ఫైలింగ్ కేబినెట్


Sun,August 4, 2019 12:38 AM

crime
మిస్ మేక్‌బ్రైడ్ 25 సంవత్సరాలుగా డెల్టన్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్‌గా పని చేస్తున్నది. ఆమె తన ఆఖరి సంవత్సరం దాకా ఆ కాలేజీలో చెప్పుకోదగ్గ పనులేమీ చేయలేదు. ఆమె పేరు తోటి లెక్చరర్స్‌లోని పది పన్నెండు మందికే తెలుసు. అలాగే, ఏటా ఆమె క్లాస్‌లోని సుమారు డజను మంది విదేశాల నుంచి వచ్చిన విద్యార్థులకే తెలుసు. ఆమె వారికి ఇంగ్లీష్ గ్రామర్‌ను బోధిస్తుంది. కాలేజీ నిర్వహించే డ్రామా, సాహిత్య ఉత్సవాలకి హాజరు కాకపోవడం వల్ల కూడా ఆమె గోప్యంగానే ఉండిపోయింది. మొత్తం సర్వీస్‌లో ఆమె సెలవు పెట్టింది కేవలం పధ్నాలుగు రోజులే. అదీ ఆమె సోదరుడి అనారోగ్యం, మరణం వల్ల. బహుశ ఆమె రిటైరయ్యాక ప్రపంచంలో మిస్ మేక్‌బ్రైడ్ అనే ఆమె జీవిస్తున్న సంగతే గుర్తుంచుకునే వాళ్ళు కాదు. కానీ, ఆ ఫైలింగ్ కేబినెట్ సంఘటన వల్ల ఆమె పేరు కాలేజీలోని వాళ్ళకే కాక అమెరికాలోని చాలామందికి తెలిసిపోయింది.

ఆమె కాలేజీలో చేరిన మొదటి ఐదేళ్ళలో ఒకరిద్దరు ఆమెతో డేటింగ్ చేసారు. కానీ, వాళ్ళు ఉద్యోగం మానేసి వెళ్ళిపోయాక ఆమెకి ముప్ఫై దాటడంతో ఎవరూ డేటింగ్ చేయలేదు. ఫలితంగా ఆమె అవివాహితగానే మిగిలిపోయింది. ఉద్యోగంలో చేరిన ఐదో సంవత్సరం ఆమె మొదటిసారి ఫైలింగ్ కేబినెట్ కోసం అడిగింది.
ఆమె ఆఫీస్‌ని ఐదో అంతస్థులోని పెద్ద గదినించి మూడో అంతస్థులోని చిన్నగదికి మార్చారు. నిజానికి అది చీపుర్లు ఉంచడానికి ఉద్దేశించిన చిన్న గది. ఆమె ఆ చిన్నగదికి మారడానికి అభ్యంతరం చెప్పలేదు. ఎక్కువ గోప్యత ఉండటంతో ఆమె సంతోషించింది. కానీ, ఆ గదికి మారాక ఆమెకి ఫైలింగ్ కేబినెట్ అవసరం ఇంకాస్త ఎక్కువ ఏర్పడింది.
ఆమె దగ్గర ఐదేండ్లుగా పేరుకున్న అనేక ఆన్సర్ షీట్స్, విద్యార్ధులు రాసిన ఎస్సేలు, అడ్మినిస్ట్రేటివ్ ఫారాలు, ఇతర కాగితాలు బల్లమీద దొంతర్లుగా పేరుకున్నాయి. ఓ రోజు ఆమె కాలేజ్ ప్రిన్స్‌పాల్ డాక్టర్ బ్రాడ్లీ ఆఫీస్ గదికి వెళ్ళి కోరింది.
నేను ఇంగ్లీష్ డిపార్ట్‌మెంట్‌కి చెందిన మేక్‌బ్రైడ్‌ని. నాకో ఫైలింగ్ కేబినెట్ కావాలి.
మిస్ మేక్‌బ్రైడ్. ప్రస్తుతం యుద్ధం జరుగుతున్నది. ఫైలింగ్ కేబినెట్లు ఇనుముతో చేస్తారు. ఇనుము యుద్ధానికి అవసరం. మీరు అర్థం చేసుకోగలరని అనుకుంటాను? యుద్ధం అయ్యాక అదే ధరకి మీకు రెండు కేబినెట్స్ కొనిస్తాను ఆయన చెప్పాడు.
థాంక్స్ సర్. కానీ, నాకు కావాల్సింది ఒక్కటే.

మా లెక్చరర్స్ కోసం మేం ఏదైనా చేస్తాం. కానీ, అసాధ్యమైంది మాత్రం చేయలేంగా.
అది నిజమే చెప్పి ఆమె బయటకి నడిచింది.
మరో ఐదేండ్ల తర్వాత 1949లో యుద్ధం ముగిసిన నాలుగేండ్లకి, ఫైలింగ్ కేబినెట్ కావాలని రిక్వెస్ట్ ఫాం రాసి పంపింది. రెండు నెలల తర్వాత బ్రాడ్లీ దాన్ని తిరస్కరిస్తూ సరిపడా ఫండ్స్ లేని కారణంగా అని రాసి పంపాడు. ఆమె దాని వంక కొద్దిసేపు ఆలోచనగా చూసి తన టేబిల్ సొరుగులో పడేసింది.
తర్వాతి ఐదు సంవత్సరాలు మిస్ మేక్‌బ్రైడ్ ఏటా ఆగస్ట్ నెలలో ఫైలింగ్ కేబినెట్ కోసం రిక్వెస్ట్ ఫామ్‌ని పంపిస్తూనే ఉంది. డాక్టర్ బ్రాడ్లీ ప్రతీసారి ఫండ్స్ లేని కారణంగా అని పింక్ రంగు పెన్‌తో రాసి తిరస్కరిస్తూనే ఉన్నాడు.
మిస్ మేక్‌బ్రైడ్ అన్నీ నీట్‌గా ఉంచుకునే తత్త్వం గలదైనా ఆమె చిన్న ఆఫీస్ గది చిందరవందర కాగితాలతో నమ్మలేనంత అశుభ్రంగా మారింది. ఫైలింగ్ కేబినెట్ లేకుండా ఆ గదిని తను శుభ్రంగా ఉంచుకోలేనని ఆమె గ్రహించింది. అప్పటికే ఆ గదిలో ఒక దానిమీద మరొకటి పేర్చబడ్డ అట్టపెట్టెలు నిండాయి. గదిలోని మూడు గోడలకి ఆనించి నేలనించి సీలింగ్ దాకా అట్టపెట్టెలు ఉన్నాయి. ఆ గదికి అరుదుగా వచ్చే సందర్శకులు దాన్ని చిత్రంగా చూస్తే ఆమె అపాలజీ చెప్పేది.
ఓ రోజు డాక్టర్ బ్రాడ్లీ సెక్రటరీ ఆమె గదికి వచ్చి ఓ కాగితాన్ని అడిగింది. ఆమె దాన్ని వెతికి ఇవ్వడానికి కొంత సమయం పట్టింది.
ఇదేమిటి? ఈ గది ఇలా ఉంది? ఎక్కడ చూసినా దుమ్ము. ఐనా, అవసరమైన కాగితాలు మీకు ఎలా దొరుకుతాయి? ఆమె ఆశ్చర్యంగా అడిగింది.
ఏ కాగితం ఏ అట్టపెట్టెలో ఉంచానో నాకు గుర్తుంటుంది. కష్టం ఏమిటంటే, ఆ పెట్టెలోని వందల కాగితాల్లోంచి దాన్ని వెదికి తీయడం మేక్‌బ్రైడ్ చెప్పింది.
మీ మైండ్ ఫైలింగ్ కేబినెట్ లాంటిదన్నమాట. మీకో ఫైలింగ్ కేబినెట్ అవసరం. అందులో ఉంచినవి తేలిగ్గా వెదికి బయటకి తీయచ్చు. అట్టపెట్టెలు, కాగితాల వల్ల ఈ గదిలో దుమ్ము బాగా పేరుకుంది. పైగా ఫైర్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఈ గదిని చూస్తే కాలేజీకి నోటీస్‌ని పంపుతారు. మీరు వెంటనే దానికోసం రిక్వెస్ట్ ఫారం ఇవ్వండి సెక్రెటరీ సూచించింది.
ఆమె వెంటనే రిక్వెస్ట్ ఫారం పంపింది. రెండు నెలల తర్వాత అదే పింక్ రంగు పెన్‌తో అవే మాటలతో అది తిరస్కరించబడింది. ఆమె వెంటనే సెక్రటరీ దగ్గరకి దాన్ని తీసుకెళ్ళి చూపించి అడిగింది.

దీన్నెందుకు తిరస్కరించారు?
కారణం దాని మీదే ఉందిగా. ఈ సంవత్సరం ఫైలింగ్ కేబినెట్ల బడ్జెట్ ఐపోయింది.
లెక్చరర్స్ అందరికీ ఫైలింగ్ కేబినెట్స్ ఉన్నాయి. ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఓ లెక్చరర్‌కి రెండున్నాయి మేక్‌బ్రైడ్ చిరుకోపంగా చెప్పింది.
మీరు సహనంతో ఉండాలి మిస్ మేక్‌బ్రైడ్. కొత్త బడ్జెట్ రావాలి. మీ వంతు వచ్చేదాకా ఆగాలి.
1942 నించి వేచి ఉన్నాను. అంటే పన్నెండేళ్ళు. ఇంకా ఎంతకాలం వేచి ఉండాలి?
వచ్చే సంవత్సరం బడ్జెట్ పెంచమని డాక్టర్ బ్రాడ్లీ అడగబోతున్నారు. అప్పుడు మీకో ఫైలింగ్ కేబినెట్ తప్పక వస్తుంది.
థ్యాంక్ యూ చెప్పి ఆమె తన గదిలోకి వెళ్ళి కాగితాల గోడౌన్‌లా ఉన్న ఆ గది వంక చూసి, ఆగడానికి సంవత్సరం ఎక్కువ కాలం కాదు అనుకుంది.
ఆ తర్వాతి సంవత్సరం కూడా ఆమెకి ఫైలింగ్ కేబినెట్ రాలేదు. ఆ తర్వాతి సంవత్సరం కూడా. రెండుసార్లు ఆమె స్వల్పంగా నిరసనని వ్యక్తం చేసింది. కానీ, ఉపయోగం లేకపోయింది. మూడేండ్ల తర్వాత ఆమె ఒక్కటైనా అంగీకరించబడుతుందని ఐదు రిక్వెస్ట్ ఫారాలని పంపింది. ఐదూ తిరస్కరించబడ్డాయి. మర్నాడు ఉదయం ఆమె డాక్టర్ బ్రాడ్లీ ఆఫీస్‌కి వెళ్ళింది.
నా పేరు మిస్ మేక్‌బ్రైడ్. నేను ఇంగ్లీష్ డిపార్ట్‌మెంట్లో ఉన్నాను. ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ పని చేస్తున్నాను. నా ఆఫీస్ గదికో ఫైలింగ్ కేబినెట్ కావాలి. నా గదిలో ఎక్కడ చూసినా కాగితాలున్న అట్టపెట్టెలే కోరింది.
రిక్వెస్ట్ ఫారం పంపించారా.. ఏం కావాలన్నారు మిస్ మార్గరెట్?
మిస్ మేక్‌బ్రైడ్. ఫైలింగ్ కేబినెట్. రిక్వెస్ట్ ఫారం పంపాను. నిజానికి గత తొమ్మిదేళ్ళుగా ప్రతీ ఏడు దాన్ని పంపుతున్నాను, 1942 నించి. యుద్ధం వల్ల మన సైనికులకి ఇనుము అవసరమని తిరస్కరించారు. తర్వాత కొరియా యుద్ధం. ఇప్పుడు ఏ యుద్ధాలూ లేవు. మరి, నా రిక్వెస్ట్ ఫాం ఎందుకు తిరస్కరించారు? బాధగా అడిగింది.
దాని మీద కారణం ఏం రాసుంది? ఆయన అడిగాడు.

ఫండ్స్ లేకపోవడం.
అవును. బడ్జెట్ సమస్య ఉంది. అది నాకెంత పెద్ద సమస్యో మీకు తెలీదు. లెక్చరర్స్ అడిగే చాలా వాటిని నేను బడ్జెట్ లేక తిరస్కరించాల్సి రావడం నాకూ బాధగానే ఉంది.
ఆమె ఆ గదిలోని ఎయిర్‌కండిషనర్ యంత్రాన్ని, నేలమీద పరిచిన ఖరీదైన కార్పెట్‌ని, కొత్త కర్టెన్లని చూసి అడిగింది.
ఓ చిన్న ఫైలింగ్ కేబినెట్‌కి బడ్జెట్ లేదా?
లేదు. మీరు ఒక్కరే కాదు. ఇక్కడ రెండు వందల మంది లెక్చరర్స్ పని చేస్తున్నారు. అందరికీ తలో ఫైలింగ్ కేబినెట్ కొనాలంటే ఎంతవుతుందో ఆలోచించండి. అదీకాక మిగతా క్లాసులతో పోలిస్తే మీ క్లాసులోని విద్యార్థులు చాలా తక్కువ.
ఆమెకి ఈసారి నిరాశ కలుగలేదు. ఇంకో ఐదేండ్లలో ఎటూ రిటైరవబోతున్నది. ఇంతకాలం ఎలా గడుపుకు వచ్చిందో అలాగే గడపవచ్చు అనుకుంది.
మిస్ మేక్‌బ్రైడ్. ఈసారి ఫైలింగ్ కేబినెట్ కొన్నప్పుడు మొదటిది మీ ఆఫీస్‌కే పంపిస్తాను ఆయన నోట్ చేసుకుని చెప్పాడు.
థాంక్స్ డాక్టర్ బ్రాడ్లీ. మీ సమయం వృధా చేసినందుకు ఏమీ అనుకోకండి.

తర్వాతి సంవత్సరం ఆమె రిక్వెస్ట్ ఫాంని పంపలేదు. నాలుగు ఫైలింగ్ కేబినెట్లని కొన్నారని తెలిసాక ఒకటి తనకి ఇస్తారని ఎదురు చూసింది. కానీ, ఇవ్వలేదు. ఇక చోటు లేకపోవడంతో తర్వాతి నాలుగు సంవత్సరాలు ఆమె విద్యార్థుల టెస్ట్ పేపర్లని, ఇతర కాగితాలని, ఫారాలని చెత్తబుట్టలో పడేయసాగింది. ఆమె రిటైర్‌మెంట్ సంవత్సరం వచ్చింది.
ఆఖరి రోజు ఉదయం తొమ్మిదికి ఇంగ్లీష్ క్లాస్‌లోకి వెళ్ళడానికి ఆమె ఆఫీస్ గదిలోంచి మెట్లెక్కి పైకి వస్తూంటే మెట్లకి అడ్డంగా ఏదో కనిపించింది. చూస్తే అది ఐదు డ్రాయర్ల ఆకుపచ్చ ఫైలింగ్ కేబినెట్.
అది చూడగానే ఆమె మొహం కోపంతో ఎర్రబడింది. తన గదిలోకి వెళ్ళి డాక్టర్ బ్రాడ్లీ సెక్రెటరీకి ఇంటర్‌కంలో చెప్పింది.
డాక్టర్ బ్రాడ్లీని తక్షణం నా గదికి రమ్మని చెప్పు. ఇది ఎమర్జన్సీ.
కుదరదు అనుకుంటాను. ఆయన గదిలో కొత్త కార్పెట్లని పరుస్తున్నారు సెక్రటరీ చెప్పింది.
ఎమర్జన్సీ. తర్వాత మీ ఇష్టం చెప్పి పెట్టేసింది.
ఆ ఫైలింగ్ కేబినెట్ పక్కన నిలబడి వేచి ఉన్న ఆమెకి కొద్దిసేపటికి వచ్చే బ్రాడ్లీ కనిపించాడు. రెండో అంతస్థులోంచి వచ్చే ఆయన తప్పుకోలేక పోయాడు. అది అతని మీదకి తిరగబడగానే పుచ్చకాయ బలంగా కాంక్రీట్ నేలమీద పడి విచ్చుకుంటే వచ్చే లాంటి శబ్దం వినిపించింది. అతను, బరువైన ఆ ఇనుప కేబినెట్ మెట్లమీద కిందికి ఒకటో అంతస్థు దాకా వెళ్ళారు.
ఇది నిజంగా దయనీయం. ఘోరమైన ప్రమాదం. చెప్పి ఆమె తన ఆఖరి క్లాస్‌కి హాజరవడానికి వెళ్ళింది.
(జాక్ బరిస్ కథకి స్వేచ్ఛానువాదం)

- మల్లాది వెంకట కృష్ణమూర్తి

1235
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles