కప్పు నూనెతో ప్రయోగం


Sun,August 4, 2019 01:44 AM

MARMIKA-KATHA
నారదుడు ప్రపంచంలో జరిగే విశేషాలన్నీ విష్ణులోకానికి వెళ్లి విష్ణువుకు వివరిస్తూ ఉంటాడు. నారదుడు అనునిత్యం నారాయణ నామంతో తరిస్తూ ఉంటాడు. అప్పుడుప్పుడూ విష్ణువు, నారదుడు మామూలు మనుషులుగా ఆకారాలెత్తుకొని ప్రపంచంలోకి వచ్చేవాళ్లు. మనుషుల జీవన విధానాన్ని, తప్పిదాల్ని, భక్తి శ్రద్ధల్ని పరిశీలించేవాళ్లు. అట్లా మామూలు మనుషులుగా ఒకసారి ఒక గ్రామానికి వచ్చారు. వాళ్లని ఎవరూ దేవతలుగా గుర్తుపట్టలేదు. ఆ వూల్లో మాధవుడనే చిన్న వ్యాపారి ఉన్నాడు. అతను తనకు వచ్చే కొద్దిపాటి ఆదాయంతో ప్రశాంత జీవనం వెళ్లబుచ్చేవాడు. అతనంటే ఊళ్లో వాళ్లకు గురి. ఊళ్లో జనం ప్రతి రోజూ ఆయన దగ్గరకు వచ్చి తమ సమస్యలు చెప్పి, ఆయన సమాధానాలతో సంతృప్తిగా వెళ్లేవారు.

మాధవుడు దారివెంట వెళ్తూంటే మహావిష్ణువు అతనికి చేతులెత్తి నమస్కరించాడు. నారదుడు ఆశ్చర్యపోయాడు. స్వామీ! మీరు ఎవరైనా మహర్షికి నమస్కరిస్తే ఆశ్చర్యపోయేవాడిని కాదు. కానీ, మామూలు మనిషికి నమస్కరించడం వింతగా ఉంది అన్నాడు. విష్ణువు అతను నా భక్తుడు. కావాలంటే పరీక్షించు అని మాయమయ్యాడు.మారువేషంలోని నారదుడు మాధవుణ్ని అనుసరించి, పరిచయం చేసుకొని, తను తీర్థయాత్రకు వెళ్తున్నానని చెప్పాడు. మాధవుడు మీరు ప్రయాణ బడలికతో వున్నట్టున్నారు. రెండు రోజులు మా ఇంట్లో నా అతిథ్యం స్వీకరించి విశ్రాంతి పొందండి అన్నారు. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టయి నారదుడు సంతోష పడ్డాడు.ఆ రెండు రోజులూ నారదుడు మాధవుని జీవితాన్ని పరిశీలించాడు. మాధవుడు పూజలు, పురస్కారాలు లాంటివి ఏమీ చేస్తున్నట్టు కనిపించలేదు. తన వ్యాపారం చేసుకుంటూ తక్కిన సమయంలో తన దగ్గరికి వచ్చిన గ్రామస్థుల సమస్యలు వింటూ తోచిన సలహాలు ఇస్తున్నాడు. అతనిలో ఎక్కడా భక్తి ఛాయలు మచ్చుకు కూడా కనిపించలేదు.

నారదుడు విష్ణువు దగ్గరకు వెళ్లి స్వామీ! రెండ్రోజులు అతని జీవితాన్ని పరిశీలించాను. ఎప్పుడో నిద్రలేచినప్పుడు ఒకసారి నారాయణ అంటాడు. పడుకునేటప్పుడు ఇంకోసారి నారాయణ అంటాడు. తక్కిన సమయంలో తన వ్యాపారం, గ్రామస్థుల సమస్యలు వింటాడు. అనునిత్యం నారాయణ నామ జపంతో వుండే వాళ్లు వీలైనప్పుడల్లా మిమ్మల్ని ధ్యానించేవాళ్లు బోలెడు మంది వుండగా ప్రత్యేకంగా ఇతని పట్ల ఎందుకు ఇష్టమో అర్థం కావడం లేదు అన్నాడు.విష్ణువు ఆ సంగతి తర్వాత చూద్దా. నూనె నింపిన ఈ కప్పును తీసుకొని ఉదయాన్నే వెళ్లి సాయంత్రానికిరా.. కానీ ఒక్కబొట్టు కూడా కింద ఒలకకూడదు. ఈ విషయం మరిచిపోకు నారదునితో అన్నాడు.నారదుడు నూనె నింపిన ఆ కప్పును తీసుకొని ఒలికిపోకుండా జాగ్రత్తగా అడుగులేస్తూ వెళ్లాడు. సాయంత్రం దాకా కప్పుమీద దృష్టి నిలిపి ఒక్క బిందువు కూడా కింద పోకుండా ఏకాగ్రతగా ఉండి, సాయంత్రానికి విష్ణువు దగ్గరికి వచ్చి విజయం సాధించానని విన్నవించాడు.

నారదా! ఏమయ్యా! అసలు .. ఏమయ్యావో అని నాకు దిగులేసింది. ఎందుకంటే, అనునిత్యం నారాయణ మంత్రం నా చెవుల్ని తాకేది. ఉదయం నించీ ఒక్కసారైనా నా పేరు పిలువలేదు నువ్వు అన్నాడు. నారదుడు పశ్చాత్తాపంతో స్వామీ! కప్పులోని నూనె మీద కళ్లన్నీ వుండడంతో ఆ సంగతే మరిచాను అన్నాడు.విష్ణువు సరిగానే చెప్పావు.. నూనె ఒలికిపోకుండా ఉందంటే దీని మీదనే ప్రాణాల్ని నిలిపావు. దీంతో ఇతరమైనవన్నీ స్తంభించాయి. మాధవుడు తన చిన్ని వ్యాపారం సక్రమంగా సజావుగా, ధర్మబుద్ధిగా నిర్వహించం మీదే అనుక్షణం మనసు నిలుపుతూ.. వీలు చిక్కినప్పుడు మనుషుల సమస్యలు పరిష్కరిస్తూ చేతనైనంత సాయం చేస్తాడు. అతని సొంత పనికి, ఇతరుల పనికి అతను తేడా చూపడు. అట్లాగే అతని జీవితాన్ని దైవచింతనలో భాగంగా కర్తవ్య నిర్వహణలో చేస్తాడు. అంతగా ప్రపంచంలో వుంటూ కూడా ఉదయాన, రాత్రి కనీసం నా పేరు రెండు సార్లు జపిస్తాడు. అంతకన్నా నాకేం కావాలి అన్నాడు.
మాధవుని ఔన్నత్యాన్ని వివరించిన విష్ణువుకు నారదుడు తల వంచి నమస్కరించాడు.

నారదుడు నూనె నింపిన ఆ కప్పును తీసుకొని ఒలికిపోకుండా జాగ్రత్తగా అడుగులేస్తూ వెళ్లాడు. సాయంత్రం దాకా కప్పు మీద దృష్టి నిలిపి ఒక్క బిందువు కూడా కింద పోకుండా ఏకాగ్రతగా ఉండి, సాయంత్రానికి విష్ణువు దగ్గరికి వచ్చి
విజయం సాధించానని విన్నవించాడు. నారదా! ఏమయ్యా! అసలు .. ఏమయ్యావో అని నాకు దిగులేసింది. ఎందుకంటే అనునిత్యం నారాయణ మంత్రం నా చెవుల్ని తాకేది. ఉదయం నించీ ఒక్కసారైనా నా పేరు పిలువలేదు నువ్వు
అన్నాడు.

ఈ శీర్షికపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని 9182777177 వాట్సప్ నంబర్‌లో తెలియజేయండి.

- సౌభాగ్య

227
Tags

More News

VIRAL NEWS