రాతి గుహలో కొలువైన అనంత పద్మనాభుడు


Sun,August 11, 2019 02:17 AM

ANANTHA
స్వయంభువుగా వెలసిన పద్మనాభ ఆలయాలు మన రాష్ట్రంలో రెండే వున్నాయి. మొదటిది వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కాగా. రెండోది నిజామాబాద్ జిల్లాలోని మల్కాపూర్‌లోని ఈ క్షేత్రము. ఇక్కడి పద్మనాభుడు ఇతర ప్రాంతాలకు భిన్నంగా మల్కాపూర్ గ్రామశివారులోని ఎత్తైన చెరువుగట్టుపై ఉన్న కొండపైన రాతి గుహల మధ్య కొలువు దీరడం విశేషం. ఈ దేవాలయం భక్తుల కొంగుబంగారంగా ఖ్యాతిగడిస్తూ దినదినాభివృద్ధి చెందుతున్నది. ఏటా వారం రోజులపాటు జరిగే ఆలయ బ్రహ్మోత్సవాలకు నిజామాబాద్ జిల్లా నలుమూలల నుంచే కాకుండా రంగారెడ్డి, హైదరాబాద్, అదిలాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచీ భక్తులు వస్తారు.

చారిత్రిక ప్రాముఖ్యం

మూడున్నర శతాబ్ధాలకు పైగా చరిత్ర కలిగింది ఈ ఆలయం. చారిత్రిక ఆధారాలను బట్టి వికారాబాద్‌లోని అనంత పద్మనాభస్వామి ఆలయ పూజారుల కుటుంబానికి చెందిన కోనమాచార్యులనే బ్రాహ్మణుడు నిజామాబాద్ జిల్లాలోని మల్కాపూర్ ప్రాంతంలో వుండేవాడు. ఒకసారి ఆయనకు విష్ణుమూర్తి కలలో కనిపించి ఈ క్షేత్ర పాలకులు ఇక్కడికి వచ్చినపుడు తాను తెల్లని గుర్రం రూపంలో కనిపిస్తానని ఆ గుర్రం పరుగులు తీస్తూ ఎక్కడ అంతర్థానం అవుతుందో అక్కడ తాను స్వయంభువుగా అవతరిస్తానని చెప్పాడట. ఒక రోజున ఆ ప్రాంత పాలకులైన గాంధారీ సంస్థానాధీషులు మల్కాపురము, గుండారం గ్రామాల మధ్య ఉన్న పెద్ద చెరువుగట్టు పై ప్రయాణిస్తునపుడు తాము ప్రయాణిస్తున్న ఎడ్లబండి ఇరుసు విరిగి పోయింది. దాన్ని సరిచేసుకునే సమయానికి అక్కడికొచ్చిన కోనమాచార్యులు తనకు కలలో విష్ణుమూర్తి చెప్పిన విషయాన్ని చెప్పగా, అదే సమయంలో ఒక తెల్లని గుర్రం తమ ముందు పరుగులు తీయడం మొదలు పెట్టింది. కోనమాచార్యులు, సంస్థానాధీషులు ఆ గుర్రాన్ని వెంబడించారు.

ఆ గుర్రం మల్కాపూరు శివార్లలోని ఒక గుట్టలో ఉన్న ఓ గుహలోకి వెళ్లి అంతర్థానమై పోయింది. గుర్రాన్ని వెంబడించిన వారు ఆ గుహలో పరీక్షించి చూడగా రాళ్లమధ్యలో ఒక సన్నని కాంతి ప్రసరిస్తున్నది. అదే లక్ష్మీ అనంత పద్మనాభస్వామి రూపంగా భావించి పూజలు చేయనారంభించారు. కొన్నాళ్లకు సన్నని కాంతి రూపంలో వున్న ఆ వెలుగు అమ్మవారి సహితంగా శంఖు చక్రాలతో భక్తులకు అనంత పద్మనాభస్వామిగా దర్శనమిచ్చాడు. అది ఎత్తైన ప్రదేశం అయినందున స్వామి వారిని దర్శించుకోడానికి నిచ్చెనపై ఎక్కి చూడాలి. స్వామి వారికి పూజలు చేయడానికి పూజారులకు, దర్శనం కొరకు వచ్చిన భక్తులకు ఇది కొంత కష్టంగా వున్నందున ఆ గుహలోనే మరో ఆనంత శయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు పాలకులు. ప్రస్తుతం వారు ఏర్పాటు చేసిన స్వామి విగ్రహానికే పూజలు జరుగుతున్నాయి.

దినదినాభివృద్ధి చెందుతున్న స్వామి రూపం

మల్కాపూర్ గుట్టపై రాతి గుహల మధ్య కేవలం ఒక చిన్నపాటి బిందువు రూపంలో వెలసిన పద్మనాభస్వామి నిజరూపం అభివృద్ధి చెందుతున్నది. ప్రస్తుతం ఈ గుహలో శంఖుచక్ర సహిత లక్ష్మీఅనంతపద్మనాభస్మామి పూర్తిరూపం దర్శనమిస్తున్నదని ఆలయ అర్చకులు తెలిపారు. మొదట్లో ఈ గుహలో చిన్నపాటి బింధువు రూపంలో ఉన్న స్వామివారికి పూజలు చేయడానికి నిచ్చెన వేసుకొని దానిపై నిలబడి చేసేవారు. కానీ స్వామివారి రూపం పెరుగుతూ రావడంతోపాటు గుహభాగం సైతం పెద్దగా మారడంతో స్వామివారికి అలంకరణ, అభిషేకాలు చేయడానికి పూజారులు గుహలోకి వెళ్లి పూజలు నిర్వహిస్తున్నారు. గుట్టపై భాగంలో గుహల మధ్య వెలసిన స్వయంభువుతోపాటు గుహకింది భాగంలో భక్తులు పూజలు చేసుకోవడానికి వీలుగా ప్రత్యేక మూర్తులను చేయించి ప్రతిష్ఠించారు.
ANANTHA1

పూజలు, ఇతర ఉత్సవాలు

ఈ అనంత పద్మనాభునికి ఏటా మాఘ బహుళ తదియ నుండి అష్టమి వరకు వారంరోజుల పాటు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. అందులో భాగంగా .... పంచమి రోజున స్వామి వారి కల్యాణం, సప్తమి నాడు రథోత్సవం నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలను నాలుగు గ్రామాలవాళ్లు నిర్వహించడం విశేషం. ఒక ఏడాది ధర్మారం గ్రామవాసులు నిర్వహిస్తే తదుపరి ఏడాది లక్ష్మాపూరు, మల్కాపూరు గ్రామస్తులు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు పరిసర జిల్లాల నుండే కాక మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల నుండి కూడ భక్తులు తండోప తండాలుగా వస్తారు. ఈ క్షేత్రంలో ప్రతి శనివారం అన్నదానం నిర్వహిస్తారు.

224
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles