కిక్ స్టార్ట్


Sun,July 7, 2019 01:36 AM

katha-new

ఇంకాసేపట్లో శీనుగాణ్ని కలవబోతున్నాను. దాదాపు ఐదేళ్ల తర్వాత. ఉద్వేగంగా ఉంది.
* * *

శీను నాకన్నా చాలా తెలివైన వాడు. అందుకు నాకేం జెలసీగా అనిపించదు. భగవంతుడు తెలివైనవాళ్లని పుట్టించడం, అటువంటి వాళ్ల స్నేహం నాకు లభించడం చాలా ఆనందంగా ఉంటుంది. వాళ్లు కదిలే విజ్ఞాన పుస్తకాల్లాంటివాళ్లు. వాళ్లతో ఉంటే నాకు సంస్కార గంధం అలుముకుంటుంది అన్నది నా అభిప్రాయం.

ఇహ విషయానికి వస్తే శీనుతో నా స్నేహం పద్దెనిమిదేళ్లనాటిది. టెంత్ అయింతర్వాత పాలిటెక్నిక్ కౌన్సెలింగ్‌లో పరిచయం. మంచి ర్యాంకర్. అతనికి ఎంతో దూరంలో నా ర్యాంక్. అతని టెంత్ మార్కులు కూడా సాధారణ స్థాయిలో లేవు. అతని మెరిట్, నా అదృష్టం మా ఇద్దర్నీ ఒకే కాలేజీలో చదివేట్టు చేసింది. కాలేజీలో లెక్చరర్ చెప్పింది ఇట్టే అర్థం చేసుకునేవాడు. తర్వాత నేనడిగితే అరటిపండు వలిచి నోట్లో పెట్టినంత సులభంగా చెప్పేవాడు. ఫస్ట్, సెకండ్ ఇయర్స్ పూర్తయ్యాక నాకు తెలిసిందేమిటంటే అతనికి చాలా బ్యాక్ లాగ్‌సబ్జెట్స్ ఉన్నాయి. నేను మాత్రం అరకొర మార్కులతో గట్టెకిక్కాను. నాకు ఆశ్చర్యం కలిగి మంచి ర్యాంకర్వి. చదువు విషయంలో అలా ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నావు? అని అడిగాను.
పట్టుమని పదిరోజులు కూర్చుంటే అయిపోతాయి అన్నాడు తేలిగ్గా.

ఎలా అవుతాయి? నువ్వు తెలివైన వాడివే కావచ్చు. త్రీ ఇయర్స్‌తో కలిపి సబ్జెకట్స్ అన్నీ క్లియర్ చేయడం అంటే ఎంత స్ట్రెస్, స్ట్రెయిన్. నాకర్థమైంది. ఏదో తెలివితేటల్తో నెట్టుకొస్తున్నావుగాని, నీకు చదువంటే పడదు. లేకపోతే కౌన్సెలింగ్‌లో సమయానికి డబ్బు సర్దుబాటు కాక దీనంగా సీట్ వదిలేసుకున్నవాళ్లని మనం చూశాం. నా ర్యాంక్‌కి సీట్ అలా వచ్చిందేగా! మీ అమ్మానాన్న పొలం పనులు చేసుకుంటూ డబ్బు పంపుతున్నారు. సమయానికి డబ్బు అందుతున్నది కాబట్టి నీకు పెయిన్ తెలియడంలా అన్నాను కాస్త కరకుగానే.

ఏమనుకున్నాడో తెలీదు. మౌనంగా ఉండిపోయాడు. సప్లీస్‌కి ముందు అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లిపోయాడు. నాకు తెగ భయం వేసింది- ఏవైపోయాడో అని.
సప్లీస్‌కి కనిపించాడు. మనిషి ఎర్రని కళ్లతో, వాడిన శరీరంతో-రెస్ట్ లెస్‌గా, డిస్ట్రబ్డ్ గా ఉన్నాడు.
మొత్తానికి అన్నీ రాసి పాస్ అయ్యాడు.

నా దగ్గరకొచ్చి నువ్వు సమయానికి చెప్పకపోతే, నేను బహుశా గట్టెక్కేవాడిని కాదు. నిజమే అన్ని బ్యాక్ లాగ్స్ క్లియర్ చేయడం ఎంత కష్టమనిపించిందో. థర్డ్ ఇయర్ కూడా కలిసిందంటే నావల్ల అయ్యేది కాదు. యు ఆర్ ఇన్డీడ్ ఫ్రెండ్ అన్నాడు నా చేతులు ఉద్వేగంగా నలిపేస్తూ.

ఇద్దరం డిప్లొమా పూర్తి చేశాక ఒక సంస్థలో టెక్నికల్ పొజిషన్‌లో జాయిన్ అయ్యాం.
ఒక సంవత్సరం అయ్యాక శీనూ, మనం కరెస్పాండెన్స్ బీ టెక్ చేస్తే ఎలా ఉంటుంది? మన ఆర్గనైజేషన్ స్టడీస్‌ని ఎంకరేజ్ చేస్తుంది. ఎంట్రస్ట్ ఫ్రీ లోన్ కూడా ఇస్తుంది. పొజిషన్లోనూ అప్‌గ్రేడ్ అవుతాం అన్నాను.
బానే ఉంటుంది బాస్, కాకపోతే ఆఫీస్ వర్క్‌తో.. అదీ టెక్నికల్ జాబ్‌తో, టైం స్టడీస్ కోసం స్పేర్ చేయగలమా? పాజిబులేనా? అడిగాడు.
పాజిబులా? కాదా? అన్నది మన థింకింగ్ మీద ఆధారపడి ఉంటుంది. మనం చేస్తున్నాం అన్నాను దృఢంగా.
నువ్వెలా అంటే అలాగే గురూ అన్నాడు.
యథాప్రకారం శీనుకి మంచి ర్యాంక్ వచ్చింది. నాకు అత్తెసరు. ఇద్దరికి మళ్ళీ ఒకటే కాలేజ్.
నాలుగేళ్లలో వాడు ఎప్పుడు బద్ధకంతో, విసుగుతో కూర్చుండి పోతున్నా, ముళ్లకర్ర మాటల్తో పొడిచి లేపేవాణ్ని.
మొత్తానికి నాలుగేళ్ల కోర్స్ పూర్తి చేశాం.
వాడు అదే సంస్థలో పాతుకు పోతే, నేను మాత్రం మరో సంస్థకి కాస్త శాలరీ హైక్‌కి మారి పోయాను.
* * *

మా ఇద్దరికీ పెళ్లిల్లయిపోయాయి.
నేను బెంగళూరు. వాడు ఇక్కడే హైదరాబాదు.
ఆరేళ్ల క్రితం ఆఫీసు పనిమీద వచ్చి వాడింటికెళ్లి కలిశాను.
సాధారణమైన ఇంట్లో పెళ్లాం పిల్లలతో కాలం గడుపుతున్నాడు. వాడికి ఒకబ్బాయి, ఇద్దరు కూతుళ్లు. వాళ్లావిడ, పిల్లలూ చాలా మంచివాళ్లు, సంస్కారవంతులు. వాడి భార్య అన్నయ్యా, అన్నయ్యా అంటూ కలుపుగోలుగా, నన్ను ఎంతో అభిమానంగా చూసుకుంది.
నాకు ఆశ్చర్యం వేసింది. నేను ఊహించింది వాడి తెలివికి వాడు నాకన్నా ఉన్నతంగా ఉంటాడని. పైగా అదే సంస్థలో లాంగ్ సర్వీస్. కాని వాడికన్నా నేనే మంచి పొజిషన్లో ఉన్నాను.
ఆ సాయంత్రం టాంక్ బండ్‌కి వెళ్లి ఓ బెంచ్‌మీద కూర్చుని, బుద్ధుడి కాళ్లను కడగాలన్న తాపత్రయంతో కదుల్తున్న నీళ్లను చూస్తూ ఒరె శీను. భగవంతుడు నీకు తెలివితేటలు ఇచ్చాడు. కాని నిన్ను నువ్వు మార్కెట్ చేసుకోవడం ఎలా? అనే జ్ఞానం ఇవ్వలేదు. నాకర్థమైందేంటంటే, నువ్వు కంఫర్టబుల్ జోన్లో ఉంటావు. ఇలా అయితే ఎలా? చిన్నపిల్లలు ఇసుక తీరానికి వెళ్లినప్పుడు ఇసుకతో బొమ్మరిల్లు కడతారు. ఆడుకున్నంత సేపు ఆడుకుని ఇంటికెళ్లి, మళ్లీ మరుసటి రోజు వచ్చి బొమ్మరిల్లే కడతారు. అది చిన్నతనం. మనం అలా ఉండకూడదు. మన ఆలోచనల్లో ప్రగతి ఉండాలి. ఇవాళ్టికీ రేపటికీ తేడా ఉండాలి. అభివృద్ధి సాధించాలి. నీకు ముగ్గురు పిల్లలు. అందులో ఇద్దరు ఆడపిల్లలు. వాళ్ల ఆలనా, పాలన, చదువులు పెళిళ్ల్లూ ప్లానింగ్ లేకపోతే ఎలా? ఉన్న సంస్థలో నీకు రికగ్నైజేషన్ లేకపోతే, నీ ఎబిలిటీస్ పెంచుకుని మరో సంస్థలోకి మారిపో. కొంత స్ట్రగుల్ అవుతావు. కాని బెటర్ స్టేజ్‌కి వెళతావు. నువ్వు మారాలి. త్వరలో నాకు మంచి న్యూస్ చెప్పాలి అన్నాను.
ఏవనుకున్నాడో కాని కామ్ అయిపోయాడు.
* * *

ఆ తర్వాత నాలుగు నెళ్లకి మంచి ఉద్యోగంలోకి మారాడని శాలరీ డబుల్ అయిందనీ ఫోన్ చేసి చెప్పాడు.
నా ఆనందం అంతా ఇంతా కాదు.
* * *

మళ్లీ ఇన్నాళ్లకి కలవబోతున్నాను.
వాడు ఎంతగా ఇంప్రూవ్ అయ్యాడో చూడాలని మనసులో తెగ ఆత్రుతగా ఉంది.
స్టేషన్లో ట్రైన్ దిగిన నన్ను సంతోషంగా రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకెళ్లాడు. మళ్లీ షరామామూలే. నేను ఐదేళ్ల క్రితం చెప్పినప్పుడు ఏ ఛేంజ్ చోటుచేసుకుందో..అక్కడే ఫిక్స్ అయి ఉన్నాడు. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతున్నది. వాడు మారడు. వాణ్ని కిక్ కొట్టి స్టార్ట్ చేస్తేనే ముందుకెళతాడు. లేకపోతే స్టేషనరీగా అలా ఉండిపోతాడు.
తెలివైనవాడైతే ఏం లాభం? తన జీవితాన్ని తీర్చి దిద్దుకుంటూ, తనను నమ్ముకున్నవాళ్లకు ఇంత నీడనివ్వడు. ఎవరి జీవితం వాళ్లది. ఇంట్రస్ట్ తీసుకుని మరొకరిని ఎందుకు ప్రోత్సహించి పైకి తీసుకొస్తారు? నేను ఇప్పటిదాకా చేసింది చాలనిపించింది.
ఈసారి నేనేమీ చెప్పకుండానే బై బై చెప్పి వాళ్లింట్లోంచి బయటపడ్డాను.
ఎందుకో నాకు చాలా రిలీఫ్‌గా అనిపించింది.

వాడు ఎంతగా ఇంప్రూవ్ అయ్యాడో
చూడాలని మనసులో తెగ ఆత్రుతగా ఉంది. స్టేషన్లో ట్రైన్ దిగిన నన్ను సంతోషంగా రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకెళ్లాడు. మళ్లీ షరామామూలే. నేను ఐదేళ్ల క్రితం చెప్పినప్పుడు ఏ ఛేంజ్ చోటుచేసుకుందో..అక్కడే ఫిక్స్ అయి ఉన్నాడు.
కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతున్నది.

- ప్రతాప వెంకట సుబ్బారాయుడు
సెల్: 9393981918

756
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles