చతురస్రాకారంలో రంగుల్లో కనిపించే ఆ గళ్లు.. మిమ్మల్ని కవ్విస్తాయి. కళ్లు తిప్పుకోనివ్వకుండా మురిపిస్తాయి.మీ తెలివితేటల్ని నిరూపించుకోమని సవాలు చేస్తాయి. గెలిచారా మీ ఆనందానికి హద్దులుండవు. అది మీకు లొంగలేదా?ఇక ఆకలిదప్పులు తెలియవు. నిద్రపోవాలనిపించదు. కలకలంగా, కలవరంగా, అస్థిమితంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా వయసుతో సంబంధం లేకుండా అందరినీ ఉర్రూతలూగిస్తున్న మ్యాజిక్ . అదే రూబిక్స్ క్యూబ్. యాభై ఏండ్ల కింద ఈ పజిల్ వేసిన విజిల్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది..
గత ఐదు దశాబ్దాలుగా ఖండాంతరాల్లో చిన్నా పెద్దా అందరినీ అలరిస్తున్న మంచి ఫ్రెండ్‌గా, మెదడుకు పదును పెట్టే పజిల్‌గా రూబిక్స్ క్యూబ్నే చెప్పుకోవాలి. హంగేరి దేశానికి చెందిన ఆర్కిటెక్చర్ ప్రొఫెసర్ ఎమో రూబిక్ దీని సృష్టికర్త. దానిని కనుగొన్న అతనికే నెలరోజులకు గానీ దాన్ని ఎలా పరిష్కరించాలో అర్థం కాలేదు. అసలు 1974లో దానిని కనిపెట్టినప్పుడు, అది పరిష్కరించటం వీలవుతుందని కూడా ఆయన అనుకోలేదు. కాలచక్రం పరుగులు తీసింది. వేగం, సృజనాత్మకత పెరిగింది. క్యూబ్ కూడా కొత్త పుంతలు తొక్కింది.ఈ క్యూబ్‌ను పరిష్కరించటానికి ఇప్పుడు 43,252,00, 274,489,9856,000 మార్గాలు ఉన్నాయని గణితశాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
రూబిక్స్ క్యూబ్ కనుగొన్న ఈ 50 ఏండ్లలో అది ఎక్కువమంది ఇష్టపడే, వెంటపడే, ఎక్కువ సమయం గడిపే క్రీడాసాధనంగా మారిపోయింది. అంతర్జాతీయంగా ఇప్పటివరకు 36 కోట్లకు పైగా క్యూబ్‌లు అమ్ముడయ్యాయని అంచనా. చవకగా తయారైన వాటిని కూడా లెక్కలోకి తీసుకుంటే, వాటి సంఖ్య ఆకాశమంత పెరిగే అవకాశం ఉంది. కంప్యూటర్ ప్రోగ్రామర్లు, తత్వవేత్తలు, ఆర్టిస్టులు ఇలా వేర్వేరు వర్గాలను ఇది వెంటాడుతున్నది. వేగంగా సమస్యను పరిష్కరించేందుకు సూచనలు ఇస్తామని, క్యూబ్ డిజైన్ సిద్ధాంతాలను వివరిస్తామని, వాటి వెనక ఉన్న తాత్వికతను చెబుతామని వందలాది పుస్తకాలు మార్కెట్లోకి వచ్చాయి. అన్నీ బెస్ట్ సెల్లర్లుగా నిలిచాయి. డిజిటల్ యుగంలో ఎంతోమంది తమ అనుభవాలను యూట్యూబ్ వీడియోల ద్వారా వివరిస్తున్నారు. కొంతమంది శిక్షకుల అవతారమెత్తారు. గంటకు ఇన్ని డాలర్లు లెక్కన ఆన్లైన్లో పాఠాలు చెబుతున్నారు. అల్గారిథమ్స్‌ను డెవలప్ చేస్తున్నారు.
రూబిక్స్ క్యూబ్ గురించి… “ఈ పజిల్ తెలివిగల యాంత్రిక ఆవిష్కరణ” అంటారు కాగ్నిటివ్ సైంటిస్ట్ డగ్లస్ హోఫ్స్ టాడ్లర్. సరైన కాలక్షేపాన్ని అందించే వనరు, రూపకాలకు మూలం, ప్రేరణ ఇచ్చే సాధనం కూడా అని వర్ణించారు. “మొట్టమొదట అది చాలా చాలా సులువుగా కనిపిస్తుంది. ఆరువైపులు, ఆరు రంగులుగానే ఉంటుంది. అంతలోనే, అతి తక్కువ సమయంలోనే నమ్మశక్యం కానంత కఠినంగా మారిపోతుంది’ అంటారు తత్త్వవేత్త స్టీవ్ పెటర్ సన్.
క్యూబ్‌తో రూబిక్ అనుభవాలు
ఎర్నో రూబిక్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 13 జులై 1944లో హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లోని ఒక హాస్పిటల్లో జన్మించాడు. అప్పుడు అది వైమానిక దాడులకు గురవుతూ ఉండేది. తండ్రి ఇంజినీర్. ఏరియల్ ైగ్లెడర్లు రూపొందించేవాడు. పిల్లవాడిగా ఉన్నప్పుడు రూబిక్కు బొమ్మలు గీయటం అంటే ఇష్టం. పెయింటింగ్, శిల్పకళ పట్ల కూడా అభిరుచి ఉంది. బుడాపెస్ట్ టెక్నికల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ చదివాడు. అనంతరం అప్లయిడ్ ఆర్ట్స్ కాలేజీలో చేరాడు. రేఖాగణిత నమూనాల పట్ల విపరీతమైన ఆసక్తిని ప్రదర్శించాడు. ప్రొఫెసర్‌గా విద్యార్థులకు డిస్క్రిప్టివ్ జామెట్రీ బోధించేవాడు. ఇందులో త్రీ డైమన్షల్ షేప్స్‌ను, సమస్యలను వివరించటానికి టూ డైమన్షనల్ చిత్రాలను ఉపయోగించేవాడు. అది అస్పష్టంగా ఉండేది. ఇదే ఎర్నో రూబిక్ క్యూబ్‌ను అభివృద్ధి చేయటానికి దారిచూపింది.1974 వసంతకాలంలో ఒక రోజున రూబిక్ తన తల్లి అపార్టుమెంటులోని ఓ గదిలో మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు. ఆ గదంతా ఎటు చూసినా క్రేయాన్లు, దారాలు, పెన్సిళ్లు, పేపర్లు, చెత్తాచెదారం. వాటితోపాటు తాను పేపరుతోనూ, చెక్కతోనూ చేసిన క్యూబ్‌లు ఉన్నాయి.
“ఆ రోజు ఆ ఆలోచన ఎందుకు ఎలా వచ్చిందో నాకు తెలియదు” అని తన ఆవిష్కరణ గురించి వివరించాడు రూబిక్. ఎనిమిది క్యూబులను ఒకదానికొకటి అతుక్కునేలా, అదే సమయంలో చుట్టూ తిరిగేలా రూపొందించాడు. దానిని చెక్కతో తయారుచేశాడు. వాటన్నిటిని కలపటానికి మూలల్లో చిన్న కన్నం పెట్టాడు. కానీ అది వెంటనే విడిపోయింది. ఎన్నో ప్రయత్నాల తర్వాత రూబిక్ విభిన్నమైన డిజైన్‌ను కనుక్కోగలిగాడు. క్యూబ్‌ల కదలిక కనిపించేలా దాని ముఖాలకు పసుపు, నీలం, ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు తదితర రంగులు వేశాడు. రూబిక్ దాన్ని అటూ ఇటూ తిప్పాడు. మళ్లీ తిప్పాడు. ఇంకోసారి తిప్పాడు. కాని దాన్ని మొదట ఉన్న రూపానికి తేవటం అతనికి సాధ్యం కాలేదు. రంగుల చిట్టడవిలో కూరుకుపోయి, దానినుంచి ఎలా ముందుకు వెళ్లాలో అర్థం కాక అవస్థలపాలయ్యాడు. ఓవైపు తన రోజువారీ పనులు చేసుకుంటూనే ఖాళీ సమయాల్లో క్యూబ్‌తో కుస్తీపట్టాడు. ఓరోజు పరిష్కారం దొరికింది.
రూబిక్ వెంటనే హంగేరియన్ పేటెంట్ ఆఫీసుకు ‘త్రీ డైమన్షనల్ లాజికల్ టాయ్’ పేరుతో ఓ దరఖాస్తు పెట్టుకున్నాడు. అలా 1977 కల్లా రూబిక్ క్యూబ్ అనేది హంగేరి ఆటవస్తువుల షాపుల్లో ప్రత్యక్షమైంది. రెండేండ్ల తర్వాత 3,00,000 క్యూబ్‌లు అమ్ముడయ్యాయి. రూబిక్ అమెరికన్ కంపెనీ ‘ఐడియల్ టాయ్’ నుంచి కాంట్రాక్టు పొందాడు. మూడేండ్లలో క్యూబ్‌ల అమ్మకాల సంఖ్య పదికోట్లకు చేరుకుంది. అంతేకాదు క్యూబ్‌ను పరిష్కరించే మార్గాలను వివరిస్తూ వచ్చిన పుస్తకాలు అత్యధిక సర్క్యులేషన్ సాధించాయి. ఆ తర్వాత రూబిక్ సొంత స్టూడియో ప్రారంభించి కొత్త తరహా క్యూబ్‌ల రూపకల్పనకు కృషిచేశాడు. స్పేక్ అండ్ రూబిక్ టాంగిల్స్ లాంటివి అందులో కొన్ని.
స్పీడ్ క్యూబర్స్
1990ల్లో కొత్త తరం ప్రవేశించింది. స్పీడ్ క్యూబింగ్ రికార్డులు మొదలయ్యాయి. అండర్ వాటర్, స్కైడైవింగ్, కళ్లకు గంతలు కట్టుకుని.. ఇలా రకరకాలుగా పోటీలు చోటుచేసుకుంటున్నాయి. వరల్డ్ క్యూబ్ అసోసియేషన్ ఏటా వెయ్యికి పైగా పోటీలను నిర్వహిస్తున్నది. వరల్డ్ క్యూబ్ అసోసియేషన్ (డబ్ల్యూసీఏ) ద్వైవార్షిక పోటీలను నిర్వహిస్తున్నది. 2×2, 3×3, 7×7 ఇలా 17 విభాగాల్లో ఈ పోటీలు సాగుతాయి. అలాగే క్యూబ్ రూపంలోనూ మార్పులు ఉంటాయి. ఇక మొదటిసారి క్యూబ్‌ను పరిష్కరించిన తర్వాత రూబిక్ చాలా రిలీఫ్‌గా ఫీలయ్యాడు. ఏదో సాధించానన్న అనుభూతి తనకు కలిగిందంటాడు. ఇప్పుడైతే రూబిక్స్ క్యూబ్‌ను గెలవడం అనే అంశంలో విపరీతమైన పోటీ నెలకొంది. ఈ క్రమంలో వేగంగా పరిష్కరించే సామర్థ్యం ఉన్న ‘స్పీడ్ క్యూబర్స్’ పుట్టుకురావడం గమనార్హం. 2018లో చైనాకు చెందిన యుషెంగ్ డు 3.47 సెకండ్లలో చకచకా దాన్ని పూర్తిచేశాడు.
రికార్డులే రికార్డులు
వేగంగా 3X3 రూబిక్స్ క్యూబ్‌ను పరిష్కరించిన రికార్డు నిఖిలేశ్ పీఎస్ సొంతం. 2022 ఏప్రిల్ 21న బెంగళూరులో నిర్వహించిన కార్యక్రమంలో క్యూబ్‌ను 54 సెకండ్ల 65 సెంటీ సెకండ్లలో పరిష్కరించి నిఖిలేశ్ కొత్త ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నాడు. 2014 అక్టోబరు 19న గాదిరాజు కృష్ణంరాజు 24 గంటల్లో ఒంటిచేత్తో 2,176 రూబిక్ క్యూబ్‌లను పరిష్కరించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకున్నాడు. అఫాన్ కుట్టీ.. బ్లైండ్ ఫోల్డ్ రూబిక్ చాంపియన్ పోటీల్లో కళ్లకు గంతలు కట్టుకుని క్యూబ్‌ను పరిష్కరించి అందరినీ ఆకట్టుకున్నాడు.
క్యూబ్‌తో ఆడుకోండి
“క్యూబ్ అనేది అన్నిటికి సార్వజనీనమైన నమూనాగా మారింది. విద్య అనేది కుతూహలాన్ని పెంచేదిగా, సమస్యలను పరిష్కారానికి ఉత్సాహాన్ని కలిగించేదిగా ఉండాలి. మనదైన పరిష్కారాన్ని కనుక్కోగలిగినప్పుడు మరింత ఆనందం కలుగుతుంది” అంటాడు రూబిక్ ‘హార్వర్డ్ బిజినెస్ రివ్యూ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో. క్యూబ్‌తో తన అనుభవాలకు రూబిక్ 2020లో ‘క్యూబ్డ్’ పేరుతో పుస్తక రూపం ఇచ్చాడు. ప్రస్తుతం రూబిక్ బ్రాండ్ బాధ్యతలను కెనడాకు చెందిన స్పిన్ మాస్టర్ కార్పొరేషన్ చూస్తున్నది. ఆ కంపెనీ బోర్డు ఆఫ్ డైరక్టర్లలో రూబిక్ ఒకరు. 78 ఏండ్ల వయసులో ఉన్న రూబిక్ ఇప్పుడు ఒకే ఒక్క నిమిషంలో క్యూబిక్ పజిల్‌ను పరిష్కరించగలడు. కానీ వేగంపైన తనకు ఆసక్తి లేదని, నింపాదిగా పరిష్కారం కనుగొనటం, అందులో నాణ్యతను ఆస్వాదిస్తానని, టైమింగ్ అనేది తనకు పట్టదని ఆయన అంటాడు. ఇప్పుడు క్యూబ్ డిజైన్ మార్పు చేయటం గురించి ఆయన ఆలోచించటం లేదు. దానిని మరింత మెరుగ్గా ఎలా వినియోగించే విషయం గురించి ఆలోచిస్తున్నాడు. మీరు కూడా రూబిక్స్ క్యూబ్‌ని మీ స్నేహితునిగా మార్చుకుని చూడండి. ఆ మజా ఏమిటో మీకే అర్థమవుతుంది
క్యూబింగ్ సెలెబ్రిటీలు
ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఓ విలేకరుల సమావేశానికి హాజరై ఒకే ఒక్క నిమిషంలో రూబిక్స్ క్యూబ్ పజిల్‌ను పూర్తిచేసి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేశాడు. మరో సందర్భంలో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అమీర్‌తో ఒక చాట్ షోకు హాజరయ్యాడు. అప్పుడు కోహ్లీ తనకు అమీర్ దగ్గర క్యూబ్ పరిష్కరించే విధానం గురించి నేర్చుకోవాలని ఉందని పేర్కొనడం విశేషం. బ్రెజిల్ జాతీయ ఫుట్‌బాల్ జట్టు ఆటగాడు ఫిలిప్ లూయిస్ ఒక స్పానిష్ టాక్ షోలో మాట్లాడుతూ సునాయాసంగా పజిల్‌ను పరిష్కరించాడు. గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ చిత్ర నటుడు తన సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూ ఇస్తూ కేవలం 3 నిమిషాల్లోనే ఈ పజిల్ పూర్తిచేశాడు. తర్వాత 2020లో దాన్ని ఒకే ఒక నిమిషంలో పరిష్కరించి ఇన్స్టాగ్రామ్ లో దానికి సంబంధించిన వీడియోను జతచేశాడు.
అంతేకాదు రూబిక్స్ క్యూబ్‌ను పది సెకండ్లలోపే పూర్తి చేయగలిగిన చిన్నారులు తన హీరోలని ఆయన ప్రకటించాడు. అందరికీ బాగా పరిచయం అయిన చిత్రం ‘పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్’ చిత్రంలో క్రిస్ గార్డెనర్ పాత్రధారి విల్ స్మిత్ రూబిక్ క్యూబ్‌ను వేగంగా పరిష్కరించటం ద్వారా ఉద్యోగం సంపాదిస్తాడు. ఒక లైవ్ టెలివిజన్ ఈవెంట్లో స్మిత్‌ను ఇదెలా సాధ్యమో చేసి చూపించమని ఎవరో సవాలు విసిరితే ఒక్క నిమిషం కంటే తక్కువ సమయంలో దాన్ని పరిష్కరించి ‘భేష్’ అనిపించుకున్నాడు. ఐదుసార్లు ఎన్బీఏ చాంపియన్ అయిన మైఖేల్ జోర్డాన్ మాజీ సహచరుడు సెవె కెర్రె 2017లో విలేకరుల సమావేశానికి క్యూబ్‌తో వచ్చి వాళ్లు అడిగే ఇబ్బందికర ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఆటలో మునిగిపోయాడు. అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్ ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఒక ఎగ్జిబిషన్‌కు హాజరై క్యూబ్‌ను పరిష్కరించటానికి ప్రయత్నించాడు. బిగ్ బాయ్స్ టీవీ షోలో లాజిక్ అనే గాయకుడు రాప్ షోను, క్యూబ్‌ను కలిపి ప్రదర్శన ఇచ్చాడు. అలాగే డీస్టార్మ్ పవర్ కూడా ఈ రెండిటిని కలిపి ప్రదర్శన ఇచ్చాడు.
ప్రపంచ విజేత
కొరియన్- అమెరికన్ మాక్స్ పార్క్‌ను అన్ని కాలాల్లోనూ అత్యుత్తమ క్యూబర్గా పరిగణిస్తారు. 2001 నవంబరు 28న పుట్టిన పార్క్ 3x3x3 క్యూబ్ వరల్డ్ ఛాంపియన్ పోటీల్లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 2023 జూన్ 11న నిర్వహించిన ఈ పోటీల్లో 3.13 సెకండ్లలో దాన్ని పరిష్కరించాడు. అతని స్నేహితుడు, ప్రత్యర్థి ఆస్ట్రేలియా చాంపియన్‌గా నిలిచిన ఫిలిక్స్ జాండెగ్స్… ఈ ఇద్దరి గురించి నెట్ ఫ్లిక్స్‌లో వచ్చిన డాక్యుమెంటరీ ‘ద స్పీడ్ క్యూబర్స్’ బాగా ప్రాచుర్యం పొందింది.
సూపర్ కిడ్ దివిష
రూబిక్స్ క్యూబ్‌ను ఐదు నిమిషాల్లో పరిష్కరించి దివిష భన్సాలీ రికార్డు సాధించింది. మూడేండ్ల దివిష ఢిల్లీలోని వివేక్ విహార్‌లో నివాసం ఉంటుంది. అలాగే క్యూబ్ పరిష్కరించిన అతి చిన్నవ్యక్తిగా రికార్డు కూడా ఈ చిన్నారి సొంతం. అంతకుముందు ఈ రికార్డు ఉన్న చిన్నారి మూడు గంటలకుపైగా సమయం తీసుకుందని ఇండియన్ క్యూబ్ అసోసియేషన్ పేర్కొంది. దీనినిబట్టి దివిష తెలివితేటల్ని మనం అంచనా వేయవచ్చు. దివిష తల్లిదండ్రులు ఆరతి భన్సాల్, విశాల్ భన్సాల్. తనకు కూడా చిన్నప్పటి నుంచి క్యూబ్ పట్ల ఆసక్తి ఉందని, అందుకే పాపను చిన్నప్పటి నుంచి చురుగ్గా తయారుచేశానని ఆరతి చెబుతారు. దివిషకు రెండేండ్లప్పటి నుంచే క్యూబ్ ఎలా పరిష్కరించాలో చెప్పటం ప్రారంభించానని ఆమె పేర్కొన్నారు. కేవలం 40 రోజుల్లోనే తనకు ఒడుపు పట్టుబడిందని అన్నారు. క్యూబ్‌ను పరిష్కరించటం అంత సులభమైన అంశం కాదని, ఇందులో దాదాపు 20 రకాల గణితశాస్త్ర సూత్రాలను అనుసరించవలసి ఉంటుందని దివిష తండ్రి విశాల్ వివరించారు. “దానిని ఐదు నిమిషాల్లో పూర్తిచేయటం అనేది సాధారణ అంశం కాదు. మా పాపను చూసి గర్వపడుతున్నా” అంటారు విశాల్.
క్యూబ్లతో చిత్రాలు
అద్వైత్ మనాజీ, కేరళలోని కొచ్చికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి. రూబిక్స్ క్యూబ్లతో చిత్రాలను రూపొందిస్తూంటాడు. అతను దాదాపు 300 క్యూబ్‌లను ఉపయోగించి రజనీకాంత్ చిత్రాన్ని రూపొందించాడు. దాన్ని సూపర్‌స్టార్‌కు బహుమతిగా ఇచ్చాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారి రజనీ అభిమానులను అలరించింది. అలాగే ప్రణవ్ ఓంకార్ అనే నాలుగేళ్ల పిల్లవాడు క్యూబ్స్‌తో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ బొమ్మను తయారుచేసి ఆమెకు పుట్టినరోజు కానుకగా ఇచ్చాడు.
-డాక్టర్ పార్థసారథి చిరువోలు