వృద్ధాప్యం కాదు పెద్దబాలశిక్ష


Sun,August 18, 2019 01:35 AM

Old-people
మన వర్తమానానికి వెలుగులైనవాళ్లు. మన భవిష్యత్‌ నడకకు బాటలు వేసినవాళ్లు. నేటి మన జీవితాన్ని మన కంటే ముందే కలకన్నవాళ్లు. గతకాలపు కష్టాలను తరిమేసి వర్తమాన అడుగులకు చేయూతనిచ్చి భవిష్యత్‌ బంగారుమయం కావాలని ఆకాంక్షించినవాళ్లు. బాల్యంలో కష్టాలను అనుభవించి, యవ్వనాన్ని మనకై త్యాగం చేసి, వృద్ధ్దాప్యంలో ఆదరణ కోరుకుంటున్నవారు. బిడ్డల భవిష్యత్తు కోసం చిన్న చిన్న సరదాలను సైతం త్యాగం చేసి అహరహం శ్రమించి వృద్ధులైనవాళ్లు. చివరి ఘడియల్లో వారి జీవితం సంతోషంగా గడుస్తుందా? అయినవారికి దూరమై, బతుకు భారమై, కష్టాలకు చేరువై, వృద్ధ్దాశ్రమాల పాలై దిక్కుమొక్కులేని చావు చస్తున్నారా? ఆగస్టు 21 న జాతీయ వృద్ధుల దినోత్సవం (నేషనల్‌ సీనియర్‌ సిటిజన్స్‌ డే) సందర్భంగా పెద్ద బాలశిక్షలాంటి వారి జీవితంపై ముఖచిత్ర కథనం.
Old-people1
నాగరిక జీవనశైలి, పెరిగిన జీవనవేగం, వృద్ధుల అవసరాలకు ఖర్చుపెట్టాల్సి రావటం వంటి కారణాల వల్ల నేటి సమాజంలో వృద్ధులపట్ల నిర్లక్ష్యం, విముఖత పెరిగాయి. దీంతో కుటుంబసభ్యుల మమతానురాగాలకు దూరమై, అనారోగ్యం, వయోభారంతో వృద్ధాశ్రమాల్లో బతుకీడుస్తున్న వృద్ధుల సంఖ్య ఏటికేడు పెరుగుతూ వస్తున్నది. దేశవ్యాప్తంగా ఉన్న ఈ దుస్థితిని నివారించి వృద్ధుల సమస్యల పట్ల సమాజంలో విస్తృత అవగాహన పెంచేందుకు ఏటా ఆగస్టు 21న ‘జాతీయ వృద్ధుల దినోత్సవం’ పేరిట జరుపుకొంటున్నాం. అనివార్యమైన వృద్ధాప్యం ఏ ఒక్క వ్యక్తికీ శాపంగా మారకుండా మనమంతా కృషిచేయాల్సిన సమయమిది. ఏ కుటుంబపు ఉన్నతికైనా ఆ ఇంటి పెద్దల కృషే ప్రధాన కారణం. బిడ్డల భవిష్యత్తు కోసం ఎన్నో కష్టాలను ఎదురీది, తమ స్వేదాన్ని చిందించిన ఆ పెద్దలే వృద్ధులయ్యేసరికి తీవ్ర నిరాదరణకు గురవు తున్నారు. మన దేశంలో గత రెండు దశాబ్దాలుగా వచ్చిన వైద్య సదుపాయాల వల్ల ఆయుః ప్రమా ణం పెరిగి వృద్ధుల సంఖ్యా పెరిగింది. 2011 లెక్కల ప్రకారం మన దేశంలో 60 ఏళ్ళ పైబడిన వారి సంఖ్య 15 కోట్లకు పైగానే. రాబోయే 20 ఏళ్ళలో ఈ సంఖ్య రెట్టింపు కానుంది.

ఎందుకీ దినోత్సవం?

వృద్ధుల పట్ల నిరాదరణ తగ్గించేందుకు, ఆదరణ పెంచేందుకు, వారి నుంచి సమాజం నేర్చుకోవాల్సిన అనుభవపాఠాల ఆవశ్యకతపై, వారి సమస్యల పరిష్కారాలపై తీసుకోవాల్సిన చర్యలపై, కుటుంబసభ్యుల నుంచి ఎదుర్కొనే వేధింపుల నివారణకు, వారికి ప్రయాణాల్లో రాయితీలపై, పింఛన్లపై, ఉచిత వైద్యంపై చర్చించేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. గత చరిత్రను, మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందంగా జీవితం గడపడానికి, సమాజానికి ఒక నిర్దేశిత సందేశం ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూ ఉంటాం. సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాం. ఏది చేసినా, ఎక్కడ చేసినా మానవాలి శ్రేయస్సు కోసమే. పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు, ప్రేమికుల రోజు ఇలా. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాం. మరి ఆగస్ట్‌ 21న ‘భారత జాతీయ వృద్ధుల దినోత్సవం’. పెద్దల పట్ల నేటితరం చూపిస్తున్న వ్యవహారశైలిని పరిగణనలోకి తీసుకొని జాతీయ స్థాయిలో ఈ సమస్య ను చర్చించి వృద్ధుల దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించి వారిపట్ల మన బాధ్యతలేమిటో తెలుసుకోవలసి ఉంది.
Old-people2

అయ్యో పాపం..

మన దేశంలో 15 కోట్లమంది వృద్ధులు ఉన్నారని ఒక లెక్క. 2025 నాటికి ఇది 32.3 కోట్లకు చేరుతుందని అంచనా. ఇందులో 90 శాతం మంది అవ్యవస్థీకృత రంగాల్లో పనిచేస్తున్నారు. 40 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. 75 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. 55 శాతం మహిళలు భర్తను కోల్పోయిన ఒంటరులు. వ్యవసాయ కూలీలు, దుకాణాల్లో గుమస్తాలుగా పనిచేసేవాళ్లు, కూరగాయలు అమ్ముకుని బతికేవాళ్లు, బరువైన వస్తువులు కలిగిన రిక్షా లాగుతూ బతికేవాళ్లు. చేతకాక దేవాలయాలు, మసీదుల ముందు బిక్షమెత్తుకుంటున్నవాళ్లు. ఇందులో 25 శాతం మంది రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పబ్లిక్‌, ప్రైవేట్‌ సెక్టార్లలో ఉద్యోగాలు చేసి రిటైరయి, పెద్ద మొత్తంలో పి.ఎఫ్‌, ఇ.పి.ఎఫ్‌. డబ్బు పొంది నెలనెలా పెన్షన్లు పొందుతూ సొంత ఇండ్లలో హాయిగా బతుకుతున్నారు. మరో 15 శాతం మంది సొంత ఇండ్లతో, నెలనెలా అద్దెలతో వ్యవసాయ భూముల వల్ల పంటల ఆదాయంతో ఉన్నారు. వీరి గురించి కూడా ఏ బాధా లేదు. ఇంకో 15 శాతం మంది 60 సంవత్సరాలు పైబడినా కూడా వివిధ రకాల వ్యాపారాలు, వర్తకాలు చేస్తూ డబ్బు సంపాదించుకొంటున్నారు. మరో 10 శాతం మంది కుమారుల సంరక్షణలలో ఉన్నారు. వారికి కూడా ఏ దిగులూ లేదు. మిగిలిన 35 శాతం మంది గురించే మనం ఆలోచించాలి. ఇందులో 25 లక్షల మంది గ్రామాల్లో జీవిస్తున్నవారే. ఈ 25 లక్షల మంది ఆర్థిక, సామాజిక, అనారోగ్య పరమైన బాధలు పడుతున్నారు. వారి మరణం వరకు కూడా పిడికెడు మెతుకుల కోసం రెక్కలు ముక్కలు చేసుకోవలసిన పరిస్థితి ఉందంటే వృద్ధుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

దుర్భర పరిస్థితి

ప్రస్తుత పరిస్థితులు సామాన్యులకు నానాటికీ బతుకుభారంగా మారుతున్నాయి. అదే సమయంలో వృద్ధులవట్ల నిరాదర ణ కూడా అంతకంతకూ ఎక్కువవుతున్నది. దేశంలోని ప్రతి అయిదుగురు వృద్ధుల్లో ఒకరు ఒంటరిగా జీవిస్తున్నారు. ముగ్గురిలో ఒకరు వేధింపులకు గురవుతున్నారని ‘హెల్పేజ్‌ ఇండియా’ సంస్థ తన అధ్యయనంలో నిగ్గుతేల్చింది. వృద్ధాప్యంలో కుటుంబ సభ్యులే వృద్ధుల పాలిట శత్రువులుగా మారుతున్నారు. దూషణలకు పాల్పడటమే కాకుండా కొందరు శారీరక హింసకూ పాల్పడుతుండటం పతనమవుతున్న మానవతా విలువలకు నిదర్శనం. ప్రస్తుతం ఎక్కువమంది వృద్ధులు ఒంటరిగా లేదా సొంత ఇంటిలోనే పరాయివారుగా బతుకులీడుస్తున్నారు. సంపాదించినదంతా కన్నబిడ్డలకిచ్చి ప్రతి అవసరానికి వారి ముందు చేయి చాచాల్సిన దుస్థితి వీరిది. ముఖ్యంగా.. నగర, పట్టణ ప్రాంతాల్లో నూటికి తొంభైమంది పరిస్థితి ఇదే. కొందరు బిడ్డలైతే ఆస్తిపాస్తుల కోసం తల్లిదండ్రుల పాలిట శత్రువులుగా మారుతున్నారు. వారు అనారోగ్యం పాలైతే వృద్ధ్దాశ్రమాల్లో చేర్చి చేతులు దులుపుకుంటున్నారు. ఈ వృద్ధ్దాశ్రమాల్ల్లో చేరిన వృద్ధులు జీవచ్ఛవాలుగా మారి చివరికి దుర్భరమైన పరిస్థితిలో బతుకు చాలిస్తున్నారు.
Old-people3

అందరూ ఉండి అనాథలుగా..

ఉద్యోగరీత్యా, ఆర్థిక కారణాలు, ఇతర కారణాల మూలంగా వృద్ధ్దులైన తమ తల్లిదండ్రులను ఆశ్రమాల్లో చేర్పిస్తున్నారు. ఉద్యోగాల రీత్యా ఇతర దేశాల్లో ఉండడం, ఆర్థిక ఇబ్బందులతో వృద్ధులను పోషించలేనివారు, ఇంట్లో గొడవల కారణాంగా వారిని ఆశ్రమా ల్లో ఉంచుతున్నారు. ఈ ఆశ్రమాల్లోనూ వ్యాపారపరమైన లక్ష్యాలతో నడిచేవి కొన్ని, ఉచితంగా నిర్వహిస్తున్నవి కొన్ని. డబ్బులు చెల్లించి ఉండే ఆశ్రమాల్లో డబ్బుకు తగినట్లే సౌకర్యాలుంటాయి. ఇక ఉచితంగా నిర్వహించే వాటిలో వివిధ సామాజిక సంస్థలు, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం ఉంటుంది. ఆ సంస్థలు దాతల మీద ఆధారపడి మాత్రమే వీటిని నిర్వహిస్తుండడంతో అంతంత మాత్రంగానే సౌకర్యాలుంటాయి. ప్రభుత్వాలు కొన్ని చోట్ల రెస్ట్‌ రూములు, ఆశ్రమాలను కూడా నిర్వహిస్తున్నాయి. అయితే అవి అందరికీ అందుబాటులో లేవు. ఎలాంటి ఆశ్రమాల్లో ఉన్నప్పటికీ అయినవారు రాక, కడుపు చించుకుని పుట్టినవారు పట్టించుకోక వృద్ధులు అందరూ ఉండి అనాథలుగా బతుకుతున్నారు.

వారే మన జాతిసంపద

వాస్తవానికి వృద్ధులు మన జాతి సంవద! వారి అనుభవాలు ముందు తరాలకు అమూల్యమైన పాఠాలు. అందుకే పాశ్చాత్య దేశాలు వృద్ధుల సంరక్షణకు దీటైన చట్టాలు రూపొందించాయి. బతికినంతకాలం వృద్ధులను కుటుంబసభ్యులు ఆదరణతో చూసుకునే విధంగా పటిష్ఠ నిబంధనలు చట్టంలో పొందుపరిచారు. ఆర్థికభద్రత సైతం వారికి లభిస్తుంది. ఎవరూ లేనివారికోసం ప్రత్యేక సంరక్షణ కేంద్రాలనూ అనేక దేశాలు ఏర్పాటు చేశాయి. మరీ ముఖ్యంగా వృద్ధుల్లో వయసురీత్యా వచ్చే అత్మన్యూనతా భావనలను పోగొట్టడానికి కౌన్సెలింగ్‌ కేంద్రాలూ సేవలందిస్తున్నాయి. వృద్ధుల సమస్యలను పట్టించుకోవడానికి, వారికి కుటుంబాల నుండి ఆదరణ, అప్యాయత లభించడానికి, అన్యాయానికి గురైన వారికి న్యాయరక్షణ కల్పించడానికి దేశవ్యాప్తంగా పలు సీనియర్‌ సిటిజన్స్‌ ఫోరాలు, అసోసియేషన్లు, సంఘాలు, సంస్థలు కృషి చేస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన సి.హెచ్‌.శివరామప్రసాద్‌ సీనియర్‌ సిటిజనుల సమస్యలు, వారు అనుభవిస్తున్న ఇబ్బందులపై సీనియర్‌ సిటిజన్స్‌ కథలు పేరులో అనేక పుస్తకాలు తీసుకువచ్చారు.

వృద్ధుల కోసం 14567 టోల్‌ ఫ్రీ నంబర్‌

విజయ వాహిని చారిటబుల్‌ ఫౌండేషన్‌ (వీసీఎఫ్‌) ద్వారా టాటా ట్రస్ట్‌, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీనియర్‌ సిటిజన్స్‌ శాఖతో కలిసి మొట్టమొదటి, వినూత్నమైన కనెక్ట్‌ సెంటర్‌ను నగరంలోని సీనియర్‌ సిటిజన్స్‌ కోసం ఎల్డర్‌ స్ప్రింగ్‌ రెస్పాన్స్‌ సిస్టమును ప్రారంభించింది. వయోజనులు ఎవరైనా ఇకపై 14567 నెంబరుకు ఫోన్‌ చేసి తమకు కావలసిన ఆస్పత్రులు, మందుల దుకాణాలు, న్యాయసేవల వివరాలు, పెన్షన్‌ సమస్య ల వంటి వాటికి సమాచారం పొందవచ్చు. ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ ఈ సెంటర్లు పనిచేస్తాయి.

ఇంకేం చేయాలి?

ఉద్యోగరీత్యా మరో ప్రాంతంలో, ఇతర దేశాలలో స్థిరపడి తమ తల్లిదండ్రులను ఆదుకోనివారు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకు సంపాదించుకోవడం, భార్యాపిల్లలను పోషించుకోవడంలో ఉన్న శ్రద్ధ తల్లిదండ్రులపై ఉండడం లేదు. సాధారణంగా 60 ఏళ్ళ పైబడిన వాళ్లకు రోగాలు మొదలవుతుంటాయి. దీర్ఘకాల రోగాల బారినపడి ఖరీదైన వైద్యం చేయించలేక ఎంతోమంది శేష జీవితాన్ని దుర్భరంగా గడుపుతున్నారు. ఇక మా బతుకులింతే అని నిరాశా నిస్పృహలతో భారంగా గడుపుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వాలు ప్రతి మండల కేంద్రంలో ఈ వృద్ధులకు ఉచిత వైద్య సహకారం అందించాలి. ఆర్టీసీ బస్సులలో రాయితీ, రైల్వేలలో ఇస్తున్న 40 శాతం కాకుండా ఇంకో 20 శాతం పెంచాలి. అంతేకాకుండా రిజర్వేషన్‌లలో కూడా ప్రాముఖ్యం కల్పించాలి. ప్రతి బ్యాంకులో క్యూతో నిమిత్తం లేకుండా సీనియర్‌ సిటిజన్లకు లావాదేవీలు జరిపే సదుపాయం కల్పించాలి. కార్పొరేట్‌ ఆస్పత్రులలో 25 శాతం రాయితీ కల్పించి ఆ విషయాన్ని ఆసుపత్రి బోర్డులపై ప్రచురించాలి. రాష్ట్ర ప్రభుత్వంలో సీనియర్‌ సిటిజన్లకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి ఒక మంత్రిని నియమించాలి. సీనియర్‌ సిటిజన్లు ఎదుర్కొంటున్న సామాజిక బాధలు పరిష్కరించడానికి ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయాలి. అనారోగ్యంతో బాధపడే వృద్ధులకు ఉచిత వైద్య సహాయం అందచేయాలి. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో, పోలీస్‌ స్టేషన్‌లలో వృద్ధులను గౌరవించడం మన బాధ్యత అనే బోర్డులను ఏర్పాటు చేయాలి.

ప్రేమను పంచుదాం

మనల్ని కని, పెంచి పెద్ద చేయడానికి ఎన్నో కష్టనష్టాలు అనుభవించి జీవిత చరమాంకానికి చేరుకున్న వృద్ధులకు కాస్త ప్రేమను పంచితే వారి కళ్లల్లో ఆనందం నిండుతుంది. బతికినన్ని రోజులు ఎన్నో ఆలోచనలు, ఆర్థిక, హార్థిక సమస్యలను ఓర్చుకుని విశ్రాంతి తీసుకుంటున్న వృద్ధులకు మేమున్నామనే భరోసానిద్దాం. కుటుంబ భారాన్ని మోసి కుటుంబానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కనురెప్పచాటున కన్నీటిని దాచి అలసి పోయిన మనసులను నవ్వుల మాటలతో పలుకరిద్దాం. ప్రేమ అప్యాయతలను పంచి వారిలో సంతోషాన్ని నింపుదాం. చిరునవ్వుతో వారి ఆరోగ్యపరిస్థితిని ప్రశ్నించి, నిండైన మాటలతో వారి కడుపునింపుదాం. మనకోసం తమ సర్వస్వాన్ని అర్పించి వృద్ధులైన మనవాళ్లకు రోజులో కొంత సమయాన్ని కేటాయిద్దాం.
Old-people4

మరో బాల్యం

నిజానికి వృద్ధాప్యం అనేది వారికి మరో బాల్యం. అరవై ఏళ్లు దాటిన తర్వాత వారి ప్రవర్తన కూడా చిన్నపిల్లల మాదిరిగానే ఉంటుంది. చాలామంది వృద్ధ్దులు అప్పటి వరకు ఏదో ఒక వృత్తిలో ఉండి ఒక్కసారిగా ఇంటికే పరిమితం కావడం వారిని ఒక రకమైన ఆత్మన్యూనతా భావానికి గురిచేస్తుంది. వయసు మీద పడడం, ఆలోచనా విధానంలో తేడా రావడం వల్ల అంతకు ముందు వరకు పనిచేసి ఉన్నవారు అదే లోకంలో ఉంటారు. తిరిగి ఆఫీసుకు వెళ్లాలని, కొలిగ్స్‌తో గడపాలనీ, కానీ రోజూ వెళ్లే మార్గంలో కాకుండా ఇంటికే పరిమితమవ్వడం, కాలాన్ని ఎలా గడపాలో తెలియకపోవడం, ఇంట్లో వాళ్లు ఆఫీసులకు వెళ్లడం వంటి కారణాలు వారిని ఒంటరితనానికి చేరువ చేస్తాయి. దీన్నుంచి వారి దృష్టిని మరల్చడానికి కొంతమంది వారి పెద్దలను యోగా క్లాసులకు, లాఫింగ్‌ క్లబ్‌లకు, ఆధ్యాత్మిక కేంద్రాలకు పంపిస్తుంటారు. అయితే రోజంతా అక్కడే ఉండడం వారివల్ల కాదు. అందుకే రోజులో కొంత సమయం మనం వారితో గడపగలిగితే వారిలో కొంతమేర ధైర్యాన్ని నింపిన వాళ్లమవుతాం.
Old-people5

మన మార్గదర్శకులు

భారత ప్రభుత్వం ‘నేషనల్‌ పాలసీ ఆన్‌ ఎల్డర్స్‌' విధానం ప్రకటించింది. రైళ్లలో రాయితీలు ఇచ్చింది. సీనియర్‌ సిటిజన్‌ సంఘాల విజ్ఞప్తుల మేరకు ఆర్టీసీ బస్సులలో రెండు సీట్లు కేటాయించింది. రెండు చాలవనీ, నాలుగు కావాలనీ విజ్ఞప్తులు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులలో చార్జీలలో రాయితీ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లో రాయితీ ఉంది. భారత ప్రభుత్వం గతంలోనే ప్రకటించిన విధంగా ప్రతి జిల్లాలో వృద్ధాశ్రమాలు నెలకొల్పవలసి ఉంది. అందుకు సీనియర్‌ సిటిజన్‌ సంఘాలు ప్రభుత్వాల మీద ఒత్తిడిచేయాలి. వృద్ధులంటే వయసుడిగిపోయిన వారనే భావన తప్పు. వృద్ధులంటే వృద్ధి చెందిన వారనీ, జ్ఞాన వృద్ధులనీ అర్థం. అనుభవం అనే ఆయుధం చేత్తో పట్టుకుని సొంత కంపెనీలు స్థాపిస్తూ విజయవంతంగా కొనసాగుతున్న వాళ్లు చాలామంది వున్నారు. అలాంటి వారంతా మనకు మార్గదర్శకులు.
- సి.హెచ్‌.శివరామప్రసాద్‌ (వాణిశ్రీ), సీనియర్‌ సిటిజన్స్‌ కథల రచయిత
Old-people6

పిల్లలు వృద్ధులు చల్లనివారే

‘పిల్లలు దేవుడు చల్లనివారేలే, కల్లకపటం ఎరుగని కరుణామయులే’అని సినిమా పాట. అదే రీతిలో వృద్ధ్దులు కూడా ఆ కోవకు చెందినవారేనని గుర్తించాలి. మనం పిల్లలను ఎంత ప్రేమగా, శ్రద్ధగా సాకుతున్నామో.. మన పెద్దలూ అంతే ప్రేమగా మనల్ని పెంచిన సంగతిని గుర్తుంచుకొని వారిపట్ల ప్రేమగా వ్యవహరించడం ప్రతి ఒక్కరి విధి. కుటుంబ బంధాలు బలపడాలన్నా, తర్వాతి తరాలు మనల్ని గౌరవించాలన్నా పెద్దల సంరక్షణను బాధ్యతగా స్వీకరించాల్సిందే. ఇది ఒకనాటికి అందరికీ వచ్చే సమస్య గనుక పెద్దలను వృద్ధులుగా చూసే ధోరణికి స్వస్తి చెప్పి శక్తి మేరకు వారి ఆలనాపాలనా చూడాలి. ఇంటి పరిస్థితులు, సమస్యలు వారితో చర్చించి సలహాలు తీసుకోవడం, పలు విషయాల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచటం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచటమూ అవసరమే. మన కుటుంబంలో అత్యధిక ప్రాధాన్యం గల వ్యక్తులుగా వారిని గుర్తిస్తేనే రేపటి రోజు మనకూ ఆ గుర్తింపు దక్కుతుందని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అప్పుడే రేపు తమ పిల్లల నుంచి దాన్ని ఆశించే హక్కు మనకు ఉంటుందనే వాస్తవాన్ని గుర్తిస్తే ఏ ఒక్కరికీ వృద్ధాప్యం శాపం కానేకాదు. మనం పెద్దల పట్ల ప్రవర్తిస్తున్న తీరు మన పిల్లలపై ప్రభావం చూపుతుంది. రేపు మనల్ని అదే పరిస్థితుల్లో ఒక్కసారి ఊహించుకుంటే వృద్ధుల పట్ల వివక్షను ప్రదర్శించడం తప్పక మానుతాం.
Old-people7

తెలంగాణలో భేష్‌

చాలా రాష్ర్టాల్లో వృద్ధ్దులకు కేవలం 200, 500 మాత్రమే ఫింఛన్లు ఇస్తున్నారు. అయితే తెలంగాణలో మాత్రం ఇందుకు భిన్నంగా రూ.2016 ఇవ్వడం గమనార్హం. నిజానికి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి పూర్వం ఉమ్మడి రాష్ట్రంలో కేవలం రూ.200 మాత్రమే ఇచ్చేవారు. కానీ తెలంగాణ వచ్చాక అందులోనూ కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక తొలి ఐదేళ్లలో ఆసరా పింఛన్ల పేరుతో రూ.1000 కి పెంచారు. ఆ తరువాత రెండోసారి అధికారంలోకి వచ్చాక వాటిని ఏకంగా రూ.2016కు పెంచి ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఒక అడుగు ముందుకు వేసి రైల్వే ప్రయాణాల్లో 60 ఏళ్లు దాటిన వృద్ధ్దులకు రాయితీ కల్పించింది. ఆధార్‌కార్డు ఆధారంగా వారికి టికెట్‌ రేటులో 40 శాతం రాయితీని కల్పిస్తున్నది.
Old-people8

ఆసరాను విస్తరించాలి

గతంలో ఉమ్మడి కుటుంబాల వల్ల వయసుపై బడిన పెద్దలకు ఎవరో ఒకరు కుటుంబంలో అండగా ఉండేది. గత కొన్ని దశాబ్దాలుగా అనేక కారణాల వల్ల ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతూ వస్తున్నాయి. సర్దుబాటు లక్షణాలు, నేను, నాది అనే అహంకారాలు, ఆధిపత్య వ్యవహారాల కారణంగాను, బతుకుతెరువుకై విదేశాలకు వెళ్లడం, దేశంలో కూడా దూరప్రాంతాలకు పోవటం వల్ల వయోపౌరుల జీవితాలు ఒంటరివి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థికంగా వెసులుబాటు ఉన్నా ఒంటరితనం, పలకరింపులేకపోవడం వల్ల మానసిక వ్యధకు గురవుతున్నారు. దిగువతరగతి వారిలో పట్టించుకోని సంతానం కారణంగా దుర్భరజీవితం గడుపుతున్న వృద్ధ్దులను చూస్తున్నాం. అయితే హైదరాబాద్‌లో 2007లోనే ఆసరా అనే పథకం ప్రారంభించి కొంతవరకు వృద్ధులకు సంఘాలు ఏర్పాటు చేయడం, కేర్‌ సెంటర్లు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం చురుకుగా సాగాయి. కొంత కాలంగా వీటి విషయంలో కొంత నిర్లక్షం కనపడుతున్నది. దీన్ని కొంత సక్రమంగా నిర్వహించడంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తరించి వృద్ధులను మలి వయస్సులో ఆనందమయ జీవితం గడిపే ఏర్పాటు చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలు, అధికారులు, సమాజం మీద ఉన్నది.
- మాడభూషి లలితాదేవి, కార్యదర్శి, సీనియర్‌ సిటిజన్స్‌ ఫోరం
Old-people9

చట్టాలు ఏం చెబుతున్నాయి

వృద్ధ్దులను సీనియర్‌ సిటిజన్స్‌గా గుర్తించడంతోపాటు వారి శ్రేయస్సుకోసం అనేక దేశాలు చట్టాలు చేశాయి. అయితే మనదేశంలో చట్టాలు చేయడానికి స్వాతంత్య్రం వచ్చాక యాభై ఏళ్లు పట్టాయంటే వృద్ధ్ద్దుల పట్ల మన వైఖరిని చెప్పకనే చెప్పినట్లుంది. అనేక చర్చల అనంతరం ఎట్టకేలకు 2007లో ‘తల్లిదండ్రులు పెద్దల పోషణ, సంక్షేమ చట్టం’ అమలులోకి వచ్చింది. అయినా, చట్ట నిబంధనలు కాగితాలకే పరిమితం కావడంతో వృద్ధుల సమస్యలు తీరనేలేదు. అనేక రాష్ర్టాల్లో కనీస మాత్రంగానైనా చట్టం అమలవుతున్న దాఖలాలు కనబడటం లేదు. అంతేకాదు వృద్ధులకు విధిగా ఆశ్రమాలు ఉండాల్సిన అవసరం ఉన్నా ఎక్కడా కనిపించవు. చాలా రాష్ర్టాల్లో వృద్ధులకోసం ప్రత్యేక శాఖలుండగా, మరికొన్ని రాష్ర్టాల్లో స్త్రీశిశు సంక్షేమశాఖలో ఇదో భాగంగా ఉంది. అందుకే చట్టం అమలుపట్ల శ్రద్ధాసక్తులు కొరవడుతున్నాయి. తల్లిదండ్రుల్ని పట్టించుకోనివారికి మూడు నెలల వరకు జైలు, అయిదు వేల రూపాయల జరిమానా లేదా రెండూ విధించే అధికారాన్ని ట్రిబ్యునళ్లకు ఈ చట్టం కల్పించింది. భరణాన్ని ఎగ్గొట్టినవారికి నెలరోజుల వరకు జైలుశిక్ష పడుతుంది. వృద్ధులకు అండగా నిలిచే ఇలాంటి నిబంధనలు ఎన్నో చట్టంలో ఉన్నాయి. చట్ట ప్రకారం వృద్ధులు తమ సమస్యలను నేరుగా ఆర్డీవో స్థాయి అధికారులకు పిర్యాదు చేసుకోవచ్చు. కుటుంబం, సమాజంలో ఏ రూపంలో వివక్ష ఎదురవుతున్నా..అది మానవ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుంది. హక్కుల కమిషన్‌ను ఆశ్రయించవచ్చు. న్యాయస్థానాల సహాయం తీసుకోవచ్చు. సీఆర్పీసీలోని (సెక్షన్‌125) మెయింటెన్స్‌ ఆఫ్‌ పేరెంట్స్‌ యాక్ట్‌ ప్రకారం కన్నవారికి జీవనభృతి ఇవ్వాలని కోర్టు ఆదేశిస్తుంది.

- మధుకర్‌ వైద్యుల, సెల్‌: 9182777409

686
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles