Virat Kohli : పొట్టి ప్రపంచ కప్ ట్రోఫీతో టీ20లకు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆన్లైన్లో రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు. మైదానంలో బౌలర్లను ఉతికేసి ఎన్నో రికార్డులు తన పేరిట రాసుకున్న విరాట్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆల్‌టైమ్ రికార్డు బద్ధలు కొట్టేశాడు. ఒంటిమీద జాతీయ జెండా.. చేతిలో వరల్డ్ కప్ ట్రోఫీతో నవ్వులు చిందిస్తున్న కోహ్లీ ఫొటో ఇన్‌స్టాగ్రామ్‌లో బోలెడన్నీ లైక్స్ సాధించింది.
‘ఇంతకంటే గొప్ప రోజును నేను ఊహించలేను. దేవుడు చాలా గొప్పోడు. కృతజ్ఞతతో శిరస్సు వంచుతున్నా. ఎట్టకేలకు మేము సాధించాం. జై హింద్’ అనే క్యాప్షన్‌తో ఉన్న ఆ పోస్ట్‌కు ఒక్క రోజులోనే కోటి తొంభై లక్షల లైక్స్ వచ్చాయి. ఇంకేముంది ఆ దెబ్బతో బాలీవుడ్ జంట సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ పెండ్లి రోజు ఫొటోకు వచ్చిన లైక్స్ రికార్డు బద్ధలై పోయింది.
విక్రమ్ బత్రా అనే భారత సైనికుడి యాథార్థ కథ ఆధారంగా తీసిన ‘షేర్షా'(Shershaah) సినిమాలో సిద్ధార్ధ్, కియారాల మెప్పించారు. ఆ మూవీ షూటింగ్ సమయంలో ఇద్దరూ ‘రియల్’ ప్రేమ పక్షులయ్యారు. దాంతో, నిరుడు ఫిబ్రవరి 7న ఈ జంట పెండ్లి చేసుకుంది. వివాహ వేడుక అనంతరం సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న తమ ఫొటోను కియారా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. ఆ ఫొటోకు ఒక్కరోజే కోటి 60 లక్షల లైక్స్ వచ్చాయి. ఇప్పుడు కోహ్లీ వాళ్లకంటే 30 లక్షల లైక్స్ ఎక్కువ సాధించి రికార్డు బ్రేకర్ అనిపించుకున్నాడు.
గత 13 ఏండ్లుగా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీని కరీబియన్ గడ్డపై భారత జట్టు ఒడిసి పట్టేసింది. ఆద్యంతం ఉత్కంఠ రేపిన ఫైనల్లో కోహ్లీ (76) ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా(3/20), బుమ్రా(2/18)ల సూపర్ స్పెల్‌తో దక్షిణాఫ్రికా చేతులెత్తేసింది. 7 పరుగుల తేడాతో గెలిచిన భారత జట్టు పొట్టి ట్రోఫీని సగర్వంగా అందుకుంది. మ్యాచ్ అనంతరం ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు ప్రదానం సమయంలో కోహ్లీ తాను టీ20ల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు. అతడిని అనుసరిస్తూ.. కెప్టెన్ రోహిత్ కూడా పొట్టి ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పేశాడు.