పద్య రత్నాలు-15


Sun,August 11, 2019 02:12 AM

Poems

చెడు పనులను దాచలేం!

చేసిన దుష్టచేష్ట నది చెప్పక నేర్పున గప్పిపుచ్చి తామూసిన యంతటన్ బయలు ముట్టక యుండ దదెట్లు రాగిపై బూసిన బంగరుం జెదరిపోవ గడంగిన నాడు నాటికిన్
దాసిన రాగి గానబడదా జనులెల్ల రెఱుంగు భాస్కరా!

- భాస్కర శతకం

తాత్పర్యం:
మనుషులు ఎప్పుడూ సత్కార్యాలే చెయ్యాలి. చెడు పనులు చేసి, వాటిని దాచినా అవి శాశ్వతంగా దాగవు. ఏనాటికో ఒకనాటికి బయట పడకుండా ఉండవు. ఎలాగైతే, రాగిపైన బంగారు పూత పూస్తే కొన్నాళ్లకు అది తొలగి, ఆ బండారం బయట పడుతుందో అలాగ. కాబట్టి, దుర్మార్గపు పనులు దాగేవి కావు. కనుక వాటిని చేయకపోవడమే మంచిది.
Poems1

తొందరపాటు తగదు!

ఎంతటి యాకలి గలిగిన
బంతిన గూర్చుండి ముందు భక్షింపరు సా
మంతులు బంధువులును నిసు
మంతైనను జెల్లదందు రమ్మ కుమారీ!
- కుమారీ శతకం

తాత్పర్యం:పదిమందిలో ఎవరైనా సరే వినయ విధేయతలను మరవకూడదు. ప్రత్యేకించి పంక్తి భోజనాల వేళ ఆకలి దంచేస్తున్నదని తొందరపడి, అందరికంటే ముందు తినడం మంచిదికాదు. అలా తినేవాళ్లను ఎదుటివాళ్లు తిండిపోతుగా ముద్ర వేస్తారు. కాబట్టి, ఇంట్లోని వారంతా కూర్చుని భోజనం చేసేప్పుడు అందరూ వచ్చాకే తినడం షురూ చేయాలి.
Poems2

ముక్తి కోసమే భక్తి!

అతివిద్య నేర్చుట యన్నవస్త్రములకే, పనుల నార్జించుట పాడి కొఱకె,
సతిని బెండ్లాడుట సంసార సుఖముకే, సుతుల బోషించుట గతుల కొఱకె,
సైన్యమున్ గూర్చుట శత్రుభయంబు కె, సాము నేర్చుట లెల్ల జావు కొఱకె,
దానమిచ్చుటయు ముందటి సచితమునకె, ఘనముగా జదువు కడుపు కొఱకె,
యితర కామంబు గోరక సతతముగను
భక్తి నీయందు నిలుపుట ముక్తి కొఱకె,
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

- నరసింహ శతకం

తాత్పర్యం: ప్రతి పని వెనుకా ఒక పరమార్థం దాగుంటుంది. పెద్ద చదువులు అన్నవస్ర్తాలకు, ఉద్యోగ వృత్తులు ఆర్థిక సంపాదనకు, భార్య సంసారసుఖానికి, పిల్లలపోషణ ఉత్తమగతులకు, సైన్యం శత్రు నాశనానికి, సామువిద్యలు వీరత్వానికి, దానాలు పుణ్యానికి.. ఇలా ఎంత గొప్ప కార్యమైనా పొట్టకూటి కోసమే కదా. అలాగే, నీ పట్ల నిలిపే భక్తి అంతా ముక్తికోసమే స్వామీ!
Poems3

ఆశ చావదు కదా?

చావంగాలము చేరువౌ టెరిగియుం చాలింపగా లేక, త
న్నేవైద్యుండు చికిత్సబ్రోవగలడో, యేమందు రక్షించునో,
ఏ వేల్పుల్ కృపజూతురో యనుచు, నిన్నింతైన చింతింప దా
జీవశ్శ్రాద్ధము చేసికొన్న యతియున్ శ్రీకాళహస్తీశ్వరా!

- కాళహస్తీశ్వర శతకం

తాత్పర్యం:మరణ సమయం ఆసన్నమైందని తెలిసి కూడా రోగిష్టి ఏ వైద్యుడో, మరే చికిత్సో తనను మృత్యువు నుంచి కాపాడుతారేమో అని ఎదురుచూస్తుంటాడు. ఆఖరకు తన పిండాన్ని తానే పెట్టుకొనే యోగి సైతం ఏ దైవమో తనపట్ల కృప చూపక పోతాడా అనీ ఆశపడుతుంటాడు. నా మనసు మాత్రం అలా కాకుండా, నీ ధ్యానం పైనే దృష్టి పెట్టేలా చూడు స్వామీ!

ఈ శీర్షికపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని 9182777177 వాట్సప్ నంబర్‌లో తెలియజేయండి.

158
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles