విదేశీ మోజులో..


Sun,July 7, 2019 01:57 AM

india
ఇండియా.. భిన్న సంస్కృతుల వేదిక. సాంప్రదాయాలకు పుట్టినిల్లు. జీవితంలో ఒక్కసారైనా భారత్‌ను చుట్టేయాలని.. భిన్నత్వంలోని ఏకత్వాన్ని చూడాలనే కోరిక విదేశీయులకు చాలా ఉంటుంది. అనేక వేదికల్లో ఎందరో పరదేశీ ప్రముఖులు భారత్ పట్ల తమకున్న ఈ అభిప్రాయాన్ని వెల్లడించారు కూడా. ప్రపంచమంతా భారత్ వైపు చూస్తుంటే.. ఇక్కడి కొందరు ప్రజలు మాత్రం పరదేశీ మోజులో పడిపోతున్నారు!

భారతదేశంలో పుట్టి.. పెరిగి.. చదువు పూర్తిచేసుకొన్నాక ఇక ఇక్కడ చాలు అనే ధోరణి అధికమవుతున్నది. విదేశీ మోజు రోజు రోజుకూ పెరిగిపోతున్నది. మిగతా దేశాల్లో మాదిరి సంక్షోభాలు, సమస్యలు పెద్దగా లేనప్పటికీ భారత యువత కొందరు ఇక్కడ ఉండటానికి ఇష్టపడటం లేదని.. విదేశాల్లోనే ఆశ్రయం పొందాలనుకుంటున్నారని ఐక్యరాజ్య సమితి నివేదిక తెలియజేస్తున్నది. విదేశాల్లో ఆశ్రయం పొందాలనుకుంటున్న భారతీయుల సంఖ్య 2008-18 మధ్యకాలంలో 999.33% పెరిగిందని ప్రకటించింది.

ఎక్కడికి వెళ్తున్నారు?

గ్రాడ్యుయేషన్ పూర్తయితే చాలు మన వాళ్లలో ఫారిన్ వెళ్లాలనే ఆశలు చిగురిస్తున్నాయి. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పెద్దయ్యాక ఫారిన్ పంపిస్తా.. అనే ఆలోచనతో ఉంటున్నారు. ఇలాంటి కారణాలతో పాటు ఇతరత్రా కారణాలతో విదేశాల్లో ఆశ్రయం పొందాలనుకుంటున్న వాళ్లు ఇండియాలో చాలా ఎక్కువని చెప్తున్నది ఐక్యరాజ్య సమితి. అమెరికా, కెనడా, సౌత్ ఆఫ్రికా, దక్షిణ కొరియా, జర్మనీ, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో భారతీయ యువత ఆశ్రయం పొందుతున్నారని లెక్కలు చెప్తున్నాయి. ఇండియన్లను ఆకర్షిస్తున్న టాప్-10 విదేశాల్లో ఇవి ముందు వరుసలో ఉన్నాయి.
india1

ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు?

ఇండియాలో ఒక ఉద్యోగానికి వందమంది పోటీ. ఇంతచేసినా ఇక్కడ రూపాయికి విలువ తక్కువ. అదే డాలర్ అయితే? చాలా వెనకేసుకోవచ్చు. డబ్బు సంపాదన అధికంగా ఉంటుందనే ఆలోచనే ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. ఇండియాలో అయితే ఎక్కువ గంటలు పనిచేయాల్సి ఉంటుంది. అదే అమెరికాలో అయితే రోజుకు రెండు గంటలు పనిచేసినా ఇక్కడి రోజు వేతనంతో సమానంగా సంపాదించవచ్చు. ఇంకా.. ఇండియాలో ఉద్యోగం అంటే ఏ ప్రభుత్వ ఉద్యోగమో లేక కార్పొరేషన్ కొలువో అనుకుంటారు. వేరే ఇతర దేనినీ ఉద్యోగంలా భావించరు. కానీ విదేశాల్లో స్వయం సంపాదనకే ప్రాధాన్యం ఉంటుంది. అక్కడ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తూ కూడా సంపాదించవచ్చు.. దాంతోపాటుగా చదువుకోవచ్చు.

పెండ్లి సంబంధమూ అక్కడిదే!

చదువు కోసం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వలస వెళ్లి.. చదువు పూర్తిచేసి ఉద్యోగం సంపాదించుకొని అక్కడే ఆశ్రయం పొందాలనుకుంటున్న యువత జీవిత భాగస్వామిని కూడా అక్కడే వెతుక్కుంటున్నారు. అప్పటికే విదేశాల్లో ఉంటున్న అమ్మాయికి పెండ్లి చేయాలనుకుంటే.. విదేశాలకు వెళ్లాలనే ఆలోచన ఉన్న అబ్బాయిని వెతికి పెండ్లి చేస్తున్నారు. లేదా ఫారిన్ కంట్రీస్‌లో సెటిల్ అయిన అబ్బాయికి అక్కడే చదువుకుంటున్న భారత యువతితో పెండ్లి సంబంధం కుదుర్చాలనుకుంటున్నారు. ఇలా విదేశాల్లోని సంబంధం అయితేనే పెండ్లికి ఓకే అని చెప్పే ధోరణి విపరీతంగా పెరిగిపోయింది.

ఇండియాలో పెట్టుబడి!

విదేశాల్లో స్థిరపడాలనే ఆలోచనా ధోరణి ఉన్నవాళ్లను మానసిక కోణంలో ఆలోచిస్తే భారత కుటుంబ సంబంధాలు రుచించని వారేనని చెప్తున్నారు నిపుణులు. కుటుంబం సంబంధాలనే అంటిపెట్టుకోవడం వారి దృష్టిలో వెనకబాటు తనంగా కనిపిస్తుందట. అలాంటి వాళ్లకు పాశ్చాత్య సంస్కృతి త్వరగా ఒంటబడుతుంది. కొంతమంది ఇక్కడే స్థిరపడాలని లేకపోవడంతో ఉన్న ఆరేడేండ్లు బాగా సంపాదించి దానిని ఇండియాలో పెట్టుబడిగా పెడుతున్నారు. కొంతమంది వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి ఇండియా వచ్చాక వ్యవసాయం చేసుకోవచ్చు అనే ఆలోచనతో ఉన్నారు. మరికొంతమంది అక్కడ సంపాదించిన డబ్బుతో ఇండియా వచ్చాక సొంత కంపెనీ ఏదైనా పెట్టుకోవచ్చనే ఉద్దేశంతో ఉంటున్నారు.

సెలబ్రేషన్ మూడ్‌లోకి..

భారత్‌లో పుట్టి, పెరిగి, ఈ గాలి మాధుర్యం తెలిసిన చాలామంది విదేశాల్లో స్థిరపడిన వాళ్లు పదేళ్లుగా పునరుత్సాహం వైపు అడుగులు వేస్తున్నారు. ఇండియాలో ఏ ఉత్సవం అయినా అక్కడ వాళ్లున్నచోట సమూహాలుగా ఏర్పడి వాటిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వీటిద్వారానైనా ఒక్కసారి తమ గత స్మృతులను గుర్తుచేసుకోవచ్చు.. అందరితో సమ్మేళనం కావచ్చు అని ఆలోచిస్తున్నారు. గత పదేళ్లుగా అమెరికా, కెనడా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా వంటి దేశాల్లో ప్రతీ సంవత్సరం దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది, బతుకమ్మ, బోనాలు వంటి మన పండుగలను జరుపుకొంటూ పూర్తిగా సెలబ్రేషన్ మూడ్‌లోకి వచ్చేస్తున్నారు.

పదేళ్లలో అధికం

2008-09 మధ్యకాలంలో అమెరికా, కెనడాల ఆశ్రయాన్ని కోరుతూ కేవలం 282 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. కానీ గత పదేళ్లలో ఈ సంఖ్య 22,967కి చేరుకుంది. 2018లో అమెరికా ఆశ్రయాన్ని కోరుకున్న భారతీయుల సంఖ్య 28,489గా ఉండగా.. కెనడా కోసం 5,522 మంది కోరుకున్నారు. దక్షిణాఫ్రికా ఆశ్రయం కోసం 4,329, ఆస్ట్రేలియా 3,584, దక్షిణకొరియా 1,657, జర్మనీ 1,313 మంది ఆయా దేశాల్లో ఆశ్రయం పొందడానికి దరఖాస్తు చేసుకున్నారు.
india2
ఇండియాలో అయితే ఎక్కువ గంటలు పనిచేయాల్సి ఉంటుంది. అదే అమెరికాలో అయితే రోజుకు రెండు గంటలు పనిచేసినా ఇక్కడి రోజు వేతనంతో సమానంగా సంపాదించవచ్చు. ఇంకా.. ఇండియాలో ఉద్యోగం అంటే ఏ ప్రభుత్వ ఉద్యోగమో లేక కార్పొరేషన్ కొలువో అనుకుంటారు.

1022
Tags

More News

VIRAL NEWS