IND vs SA : పొట్టి ప్రపంచ కప్ తొమ్మిదో సీజన్ ఫైనల్ మరికొన్ని గంటల్లో మొదలవ్వనుంది. మెగా టోర్నీలో ఓటమెరుగని రెండు జట్లు టైటిల్ కోసం కొదమ సింహాల్లా కొట్లాడబోతున్నాయి. ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్‌లో భారత్ (India), దక్షిణాఫ్రికా (South Africa)లు ఢీ కొట్టనున్నాయి. ‘చోకర్స్’ అనే అపవాదును బద్ధలుకొట్టిన సఫారీ జట్టు తొలి టైటిల్ వేటకు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతోంది. మరోవైపు 13వ ఐసీసీ ఫైనల్ ఆడుతున్న టీమిండియా 11 ఏండ్ల ట్రోఫీ నిరీక్షణకు చెక్ పెట్టాలనే పట్టుదలతో ఉంది.
అయితే.. కింగ్స్టౌన్ ఓవల్ వేదికగా జరిగే బిగ్ ఫైట్‌లో బౌలర్ల ఆధిపత్యం ఖాయమనిపిస్తోంది. ఎందుకంటే లీగ్ దశ నుంచి టీమిండియా, సఫారీ జట్ల విజయాల్లో పేసర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ బిగ్ మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్‌కు కగిసో రబడ (Kagiso Rabada), నోకియా.. దక్షిణాఫ్రికా టాపార్డర్‌కు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah), అర్ష్‌దీప్‌ల నుంచి ముప్పు పొంచి ఉంది. ఇరుజట్లలో వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉండడంతో టైటిల్ పోరులో బ్యాటర్లు బేజారవ్వడం పక్కా అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
టీ20 వరల్డ్ కప్‌లో రోహిత్ సేనకు స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌లు.. మర్క్రమ్ టీమ్‌కు నోకియా, రబాడలు కొండంత బలమవుతున్నారు. ఇక మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav), అక్షర్ పటేల్‌లు తిప్పేస్తుండగా.. సఫారీ జట్టులో తబ్రేజ్ షంసీ (Tabraiz Shamsi), కేశవ్ మహరాజ్‌లు వికెట్ల వేట కొనసాగిస్తున్నారు.
ముఖ్యంగా సూపర్ 8 మ్యాచ్‌లతో ఎంట్రీ ఇచ్చిన కుల్దీప్ అదరగొడుతున్నాడు. ఈ చైనామన్ బౌలర్ నాలుగు మ్యాచుల్లో 10 వికెట్లతో తానెంత ప్రమాదకరమో చాటాడు. ఇక సెమీస్‌లో అయితే.. మూడు పెద్ద వికెట్లతో కుల్దీప్ ఇంగ్లండ్(England) పతనాన్ని శాసించాడు.
మరోవైపు షంసీ కూడా తక్కువేమీ కాదు. ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఆడిన 4 మ్యాచుల్లోనే 7.31 ఎకానమీతో 11 వికెట్లు నేలకూల్చాడు. అఫ్గనిస్థాన్‌తో జరిగిన సెమీస్‌లో షంసీ మూడు వికెట్లతో విజృంభించాడు. దాంతో, ఫైనల్లోనూ టీమిండియా టాప్ గన్స్‌ను అతడు ఇబ్బంది పెట్టే చాన్స్ ఉంది. బలాబలాల పరంగా సమఉజ్జీల సమరమైన ఫైనల్ ఫైట్‌లో ఒత్తిడిని జయించిన జట్టే చాంపియన్ అవుతుందని మాజీలు విశ్లేషిస్తున్నారు. ఇప్పటివరకైతే రోహిత్ సేన ఎలాంటి బెరుకు లేకుండా ఆడింది. మర్క్రమ్ సైతం కూల్‌గా జట్టును నడిపిస్తున్నాడు. దాంతో, ట్రోఫీ విజయంలో కెప్టెన్సీ కూడా కీలకమయ్యే అవకాశం లేకపోలేదు.
Is Tabraiz Shamsi the key for South Africa in the final? 👀#T20WorldCup pic.twitter.com/GnUSrOybRi
— ICC (@ICC) June 28, 2024