తియ్యని కబుర్లు..


Sun,July 7, 2019 01:49 AM

chocolates
పిల్లాడు మారాం చేసినా, ప్రియురాలు అలిగినా మెప్పించడానికి ముద్దుగా ఇచ్చేది చాక్లెట్. ఇవి రెండు సందర్భాల్లోనే కాదు చెప్పుకుంటూ పోతే మన డైలీ లైఫ్‌లో చాక్లెట్ సందర్భాలు ఎన్నో ఉంటాయి. అలాంటి ఎన్నో సందర్భాల్లో తియ్యని అనుభూతిని కలిగించే ఈ చాక్లెట్ గురించి మీకు తెలుసా? జూలై 7న చాక్లెట్ డే. అందుకే ఈ తియ్యని కబుర్ల జంటకమ్మ.

తల్లి గారాలపట్టి ఒకటే ఏడుపు. ఎంత ఊరుకోబెట్టినా ఏడ్పు మానట్లేదు. అప్పుడే తల్లి చాక్లెట్స్ ఇచ్చింది. గర్ల్ ఫ్రెండ్ బర్త్‌డే.. గిఫ్ట్‌తో పాటు ఇంకేదైనా ఇవ్వాలనుకుంటాడతను. వెంటనే గుర్తుకొచ్చింది మిల్క్ చాక్లెట్. ఇట్లా ఇద్దరి మధ్య ఆనందాన్ని మరింత తియ్యగా మార్చడం చాక్లెట్లతో సాధ్యం. కానీ చాక్లెట్లు తినడం ఆనారోగ్యకరం అని కొందరు అంటారు. తింటే మంచిది అని మరికొందరు అంటారు. నిజమే.. చాక్లెట్లు తినడం వల్ల లాభాలూ ఉన్నాయి, నష్టాలూ ఉన్నాయి. అంతకంటే ముందు దీనికి వందల ఏండ్ల చరిత్ర కూడా ఉంది.

పుట్టిందిక్కడే!

ప్రపంచానికి చాక్లెట్‌ను పరిచయం చేసింది మొదట యూరోపియన్లేనట. దాదాపు మూడు వేల యేండ్ల కిందటే చాకెట్లు ఆ దేశంలో వాడుకలో ఉన్నాయి. హాన్స్‌స్లోన్ అనే ఐర్లాండ్ దేశస్థుడు మొదటిసారి చాక్లెట్‌ను ప్రపంచానికి పరిచయం చేశాడని కథనాలు ఉన్నాయి. అతను జమైకా దేశంలోని బ్రిటిష్ గవర్నర్ దగ్గర పని చేసేవాడు. అక్కడే చాక్లెట్ తయారైంది. అది విచిత్రం. ఒకరోజు హాన్స్ కొకొ తాగుతున్నప్పుడు అది చేదుగా అనిపించింది. అప్పుడు దాంట్లో కొన్ని పాలు కలిపాడు. అదే అనుకోకుండా చాక్లెట్‌గా మారిందట. అప్పటి నుంచి చాక్లెట్ పేరు వాడుకలోకి వచ్చింది. తర్వాత ఈ పద్ధతినే తరచూ కొనసాగించడం వల్ల ఆ మిశ్రమం అక్కడ పాపులర్ అయింది. క్రీ.శ. 1550 జూలై7 న యూరోపియన్లు మొదటిసారి ఆ చాక్లెట్‌ను రుచి చూశారు. ఆ సందర్భంగా చాక్లెట్ డే గా వారు సెలబ్రెట్ చేసుకొనేవారు. అదే అనవాయితి రానురాను ప్రపంచానికి పాకింది. చాక్లెట్‌లలో రకాలు, ఫ్లేవర్‌లు, కంపెనీలు అందుబాటులోకి వచ్చాయి. వయసుతో సంబంధం లేకుండా అందరిలో చాక్లెట్లు తమ ముద్ర వేసుకున్నాయి.

మొదట ధనికులకే..

కొకొ చెట్టు నుంచి ఈ చాక్లెట్లు తయారవడం ప్రారంభమయ్యాయి. మొదట ఇవి కొందరు సంపన్నులే బలం కోసం తినేవారు. అప్పటి అజ్‌టెక్ రాజు మాంటె జుమా తన దేశానికి సందర్శన కోసం వచ్చిన స్పానిష్ అన్వేషకుడు హెర్నాండో కోరెస్ట్‌కు ఇచ్చిన విందులో చాక్లెట్‌ను పానీయంగా అందించారు. దీన్ని రుచి చూసిన ఆయాన చేదుగా ఉందనడంతో ఆ రాజు దీనికి మరింత తేనె, చక్కెర కలిపి తియ్యగా చేశాడు. తర్వాత ఇది ప్రజల్లోకి వెళ్లింది. తర్వాత కొన్ని రోజులకు కొకొను కరిగించి, అచ్చులలో పోసి చాక్లెట్ బార్‌లు తయారయ్యాయి. 1868 సంవత్సరానికల్లా క్యాడ్‌బరీస్ అనే కంపెనీ ఇంగ్లాండ్ మార్కెట్‌లో చాక్లెట్లను అమ్మడం మొదలు పెట్టింది. పాలు కలిపిన రుచులకు కొకొ చాక్లెట్లు బాగా ప్రసిద్ధి చెందాక కొత్తదనం కోసం చేసిన ప్రయత్నం ఇది. నెస్లే కంపెనీ వాళ్లు పిల్లల కోసం ప్రత్యేకంగా మిల్క్ చాక్లెట్లను ఉత్పత్తి చేశారు. అది పెద్దవాళ్ల నోరూ ఊరించింది.

యూరోపియన్లే అధికం

ప్రపంచం మొత్తం జనాభా కలిసి తినే చాక్లెట్లలో దాదాపు సగం వరకూ యూరోపియన్లే తినేస్తారని అంచనా. ఇందులో ఆడవాళ్లే ఎక్కువగా తింటారటా. ఆ దేశంలోని 91 శాతం ఆడవాళ్లు, 87 శాతం మగవాళ్లు చాక్లెట్ ప్రియులే. ప్రపంచ వ్యాప్తంగా చాక్లెట్ల అమ్మకం ఏటా 8300 కోట్ల రూపాయలు ఉంటుంది. ఒక్క అమెరికాలో వాలంటైన్స్ డే రోజు చాక్లెట్ల అమ్మకాలు కోటి రూపాయల విలువ ఉంటుంది.

మంచిదే..

వంద గ్రాముల డార్క్ చాక్లెట్‌లో 70-80 శాతం కొకొ ఉంటుంది. 11 గ్రాముల ఫైబర్‌తో పాటు మెగ్నీషియం, కాపర్ మాంగనీస్, పొటాషియం, జింక్ మూలకాల మిశ్రమాలుంటాయి. ఇవన్నీ శరీరానికి అవసరమైనవే. ఇవన్నీ కలిస్తే శరీరానికి ఆరు వందల కేలరీల శక్తి అందుతుంది. డార్క్ చాక్లెట్ యాంటి ఆక్సిడెంట్‌గా కూడా పని చేస్తుంది. ఇమ్యూనిటీ పవర్‌ను పెంచేందుకు డార్క్ చాక్లెట్ ఉపయోగపడుతుంది.

చాక్లెట్లలో ఎక్కువగా ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. తింటే మనుషుల్లో తెలివితేటలు, మేధాశక్తి పెరుగుతుందని న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ ప్రకటించింది. ఈ బృందం 23 దేశాల్లో చాక్లెట్ తినే ప్రజల సంఖ్యతో ఆ దేశం సంపాధించిన నోబెల్ బహుమతుల సంఖ్యను పోల్చారు. స్విట్జర్లాండ్‌లో ప్రజలు ఎక్కువగా చాక్లెట్లు తింటారు. అలాగే ఆ దేశంలో వారికి వచ్చిన నోబెల్ బహుమతులు కూడా ఎక్కువేనని తేల్చారు.

చాక్లెట్ డిగ్రీ

కొద్ది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా చాక్లెట్ పాపులర్ అయింది. వాటిమీద పరిశోదనలు జరగడం, రకరకాల ఉత్పత్తులను తయారు చేయడం, విక్రయించడం అంతిమంగా వ్యాపారంగా మారింది. ఇట్లా చాక్లెట్ తయారు చేయడానికి ఆసక్తి చూపేవారు పెరిగారు. మరి ఎలా తయారు చేయాలి. చాక్లెట్ మేకర్స్ ఎక్కడ ఉంటారు? ఎవరు నేర్పిస్తారు? అందుకే చాక్లెట్ తయారు చేయడానికి ప్రత్యేకమైన డిగ్రీ కూడా ఉంది. కాలేజీలో చేరి చాక్లెట్ మేకింగ్ నేర్చుకొని పట్టా కూడా పొందవచ్చు. లండన్‌లోని ప్రఖ్యాత కేంబ్రిడ్జి యూనివర్సిటినే ఈ అవకాశాన్ని కల్పిస్తున్నది. ఈ కోర్సులో భాగంగా చాక్లెట్ తయారి, దాంతో చేసే ఆహార పదార్థాలు, మెళకువలు నేర్పిస్తారు. కొత్త ఫార్మూలాలు కనిపెట్టేందుకు నైపుణ్యాలు పెంచుతారు. మూడేండ్లు ఈ కోర్సు ఉంటుంది. పూర్తి చేశాక డాక్టర్ ఆఫ్ చాక్లెట్ అని మీరు చెప్పుకోవచ్చు.

ఫ్లేవర్లు..

డార్క్, వైట్, మిల్క్ మూడు రకాల చాక్లెట్లు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్. అందులో ఎన్నో కంపెనీలు మరెన్నో రకాల ఫ్లేవర్లతో చాక్లెట్లను ఉత్పత్తి చేస్తున్నాయి. వాటిలో.
మిల్క్ చాక్లెట్, టర్కిష్ డిలైట్, స్నాక్ చాక్లెట్, హాజెల్ నట్, రాకీ రోడ్, కర్మెలో, క్రంచీ, టాప్‌డెక్, రోస్ట్ ఆల్మండ్ ఉన్నాయి.

- వినోద్ మామిడాల
సెల్: 7660066469

781
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles