US Open | న్యూయార్క్: టెన్నిస్ క్యాలెండర్లో ఆఖరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ అయిన ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్‌కు రంగం సిద్ధమైంది. న్యూయార్క్ వేదికగా జరుగబోయే ఈ టోర్నీకి సోమవారం నుంచి తెరలేవబోతోంది. నేటి నుంచి పురుషుల, మహిళల సింగిల్స్ మ్యాచ్‌లు మొదలుకానున్నాయి. డిఫెండింగ్ చాంపియన్లు నొవాక్ జొకోవిచ్ (పురుషుల), కోకో గాఫ్ (మహిళల) తమ టైటిల్స్‌ను నిలబెట్టుకునేందుకు బరిలోకి దిగుతున్నారు.
పురుషుల కేటగిరీలో కార్లొస్ అల్కారజ్, జన్నిక్ సిన్నర్, డేనియల్ మెద్వెదెవ్, ఆండ్రీ రుబ్లెవ్, అలగ్జాండర్ జ్వెరెవ్, ఫ్రాన్సెస్ టియాఫో, టేలర్ ఫ్రిట్జ్ వంటి స్టార్లు టైటిల్ వేటలో ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నెంబర్ వన్ ఇగా స్వియాటెక్, అరీనా సబలెంక, జాస్మిన్ పలోని, ఎలీనా రిబాకినా, జలెనా ఒస్టపెంకొ, యువ సంచలనం మిర్రా అండ్రీవాతో పాటు పారిస్ ఒలింపిక్ స్వర్ణ విజేత కిన్వెన్ జెంగ్ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
గతేడాది ఇక్కడే తన కెరీర్లో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గి 25వ టైటిల్ కోసం ఏడాదిగా వేచి చూస్తున్న జొకోవిచ్ మరోసారి తనకు అచ్చొచ్చిన యూఎస్ ఓపెన్‌లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, వింబుల్డన్ టోర్నీలలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా ఇటీవలే ముగిసిన విశ్వక్రీడలలో స్వర్ణం సాధించడం జొకోలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.