భలే భలే..మక్కజొన్న బొమ్మలు!


Sun,August 4, 2019 01:55 AM

dolls
మక్కజొన్న పొట్టును, పీచును తన కళా వస్తువుగా ఎంపిక చేసుకున్నదీ మణిపూర్ మహిళ. కేవలం పొట్టు, పీచుతోనే అద్భుతాలు సృష్టిస్తున్నది. వాటిని విక్రయిస్తూ.. కళాత్మకతతో కూడిన కష్టానికి ప్రతిఫలం అనుభవిస్తున్నది.

మనసుంటే మార్గముంటుంది.. తనలోని సృజనాత్మకతకు మరికొంత కళాత్మకతను జోడించి అద్భుత కళాఖండాలను తయారు చేస్తున్నది ఈ మహిళ. కళ ఉంటే వ్యర్థాలు కూడా కళారూపాలవుతాయనడానికి ఈమే నిదర్శనం. మణిపూర్ రాష్ట్రం మావో ప్రాంతానికి సమీపంలోని సాంగ్‌సాంగ్ గ్రామానికి చెందిన ఈ మహిళ పేరు నెలి చాచెయా. మక్కజొన్న పొట్టు, పీచులతో అందమైన బొమ్మలు తయారుచేస్తూ.. చేతినిండా సంపాదిస్తున్నది నెలి.

బంగారం కంటే ఎక్కువ

మక్కజొన్న పొత్తులంటే చాలామంది ఇష్టంగా తింటారు. చలికాలంలో.. తొలకరి వర్షానికి మక్కజొన్న కండెలు కాల్చుకొని గింజల్ని తిని.. పొట్టు, కండెలను పారేస్తం. అయితే మనం ఎందుకూ పనికిరావని పడవేసే పొట్టు, కండెలను బంగారం కంటే ఎక్కువగా భావిస్తుంది నెలి చాచెయా. ఎందుకంటే వాటితోనే ఆమె అందమైన బొమ్మలు తయారు చేస్తున్నది కాబట్టి. సాంగ్‌సాంగ్ గ్రామానికి చెందిన అతుయో నెలి, ఖోలి చిసా దంపతులకు ఎనిమిది మంది సంతానం. వారిలో ఒకరైన నెలి చాచెయా 14 యేండ్ల నుంచి పువ్వులు, బొమ్మల వ్యాపారం చేస్తున్నది. చాచెయాకు చిన్నప్పటి నుంచి మక్కజొన్న పొత్తులంటే ప్రాణం. ఆమె ఒకసారి మక్కలు తిని.. పొట్టు, కండె పారేయబోతూ ఆలోచనలో పడింది. వీటిని కూడా ఎందుకు పడేయాలి? వాటితో ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది కదా అని అనుకున్నది. వచ్చిన ఆలోచననను వెంటనే ఆచరణలో పెట్టంది. ఆమె ఎలాగూ పూలు, బొమ్మలు తయారు చేస్తున్నది కాబట్టి.. మక్కజొన్న పొట్టు, కండెలతో కూడా బొమ్మలు తయారు చేయాలని నిర్ణయించుకున్నది.

కస్టమర్లకు నచ్చిన విధంగా..

మక్కజొన్న వ్యర్థాలతో బొమ్మల తయారీ మొదలు పెట్టిన చాచెయా.. అనతికాలంలో డబ్బులు బాగా సంపాదించింది. తన వ్యాపారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కస్టమర్లకు నచ్చిన విధంగా బొమ్మలు తయారు చేయడం మొదలు పెట్టంది. అంతేకాకుండా వాటిని శుభకార్యాలు, ఫంక్షన్లకు బహుమతులుగా ఇచ్చేలా రూపొందించింది. అవి కూడా చూడముచ్చటగా ఉండటంతో గిరాకీ బాగా పెరిగింది. దీంతో కొద్దికాలంలోనే ఆ ప్రాంతంలో తనో బిజినెస్ ఉమెన్‌గా అవతరించింది. ఈ క్రమంలో ఢిల్లీలోని ప్రగతి మైదానంలో 2007లో జరిగిన 2వ అంతర్జాతీయ ఫ్లోరా ఎక్స్‌పోలో చాచెయా స్టాల్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఆమె ప్రతిభను మెచ్చిన వ్యవసాయ మంత్రిత్వ శాఖలోని ఇండియన్ ఫ్లవర్స్ అండ్ డెకరేటెడ్ ప్లాంట్స్ సంక్షేమ సంఘం చాచెలియాను అభినందించి సత్కరించింది.
dolls1

రూ.200 నుంచి మొదలు

నెలి చాచెయా మక్కజొన్న బొమ్మలు మంచి ధర పలుకుతున్నాయి. ఆయా డిజైన్లను బట్టి ఒక్కో బొమ్మ రూ. 200 నుంచి రూ.500 వరకు అమ్మున్నది చాచెయా. ఈమెకు మణిపూర్ మావో గేట్ వద్ద ఐడియాస్ ఫ్లోరిస్ట్ అనే స్టోర్ ఉంది. ఇందులో తాను తయారు చేసిన బొమ్మలన్నీ ప్రదర్శనకు ఉంచుతుంది. మైసూర్, భోపాల్ సమీపంలో కొందరు ఆర్ట్ విద్యార్థులకు ప్రత్యేకంగా క్లాసులు కూడా చెప్పింది చాచెయా. మక్కజొన్న పొత్తులతో బొమ్మలను తయారు చేయడం ఎలా? వాటితో ఫ్లవర్ బొకేలను డిఫరెంట్‌గా ఎలా డెకరేట్ చేయవచ్చు? అనే విషయాలపై శిక్షణ కూడా ఇస్తున్నది. ముంబైలోని హారిజోన్, హిల్లీ వ్యాలీ, మణిపూర్ హస్తకళల ఎగ్జిబిషన్‌లో చాచెయా తయారు చేసిన అందమైన బొమ్మలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

పలు రాష్ర్టాల్లో ఎక్స్‌పోలు

చాచెయా తయారు చేసే బొమ్మలకు డిమాండ్ బాగా పెరగడంతో.. పలు రాష్ర్టాల్లో నిర్వహించే ఎక్స్‌పోలకు హాజరయ్యేది. కాలానుగుణంగా బొమ్మలను వైవిధ్యంగా తయారు చేస్తూ.. అన్ని వర్గాల వారి మన్ననలు పొందుతున్నది చాచెయా. ప్రస్తుతం తన వ్యాపారాన్ని నాగాలాండ్, ముంబై, భోపాల్ వంటి ప్రాంతాలకూ విస్తరించింది. రోజుకు 10 నుంచి 12 బొమ్మలను తయారు చేస్తానని చాచెయా చెబుతున్నది. మొత్తంగా ఓ సాధారణ పూల వ్యాపారి ఇవాళ బిజినెస్ ఉమెన్‌గా మారి ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలిచింది. రోజు మనం చూసేవాటిని కూడా ముచ్చటైన వస్తువులు తయారుచేయవచ్చని నిరూపించింది చాచెయా. మీరు కూడా ఇక నుంచి మక్కజొన్న పొట్టు, కండెలు పారేసేముందు ఆలోచించుకోండి. వాటితో మీరేం అద్భుతాలు చేస్తారో మీ బుర్రకు పదును పెట్టండి.
dolls2
మక్కజొన్న పొట్టు, పీచు, కండెలతో బొమ్మలు తయారు చేయడం ప్రారంభించింది. కొన్ని ప్రయోగాల తర్వాత వాటికి చక్కని రూపం ఇచ్చి, అందమైన రంగులు దిద్ది అమ్మకానికి పెట్టింది. మొదట్లో ఆ బొమ్మలను మార్కెట్‌కు పరిచయం చేయడానికి కొంత భయపడినా.. ఆ తర్వాత ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి అవాక్కైంది చాచెయా.

209
Tags

More News

VIRAL NEWS