ప్రధాని మెచ్చిన పల్లె!


Sun,August 18, 2019 12:34 AM

Nature
పచ్చదనం పరుచుకున్న నేల. ప్రతిధ్వనించే పక్షుల కిలకిలరావాలు. ప్రతి ఇంట్లో పాడి. గుమ్ముల నిండా సిరుల పంటలు. ఆప్యాయతలు పంచుకునే మనుషులు. పరిశుభ్రతకు పెద్ద పీట వేసే కుటుంబాలు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఇంకా బతికే ఉందనిపించే చిత్రాలు. అభివృద్ధికి కేరాఫ్‌గా నిలిచే ఆదర్శ గ్రామమది. ఆ గ్రామం ఇప్పుడు దేశంలోనే అందమైన గ్రామం. అలా పేరొందడానికి ముందు ఎంతో విషాద చరిత్ర కలిగి ఉన్నది. విషాదం నుంచి విజయం వైపు నడిచిన గ్రామ విజయమంత్రమిదే..

ఆసియాలోనే ఆదర్శ గ్రామంగా మాలినాంగ్‌ గ్రామం పేరు తెచ్చుకుంది. వృక్షాల వేర్లతో కూడిన వంతెనలు ఇక్కడ ప్రత్యేకం. ఇక్కడి బియ్యంతో వండే బిర్యానీ అద్భుతంగా ఉంటుంది. పచ్చని అందాలు పర్యాటకుల్ని ఆకర్షిస్తాయి. ఈ గ్రామానికి వెళ్లేందుకు వివిధ సంస్థలు టూరిజం ప్యాకేజీలు సైతం కల్పిస్తున్నాయి. ఇక్కడ బస చేసేందుకు స్థానిక ప్రభుత్వం ఓ గెస్ట్‌హౌస్‌ కూడా ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి మన్‌కీ బాత్‌లో మాలినాంగ్‌ గ్రామాన్ని ఆదర్శగ్రామంగా, అక్కడి ప్రత్యేకతల గురించి ఆయన అనేకసార్లు ప్రస్తావించారు.


అది మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌. దానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉందా గ్రామం. దాని పేరు మాలినాంగ్‌. ఆ ఊరి జనాభా 600. ఆ ఊరిలోకి అడుగు పెట్టగానే అన్నీ పెంకుటిళ్లు దర్శనమిస్తాయి. ఎటుచూసినా పచ్చని చెట్లు పిల్లగాలికి ఊగుతూ కనిపిస్తాయి. నల్లని తారు రోడ్లు ఆహ్వానం పలుకుతాయి. రోడ్లపై చెత్త, పశువుల వ్యర్థాలు, కాగితపు ముక్కలు ఏవీ కనిపించవు. ప్రతి 500 మీటర్లకు ఒక వెదురుతో చేసిన చెతకుండీ ఉంటుంది. ఇందులో తడి, పొడి చెత్త వేర్వేరుగా వేస్తారు. ప్రతి ఇంట్లో పాడి పశువులు ఉంటాయి. పూర్తిగా వ్యవసాయాధారిత కుటుంబాలు ఇక్కడుంటాయి.
Nature1
విషాద చరిత్ర : 130 ఏండ్ల క్రితం మాలినాంగ్‌ గ్రామంలో కలరా ప్రబలింది. రెండు నెలల్లో 320మంది గ్రామస్తులు చనిపోయారు. అందులో ఎక్కువగా చిన్నపిల్లలున్నారు. ఆ తర్వాత ప్రతి ఏటా కలరా ప్రబలి ఒకరిద్దరు పాడె ఎక్కుతూనే ఉన్నారు. కొన్నాళ్లకు అక్కడి గ్రామస్తులంతా ఒక నిర్ణయానికి వచ్చారు. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత తప్ప వేరే మార్గం లేదని గ్రహించారు.

రోజుకో గంట! : గ్రామంలోని ప్రతి ఒక్కరి ఇంటి పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలనే నిబంధన తీసుకువచ్చారు. ప్రతి రోజు గ్రామ ప్రజలంతా ఊరి కోసం రోజూ ఉదయం గంట పాటు శ్రమదానం చేస్తారు. ప్రతి ఇంటి నుంచి ఒకరు ఈ శ్రమదానంలో పాల్గొంటారు. గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయరు. ప్రత్యేకంగా తయారు చేసిన వెదురు బుట్టల్లో మాత్రమే చెత్తను పోగు చేస్తారు. ఇష్టమొచ్చినట్లుగా చెత్త పడేస్తే అప్పట్లో ఒక్క రూపాయి జరిమానా విధించేవారు.
Nature2
సంపూర్ణ విద్య.. పరిశుభ్రత : ఈ గ్రామంలోని వారంతా గిరిజనులే. అయినప్పటికీ అక్షరాస్యతా శాతం 95. ఇప్పటికీ గ్రామ కమిటీ నిర్ణయం మేరకే గ్రామస్తులంతా నడుచుకుంటారు. వెదురు బుట్టల్లో పోగైన తడి పొడి చెత్తను సేకరించి ఎరువులుగా మార్చుకుంటున్నారు. చెత్తలోని వ్యర్థాలను ఊరి చివరకు తీసుకెళ్లి కాల్చివేస్తారు. రసాయన ఎరువులు వాడకుండా పంటలు పండించడంలోనూ మాలినాంగ్‌ గ్రామస్తులు ప్రత్యేకతను చాటుకుంటున్నారు. సేంద్రియ ఎరువులు వాడుతుండడంతో వారు పండించిన పంటలో అధిక పోషకాలు ఉంటున్నాయి. పోషకాలు కల్గిన ఆహారం తింటుండడంతో అనారోగ్యం వారి దరిచేరట్లేదు. ప్రతి ఏటా రబీ, ఖరీఫ్‌ సీజన్‌ల అనంతరం అక్కడి పంటలు కొనేందుకు చుట్టుపక్కల ఊళ్లలోని వ్యాపారులు పోటీ పడుతుంటారు.

మాతృస్వామ్య వ్యవస్థ : మాలినాంగ్‌ గ్రామంలో మాతృస్వామ్యానిదే పై చేయి. ఇక్కడి ప్రజల ఆస్తి తండ్రి నుంచి కొడుకుకి కాకుండా తల్లి నుంచి కూతురికి సంక్రమిస్తుంది. తల్లి ఇంటిపేరే కూతుళ్లకు, కొడుకులకు వస్తుంది. కొన్నేళ్లుగా కట్నం ఇచ్చి పుచ్చుకోవడం కూడా ఈ గ్రామంలో మానేశారు. కల్మషం లేని పల్లెకు పిల్లనివ్వడానికి చుట్టుపక్కల గ్రామస్తులు ఆసక్తి చూపిస్తుంటారు. ఇండ్లల్లో కూడా మహిళల నిర్ణయం మేరకే కుటుంబీకులు నడుచుకుంటారు. గ్రామానికి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా గ్రామంలోని మహిళలంతా ఒక్కచోట కూర్చొని నిర్ణయాలు తీసుకుంటారు.
Nature3
కొన్ని నిషేధాలు!: గ్రామం ఆరోగ్యంగా ఉండాలంటే గ్రామస్తులు ఆరోగ్యంగా ఉండాలని బలంగా నమ్ముతారు మాలినాంగ్‌ గ్రామస్తులు. ఇక్కడ ఇంటికో మరుగుదొడ్డి ఉంటుంది. అయితే బహిరంగ మల విసర్జన, మూత్ర విసర్జన చేస్తే రూ. 5000 జరిమానా వేస్తారు. ఈ గ్రామంలో పొగతాగడం, మద్యపానం, క్యారీబ్యాగులు వాడడం నిషేధం. వర్షపు నీటిని వీలైనంతగా ఒడిసిపట్టేందుకు ప్రజలు ప్రయత్నిస్తూ ఉంటారు. తీరిక వేళల్లో పాత ప్లాస్టిక్‌ వస్తువులతో ఏదైనా కొత్త వస్తువులను తయారు చేసే పనిలో ఇక్కడి యువతులు నిమగ్నమవుతారు.

248
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles