Zhang Zhijie : ఎన్నో ఆశలతో బ్యాడ్మింటన్ కెరీర్ ఎంచుకున్న ఓ అటగాడు అకస్మాత్తుగా తనువు చాలించాడు. తాను ఎంతో ఇష్టపడిన బ్యాడ్మింటన్ ఆడుతూనే చైనాకు చెందిన 17 ఏండ్ల ఝాంగ్ ఝిజీ (Zhang Zhijie) అనే యువ ఆటగాడు ప్రాణాలు కోల్పోయాడు. ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా జూనియర్ చాంపియన్షిప్స్(Asia Junior Championships)లో ఈ విషాదకర సంఘటన జరిగింది. జపాన్ ప్లేయర్ కజుమా కవానో (Kazuma Kawano)తో తొలి మ్యాచ్లో ఝాంగ్ తలపడ్డాడు.
అయితే.. మ్యాచ్ జరుగుతుండగానే చైనా షట్లర్ కోర్టులో ఒక్కసారిగా కూలబడ్డాడు. అతడిలో కొంచెం కూడా కదలిక లేకపోవడంతో షాక్ తిన్న నిర్వాహకులు అతడిని హుటాహుటిన దగ్గర్లోని హాస్పిటల్కు తరలించారు. కానీ, గుండెపోటు కారణంగా ఝాంగ్ అప్పటికే ప్రాణాలు విడిచాడని డాక్టర్లు తెలిపారు. దాంతో, చైనా బ్యాడ్మింటన్లోలో తీవ్ర విషాదం నెలకొంది.
‘చైనాకు చెందిన ఝాంగ్ అనే సింగిల్స్ ఆటగాడు కోర్టులోనే కుప్పకూలాడు. దాంతో, అతడిని వెంటనే దవాఖానకు తీసుకెళ్లాం. కానీ, అతడు మార్గంమధ్యలోనే మరణించాడని వైద్యలు చెప్పారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఓ ప్రతిభావంతుడిని కోల్పోయింది’ అని జూలై 1 సోమవారం నాడు బ్యాడ్మింటన్ ఆసియా, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండోనేషియాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.