V నాయకుడు


Sun,September 1, 2019 01:56 AM

Ganesh-Chaturthi
v అంటే విజయానికి సంకేతం. వినాయకునికీ ప్రతిరూపం. మీరు విజేత కావాలంటే విఘ్నేశ్వరుడిని ఆరాధించాలి. అందుకు లంబోదరుడ్ని చూసి మనం ఏం నేర్చుకోవచ్చు? గణపతీ! నీవే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడవు, నీవే ఇంద్రుడవు. నీవే అగ్నివి, వాయువు, సూర్యుడవు, చంద్రుడవు. నీవే భూలోకం, అంతరిక్షం, స్వర్గం. నీవే ఓం కారం. శైవం, వైష్ణవం, జైనం, బౌద్ధం.. అందరూ ఆరాధించే ఆదిదేవుడవు.

మన దేశంలోనే కాదు చైనా, నేపాల్, జపాన్, ఇండోనేషియా వంటి దేశాల్లో కూడా విఘ్నేశ్వరుడిని ఆరాధిస్తారు.అందుకే వినాయకుడు ఒక పేరు కాదు.. ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్. శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే తెల్లని వస్ర్తాలు ధరించినవాడు, అంతటా వ్యాపించినవాడు, చంద్రునిలా తెల్లనైన శరీరవర్ణం గలవాడు, నాలుగు చేతులు కలవాడు, అనుక్షిగహదృష్టితో కూడిన ముఖం గలవానిని (వినాయకుని) అన్ని విఘ్నాలు ఎదుర్కొనుటకు ధ్యానించపూను. విఘ్నాలు ఎదుర్కొన్నవాడు విజేత అవుతాడు. అంటే విజయానికి సంకేతం. వినాయకునికీ ప్రతిరూపం. మీరు విజేత కావాలంటే విఘ్నేశ్వరుడిని ఆరాధించాలి. అందుకు లంబోదరుడ్ని చూసి మనం ఏం నేర్చుకోవచ్చు?గణపతిని ఒక మేనేజ్మెంట్ గురుగా, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్‌గా అర్థం చేసుకోవాలి. ఆచరించాలి. వినాయకుని ఆకారానికి సంబంధించిన తాత్విక వివరణలో వ్యక్తిత్వ వికాస పాఠాలున్నాయి. అవేంటో తెలుసుకోండి.

పెద్ద తల:

వినాయకుని పెద్ద తల మనం పెద్దగా ఆలోచించాలని సూచిస్తుందన్నమాట. లో ఎయిమ్ ఈజ్ క్రైమ్ అంటారు అబ్దుల్ కలామ్. అందుకే, మన లక్ష్యం పెద్దదిగా ఉండాలి. మన ఆలోచనలూ పెద్దవిగా ఉండాలన్నమాట. ఇదే విషయం గణపతి పెద్ద తలని చూసి అర్థం చేసుకోవాల్సింది. థింగ్ బిగ్... అచీవ్ బిగ్.

చిన్న కళ్లు:

గణపతి చిన్న కళ్లు ఫోకస్‌కు సింబల్. ఏదైనా వింతని చూసేప్పుడు మన కళ్లు పెద్దవవుతాయి. ఏకాక్షిగతగా గమనించేప్పుడు చిన్నవవుతాయి. గణపతి కళ్లు, మన ఫోకస్ ఎప్పుడూ మన లక్ష్యం మీదుండాలని, ఫోకస్ పెడితే సక్సెస్ మీదే అవుతుందని చెబుతాయి.

పెద్ద చెవులు - చిన్న నోరు:

Give every man thy ear but few thy voice అంటారు షేక్స్పియర్. వినాయకుని చెవులు, నోరు కూడా ఇదే విషయాన్ని చెబుతాయి. పెద్ద చెవులు చూసి ఎక్కువగా వినాలని, చిన్న నోరు చూసి తక్కువగా మాట్లాడాలని మనం అర్థం చేసుకోవాలి.

తొండం:

గణపతి పొడవైన తొండం వాసన పసిగట్టే శక్తి ఎక్కువగా ఉండాలని చెబుతుంది. భవిష్యత్తులో జరగబోయే మంచిని, చెడుని ముందే వాసన చూసి పసిగట్టాలని దీనర్థం. ఆ తొండానికి ఎటువైపు అయినా కదిలే సౌలభ్యం ఉంటుంది. మనం కూడా అవకాశాలు వచ్చినప్పుడు వదులు కోకుండా అటువైపు కదలాలని బోధిస్తుంది. చెడు ఎదురైనప్పుడు దూరంగా వెళ్లాలని చెబుతుంది.

పెద్ద బొజ్జ:

గణపయ్యకు ఉండే పెద్ద బొజ్జ జీర్ణం చేసుకునే శక్తి ఎక్కువగా ఉండాలని సూచిస్తుంది. మనిషిగా పుట్టినందుకు మనం జీర్ణించుకోవాల్సిన విషయాలు చాలానే ఉంటాయి. మంచి చెడు, సుఖం దుఃఖం, ప్రేమ ద్వేషాలు.. ఇలాంటి వాటినన్నింటినీ మనం జీర్ణించుకోవాలి. అప్పుడే విజయం వరిస్తుంది.

నాలుగు చేతులు:

వినాయకునికి నాలుగు చేతులుంటాయి. ఒక చేతిలో లడ్డు ఉంటుంది. ఇంకో చేయి మనకు అభయమిస్తుంది. ఇచ్చి పుచ్చుకోవడంలో బలపడే బంధాలకు ఈ చేతులు ప్రతీకలు. వెనకాల ఉండే కుడిచేతితో గణపతి పరశువు పట్టుకుంటాడు. గొడ్డలి అంటే కటాఫ్.. పనికిరాని విషయాల్ని, అజ్ఞానాన్ని, వృథా ప్రయాసల్ని కటాఫ్ చేయాలని ఇది చెబుతుందన్నమాట. ఎడమ చేతిలో ఉండే పాశం విఘ్నాలని కట్టిపడేసే సాధనంగా చెప్పుకోవచ్చు. అవరోధాల్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచిస్తుంది.

దంతాలు :

దంతాలు అందానికి ప్రతిరూపాలు. గణపతి రెండు ఏనుగు దంతాలలో ఒకటి విరిగి ఉంటుంది. మంచీ చెడులు పక్క పక్కనే ఉంటాయని ఇది తెలియజేస్తుంది. విరిగిన దంతం త్యాగానికి చిహ్నం. కొన్ని పొందాలంటే కొన్ని వదులుకోవాలని కూడా సూచిస్తున్నట్టు.

మూషిక వాహనం:

గణేషునిది భారీ శరీరం. కానీ, అతని వాహనమైన మూషికం మాత్రం చాలా చిన్నది. అంటే ఆయనకు ఎలాంటి ఈగో ఫీలింగ్స్ లేవు. మనుషులు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి, చిన్నవాళ్లని చిన్నచూపు చూడకూడదని వాహనాన్ని చూసి అర్థం చేసుకోవచ్చు.

హిందూమతంలో ప్రణవ మంత్రం అయిన ఓం కార స్వరూపమే వినాయకుడు అని చెబుతారు. కానీ, గణపతి కేవలం ఓం కారం మాత్రమే కాదు.
అందుకే...
తొండము నేకదంతమును తోరపు
బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల
మందహాసమున్
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయా
ఓ గణాధిపతి నీకు మొక్కెదన్!
జై బోలో గణేశ్ మహరాజ్ కీ! జై!!

309
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles