అమ్మాయిలు అదరగొట్టారు. సొంతగడ్డపై తమకు తిరుగులేదని చాటిచెబుతూ సుదీర్ఘ ఫార్మాట్లో సత్తాచాటారు. దాదాపు దశాబ్దం తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు విజయదుందుభి మోగించింది. భారీ స్కోర్లు, వికెట్ల వేట కొనసాగిన పోరులో సఫారీలపై టీమ్ఇండియాదే పైచేయి అయ్యింది. అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించిన కౌర్‌సేన ఏకైక టెస్టు మ్యాచ్‌ను తమ ఖాతాలో వేసుకుంది. లారా వోల్వార్డ్, సునె లుస్ శతక పోరాటం చేసినా లాభం లేకపోయింది.
చెన్నై: టెస్టుల్లో భారత మహిళల క్రికెట్ జట్టు జైత్రయాత్ర కొనసాగుతున్నది. ఇప్పటికే ఇంగ్లండ్, ఆస్ట్రేలియాపై చారిత్రక విజయాలు సాధించిన టీమ్ఇండియా తాజాగా దక్షిణాఫ్రికా భరతం పట్టింది. సోమవారం ముగిసిన ఏకైక టెస్టులో భారత్ 10 వికెట్ల తేడాతో సఫారీలపై ఘన విజయం సాధించి సిరీస్ విజేతగా నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 232/2 నాలుగో రోజు ఫాల్‌ఆన్‌కు దిగిన సఫారీలు..టీమ్ఇండియాకు దీటుగా బదులిచ్చే ప్రయత్నం చేశారు.
పిచ్ పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటూ కెప్టెన్ లారా వోల్వార్డ్(122), సునె లుస్(109) సూపర్ సెంచరీతో రాణించారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 373 పరుగులు చేసి భారత్‌కు 37 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. స్నేహ్‌రానా(2/111), దీప్తిశర్మ(2/95), రాజేశ్వరి(2/55) రెండేసి వికెట్లు తీశారు. ఓపెనర్లు షెఫాలీ వర్మ(24), శుభా సతీశ్(13) నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించారు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 10 వికెట్లు తీసిన స్నేహ్ రానాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
తొలి ఇన్నింగ్స్‌లో తడబడ్డ..దక్షిణాఫ్రికా ఫాలోఆన్‌లో భారత్‌కు దీటుగా సమాధానమిచ్చేందుకు ప్రయత్నించింది. ముఖ్యంగా వోల్వార్డ్, లుస్ సెంచరీలతో భారత బౌలర్లకు పరీక్ష పెట్టారు. పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుంటూ టీమ్ఇండియా బౌలర్లపై తమ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. పిచ్ ఓవైపు స్పిన్నర్లకు సహకరిస్తున్నా..ఏ మాత్రం వెనుకకు తగ్గకుండా వోల్వార్డ్, లుస్ పరుగులు కొల్లగొట్టారు.
314 బంతులు ఎదుర్కొన్న వోల్వార్డ్ 16ఫోర్లతో విజృంభించగా, 203 బంతులు ఆడిన లుస్ 18 ఫోర్లు ఖాతాలో వేసుకుంది. వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కు 190 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. లుస్ను కౌర్ ఔట్ చేయడం ద్వారా వీరి జోరుకు అడ్డుకట్ట వేసింది. డీకెర్ల్(61) మిడిలార్డర్లో ఆకట్టుకోగా, మిగతా బ్యాటర్లు స్వల్ప స్కోర్లకు పరిమితమయ్యారు. మొత్తంగా భారత్‌పై రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా రికార్డు స్కోరు నమోదు చేసింది.
సంక్షిప్త స్కోర్లు
భారత్ తొలి ఇన్నింగ్స్: 603డిక్లేర్డ్, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 266 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్: 373 ఆలౌట్, భారత్ రెండో ఇన్నింగ్స్: 37/0.