విఘ్నేశ్వరుని వ్రతకథ ప్రారంభం


Sun,September 1, 2019 02:13 AM

Vinayaka
ఒకరోజు ధర్మరాజుతో శౌనకాది మహామునులందరూ కలిసి సూతుడి దగ్గరికి వెళ్ళి సత్సంగ కాలక్షేపము చేయతలిచారు. అపుడు సూతుడు మిగతా మునులతో నేను ఈ రోజు మీకు వినాయకుని పుట్టుక, చవితి రోజున చంద్రుణ్ని దర్శిస్తే కలిగే దోషం, దాని నివారణోపాయములు వివరిస్తాను అని చెప్పడం మొదలు పెట్టాడు. శౌనకాది మహా మునులంతా శ్రద్ధగా వింటున్నారు. పూర్వకాలమున ఏనుగు రూపములో కల గజాసురుడు అనే రాక్షసుడు పరమశివున్ని గురించి ఘోర తపస్సు చెయ్యడం ప్రారంభించాడు. అతని తపస్సుకు మెచ్చిన శివుడు గజాసురా! నీకేమి వరము కావలెనో కోరుకో అని అనెను. అంత గజాసురుడు శివున్ని అనేక విధములుగా స్తుతించి స్వామీ! లోకాలన్నింటిలోనూ పూజించబడే మీరు నా ఉదరంలో ఇక నుండి నివాసము ఉండాలని వరమును కోరెను. భక్తుల కోర్కెలను ఎన్నడూ జవదాటని భోళా శంకరుడు వెంటనే గజాసురుని ఉదరంలోకి ప్రవేశించి నివాసముండసాగెను. కైలాసములో పార్వతీదేవి తన భర్త ఎటు వెళ్ళాడో తెలియక అనేకచోట్ల వెతకడం మొదలు పెట్టెను. కొంత కాలానికి తన పతి గజాసురుడనే రాక్షసుని ఉదరంలో ఉన్నాడని తెలుసుకొని, తిరిగి తీసుకు వచ్చే మార్గము తెలియక బాధపడుతూ చివరికి విష్ణుమూర్తిని ప్రార్థించి, జరిగినదంతా చెప్పి ఓ మహానుభావా! పూర్వం భస్మాసురుడి బారి నుండి నా భర్తను రక్షించావు. ఇప్పుడు కూడా అలాగే తగు ఉపాయముతో రక్షించమని విలపించగా, అంత శ్రీహరి పార్వతీ దేవిని అనునయించి నేనున్నానని అభయమిచ్చెను. అప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మాది దేవతలతో చర్చించి, చివరికి దీనికి గంగిరెద్దుల మేళమే సరి అయినదనే ఆలోచనకు వచ్చి, శివుని వాహనమైన నందిని గంగిరెద్దుగా అలంకరించి, బ్రహ్మాది దేవతలు తలొక వాయిద్యములు పట్టుకోగా శ్రీహరి చిరుగంటలు, సన్నాయి పట్టుకొని మేళగాని వేషంలో గజాసుర సంహారానికి అతని రాజ్యము నందు ప్రవేశించి, పలుచోట్ల జగన్మోహనముగా ఆడించుచుండిరి.

ఈ విశేషము విన్న గజాసురుడు వారిని పిలిపించి తన భవనము ఎదుట ఆడమనెను. బ్రహ్మాది దేవతలు వాయిద్యముల విశేషమునకు తోడు శ్రీహరి చిత్ర విచిత్రములుగా గంగిరెద్దును ఆడించుచుండటంతో పరమానంద భరితుడైన గజాసురుడు మీకేమి కావాలో కోరుకోండి అని అనెను. అంత శ్రీహరి గజాసురున్ని సమీపించి ఓ రాజా! ఇది శివుని వాహనమైన నంది. శివుడిని కనుగొనడానికి వచ్చెను. కావున, శివుని మాకివ్వుము అని పలికెను. అంత ఆ అసురుడు ఉలిక్కిపడి తన దగ్గరికి వచ్చినది రాక్షసాంతకుడగు శ్రీహరి అని గుర్తించి తనకు ఇక మరణమే శరణ్యమని నిర్ధారణకు వచ్చి తన గర్భములో ఉన్న శివుడిని నా శిరస్సుకు త్రిలోకములలో పూజలు జరిగేలా చేసి తన చర్మమును నీవు ధరించవలెనని ప్రార్థించెను. భోళా శంకరుడు సరేనని వరమునిచ్చెను. అంత శ్రీహరి అనుమతితో నంది గజాసురుని తన కొమ్ములతో సంహరించెను. అపుడు శివుడు ఆ అసురుని ఉదరము నుండి బయటకు వచ్చి విష్ణుమూర్తిని స్తుతించెను. బ్రహ్మాదులతో శ్రీహరి దుష్టులకు ఇటువంటి వరములు ఇవ్వరాదు. ఒకవేళ ఇచ్చినచో పాముకు పాలు పోసి పెంచినట్లు అగునని ఉపదేశించి బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి తాను వైకుంఠమునకు బయలుదేరెను. శివుడు నందిని ఎక్కి కైలాసముకు వెళ్ళెను.
Vinayaka1

వినాయకుని జననం

కైలాసములో ఉన్న పార్వతి దేవతలవల్ల తన భర్త వస్తున్నాడని విని సంతోషించి అభ్యంగన స్నానం చేసి తన శరీరము నుండి వచ్చిన నలుగు పిండితో ఒక బాలుణ్ని తయారు చేసి ప్రాణము పోసి, ద్వారము దగ్గర కాపలాగా ఉంచెను. స్నానానంతరం సర్వాభరణాలు అలంకరించుకుని తన పతి రాకకై ఎదురు చూడసాగెను. అంత పరమేశ్వరుడు నందిని అధిరోహించి వచ్చి లోపలికి వెళ్లుచుండగా ద్వారం దగ్గర ఉన్న బాలుడు అడ్డగించెను. దీనితో కోపావేశుడైన శివుడు తన త్రిశూలముతో ఆ బాలుని కంఠము తెంచి లోపలికి వెళ్ళెను. పార్వతి లోపలికి వచ్చిన శివుని పూజించి సాదరంగా లోనికి తీసుకువెళ్ళెను. చాలాకాలం తరువాత కలుసుకున్న దంపతులిద్దరూ ప్రియసంభాషణములు ముచ్చటించుకుంటుండగా మధ్యలో బాలుని మాట వచ్చి జరిగిన విషయము తెలుసుకుని తాను చేసిన పనికి శంకరుడు చింతించెను. అంత మహేశ్వరునికి తాను గజాసురునికిచ్చిన వరము గుర్తొచ్చి, గజాసురుని తలను ఆ బాలుడికి అతికించి ప్రాణము పోసి గజాననుడనే పేరు పెట్టెను. ఆ బాలుడిని పుత్ర వాత్సల్యముతో ఆదిదంపతులిద్దరూ అల్లారుముద్దుగా పెంచుకొనసాగిరి. గజాననుడు కూడా భక్తి ప్రపత్తులతో తల్లిదండ్రులను సేవించుచుండెను. ఇతడు సులభముగా ఎక్కి తిరుగుటకు అనింద్యుడను ఒక ఎలుకను వాహనముగా చేసుకొనెను. కొన్ని రోజులకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించెను. ఇతడు మహా బలశాలి. కుమార స్వామి నెమలిని వాహనముగా చేసుకుని దేవతల సేనానాయకుడిగా ప్రఖ్యాతి గాంచెను.

విఘ్నేశాధిపత్యం:

ఒకరోజు దేవతలు, మునులు పరమశివుణ్ని సేవించి, విఘ్నములకు అధిపతిగా ఒకరిని నియమించమని అడిగెను. అక్కడే ఉన్న కుమారస్వామి గజాననుడు మరుగుజ్జువాడు, అసమర్థుడు. కావున, ఆ ఆధిపత్యము తనకిమ్మని తండ్రిని ప్రార్థించెను. అపుడు శివుడు ఇద్దరినీ పిలిచి మీలో ఎవరు ముందుగా ముల్లోకములలోని నదులన్నిటిలో స్నానం చేసి నా దగ్గరకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం ఇస్తానని చెప్పెను. ఇది వినగానే ఈ పరీక్షకు కుమారస్వామి సమ్మతించి తన వాహనమైన నెమలి మీద ఎక్కి వాయువేగంతో వెళ్ళెను. అక్కడే ఉన్న గజాననుడు తండ్రి దగ్గరకు వెళ్ళి వినమ్రంగా నమస్కరించి తండ్రీ! నా అసమర్థత తెలిసి కూడా మీరు ఇట్లాంటి పరీక్ష పెట్టుట తగునా అని తగిన ఉపాయము చెప్పమని ప్రార్థించెను. అంత శివుడు కరుణతో వత్సా! ఒక్కసారి నారాయణ మంత్రాన్ని పఠించినవారు మూడువందల కల్పాల కాలం పుణ్యనదులలో స్నానమాచరించిన ఫలం పొందుతారని చెప్పి పుత్రునకు ఆ మంత్రం ఉపదేశించెను. గజాననుడు తన తండ్రి ఉపదేశించిన మంత్రమును భక్తితో పఠిస్తూ కైలాసములోనే ఉండెను. నారాయణ మంత్ర ప్రభావము చేత కుమారస్వామి ఏ నదిలో స్నానమాచరించుటకు వెళ్ళినా తన కంటే ముందుగా గజాననుడు అక్కడ ఉండటాన్ని గమనిస్తాడు. కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసములో శివుని పక్కనే ఉన్న గజాననునికి నమస్కరించి తన తప్పును తెలుసుకొని ఈ ఆధిపత్యము తన అన్నగారికే ఇమ్మని తండ్రిని కోరెను.

అంత పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితి నాడు గజాననునికి విఘ్నాధిపత్యం ఇచ్చెను. దీంతో విఘ్నేశ్వరుడికి భక్తులు కుడుములు, ఉండ్రాళ్ళు మొదలైనవి నైవేద్యంగా పెట్టగా వాటిని సంతోషంగా తిని, కొన్ని తన వాహనమునకు పెట్టి, మిగతా వాటిని చేతిలో పెట్టుకుని భుక్తాయాసంతో సాయంకాల సమయమున తిరిగి కైలాసమునకు చేరుకొనెను. అక్కడే ఉన్న తల్లిదండ్రులకు నమస్కరించ తలచి సాష్టాంగ నమస్కారం చేయడానికి ప్రయత్నించగా తాను ఎక్కువగా ఆరగించడం వల్ల వంగడానికి తన శరీరము సహకరించక పోవడంతో ఇబ్బంది పడతాడు. అది చూసి శివుని శిరస్సు మీద ఉన్న చంద్రుడు వికటముగా నవ్వెను. అంత రాజదృష్టి సోకితే రాయి అయినా పగులును అనే సామెత నిజమగునట్టు గజాననుడి పొట్ట పగిలి అందులో ఉన్న కుడుములు ఆ ప్రదేశం మొత్తం దొర్లి గణేషుడు చనిపోయాడు. అపుడు పార్వతి పుత్రుని మరణము చూసి తట్టుకొనలేక ఓరి పాపాత్ముడా! నీ దృష్టి వల్ల నా కుమారుడు మరణించినాడు. కావున, ఇకపై నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురుగాక అని శపించెను.
Vinayaka2

ఋషిపత్నులకు నీలాపనిందలు:

అదే రోజున సప్తమహర్షులు యజ్ఞము చేయుచూ, తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణము చేస్తున్నారు. ఋషి పత్నులను చూసి అగ్నిదేవుడు మోహించి శాపభయముతో క్షీణించసాగెను. ఇది గ్రహించిన అగ్నిదేవుని భార్య స్వాహాదేవి అరుంధతి రూపము తప్ప తక్కిన ఆరుగురి రూపములను తానే దాల్చి పతికి సేవ చేయుచుండెను. ఇది చేసిన ఋషులు తమ భార్యలనుకుని అనుమానించి వారిని విడిచిపెట్టిరి. ఇది విన్న బ్రహ్మ మొత్తము తన దివ్య నేత్రముతో గ్రహించి ఓయి ఋషి పుంగవులారా! ఆ రోజు అగ్నిదేవునికి సేవించిన వారు మీ భార్యలు కారు అని జరిగినదంతా చెప్పి వారిని సమాధాన పరిచి ఇదంతా వారు చంద్రుని చూడటం వల్లే వచ్చిందని తెలిపెను. దీనికి తగిన మార్గము అన్వేషించుటకు బ్రహ్మాది దేవతలు కైలాసానికి వెళ్ళి ఉమామహేశ్వరులను సేవించి, మృతుడై పడి ఉన్న గణేశున్ని బతికించి జరిగింది తెలిపి, తగు శాపమును ఉపసంహరింపమని ప్రార్థించెను. అంత పార్వతి గణేశున్ని ముద్దాడి ఏ రోజున విఘ్నేశ్వరుని చూసి చంద్రుడు నవ్వెనో ఆ రోజు తప్ప మిగిలిన, రోజులలో చంద్రుణ్ని చూసినా ఏమీ కాదు అని శాప విమోచనం చెప్పెను. బ్రహ్మాది దేవతలు సంతోషించి తమ ఇళ్ళకు చేరుకొని భాద్రపద శుద్ధ చతుర్థినాడు చంద్రుణ్ని చూడకుండా జాగ్రత్తగా ఉండిరి. ఇలా కొంత కాలము గడిచెను...

శమంతకమణి కథ:

ద్వాపర యుగమున ఒకనాడు ద్వారకాధీశుడైన శ్రీకృష్ణుని చూడటానికై నారదుడు వచ్చి దర్శించి, ఇద్దరూ ప్రియ సంభాషణలు మాట్లాడుకొనుచుండగా సాయంత్రము అయ్యెను. ఆ రోజు వినాయక చతుర్థి. కావున, పార్వతి శాపముతో చంద్రుణ్ని చూడరాదు. కనుక, తాను ఇంటికి వెళ్ళెదనని, అపుడు జరిగిన వృత్తాంతము మొత్తము చెప్పి నారదుడు స్వర్గ లోకమునకు వెళ్లెను. ఇది తెలుసుకుని శ్రీ కృష్ణుడు ఈ రోజు ఎవరూ చంద్రుణ్ని చూడరాదని చాటింపు వేయించాడు. కృష్ణునకు పాలు అంటే ఇష్టము. కావున, వాటిపై మనసు పుట్టి గోశాలకు వెళ్ళి పాలు పిదుకుతూ పాలలో చంద్రుని ప్రతిబింబము చూసి, ఆహా నా కెట్టి అపనింద రానున్నదో కదా అని చింతించెను.కొన్నాళ్ళకు యదువంశ రాజు సత్రాజిత్తు సూర్యుని ఉపాసించి శమంతకమనే పేరు గల అద్భుతమైన మణిని సంపాదించి, ద్వారకా నగరంలోని శ్రీకృష్ణుణ్ని సందర్శిస్తాడు. అతన్ని శ్రీకృష్ణుడు సాదరంగా ఆహ్వానించి మర్యాద చేసి, ఈ మణిని మన రాజుకు ఇమ్మని అడిగెను. అంత సత్రాజిత్తు రోజుకు ఎనిమిది బారువుల బంగారమిచ్చే ఈ మణిని నేనెవ్వరికీ ఇవ్వనని తిరస్కరించాడు. దీనితో కృష్ణుడు సరే నీ ఇష్టం అని ఊరుకున్నాడు. ఇలా కొన్ని రోజులు గడవగా ఒక రోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో ధరించి అడవికి వేటకు వెళ్ళగా, ఒక సింహం మెడలోని ఆ మణిని చూసి మాంసపు ముద్ద అని భ్రమపడి అతనిని చంపి, మణిని నోట కరుచుకుని పోవుచుండగా, ఒక మగ ఎలుగుబంటి (జాంబవంతుడు) ఆ సింహముతో పోరాడి ఆ మణిని తీసుకొని కొండగుహలోని తొట్టెలో ఆడుకుంటున్న తన కూతురైన జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చెను.మరునాడు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్త విని కోపంతో ఆ రోజు శ్రీ కృష్ణుడికి మణి ఇవ్వలేదని, ఈ రోజు నా తమ్ముడిని చంపి మణిని తస్కరించాడని నగరమంతా చాటింపు వేయించాడు. అది విన్న శ్రీ కృష్ణుడు బాధపడి అయ్యో ఆ రోజు పాలలో చంద్రుని చూసినందుకే కదా ఇటువంటి నీలాపనిందలు అని అనుకొని ఈ అభియోగమును తొలగించు కొనుటకు బంధుసమేతుడై అడవికి వెళ్ళి వెతుకుచుండెను. పలుచోట్ల గాలించగా ఒకచోట ప్రసేనుని మృతదేహము, సింహము కాలి జాడలు, ఎలుగుబంటి పాదముల గుర్తులు కనిపించెను.

ఆ పాదముల గుర్తులను బట్టి కొంత దూరము వెళ్ళగా ఒక పర్వతగుహ ద్వారము దగ్గర అగి తన పరివారమును అక్కడే ఉండమని చెప్పి శ్రీ కృష్ణుడు లోపలికి వెళ్ళి, అక్కడ బాలిక ఉయ్యాలకు కట్టబడి ఉన్న మణిని చూసి తీసుకు వెళ్ళడానికి ప్రయత్నించెను. అది చూసిన జాంబవతి ఎవరో ఒక వింత మనిషి వచ్చాడంటూ కేకలు వెయ్యసాగెను. అంత కోపావేశుడైన ఆ బాలిక తండ్రి జాంబవంతుడు శ్రీ కృష్ణునిపై పడి గోళ్ళతో గిచ్చి, కోరలతో రక్కి అరుస్తూ కృష్ణుణ్ని చంపడానికి ప్రయత్నించెను. అంత వాసుదేవుడు అతన్ని పడద్రోచి చెట్లతోనూ, రాళ్ళతోనూ, చివరికి ముష్టి ఘాతాలతోనూ ఇరవై ఎనిమిది రోజులు రాత్రీ, పగలూ యుద్ధం చేస్తారు. దీనితో జాంబవంతుడు అలసి, క్షీణించి దేహమంతా దెబ్బలతో తనతో ఇట్లా యుద్ధము చేసి తన బలమంతా హరించిన మహా పురుషుడు త్రేతాయుగమున రావణ సంహారి అయిన శ్రీరామచంద్రుడుగా భావించి నమస్కరించి దేవదేవా! భక్త జనపాలకా! నీవు అలనాడు రావణాది రాక్షస సంహారములకై అవతరించిన శ్రీరామచంద్రునిగా నేను గుర్తించాను. అపుడు నీవు నా మీద ప్రేమతో వరము కోరుకొమ్మని అడగగా, నేను బుద్ధి మాంద్యముతో మీతో ద్వంద యుద్ధము చేయవలననే వరము కోరుకుంటివి. అది కాలాంతమున జరగగలదని మీరు శెలవిచ్చిరి. అప్పటి నుండి మీ నామస్మరణ చేస్తూ కాలం గడుపుతున్నాను. ఇంత కాలానికి తమరు నా గృహముకు వచ్చి నా కోరికను తీర్చినారు అని పరిపరి విధములుగా స్తుతించి స్వామీ! మీతో యుద్ధము కారణముగా నా శరీరము అంతా గాయములతో బాధపడుచున్నది. నన్ను ఈ బాధల నుండి విముక్తున్ని చెయ్యమని ప్రార్థించెను. అంత శ్రీకృష్ణుడు జాంబవంతున్ని వాత్సల్యంతో నిమరగా అతడి బాధలన్నీ పోయి పూర్వ శరీరాన్ని పొందాడు. కృష్ణుడు జాంబవంతుడికి జరిగిన వృత్తాంతము అంతా చెప్పి మణిని ఇమ్మని కోరగా స్వామీ! ఈ మణితో పాటు నా పుత్రికను కూడా స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చెయ్యమని కోరెను.

దీనికి శ్రీకృష్ణుడు అంగీకరించి మణితోపాటు జాంబవతిని కూడా తీసుకుని గుహ బయట తన కోసం ఎదురుచూస్తున్న పరివారమునకు జరిగింది వివరించి సత్రాజిత్తు దగ్గరికి వెళ్ళి ఈ వృత్తాంతమంతా చెప్పగా, అంత సత్రాజిత్తు అయ్యో తమరిపై నేను తీవ్ర అభియోగము మోపానని బాధపడి మణితోపాటు తన కుమార్తె అయిన సత్యభామను కూడా స్వీకరించమని కోరెను. అంత శ్రీకృష్ణుడు మణి నా కొద్దని ఒక శుభముహూర్తమున జాంబవతీ, సత్యభామలిద్దరినీ వివాహమాడెను. ఈ వివాహమునకు వచ్చిన దేవతలు, మునులు శ్రీకృష్ణుణ్ణి స్తుతించి స్వామీ! మీరు తగిన సమర్థులు కనుక మీ మీద వచ్చిన అపనిందను పోగొట్టుకోగలిగారు. మరి, మాలాంటి సామాన్యుల గతి ఏమని ప్రార్థించగా, శ్రీ కృష్ణుడు దయాహృదయుడై ఎవరైతే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు యాథావిథిగా వినాయకుని పూజించి ఈ శమంతకమణి కథను చదివినగానీ, వినిన గానీ అక్షింతలు తలపై చల్లుకుంటారో వారికి చంద్రుణ్ని చూసిననూ ఎటువంటి ప్రమాదము ఉండదు అని చెప్పెను. అంత దేవతలు, మునులు, జనులు సంతోషముతో తమ తమ ఇళ్ళకు చేరి ప్రతీ సంవత్సరము భాద్రపద శుద్ధ చతుర్థి నాడు తమ స్థాయికి తగ్గట్టుగా గణపతిని పూజించి, తాము సుఖముగా జీవించుచుండిరని సూతుడు శౌనకాది మహామునులకు వినిపించి, అక్కడే ఉన్న ధర్మరాజుతో నువ్వు కూడా ఇదే ప్రకారముగా గణపతిని పూజిస్తే తప్పక నీకు జయం కలుగుతుంది. తిరిగి నీ రాజ్యం నీకు దక్కుతుంది. దీన్ని ఎంతో మంది భక్తితో ఆచరించారు. ఈ వ్రత ప్రభావముతో దమయంతి నలుని, శ్రీ కృష్ణుడు జాంబవతిని పొందారు. ఇంద్రుడు వృత్తాసురుణ్ని సంహరించాడు. రావణుడు సీతను అపహరించినపుడు రాముడు ఈ వ్రతం ఆచరించి సీతను తిరిగి పొందాడు. భగీరథుడు గంగను తేవడానికి, దేవాసురులు అమృతాన్ని పుట్టించడానికి ఈ గణనాథ వ్రతాన్ని ఆచరించారు. మనస్సులో తలచిన కార్యాలను నేరవేరుస్తాడు. కనుక, గణపతిని సిద్ధి వినాయకుడు అంటారు. ఈ గణపతిని విద్య ప్రారంభించేటప్పుడు పూజిస్తే చక్కటి విద్యను పొందుతారు. భర్తను కోరి పూజించే వారికి చక్కని భర్త లభిస్తాడు. విధవలు పూజిస్తే మరు జన్మలో వైధవ్యం రాదు.గజాననుడు జన్మించింది భాద్రపద శుద్ధ చతుర్థి. గణాధిపతి అయినది కూడా అదే రోజు. అందుకే భాద్రపద శుద్ధ చతుర్థినాడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే నాలుగు వర్ణాలవారు, స్త్రీలు, పిల్లలూ అందరూ ఈ వ్రతాన్ని యధావిధిగా ఆచరించి, తమ కోరికలను నెరవేర్చుకొనగలరు అని చెప్పాడు సూతుడు. అపుడు ధర్మరాజు విధి ప్రకారముగా గణపతిని పూజించి సకలైశ్వర్యాలనూ, రాజ్యాన్ని పొంది సుఖంగా జీవించాడు.

ఇది శ్రీ స్కాంద పురాణములోని ఉమామహేశ్వర సంవాదమునందలి వినాయకవ్రత కల్పము.

ఉద్యాపన:


యజ్ఞేన యజ్ఞ మయజంత దేవా
తాని ధర్మాణి ప్రథమాన్యాసన్
తేహ నాకం మహిమాన స్సచంతే
యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః
(దేవుని ఈశాన్య దిశగా కొంచెము కదపండి!)


సర్వేజనా స్సుఖినో భవంతు...
ఓం శాంతిః ఓం శాంతిః ఓం శాంతిః

889
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles