ఎటూ తేలని మరణ రహస్యం కళాభవన్ మణి


Sun,July 7, 2019 02:04 AM

gemini
కళాభవన్ మణి అంటే అంతగా గుర్తు పట్టకపోవచ్చు. కానీ వెంకటేష్ హీరోగా నటించిన జెమిని చిత్రంలో విలన్ లడ్డా అంటే ఠక్కున గుర్తొస్తారు. ఆ పాత్రలో మణి ప్రదర్శించిన నటన, హావభావాలు ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో సుస్థిరం. ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు గాయకుడు, సంగీత దర్శకుడు, మిమిక్రీ ఆర్టిస్ట్, కథా రచయిత కూడా. ఆటోడ్రైవర్‌గా జీవితాన్ని ప్రారంభించిన ఆయన స్వతహాగా మిమిక్రీ ఆర్టిస్ట్. కేరళలో గొప్ప కళాకారులను అందించిన కళాభవన్‌లో మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ఆ కళాభవన్ పేరునే ఇంటిపేరుగా చేసుకున్నారు. హాస్య నటుడిగా అక్షరం సినిమాతో మలయాళ సినీరంగానికి పరిచయమైన మణి 200 పైగా చిత్రాల్లో విభిన్న పాత్రల్లో కనిపించారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆయన 2016లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. అయితే ఆయనది సహజమరణం కాదన్నది కుటుంబ సభ్యుల ఆరోపణ. నాటి వివరాలే ఈ చివరిపేజీ.

2016 మార్చి 5, శనివారం..

స్నేహితులతో రోజంతా గడపిన కళాభవన్ మణి. ఇంటికి వచ్చాడు. కాసేపటికే ఆయన కళ్లు తిరిగిన స్థితిలో ఇంట్లో పడిపోయారు. కోమాలో ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు హాస్పటిల్‌కు తరలించారు. మొదట ఆయనను లోకల్ హాస్పటిల్‌లో ఎడ్మిట్ చేసారు. అయితే కండీషన్ మరీ చేజారిపోయేటట్లు ఉండటంతో వెంటనే కొచ్చిలోని అమృత హాస్పటిల్‌కు పంపారు. అక్కడ ఆయన శరీరంలో మోతాదుకు మిం చిన మిధైల్ ఆల్కహాల్ ఉండటం గమనించి, పోలీసులను ఎలర్ట్ చేసారు. కానీ ఆ పరిస్దితుల్లో మణి మాట్లాడే స్థ్ధితిలో లేకపోవటంతో స్టేట్‌మెంట్ తీసుకోలేకపోయారు. అయితే పోలీసులు అవుట్ హౌస్, ఆయన ఇంటి దగ్గరలోనూ, ఆయన ముగ్గురు స్నేహితులతో అవుట్ హౌస్‌లో గడిపిన చోట సెర్చ్ చేసారు. ఆయన స్నేహితుల నుంచి కూడా స్టేట్‌మెంట్ తీసుకున్నారు.

కొంతకాలంగా కాలేయ, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మార్చి 6న ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయనకి భార్య డా.నిమ్మి, కూతురు శ్రీలక్ష్మి ఉన్నారు. నటుడు కళాభవన్ మణి శనివారం కొచ్చిలోని అమృత ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచాం. ఆదివారం రాత్రి 7.15గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు అని వైద్యులు తెలిపారు. అయితే ఆయన మరణం సహజమరణం కాదని భార్య, తమ్ముడు అనుమానం వ్యక్తం చేయడంతో మణి మృతి మిస్టరీగా మారింది.

కళాభవన్ మణి అసలు పేరు మణిరామన్.1971 జనవరి 1న కేరళలోని చలక్కుడిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. స్వతహాగా మిమిక్రీ కళాకారుడు అయిన ఆయన అక్కడి కళాభవన్‌లో ప్రదర్శనలు ఇస్తూనే ఆటోడ్రైవర్‌గా పనిచేశాడు. హాస్య నటుడిగా అక్షరం సినిమాతో మలయాళ సినీరంగానికి పరిచయమైన మణి వాసంతియుం లక్ష్మీయం పిన్నె న్యానమ్ చిత్రంలో అంధ వీధి గాయకుడిగా అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. ఆ చిత్రంలో ఆయన నటనకు జాతీయస్థాయిలో ప్రత్యేక ప్రశంస అవార్డుతో పాటు పలు అవార్డులను అందుకున్నారు. జెమిని చిత్రంలో విలన్ లడ్డా పాత్రలో మణి ప్రదర్శించిన నటన, హావభావాలతో ప్రేక్షకుల గుండెల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్నారు. జెమిని చిత్రం తర్వాత దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రముఖ విలన్లలో ఒకరిగా మారారు. తెలుగులో ఎవడైతే నాకేంటి, నరసింహుడు, అర్జున్‌తోపాటు పలు చిత్రాల్లో నటించారు. మలయాళ చిత్రసీమ నుంచి నట ప్రయాణం మొదలుపెట్టి తెలుగు,తమిళంలోనూ నటిం చి పేరు తెచ్చుకొన్నారు. గాయకుడు, సంగీత దర్శకుడు కూడా. 25కుపైగా చిత్రాల్లో పాటలు పాడారు. మలయాళం, తమిళం, తెలుగులో 200 చిత్రాలకుపైగా నటించారు. తెలుగులో జెమిని చిత్రంతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. అందులో పక్షుల్లాగా, జంతువుల్లాగా అనుకరిస్తూ విలన్ పాత్రతో ఆకట్టుకున్నారు.

అసలేం జరిగింది?

కాలేయవ్యాధితో బాధ పడుతున్న మణి అంత సడన్‌గా మృత్యువాత పడడం చలనచిత్ర రంగాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయనది అనుమానాస్పద మృతి కావడంతో దీనిపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. ఈ క్రమంలో నిర్వహించిన శవపరీక్షలో పలు విషయాలు బయటపడ్డాయి. కళాభవన్ మణి శరీరంలో ఇన్సెక్టిసైడ్స్ (క్రిమి సంహారకాలు), ఇథనాల్, మిథనాల్ వంటి రసాయనాలు ఉన్నట్లు టాక్సికాలజీ పరీక్షల్లో తేలింది. శరీరానికి తీవ్రంగా హాని కలిగించే ఇన్సెక్టిసైడ్ క్లోర్పిరిఫోస్ సైతం కళాభవన్ మణి శరీరంలో ఉన్నట్లు పరీక్షలో బయటపడింది. క్లోర్పిరిఫోస్‌ను పంటపొలాల్లో పురుగుల నివారణకు ఉపయోగిస్తారు. దీనితో పోలీసులు కళాభవన్‌ది అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. ఇక అతని మరణంపై పలు అనుమానాలున్నాయంటూ ఆయన భార్య కూడా ఫిర్యాదు చేసింది. అయితే, కుటుంబ పరంగా ఎటువంటి సమస్యలూ లేవని ఆమె స్పష్టం చేసింది. తన భర్తకూ, తనకు మధ్య విభేదాలు లేవని తెలిపింది. తన భర్తకు ఎవరైనా శత్రువులున్నారా? అంటూ వేసిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. మణికి తన స్నేహితులతో కలిసి మందు తాగే అలవాటు ఉందని చెప్పింది. అయితే, తన భర్త బలవన్మరణానికి మాత్రం పాల్పడలేదని, ఆర్థిక సమస్యలు ఏవీ లేనప్పుడు ఆత్మహత్య చేసుకునే అవకాశం ఎందుకుంటుందని ఆమె ప్రశ్నించింది.

మరోవైపు ఆయన డైరెక్ట్‌గా డ్రగ్స్ తీసుకోవడమో లేక పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకోవడమో చేశారని అక్కడి మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఇన్వెస్టిగేషన్‌లో మాత్రం పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. మణికి అత్యంత సన్నిహితుడైన ఓ వ్యక్తి చెప్పిన దాని ప్రకారం.. ఇడుక్కికు చెందిన ఓ లేడీ డాక్టర్‌తో మణికి అక్రమ సంబంధం ఉందని, అయితే ఆ లేడీ డాక్టర్ పేరు చెప్పటానికి ఇష్టపడలేదు. దీంతో ఆయనకు కుటుంబంతో సరైన సంబంధాలు లేకపోవచ్చు అనుకుంటున్నారు. ఈ విషయాలు వెలుగులోకి వచ్చాక కళాభవన్ మణికి చెందిన బంధువులు, స్నేహితులు, ఆయన భార్య నిమ్మి ని ఇంటరాగేట్ చేశారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మణి...తన భార్య నిమ్మితో డైవర్స్ తీసుకోవాలని అనుకున్నారట. ఇక మణి స్నేహితులు చెప్పిన వివరాల ప్రకారం.... మణి.. లివర్ డిసీజ్ విషయం తెలిసాక డిప్రెషన్‌లోకి వెళ్ళాడని అంటారు. ఇది మణి సినీ కెరీర్ పై పడిందని, త్వరలోనే సినిమాలను వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు. మణి పర్సనల్ మేకప్ మ్యాన్ జయరామ్ మాత్రం మణి చాలా స్ట్రాంగ్‌గా ఉండే వ్యక్తి, సూసైడ్ చేసుకునేటంత బలహీన మనస్కుడు కాదు. అంతేకాదు మణికి తన భార్య నిమ్మి అన్నా, కూతురు అన్నా ప్రాణం అని చెప్పాడు.

ఫోరెన్సిక్ రిపోర్టులోనూ ఆయన దేహంలో అత్యంత విషపూరితమైన మిథైల్ ఆల్కహాల్(మిథనాల్) అవశేషాలు ఉన్నట్లు నివేదిక తేల్చింది. హైదరాబాద్‌కు చెందిన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నిర్వహించిన టెస్టుల్లో ఇది రుజువైంది. అయితే అది ఆయన మరణానికి ఎంతవరకు కారణం అయిందనేది తేలాల్సి ఉంది. ఇంతకు ముందు కొచ్చిలోని ప్రాంతీయ రసాయన పరీక్ష కేంద్రంలో జరిపిన టెస్టులో ఆయన శరీరంలో ప్రమాద కరమైన క్లోర్‌పిరిఫోస్ అవశేషాలు ఉన్నట్లు రిపోర్టు ఇచ్చారు. అయితే హైదరాబాద్‌లో జరిగిన టెస్టులో మాత్రం ఆయన శరీరంలో పురుగు మందు అవశేషాలేమీ లేవని తేలింది. ఒక్కో రిపోర్టు ఒక్కో రకంగా రావడంతో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు కేరళలోని ఆయన అభిమానులు కూడా ఈ రిపోర్ట్‌లతో అయోమయానికి గురవుతున్నారు. తమ అభిమాన నటుడి మరణం విషయంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం వారిని షాక్‌కు గురి చేసింది. కొన్నాళ్ళ పాటు కేసు దర్యాప్తు చేసిన పోలీసులు అయన మరణంలో ఎటువంటి మిస్టరీ లేదని, కేవలం లివర్ సంబంధిత వ్యాధితోనే మృతి చెందాడని హైకోర్టుకి తెలిపింది. అయితే కుటుంబసభ్యుల అభ్యంతరంతో కళాభవవన్ మణిది హత్యా? ఆత్మహత్యా? తేల్చేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. ఆయన మరణ రహస్యాన్ని తేల్చడంలో కేరళ రాష్ట్ర పోలీసులు విఫలం అయిన నేపథ్యంలో కేసు సిబీఐ చేతికి వెళ్లింది.

కేసును తేల్చడంలో విఫలం అవ్వడంతోపాటు, అసలు కారణాన్ని పక్కదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఈ కేసును సీబీఐ చేతికి ఇచ్చారు. మరోవైపు కళాభవన్ మణి డెత్ కేసులో కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కేరళలోని ఎర్నాకులం కోర్టులో జరిగిన విచారణలో సిబిఐ అధికారులు మణి స్నేహితులని విచారించేందుకు లై డిటెక్ట్ టెస్ట్‌కు అనుమతి సాధించారు. ఈ కేసులో నిజాలు నిగ్గు తేలాలంటే మణి స్నేహితులనీ కూడా విచారించాలని సిబిఐ అధికారులు భావించారు. దీనితో పట్టుబట్టి కోర్టులో అతడి స్నేహితులపై లై డిటెక్ట్ టెస్ట్‌కు అనుమతులు సాధించారు. కోర్టు నిబంధనల ప్రకారం కళాభవన్ మణి స్నేహితులందరిని విచారించడానికి వీల్లేదు. ఆ సమయంలో కళాభవన్ మణితో సన్నిహితంగా ఉన్నవారికి మాత్రమే లై డిటెక్ట్ టెస్టు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. కళాభవన్ మణి స్నేహితులని విచారిస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయని సిబిఐ అధికారులు బలంగా విశ్వసిస్తున్నారు. ఎందుకంటే మణి అనారోగ్యానికి గురైన సమయంలో అతడి స్నేహితులే దగ్గరగా ఉన్నారట. మణి అనారోగ్యానికి గురైన రోజు అతడు తనకున్న 30 ఎకరాల ఫామ్ హౌస్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో అతడి భార్య, కుమార్తె ఇంట్లో ఉన్నారు. అతడి స్నేహితులు మాత్రం ఫామ్‌హౌస్‌లోనే ఉన్నట్లు తెలుస్తున్నది. ఫామ్ హౌస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మణి అనారోగ్యానికి గురయ్యాడు.

gemini1
మణి...తన భార్య నిమ్మితో డైవర్స్ తీసుకోవాలని అనుకున్నారట. ఇక మణి స్నేహితులు చెప్పిన వివరాల ప్రకారం.... మణి.. లివర్ డిసీజ్ విషయం తెలిసాక డిప్రెషన్‌లోకి వెళ్ళాడని అంటారు. ఇది మణి సినీ కెరీర్ పై పడిందని, త్వరలోనే సినిమాలను వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు.

ఆయన స్నేహితులను విచారిస్తున్న క్రమంలో మణి స్నేహితుడు, నటుడు జప్పర్‌ను కూడా విచారించారు. ఆయన మాట్లాడుతూ... మణి మరణానికి ముందు రోజు ఆయన అవుట్ హౌస్‌లో మిత్రులందరం కలిసాము. అలాగే ఆయనతో కలిసి ఓ బీర్ తీసుకున్నాను. ఆయన స్నేహితులు, బంధువులు అందరూ ఓ పదిమంది దాకా కలిసాము. అప్పుడు మణి చాలా ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నారు. మణి కూడా ఓ బీర్‌ని మాత్రమే నాతో కలిసి తీసుకున్నారు. ఇంకెవరూ మద్యం తీసుకోలేదు. నేను ఓ సినిమా విషయమై డిస్కస్ చేయటానికి వెళ్లాను. అలాగే మణిని చంపాలని ఎవరూ అనుకోరు. అలాంటివారు ఉన్నారంటే నమ్మబుద్ధి కావటం లేదు. అలాగని మణిది సూసైడ్ చేసుకునే మనస్తత్వం కూడా కాదని చెప్పారు. ఆయన రక్తంలో విషం ఉన్న విషయాన్ని ఎంక్వైరీ చేసి బయిట పెట్టాలని ఆయన కోరారు. ఈ విషయమై ఆయన సోదరుడు రామకృష్ణన్ ...సెక్షన్ 174 క్రింద ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేసారు. దాంతో కంప్లైంట్ తీసుకున్న స్టేషన్‌కు చెందిన పోలీస్ సర్కిల్ ఇన్సిపెక్టర్‌తో పాటు ఓ టీమ్‌ని డిప్యూటి సూపర్‌డెంట్‌ఆఫ్‌పోలీస్ సుధాకరన్ ఆధర్వంలో నియమించటం జరిగింది. త్రిసూల్ రూరల్ ఎస్‌ఐ కార్తీక్ మాట్లాడుతూ.. ఎఫ్‌ఐఆర్ ని ఫైల్ చేసాం, డాక్టర్స్‌ని, మిగతా వారిని ప్రశ్నిస్తున్నాం. పోస్ట్‌మార్టం రిపోర్ట్, మిగతా మెడికల్ రిపోర్ట్‌లు వచ్చిన తర్వాత పూర్తి ధృవీకరణకు రాగలం. అన్నారు. మొదట ఆయన శరీరాన్ని ఆయన ఎక్కడైతే మరణించారో... అదే ( కొచ్చిలోని అమృత) హాస్పటిల్ లోని మార్చురికి షిప్ట్ చేసారు. తర్వాత దాన్ని త్రిసూర్‌లోని మెడికల్ కాలేజ్‌కు తరలించారు. మణి శరీరంలో మిథైల్ ఆల్కహాల్ ఉందని వస్తున్న వార్తలపై మాట్లాడుతూ... ఇప్పుడే ఏమీ చెప్పలేం...ఏ విషయంలోనూ కంక్లూజన్‌కు రాలేం. మెడికల్ రిపోర్ట్‌లు రావాల్సిందే అని తేల్చి చెప్పారు పోలీసులు.

కళాభవన్ మణి హత్య కేసులో హీరో దిలీప్‌కు హస్తం ఉందని సోదరుడు రామకృష్ణన్, దర్శకుడు బైజు కొట్టారక్కర ఆరోపించారు. ఈ విషయానికి సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని సిబిఐకి చెప్పారని తెలుస్తున్నది. దీని గురించి కోజికోడ్‌కు చెందిన ఓ మహిళ తనకు ఫోన్ చేసి చెప్పిందని భూముల విషయంలో కళాభవన్ మణికి, దిలీప్‌కు గొడవ జరిగిందని బైజు సీబీఐకి వివరించారు. ఈ కేసు విషయంలోనూ దిలీప్‌ను విచారించాల్సిందిగా కోరారు. దిలీప్ గతంలో భావన అనే నటిపై అత్యచారం కేసులో అరెస్ట్ అయ్యాడు. మణి అనుమానాస్పద మృతిపై ఉత్తగానే తాము ఆరోపణలు చేయటం లేదని.. తమ దగ్గర ఆధారాలు ఉన్నట్లుగా వారు చెబుతున్నారు. తాజాగా.. సీబీఐ అధికారులకు మణి సోదరుడు కొంత సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తున్నది. భూముల విషయంలో మణికి.. దిలీప్‌కి గొడవ జరిగిందని.. అదే చివరకూ అతని మరణానికి దారి తీసినట్లుగా చెబుతున్నారు. ఇది ఎంత వరకు వాస్తవమో తేలాల్సి ఉంది.

- మధుకర్ వైద్యుల, సెల్: 9182777409

1443
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles