యాదృచ్ఛికం


Sun,August 11, 2019 12:57 AM

Yadruchikam
స్వామిజీ తన కుడి చేతితో అందర్నీ ఆశీర్వదిస్తూ మెల్లిగా గేటు లోపలికి వచ్చారు. అంతకు ముందే ఆశ్రమంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుల మండపం పక్కనే నిర్మించిన స్జేజీ దగ్గరకు ఆయనను తీసుకు వచ్చారు. ఆ స్టేజీ మీద కుర్చీలు, వాటి ముందు బేంచీలు, వాటి మీద పూల దండలు పెట్టి ఉన్నాయి.

చూడమ్మా మృదులా! నువ్వు ఇక్కడే ఈ ఆశ్రమంలోనే పెరిగి పెద్దయ్యావు. ఇక్కడికి మూడు నెలల పసిపిల్లగా వచ్చావు. వచ్చిన దగ్గర నుంచి ఈ ఆశ్రమాన్ని దాటి నువ్వు ఎక్కడికీ వెళ్లలేదు. కానీ ఈ రోజు ఆ దేవుని దయవల్ల నీ జీవితం మారిపోయింది. ఆ పరమేశ్వరుడు, ఆ వెంకన్న స్వామి నీకు ఒక చక్కని తోడుని ప్రసాదించాడు. నువ్వు చేసిన పూజలు ఈ ఆశ్రమంలోని వారికి నువ్వు చేసిన సేవలు నిన్ను పెండ్లి చేసుకున్న ఆ కృష్ణుడి రూపంలో నిన్ను వరించాయి. నువ్వు పెండ్లి చేసుకుని భర్తతో వెళుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందమ్మా. కానీ, ఇన్ని సంవత్సరాలు ఇక్కడ మా అందరితోనూ మంచిగా ఉండి ఇంత తొందరగా వెళ్లిపోతావనుకోలేదమ్మ. అందుకే, మా అందరికీ చాలా దిగులుగా ఉందమ్మా. చూడమ్మా మృదులా! నీకు ఎప్పుడు రావాలనుంటే అప్పుడు స్వేచ్ఛగా ఇక్కడికి రావొచ్చు. ఇది నీకు పుట్టినిల్లు. అంటూ తన పక్కనున్న మృదుల తలను ప్రేమగా నిమిరారు అన్నపూర్ణమ్మ. ఆమె ఈ ఆశ్రమానికి ప్రెసిడెంటు. అక్కడికి కొద్ది దూరంలో ఈ ఆశ్రమంలో మేనేజర్‌గా చేస్తున్న రాంబాబుతో మాట్లాతున్నాడు మృదులను పెండ్లి చేసుకున్న శ్రీకృష్ణ.

అన్నపూర్ణమ్మ వయసు సుమారు అరవై సంవత్సరాలు ఉండవచ్చు. ఈ ఆశ్రమంతో ఆవిడ అనుబంధం ముప్పై సంవత్సరాలు. ఎంతోమంది అనాథపిల్లలు ఈ ఆశ్రమంలో ఉండి ప్రయోజకులై వెళ్లారు. వారిలో కొంతమంది ఉద్యోగరీత్యా విదేశాల్లో ఉన్నారు. మరికొందరు బిజినెస్‌లు పెట్టుకొని ఇక్కడే స్థిరపడ్డారు. వారిలో చాలామంది ఈ ఆశ్రమ యోగక్షేమాలు చూస్తూ ఉంటారు. ఇంకా వీరికి ఫండ్స్ రూపంలో డబ్బులు రావడంతో ఈ ఆశ్రమంలో పిల్లలకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నారు యాజమాన్యం వారు. ఇక్కడ సుమారు నూట నలభై మంది పిల్లలు ఉన్నారు. అందులో మగపిల్లల కంటే ఆడపిల్లల సంఖ్య ఎక్కువ. ఎందుకంటే, ఆడపిల్లలంటే మన సమాజంలో ఎంత చిన్నచూపో మనకు తెలియంది కాదు. ఆడపిల్ల పుట్టింది అనగానే ఆ పిల్లని పురిట్లోనే చంపేయడమో లేకపోతే ఏ చెత్త కుప్పలోనో పారేయడమో చేసి ఆడపిల్లల్ని వదిలించుకునే వారు ఇంకా చాలామందే ఉన్నారు. ఈ ఆశ్రమంలోని ఆడపిల్లలు అలా వచ్చి చేరినవారే. ఈ ఆశ్రమానికి మంచి పేరు ఉంది. ఇక్కడ యాజమాన్యం వారు పిల్లల్ని బాగా చూసుకుంటారు. ఒకవిధంగా చెప్పాలంటే ఈ రోజు పెండ్లి అయిన మృదుల కూడా అలా వచ్చిందే.

ఒకరోజు ఉదయాన్నే అన్నపూర్ణమ్మ గుడికి వెళ్లి ఆశ్రమానికి వస్తుంటే ఓ పసిపిల్ల ఏడుపు వినిపించింది. చుట్టూ చూసిన ఆమెకు ఓ చెట్టు పక్కనే గుక్కపెట్టి ఏడుస్తున్న సుమారు మూడు నెలలున్న పసిపాప కనిపించింది. ఆ పాపని చూడగానే ఆమె హృదయం ద్రవించిపోయింది. వెంటనే ఏడుస్తున్న ఆ పాపని హృదయానికి హత్తుకున్నారు.
అన్నపూర్ణమ్మ స్పర్శ తాకగానే ఆ పాప ఏడుపు ఒక్క సారిగా ఆగిపోయింది. ఆ పాపని ఆశ్రమానికి తీసుకెళ్లాలనుకున్నారు ఆమె. గుండెలకు హత్తుకున్న ఆ పాపని భుజం మీదికి మార్చుకున్నారు. ఆ పాపతో మెల్లిగా ఆశ్రమం వైపు బయల్దేరారు.
ఆ అమ్మాయిని తీసుకెళుతున్నారే కానీ అన్నపూర్ణమ్మకి ఒక పక్క దిగులుగానే ఉంది. ఇప్పటికే ఆశ్రమంలో ఇరవై మంది వరకు పిల్లలున్నారు. వాళ్ల పోషణే అంతంత మాత్రంగా ఉంది. ఈ అమ్మాయిని కూడా తీసుకెళుతున్నాను ఇక్కడే వదిలేద్దామంటే మనస్సు ఒప్పుకోవట్లేదు. మరి ఈ అమ్మాయిని చూసి యాజమాన్యం వారు ఏమంటారో ఆమె ఆశ్రమంలో చేరి ఇప్పటికి ఐదు సంవత్సరాలయింది. ఆమె స్వతంత్రంగా ఇంతవరకు ఎవ్వరిని తీసుకు రాలేదు. అక్కడ ఎవరైనా ఏదైనా అంటారా ఏమో అంటే అననీ ఏదో తెలియని మెండి ధైర్యం అన్నపూర్ణమ్మలో ప్రవేశించింది. తానేమి తప్పు పని చేయలేదు అనుకుంటు ఆ పసిపిల్లను తీసుకుని ఆశ్రమానికి వచ్చారు.
అయితే ఆవిడ ఊహించినట్టు అక్కడేమి జరుగలేదు. ఆ అమ్మాయిని చూసి అందరూ ఆనందించారు. అంతేకాదు ఆమెని అభినందించారు కూడా. ఆశ్రమంలోని పిల్లలయితే ఆ పాప చుట్టూ చప్పట్లు కొడుతు ఆనందంగా తిరగసాగారు. అభం , శుభం తెలియని ఆ పిల్లల ఆటల్ని చూసి అన్నపూర్ణమ్మ కళ్లు చెమర్చాయి.

అపుడే అన్నపూర్ణమ్మ ఆ అమ్మాయికి మృదుల అని నామకరణం చేశారు. పేరుకు తగ్గట్టుగానే మృదుల అక్కడ ఉన్న వారందరి పట్ల ప్రేమగా ఉండేది. పెద్దవారంటే భయ, భక్తులతో ఉండేది. ఇరవైఐదు సంవత్సరాలు ఇట్టే గడిచి పోయాయి. ఆశ్రమంలో ఉంటూనే డిగ్రీ పాసయింది. అందరిలాగ బయటకి పోవడం ఇష్టం లేక అక్కడే ఉండిపోయింది. అందరినీ తన వాళ్లలాగానే చూసుకోసాగింది. అయితే, రోజులు ఒకలాగ ఉండవు కదా! మృదులని అదృష్టం వరించింది. శ్రీజ్ఞానానంద స్వామి వారి రాక ఆమె జీవితాన్నే మార్చేసింది.
శ్రీజ్ఞానానంద స్వామి వారంటే ఆ అనాథాశ్రమానికి గురువుగారు.
అసలు ఏం జరిగిందంటే ఆరోజు అనుకోకుండా గురువుగారు ఆశ్రమానికి వస్తున్నారని కబురొచ్చింది. ఆ రోజు సాయంత్రమే ఆయన వస్తున్నారు.
స్వామిజీ వస్తున్నారని తెలియగానే యాజమాన్యం వారు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఆశ్రమాన్ని స్థాపించిన దగ్గర నుంచి ఏ చిన్న పనైనా ఆయనకు చెప్పకుండా చేయరు. ఈ ఆశ్రమానికి ఇంత మంచి పేరు రావడానికి ఆయన ఆశీస్సులే కారణమని నమ్మకం. ఆయన అంటే ఆశ్రమంలోని వారికి దైవంతో సమానం అటువంటి వ్యక్తి ఈ రోజు ఆశ్రమానికి వస్తున్నారంటే పిల్లలకి, పెద్దలకి ఆనందంగానే ఉంది మరి.
సాయంత్రం 5:30 అయింది. గబగబా అన్నపూర్ణమ్మ ఆఫీసు రూములోంచి బయటకి వచ్చారు. ఆమె వెనుకే వైస్ ప్రెసిడెంట్, మేనేజర్ రాంబాబు, ఇంకా అక్కడికొచ్చిన పెద్దలు హడావుడిగా గేటువైపు వెళ్లారు. అంటే కొద్దిసేపట్లో స్వామిజీ అక్కడకి వస్తారన్నమాట.

ఆశ్రమంలో అందరూ గేటువైపు రాసాగారు. అయితే అక్కడ పిల్లలందరినీ ఒక వరుసక్రమంలో నిలబెడుతున్నది మృదుల. మగ పిల్లలు అందరూ ఒకవైపు, ఆడపిల్లలందరూ ఇంకోవైపు నిలబడ్డారు.
ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ గేటుకి రెండువైపుల నిలబడ్డారు.
రెండు నిమిషాల్లో తెల్లని ఇన్నోవా కారొకటి ఆశ్రమం గేటు ముందు ఆగింది. ఒకరు కారు డోరు తీసి పట్టుకున్నారు. కారులోంచి మెల్లిగా దిగారు శ్రీజ్ఞానానంద స్వామి వారు.
కాషాయరంగు బట్టల్లో ఆయన మూర్తీభవించిన వామనమూర్తిలాగ ఉన్నారు. స్వామివారు కొద్దిగా పొట్టి కానీ ఏదో తెలియని తేజస్సు వారి ముఖంలో ఉట్టి పడుతుంటుంది.
ఒక తెలియని గంభీరత అక్కడ అందర్నీ మంత్ర ముగ్ధుల్ని చేసింది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకూ తమకు తెలియకుండానే రెండుచేతుల్ని జోడించి నిలబడ్డారు.
స్వామిజీ తన కుడిచేతితో అందర్నీ ఆశీర్వదిస్తూ మెల్లిగా గేటు లోపలికి వచ్చారు. అంతకు ముందే ఆశ్రమంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుల మండపం పక్కనే నిర్మించిన స్జేజీ దగ్గరకు ఆయనను తీసుకువచ్చారు. ఆ స్టేజీమీద కుర్చీలు, వాటి ముందు బేంచీలు, వాటిమీద పూలదండలు పెట్టి ఉన్నాయి.
అక్కడికి చేరుకున్నారు స్వామిజీ. అయితే ఆ స్వామిజీ దృష్టి వాటి మీదకి పోలేదు. తన చుట్టూ ఉన్న జనాన్ని తన రాకపట్ల వారి కళ్లలోని ఆనందాన్ని గమనిస్తూ గేటువైపు చూశారాయన. గేటులోంచి లోపలికి వస్తున్న ఒక వ్యక్తిపైన పడ్డాయి ఆయన చూపులు. ఆ వ్యక్తిని చూడగానే ఆయన పెదాలమీద సన్నని చిరునవ్వు మెరిసింది. ఆరడుగుల ఆజానుబాహువు, ఉంగరాల జుట్టు, కళ్లకి గోల్డు ఫ్రేమున్న కళ్లజోడుతో ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాడు ఆ వ్యక్తి. అతను సరాసరి స్వామిజీ ఉన్న స్టేజీ దగ్గరకొచ్చాడు. కాలికున్న శాండిల్స్‌ని ఒక పక్కగా వదిలి, కొద్ది దూరంలో ఉన్న వాటర్‌తో కాళ్లు కడుక్కొని స్వామిజీ దగ్గరకు వచ్చి.. ఆయన కాళ్లు ముట్టుకోకుండా, ఆయనకు పాదాభివందనం చేశాడు.
అతన్ని చూసి చిరునవ్వు నవ్వి, కళ్యాణమస్తు అంటూ దీవించారు ఆయన. ఆ మాటలకు తల పైకెత్తి ప్రశ్నార్థకంగా చూశాడు ఆ వ్యక్తి. అదే చిరునవ్వుతో నీకు కళ్యాణ ఘడియలు దగ్గర పడ్డాయి శ్రీకృష్ణా అన్నారు. అక్కడ ఉన్నవారెవరికీ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆయన ఉపన్యాసం వినడానికి వచ్చారు వారందరూ. కానీ ఇవాళ స్వామిజీ ఇంకా ఎందుకు ఉపన్యాసం ఇవ్వడం లేదు అని వాళ్లలో వాళ్లే ఈ విషయంపై గుసగుసలాడుకొనసాగారు.

అంతలో..
ఇక్కడికొచ్చిన పెద్దలకు, పిల్లలకు నా హృదయపూర్వకమైన శుభాశీస్సులు అంటూ మైకులోంచి ఆయన కంఠం గంభీరంగా వినిపించింది.
అంతవరకూ చెవులు కొరుక్కుంటున్న వారి గొంతు ఠక్కున మూతపడింది. నేను వస్తే కొన్ని మంచి మాటలు వినొచ్చని మీరందరూ వచ్చారు. కానీ నేను ఈ రోజు ఇక్కడికొచ్చింది ఒక ప్రత్యేకమైన పనిమీద. ఆ పని మీరందరికీ ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందని నేను అనుకుంటున్నాను.
ఇదిగో ఇతనిని చూడండి. ఇతని పేరు శ్రీకృష్ణ. ఇతను ఐఏఎస్ పాసై రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నాడు అంటూ తన పక్కనే ఉన్న వ్యక్తిని చూపించారు. స్వామిజీ ఒక ప్రత్యేకమైన పనిమీద వచ్చానన్నారు. తనని వీరందరికీ ఎందుకు పరిచయం చేస్తున్నారో అతనికి అర్థం కాలేదు. స్వామిజీ తనకు ఇంతకు ముందే తెలుసు. ఆయన వస్తున్నారని తెలిసే తాను ఇక్కడికి వచ్చాడు. ఇంతకు ముందు తనకు ఆ ఊరివారితో ఏ పరిచయమూ లేదు. అయితే, స్వామిజీ తనను వారికి పరిచయం చేయడంతో వారందరికీ నమస్కారం చేశాడు శ్రీకృష్ణ.

ఇంతకు ముందే నేను చెప్పాను. నేను ఒక ప్రత్యేకమైన పనిమీద వచ్చానని. నేను వస్తున్నానని తెలిసి ఇతను ఇక్కడికి వచ్చాడు అంటూ తన పక్కనున్న వ్యక్తితో ఏదో చెప్పారు. ఆ వ్యక్తి సరే అంటూ తల ఊపి, అక్కడకు కొద్ది దూరంలో నిల్చుని అక్కడి వారితో మాట్లాడుతున్న మృదుల దగ్గరకు వెళ్లాడు ఆ వ్యక్తి. స్వామిజీ రమ్మన్నారని చెప్పాడు. స్వామిజీ తనని ఎందుకు రమ్మన్నారో అర్థం కాలేదు మృదులకు. ఇప్పుడే వస్తా అని వారికి చెప్పి ఆ వ్యక్తి వెంట స్వామిజీ దగ్గరకు వచ్చింది. తనకేసి చూస్తున్న శ్రీకృష్ణని తన దగ్గరకు రమ్మంటూ సైగ చేశారు స్వామిజీ. అతను రాగానే అక్కడే ఉన్న పార్వతీ పరమేశ్వరుల వద్ద నుండి కుంకుమ తెచ్చి మృదుల నుదుట పెట్టమన్నారు.
ఆ వెంటనే స్టేజీ మీదున్న దండలను తెప్పించి వారి ఇద్దరికి ఇచ్చి ఒకరి మెడలో ఒకరికి వేయించారు. నిమిషాల్లో జరిగిన ఈ పెండ్లి కార్యక్రమం అక్కడున్న వారిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అందరూ ఆశ్చర్యంలోంచి తేరుకోక ముందే వారిని ఉద్దేశించి స్వామీజీ ఇలా అన్నారు. ఆది దంపతులైన పార్వతీపరమేశ్వరుల సాక్షిగా వీరిద్దరూ ఈ రోజు నుంచి భార్యాభర్తలు. స్వామీజీ ఇలా ఎందుకు చేశారు అని మీరనుకోవచ్చు. నేను నిమిత్త మాత్రుణ్ణి. పెండ్లిళ్లు స్వర్గంలోనే నిర్ణయించబడతాయి. అయితే వీరిద్దరి వివాహం నా చేతుల మీదుగా ఈ ఆశ్రమంలో జరుగాల్సి ఉంది. కొన్ని సంఘటనలు అనుకోకుండా జరుగుతాయి. దానినే యాదృచ్ఛికం అనవచ్చు. ఇది మీరందరి సమక్షంలోనే జరిగింది కాబట్టి మీరందరూ పెద్ద మనసుతో వీరిద్దరినీ ఆశీర్వదించండి అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు జ్ఞానానందస్వామివారు. ఆయన వెళ్లిపోయిన కొద్దిసేపటికి ఆ ప్రదేశమంతా చప్పట్లతో, కేకలతో హోరెత్తిపోయింది. అందరూ మృదుల చుట్టూ చేరి తమ తమ అభినందనలు తెలియచేశారు.
మృదులని తన వెంట తీసుకుకెళ్లాలని వారికి తెలియ చేశాడు శ్రీకృష్ణ. బయట కారు హారన్ వినిపించింది. ఈ ఆశ్రమాన్ని, తనని పెంచి పెద్ద చేసిన వారందరినీ విడిచి పెడుతున్నా అనే బాధ ఉన్నా పెండ్లి చేసుకొని భర్తతో వెళ్తున్నానే ఆనందం ఆమెకు కొంత ఊరటనిచ్చింది. పసుపు బొట్టు పెట్టి మృదులతో కారు వరకూ వచ్చారు అన్నపూర్ణమ్మ.

చూడు బాబూ! ఇన్ని సంవత్సరాల్లో ఎవర్నీ ఎప్పుడూ ఏమీ అనడం కానీ అనిపించుకోవడం కానీ మా మృదులకు తెలీదు. అంటువంటి అమ్మాయిని నీ చేతుల్లో పెడుతున్నాం జాగ్రత్తగా చూసుకో బాబూ అంటూ మృదుల చేతిని అతని చేతిలో పెట్టారు అన్నపూర్ణ. అలా అంటున్నప్పుడు ఆమె కంఠం వణికింది. అది గమనించిన శ్రీకష్ణ మీరెప్పుడు చూడాలనుకుంటే అప్పుడు నాకు ఒక ఫోన్ చేయండి మృదులను నేను తీసుకొస్తాను అన్నాడు భరోసా ఇస్తున్నట్టు.
కారులో భర్త పక్కనే కూర్చున్న మృదుల కన్నీటి పొరల మధ్య తన తోటివారిని చూస్తూ చేయి ఊపింది. ఆమె చేయి ఊపుతుండగానే కారు మెల్లిగా ముందుకు కదిలింది.
నమో వెంకటేశా అంటూ ఎక్కడినుంచో భక్తి పాట వినిపించడంతో కళ్లు తెరిచి పక్కకి చూసింది మృదుల. ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు భర్త శ్రీకృష్ణ. కలలో కూడా ఊహించుకోలేదు. ఇంత అందమైన భర్త పక్కన కూర్చొని కార్లలో తిరుగుతానని. సంతోషంతో భర్తకేసి ఒకసారి చూసి కండ్లు మూసుకుంది మృదుల.

ఒకే ఒక్కఫైవ్ మినిట్స్‌లో మేము అక్కడుంటాం అంటూ ఫోన్ కట్ చేసి పక్కనే ఉన్న భార్యకేసి చూశాడు కృష్ణ. కండ్లు మూసుక్ను ఆమెకేసి చూసి వెరీ బ్యూటిఫుల్ ఫేస్ అనుకుంటూ ఇంత అందమైన భార్యని తనకు ప్రసాధించన శ్రీ జ్ఞానానందస్వామిని తలచుకుంటూ సీటు వెనక్కివాలాడు ఆనందంగా.
ఐదు నిముషాల్లో గెస్టుహౌస్‌ని చేరుకుంది కాదు. శ్రీకృష్ణకారు దిగి రెండడుగులు ముందుకు వేసి ఆగాడు. అప్పటికే కారు దిగి అతని పక్కకు చేరి నిలుచుంది మృదుల. ఆమెకేసి ఒకసారి చూసి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని ముందుకు నడిచాడు.
భర్త వెనకాలే అతని చేయి పట్టుకొని కొద్దిసేపట్లో తాను చూడబోయే ఆ శ్రీవేంకటేశ్వరుని దివ్యమంగళ రూపాన్ని తలచుకుంటూ సంతోషంతో అతని వెనుకే అడుగులేసింది.

- పి. సత్య శ్రీ
సెల్: 9966986344

564
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles