సాయి దీపక్‌. మలేషియా ఇంటర్నేషనల్‌ ఓపెన్స్‌లో, ఇండియా ఇంటర్నేషనల్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు సాధించాడు. నాలుగు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులు సాధించాడు. దీపక్‌ రానున్న ఒలింపిక్స్‌లో తైక్వాండోలో ఇండియాకు గోల్డ్‌ మెడల్‌ తీసుకురావడానికి సిద్ధమవుతున్నాడు.

సౌత్‌ ఇండియా నుంచి ఒకే ఒక్కడు: వుడ్‌బాల్‌ క్రీడాకారుడు ఆదర్శ్‌ది జనగామ జిల్లా. సౌత్‌ ఇండియా నుంచి ఒకే ఒక్కడుగా వుడ్‌బాల్‌లో ఇంటర్నేషనల్‌ పోటీల్లో రాణిస్తున్నాడు. 2018లో థాయిలాండ్‌లో నిర్వహించిన వరల్డ్‌ కప్‌ పోటీల్లో పాల్గొని ప్రత్యర్థి పాకిస్తాన్‌ మీద 17 పాయింట్లు సాధించాడు.
-పసుపులేటి వెంకటేశ్వరరావు,
సెల్‌: 8885797981

510
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles